13 August, 2009

ప్రశాంతాశ్రమం

డియర్ సత్యానంద్,


hemingway_beard

                        నేను శివ ఎన్నో సంత్సరాల తరువాత నీకు లెటర్ రాస్తున్నాను.నీ అడ్రసు ఎలా దొరికిందా అని ఆశ్చర్య పోతున్నావు కదూ! క్రిందటి వారం మీ మేనల్లుడు కిరణ్ కనుపించాడు.ఇంటికి తీసుకువచ్చి నీ గురించి వివరాలడిగాను.నీవు యుఎస్ లో నీ కొడుకు వద్ద వుంటున్నావని చెప్పి నీ అడ్రసు యిచ్చాడు.నాకున్న ప్రోబ్లమ్స్ ఎవరితో మొరపెట్టుకోవాలో తెలియక తికమక పడుతున్న సమయంలో నీ అడ్రసు దొరకడం వరంలా అనిపించింది. పన్నెండేళ్ల క్రిందట ఒక పెళ్లిలో కలిశాం. అప్పుడు సెర్వీసులో వున్నాను.ముఫై సంత్సరాలు నార్త్ లో రైల్వేలో చేసిన నాకు అటువైపు సెటిలవడం యిష్టం లేక రిటైర్మెంటు ముందుగా ఈ చిన్న పాటి టౌనులో చిన్న యిల్లు ఏర్పరుచుకున్నాను.సంతానం లేని మా దంపతులం ప్రశాంతంగా శేష జీవితాన్ని గడుపుదామని ఆశపడ్డాం

.ఇక్కడికి వచ్చిన నెల నుంచి నాకు మీనాక్షికి అర్ధమయింది శాంతంగా వుండటం అన్నది ఎంత అడియాసోనని. మాబ్రతుకులు మమ్మల్ని బ్రతకనివ్వటం లేదు మా బంధువులు. రోజూ ఎవరొ ఒకరు రావటం అనాయాచితంగా సలహాలివ్వటం.ముసలి వయసులో యిద్దరే ఎలా వుంటారు? యిద్దరిలో ఏఒక్కరి అరోగ్యం దెబ్బ తిన్నా చూసేవాళ్లెవరు? బంధువులలోంచి ఒక జంటని చేరదీసి మా తదనంతరం ఆస్థి వారికి చెందేటట్లు రాస్తే చివరిదాకా మమ్మల్ని కంటికి రెప్పలాచూసుకుంటారని హామీలిస్తున్నారు.మా అవసాన దశలో ఎవరు చూస్తారో లేదో తెలియదు గాని ఈ వచ్చి వెళ్లేవాళ్లకి రోజూ వండి వార్చలేక మీనాక్షి పని అవుతోంది.ఇన్ని సంవత్సరాలు మాది చాలా ప్లాన్డ్ బడ్జెట్ వుండేది ఇక్కడికి వచ్చాక పెన్షను డబ్బులు ఎలా ఖర్చైపోతున్నాయో తెలియటంలేదు సేవింగు చేసినదాంట్లోంచి కూడా తీయవలసి వస్తోంది. వీళ్లందరినుంచి తప్పించుకుని దూరంగా నలుగురు స్నేహితుల మధ్య ఆశ్రమవాసుల్లా గడపాలనిపిస్తోంది.ఈ రాబందుల్లాంటి బంధువుల నుంచి కాపాడే నాధుడెవరో తెలియటం లేదు. ఇటువంటి బాదరబందీల నుండి దూరంలో హాయిగా వున్నావు.మా దగ్గర కొచ్చి మాతో గడిపి కలిగింది మతో కలిసి తిని బయటకు వెళ్లి మేము పిసినార్లమని యిద్దరికోసం కడుపు కట్టుకుని కూడపెడుతున్నామని యింటికి వచ్చిన వాళ్లకి సరిగా భోజనాలు కూడా పెట్టమని పోయేటప్పుడు మూట కట్టుకుపోతామా అంటూ పదిమందికి చెప్తూంటే ఆ మాటలు మా చెవినపడి మరీ మనస్తాపంగా వుంటోంది.