Showing posts with label my experience. Show all posts
Showing posts with label my experience. Show all posts

04 September, 2013

మరపు రాని సంఘటన

  మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గదిచింది.బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం,అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది.ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది.

     నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న ప్రాంతంలో ఏవో సంబరాలు జరుగుతూండేవి.ఏ సంబరమైనా డప్పుల మోత వినపడేది.అలా డప్పులమోత వినగానే వీధిలోకి పరుగెత్తి అరుగు మీద కూర్చునేదాన్ని.ఆ సందడంతా మా యింటి ముందునుంచి దాటాక యింట్లోకి వెళ్ళేదాన్ని.

     అలాగే ఒక రోజు డప్పుల మోత వినపడగానే వీధిలోకి పరుగెత్తాను.మా అమ్మ కేకవేస్తూ"వీధిలోకేమొచ్చినా పరుగెడతావు,నేను పనిలో వున్నాను వీధి తలుపు వేస్తాను, ఆ సందడయ్యాక తలుపు కొట్టు తీస్తాను అన్నయ్య పడుక్కున్నాడు" అంది.సరేనని వీధరుగు మీద కూర్చున్నాను.

     డప్పులమోత దగ్గరయింది.డప్పుల వాయిద్యగాళ్ళ వెనుక కొంతమది పిల్లలు పెద్దలు లయకి తగినట్లు నాట్యం చేస్తున్నారు.ఆ వెనుక ఒక స్త్రీ తడిబట్టలతో ఒంటినిండా పసుపు రాసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో తల మీద పూలతో అలంకరించిన బిందె(అమ్మవారికి  ఘటంతో మొక్కు తీర్చుకోవడం) బిందెపైన వెలుగుతున్న దీపం,కళ్ళు తెరవకుండా చేతులతో బిందె పట్టుకోకుండా నడుస్తున్నాది. ఆమె నడిచినంతమేరా పసుపునీళ్ళలో ముంచిన చీరలు  తోవంతా పరుస్తూన్నారు.వాటిపైన ఆమె నడుస్తున్నాది.ఆమె రెండు వైపులా ఒకరు ధూపం వేస్తూంటే ఒకరు వేపమండలతో విసురుతున్నారు.వెనుక యిద్దరు ఘటం పొరపాటుగానైనా ఘటం కింద పడకుండా చేతులు ఆసరా చూపిస్తూ నడుస్తున్నారు.అక్కద వాళ్ళు గ్రామ దేవతకి మొక్కు తీర్చుకునే ఒక ఆచారం.

    అవన్నీ వింతగా చూస్తున్నాను.మా యింటిముందుకి వచ్చి ఘటం పట్టుకున్నామె ముందుకు అడుగు వెయ్యకుండా నిల్చుండిపోయింది.ధూపం మరికొంత వేసి వేపమండలతో విసురుతూ "అడుగెయ్యి తల్లీ! ఏం కావాలమ్మా?సెప్పు తల్లీ లోపముంటే దిద్దుకుంటామమ్మా!"తలో విధంగా ప్రాధేయ పడుతున్నారు. ఆ స్త్రీ అంగుళం కూడా కదల్లేదు సరికదా 'వూ వూ---అంటు వూగిపోతోంది.చుట్టూ వున్న వాళ్ళు ఒకరి తరువాత ఒకరు ఆమె కాళ్ళకి దండాలు పెడుతున్నారు.

    "ఈ యింటి వాళ్ళని బయటికి పిలవండి.నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి గుమ్మం ముందునుంచి వెళ్తూంటే తలుపులేసుకుంటుందా?పిలవండి"వూగిపోతూనే చెప్పింది.

    నాకు కాళ్ళలోంచి ఒణుకు వచ్చింది.ఒక పెద్దతను వచ్చి అమ్మా అమ్మగారిని పిలువమ్మా నేకుంటే ఘటం కదల్దు."అనగానే తలుపు దబ దబా బదేను.అమ్మ విసుగ్గా  తలుపు తీసి ఏమాట అనేలోపున పెద్దతను వచ్చి "అమ్మగారూ ఒక  పాలి అమ్మోరి ఘటం ఎత్తుకున్న మడిసితో మాటాడండమ్మా."

       అమ్మ ఆశ్చర్యంగా వెళ్ళి ఏం కావాలి తల్లీ? మావల్ల ఏం అపరాధం జరిగింది?" అమ్మకి యిటువంటివి పరిచయం వున్నట్ట్లుంది.

    ఘటం ఎత్తుకున్నామె "అపరాధమంటావేం? నీకొడుకు ఒంటి మీద వచ్చి పదిహేను రోజులు నీ యింట వున్నాను. నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి, నీ గుమ్మం ముందునుంచి వెళ్తుంటే వసంతం నీళ్ళతో కాళ్ళు కడిగి పిల్లడిచేత దండం పెట్టించడం ఫోయి తలుపులేసుకుంటావా హూం?" హుంకరించింది.