కొత్తగా వచ్చే ఆదాయం లేదు పిల్లలు లేరు ఏలోటైనా సర్దుబాటు చెయ్యడానికి యివేవీ వాళ్ల వూహలోకి రావు ఈ వయసులో ఎవరిని చేరదీస్తే ఎవరు చేస్తారు కన్న పిల్లలమీదే ఆశపెట్టుకునే రోజులుకావు.స్నేహితుడిగా ఏమైనా సలహా యిస్తావని యింత వివరంగా లెటర్ రాశాను.మీ అబ్బాయికి కోడలికి మా ఆశీస్సులు.మనుమలుంటే వారికి కూడా అశీస్సులు.నా టెలిఫోను నంబరు రాస్తున్నాను వీలయితే ఫోన్లో మాట్లాడితే నిన్ను చూసిన్సంత సంతోషిస్తాను. ఇట్లు శివకామయ్య వుత్తరం పోస్టు చేసిన మూడోనాటినుంచి ఎదురు చూస్తున్నాను.కాని వుత్తరం చేరటానికే పదిరోజులు పట్టవచ్చు.అనుకున్నట్లుగానే పది రోజుల తరువాత ఫోను వచ్చింది,"హలో శివా ఎలావున్నావ్? నీ లెటరు చదివాను.నీ బాధ అర్ధమయింది.నెలరోజుల్లో నేను ఇండియాకి వస్తున్నాను.మనం కలిసి ఈ ప్రాబ్లమ్ కోసంసొల్యూషన్ ఆలోచిద్దాం అంతవరకు ఓపికపట్టు. తాపీగా నిర్నయిద్దాం ఏంచెయ్యాలో".అమృతధారలు చెవిలో కురిసినట్లనిపించింది.చిన్నప్పటినుంచి ఏ సమస్య వచ్చినా సత్యానంద్ తో చర్చించడం,వెంటనే సలహా చెప్తే ఆ గొడవ తీరిపోవడం అలవాటు.మళ్లీ యిన్ని సంత్సరాల తరువాత నదిలో కొట్టుకుపోతున్న వాడికి ఆధారం దొరికినంత ఆనందం కలిగింది.నెల రోజులు మీనాక్షి నేను స్నేహితుని రాకకై ఎదురు చూస్తూ ఎన్నో అందమయిన కలలు కన్నాము.ఆ రోజు రానే వచ్చింది.సత్యానంద్ రాకతో మాలో పోయిన వుత్సాహం చోటుచేసుకుంది.రెండు చేతులు జాచి స్నేహితుడిని కౌగలించుకున్న ఆనందం వూహాతీతం.వచ్చినప్పటినుంచి తన ప్లాన్లు చెప్పడం మొదలుపెట్టాడు. సత్యానంద్ కి అమెరికాలో వుండిపోవడం యిష్టంలేదు. అయితే యిక్కడ ఒక్కడూ వుండటం కొడుకు యిష్టపడక కొడుకుతో వుంటున్నాడు. ఎప్పటికయినా మనవాళ్లమధ్య యిక్కడ గడపడం తన అభీష్టం అన్నాడు.
హైదరాబాదుకి నలభై కిలో మీటర్ల దూరంలోఒక తనకి పెద్ద బంగళా చుట్టూ పెద్ద ఆవరణ వున్నాయని దానిని మనలాటి వాళ్లం కొంతమందిమి వుండేందుకు వసతిగా ఏర్పరచి దానికి తగిన సౌకర్యాలు కూర్చుకుని వుందాం. ముందుగా ఫౌండర్ మెంబర్లుగా మన ముగ్గురమే వుందాం. నెమ్మదిగా మనలాంటివాళ్లు చేరవచ్చు.అనగానే ఏమిటీ ఓల్డ్ హోమా?అంటూ ప్రశ్నించాను.పేరేదయినా పెట్టుకోవచ్చు కాని మనలాటి వాళ్లు ఒకరికి బర్డెన్ కాకుండా మనకి యింకొకరి ప్రమేయంలేకుండా బ్రతకడానికి పేరేదయినా అనుకోవచ్చు.

ముగ్గురం హైదరాబాద్ వెళ్లాం.ఇల్లు చాలా విశాలంగా వుంది.నాలుగు బెడ్రూములున్నాయి.సత్యానంద్ అన్నాడు కాంపౌండు గోడనానుకుని ఎల్ షేపులో పది రూములు ఎటాచెడ్ బాత్రూములతో కట్టించితే యింకా మనుషులు వచ్చినా సరిపోతుంది.అంతవరకు ఆ ఇంటిలోనే మేము వుండవచ్చనిఅన్నాడు. యిది ఎస్టాబ్లిష్ అయేవరకు మనిద్దరం కాస్త శ్రమ పడాల్సి వుంటుందన్నాడు.మరి దీని మైంటెనెన్సుకి డబ్బు కావద్దా?అని సందేహం వెలిబుచ్చాను.మన నెలలో ఖర్చు చేసే దానిలో కొంత భాగం నిఖరంగా జమచేసుకుంటే దీనిని నడపడం కష్టమేమీ కాదు.అయితే ముందుగా కొంత మదుపు పెడతాను నాకు వెనుకా ముందు ఎవరూ అడిగేవాళ్లు లేరు నాకొడుకు అమెరికాలో సెటిల్ అయి నా మీద ఆధారపడడు.అయితే అందరూ ఒకే విధంగా చెల్లించలేకపోవచ్చు అప్పుడెలా అన్నాను.చూద్దాం ఎంత చెల్లించాలన్నది అడ్వర్టైజ్ మెంటులో వేద్దాం అంతగా ఎవరైనా అంత యివ్వలేకపోతే అప్పుడు ఆలోచిద్దాం. 
ఇంకొంతమంది సలహా తీసుకుని అప్రూవల్ తీసుకున్నాం.ఈ లోపున మాయిల్లు అమ్మకానికి పెట్టాను.ముగ్గురంకలిసి పని మొదలు పెట్టాము.పేరు నిర్ణయించి రిజిస్ట్రేషను చేయించాలి అని ముగ్గురం ఆలోచించాం మీనాక్షి చెప్పింది ప్రశాంతత కోసం ఒక్ చోటికి చేరాలనుకున్నాం కావున ప్రశాంతాశ్రమం అని పేరు పెట్టుకుందాం అంది. ఆ పేరే బాగుందని ఖాయం చేశాం.

వంటమనిషిని ఏర్పాటు చెయ్యాలని సత్యానంద్ అంటే మీనాక్షి ప్రపోజ్ చేసింది మా వూర్లో దూరపు బంధువు పేరు సీతమ్మ పెళ్లయిన ఆర్నెలలకే భర్త దేశాలు పట్టిపోతే తండ్రి పంచన వుండేది. తండ్రి బ్రతికున్నంతవరకు అమె జీవితం సాఫీగానే గడిచింది.తండ్రి పోయి అయిదేళ్లయింది.తాతలనాటి యిల్లు కొద్దిపాటి ఆస్థి వున్నాయి.కాని వాటితో పూర్తిగా ఆమె భుక్తి గడవటం లేదు. మనిషి ధృడంగా వుంది ఆవూర్లో ఎవరికి ఏ సహాయం కావాలన్నా చేసి వారిచ్చిన దానితో తృప్తి పడుతోంది.మా యిల్లు అమ్మి మావూరినుంచి వచ్చేసే ముందు ఆమెని యిక్కడికి తీసుకు వస్తే పది పన్నెండు మందికి వంట చేసి పెట్టగలదు.ఆమెకి జీతంలా కొంత సొమ్ము బేంకులో జమచేస్తే ఏ రోజునైనా వైద్య సహాయానికి పనికొస్తుందిఅని చెప్పి మా అభిప్రాయం కోసం ఆగింది.ఈ అయిడియా బాగుందని ఆమె ఆశ్రమంలో మెంబరుగా వుంటూ పనికూడా చెయ్యగలదని ముగ్గురం ఏకీభవించాం.అన్ని ఏర్పాట్లు చేసి ఒక డాక్టరుతో మాట్లాడాం వారానికి ఒక సారి ఆశ్రమానికి వచ్చి అందరినీ చెకప్ చెయ్యటానికి.పేపర్లో అడ్వర్టైజ్ మెంటు వేయించాం.