    అమ్మ వెంటనే కాళ్ళకి దండం పెట్టి "క్షమించు తల్లీ తప్పైపోయింది క్షణంలో వస్తాను"అంటు లోపలికెళ్ళి పెద్ద చెంబుతో వసంతం ఒక గ్లాసు పానకం పసుపు కుంకుమలతో పాటు అన్నయ్యను కూడా తీసుకొచ్చింది. అన్నయ్యచేత వసంతం నీళ్ళతో ఆమె కాళ్ళు కడిగించి దండం పెట్టించింది.పానకం గ్లాసు అందించి అమ్మ నమస్కారం చేసి నాచేత నమస్కారం చేయించింది పసుపు కుంకుమలు సమర్పించి లెంపలు వేసుకుంది.ఘటం పట్టుకున్నామె మా ముగ్గురి తలల మీద ఒకరి తరువాత ఒకరికి చేయివేసి "చల్లగా వుండండి"అంటూ ఆశీర్వదించింది.

   యిప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. నిత్యం యాసతో మాట్లాడే ఆమె ఆసమయంలో అంత స్వచ్చంగా ఎలా మాట్లాడింది? మా యింట్లో మా అన్నయ్యకి ఆటలమ్మ వచ్చిన తగ్గినట్ట్లు ఆమెకెలా తెలిసింది?యివన్నీ సందేహాలే.పెళ్ళయ్యాక పల్లెలు వదిలి పట్నానికి వచ్చినా అనాటి సంఘటన యిప్పటికీ ప్రశ్నార్ధకమే!

29 July, 2013

రైలు ప్రయాణం-రిజర్వేషను గొడవ

మేము అయిదుగురు స్నేహితురాళ్ళం భిలాయి నుంచి భోపాల్ బయలుదేరాం.అక్కడ చదువుకుంటున్న మా అమ్మయిలని కలిసి రావడానికి. నా ఒక్కర్తికే రానూ పోనూ రిజర్వేషను అయింది మిగతా వాళ్ళు వచ్చేటప్పుడు రైల్లో చేయించుకుంటాం అని వూరుకున్నారు.
రెండు రోజుల తరువాత తిరుగు ప్రయాణం.నా రిజర్వుడు బెర్త్ లో నేను కూర్చున్నాను. అదే కంపార్టుమెంటులో మా స్నేహితులు ఎక్కి టీ టీ యిని అదే పెట్టెలో వాళ్ళకి బెర్తులు అలాట్ చేయమని కోరారు.ఆ పెట్టెలో వీలుకాదని వేరే బోగీలో అలాట్ చేస్తామన్నారు.
"ఒక్క రాత్రి ప్రయాణం మీరంతా ఒకచోట వుంటారు బెర్తులు వేరే చోట తీసుకోండి నాకిక్కడ ఒక్కర్తిని అన్న భయం లేదు"అన్నాను. అందరికీ ఒక్ చోట బెర్తులిమ్మని చాలా బతిమాలేరు. ఇక తప్పదని నాతో సహా మా అందరికీ వేరే బోగీలో బెర్తులు అలాట్ చేశారు.
అందరం అక్కడ కూర్చుని 'హమ్మయ్య!'అనుకున్నాం.వెళ్తూ వెళ్తూ ఆ టీ టీ యి నాతో "మేడం!వేరే టీ టీ యీ వచ్చి అడిగితే పొరపాటూన కూడా మీరు వేరే బోగీ నుంచి యిక్కడికి వచ్చినట్లు చెప్పవద్దు,"అని హెచ్చరించాడు.
ఇందులో ఏదో తిరకాసుంది చూద్దాం ఏమవుతుందోనని దుప్పట్లు వేసుకుని నిద్రకుపక్రమించాం.
ఇటార్సీ స్టేషను దాటిన పావుగంటకి వేరే టీ టీ యీ వచ్చి లైటు వేసి "టికెట్"అన్నారు.నా టికెట్ చూడగానే "మీరిక్కడెలా కూర్చున్నారు? ఎస్-4 లో మీ బెర్తు కదా"అన్నారు గద్దించుతూ.నా పనైపోయిందనుకున్నాను.
మళ్ళీ అడిగారు విసుగ్గా"ఈ కంపార్టుమెంటులో మీ బెర్తు లేదు యిందులో ఎందుకు కూర్చున్నారు?"స్వరంలో  అధికార దర్పం వుంది.ఏంచెయ్యాలో పాలుపోలేదు,అయినా స్థిరంగా "నాకు తెలియదు,నాకు చదువురాదు. భోపాల్ లో టి టీ యి కి టికెట్ చూపించి ఎక్కడ కూచోవాలని అడిగితే యీ జాగాలో కూర్చోమన్నారు.కూర్చున్నాను.అంతకుమించి నాకేమీ తెలియదు"అన్నాను.
ఎగాదిగా చూసి గొణుక్కుంటూ వెళ్ళారు.అతను వెళ్ళారని నమ్మకం కుదిరాక మావాళ్ళంతా లేచి"మిసెస్ రావ్! అంత ధైర్యంగా అబద్ధమెలా చెప్పారు?మరోకటీ మరికటీకాదు ఏకంగా చదువురాదని,బాప్ రే!"అనగానే "ఏం చెయ్యాలి మీ అందరికోసం నా బెర్తు వదులుకుని వచ్చాను.ఏ మాత్రం నసిగినా పినాల్టీ వడ్డించేస్తారు.ఎలాగో తప్పించుకోవాలి, అదే చేశాను."
వారిజాక్షులయందు 
వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
బొంకవచ్చునధిప పొందదఘము.అన్న పద్యం గుర్తుకొచ్చింది.ఈ పద్యార్ధం మా వాళ్ళకి బోధపరిచే ఓపిక లేక దుప్పటి ముసుగు పెట్టేసుకున్నాను.