నాలుగు రోజుల తరువాత ఒక జంట వచ్చారు ఆశ్రమాన్ని వెతుక్కుంటూ.తమని తాము పరిచయం చేసుకున్నారు.అతని పేరు రంగనాధం భార్య లలిత,హైస్కూలు హెడ్మాష్టరుగా చేసి ఆరు నెలల క్రితమే రిటైర్ అయినట్లు చెప్పారు. సత్యానంద్ అడిగాడు "మీ గురించి క్లుప్తంగా చెప్పండి ఏ కారణంతో యిక్కడ చేరాలనుకుంటున్నారు".ఏం చెప్పమన్నారు నాకు యిద్దరు పిల్లాలు. అమ్మాయి పెద్దది దాని వివాహం చేసి పదేళ్లయింది యిద్దరు పిల్లలు.మా రెండో సంతానం అబ్బాయి.నేను వుపాధ్యాయ వృత్తిలో వుండి వేలాది స్టూడెంట్లకి విద్యాబోధ చేసిదారి పెట్టాను కాని నా కొడుకుని దారిలో పెట్టలేకపోయాను.ఏడవక్లాసునుంచి చెడు సహవాసాలు చేసి సరిగా చదవక గట్టిగా మందలించితే యిల్లు వదిలి రెండు మూడు రోజుఇలు ఎక్కడో గడిపి వచ్చేవాడు .తల్లి పెట్టిన తిండి తిని చాటుగా తప్పించుకుని తిరిగేవాడు.ఆకతాయితనం కాస్త వయసుపెరిగితే వాడే దారిన పడతాడని కఠినచర్యలు తీసుకోలేదు.నడవడి సరిగాలేక చదు ఒంటబట్టక జీవితంలో ఏం చేస్తాడన్నది మా మనోవ్యధ. వీటికి తోడు మా అల్లుడికి ధన దాహం.ఒక్కతే పిల్లని ఎన్ని ముద్దు ముచ్చటలు తీర్చినా ప్రతీ సారీ ఏదో ఒకటి మా తలకుమించినది కోరుతూంటాడు.యివ్వలేకపోతే అమ్మాయిని హింసిస్తుంటాడు.రిటైర్ అయ్యాకకూడా ఏపిల్లలు పాసయినా వచ్చి మా యిద్దరి కాళ్లకు నమస్కరించేవారు.ఆరోజున నా భార్య తిండి తినేది కాదు నిద్రపోయేదికాదు."యింత మంది మిమ్మల్ని గౌరవంగా నెత్తిన పెట్టుకుంటూంటే కడుపున పుట్టిన కొడుకు శతృవులా ప్రవర్తిస్తున్నాడు యిదేం ఖర్మండీ?" అంటూ వాపోయేది నెల క్రితం యింట్లోంచి వెండి వస్తువులు పట్టుకెళ్లి నాకొడుకు అమ్మకానికి పెట్టాడు.దుకాణం యజమాని ధరకట్టడానికి టైము పడుతుందని కూర్చోపెట్టి నాకు కబురు చేశాడు.నేను వెళ్లి అదంతా చూసి నిశ్చేష్టుడనయ్యాను.నన్ను చూసి నాకొడుకు కూడా అంతే అశ్చర్యపోయాడు.యింటికి తీసుకువచ్చి శాంతంగా కూర్చో పెట్టి చెప్పాను.చదువబ్బకపోతే మానె ఏదయినా చిన్న దుకాణం పెట్టుకుని గౌరవంగా బ్రతకమని.జీవతంలో ఎప్పటికి సెటిల్ అవుతావు?నేనా రిటైర్ అయ్యాను యింతకన్నా ఏం చెయ్యగలనని నిగ్గ దీస్తే వాడికిలాంటి పనులు చేసి బ్రతకటం యిష్టం లేదన్నాడు.మరి యిలా దొంగతనాలు చెయ్యడం యిష్టమేనా?మన యిల్లు గుల్లయాక పొరుగిళ్లుకూడా దోచడం మొదలెడతావా అని గద్దించాను.ఆ రోజు వెళ్లిన వాడు వారం దాకా రాలేదు.యిక లాభం లేదని పోలీసు కంప్లైంటు యిచ్చాను.నా కొడుకు నడవడిక సరిగా లేదని శతవిధాలా ప్రయత్నించి నేను విఫలుడినయానని,యికపై వాడికి నాకు ఎటువంటి సంభంధం లేదు వాడు ఏమయినా నేరాల్లోయిరుక్కుంటే నా పూచీలేదు మీకు తోచిన చర్యలు తీసుకోండని రాసిచ్చాను. అది తెలిసి నా భార్య కన్నీరు మూన్నీరుగా ఏడ్చింది.ఎంతో గౌరవంగా బ్రతికిన మేము అక్కడే వుంటే యింకా ఏం వినాలో ఏం చూడాలోనని భయపడ్డాం నేను శ్రీకాకుళలో జిల్లాలో మారుమూల గ్రామంలో వుంటాను అక్కడే వుంటే నాకూతురి బ్రతుకు కూడా నా అల్లుడు నరకం చేస్తాడు. వాళ్ల బ్రతుకులు ఎలాగయితే అయింది యిక పిల్లల చింత మానుకోడానికి నిర్ణయించుకున్నాం.యిటువంటి తరుణంలో ప్రశాంతాశ్రమం అడ్వర్టైజ్ మెంటు చూశాం. ఇక్కడ వుండి శేష జీవితం ప్రశాంతంగా గడపాలనుకుంటున్నాం.మేమిద్దరం మానసికంగా క్రుంగిపోయాం గాని శరీర దారుఢ్యం బాగానే వుంది యిక్కడ మేము చెయ్య గలిగే పని చేస్తూ అయిడిల్ గా వుండకుండా గడుపుతాం".అంతా విన్నాక ఫారాలిచ్చాము నింపడానికి.ఫారాలు నింపి వారంరోజుల్లో వస్తామని చెప్పి వెళ్లారు రంగనాధం లలితమ్మలు.

అయిదు మందితో ఆశ్రమం ప్రారంభించాం.నాలుగు నెలలు గడిచాయి వేటికీ యిబ్బంది పడటంలేదు.మీనాక్శీ లలితమ్మ సీతమ్మలు.అది ఆశ్రమంలా కాక ఒక యిల్లు నడుపుతున్నట్లే నడుపుతున్నారు.ఒక రోజు రాత్రి తొమ్మిది గంటలకి పోలీసు వద్దనుంచి ఫోను వచ్చింది.ఒక ముసలామె ఆత్మ హత్యా ప్రయత్నం చేసుకూంటూ పట్టు పడిందని ఆమె పరిస్తితి చాలా దీనంగా వుందని మా ఆశ్రమంలో చేర్చుకుంటారా అని అడిగారు.ఆమెని తీసుకు రమ్మని పరిస్థితి చూసి తగిన సహాయం చేస్తామని 
చెప్పాము.అరగంటలో ఒక పోలీసు ఒక సోషల్ వర్కరు ముసలామెనుతీసుకు వచ్చారు.వొళ్లంతా వణుకుతోంది నోట మాటరాక అయోమయ స్థితిలో వుంది.ఏమైందని ప్రశ్నించాము.ఈ వూరి మనిషి కాదు ఎక్కడినుంచి వచ్చిందో అడుగుతుంటే చెప్పటం లేదు.పన్నెండో అంతస్తునుంచి దూకింది.ఆమె చీర అదే ఫ్లోరులోవున్న హుక్కుకి తగిలి వేలాడుతుంటే పిల్లలు గోలచేశారు.నలుగురూ పోగయి రక్షించి మాకు ఫోను చేశారు.డాక్టరుకి చూపించాము.చేసినపని అసఫలమవటంతో షాకు తగిలి ఏమీ మాట్లాడటం లేదు,ప్రమాదమేమీలేదు మెంటల్ షాకు తగ్గితే కోలుకుంటుందని మందిచ్చారు.ఈ లోగా సొషల్ సర్వీస్ వారికి ఫోను చేస్తే మీ సంస్థ గురించి తెలిసిందని ఆమె వయసుని బట్టి యిక్కడ వుంచుతారేమో ఎంక్వైరీ చేశాము అన్నారు. సరే వుంచండి ఆమె కోలుకున్నాక విషయం తెలుసుకుని తగిన సహాయం చేస్తాము అనిచెప్పి వాళ్లని పంపించాము. యింత విన్నాక ఆమెని విసిగించకుండా బలవంతంగా కాస్త తినిపించి గ్లాసుడు పాలు పట్టించి తన గదిలో పడుకోపెట్టింది సీతమ్మ.

రాత్రంతా గాఢ నిద్రపోయిన ఆమె వుదయంలేచి రిలీఫ్ గా ఫీలయింది.ముఖం కడుక్కోమని కాఫీ తెచ్చి యిచ్చింది సీతమ్మ.కాస్త తేరుకున్నాక మీనాక్షి లలితమ్మలు కూడా వచ్చి కూర్చున్నారు."మీ పేరేమిటమ్మా?" చాలా సున్నితంగా అడిగింది లలితమ్మ."నాపేరు కమలమ్మ"ఎంత అడిగితే అంతే సమాధానం యిచ్చింది.ఈ వూర్లో ఎవరింటికి వచ్చారు? ఏదైనా పనిమీద వచ్చారా?మీ దేవూరు?"యిన్ని ప్రశ్నలు వేయగానే భోరున ఏడిచింది.
ముగ్గురూ ఓదార్చి జరిగినది చెప్పమని అడిగారు."నా గురించి ఏం చెప్పమన్నారు దురదృష్టమంతా నా నొసటనే రాశాడు భగవంతుడు.నాకు ముఫై అయిదేళ్లు వచ్చేసరికి మూడొంతుల జీవితం ముగిసిపోయింది.నా భర్త గవర్నమెంటు ఆఫీసులో క్లర్కుగా చేసేవారు.నాకు వరుసగా ఏడుగురు పిల్లలు పుట్టి పురిటిలోనే పోయారు.ఎనిమిదోసారి పట్నం తీసుకెళ్లి పెద్ద డాక్టరుకి చూపించి విషయమంతా చెప్పారు. నెలలు నిండాక తన హస్పిటల్లో పురుడుపోసుకోమన్నారు.అలాగే చేశాము దేముని దయవలన మగబిడ్డ దక్కాడు.ఎంతో సంతోషంగా యింటికి తీసుకువచ్చాము.బిడ్డని ఒళ్లో పెట్టుకుని ఆరోజు ఎంత సంతోషించానో మర్నాడు అంతకు రెట్టింపు దుఖం పొందాను. మరునాడు ఆదివారం నా భరత భోజనం చేసి కుర్చీలో కూర్చుని పేపరు చదువుకుంటూ ఒరిగిపడి ప్రాణం పోయింది.గుండాగిపోయిందన్నారు.ఎందుకు బ్రతకాలని ఏడుస్తుంటే ఒళ్లోని పిల్లడు కేరుమన్నాడు.ఎన్ని కష్టాలెదురయినా వాడిని పెంచి పెద్ద చేయాలని నిర్ణయించుకున్నాను.వచ్చే పెన్షనుతో పిల్లడిని పెంచి పెద్ద చేశాను.నేను తిన్నా తినక పోయినా వాడికి పెట్టి కంటికి రెప్పలా చూసుకున్నాను.మా కష్టాలు గట్టెక్కి నా కొడుక్కి వాళ్ల నాన్న ఆఫీసిలోనే అకౌంటెంటుగా వుద్యోగం వచ్చింది.మరుచటి సంవత్సరమే చక్కని పిల్లని చూసి పెళ్లి చేశాను.కోడలు అడుగు పెట్టిన నెల్లాళ్లనుంచి తన స్వభావం బయట పెట్టడం ప్రారంభించింది.నా కొడుకు యింట్లో వున్నంత వరకు ఎంతో వినయంగా ప్రవర్తిస్తూ ఆఫీసుకెళ్లగానే సూటిపోటి మాటలనడం కొడుకుని కొంగున ముడేసుకున్నానని వాళ్లిద్దరూ స్వేఛ్చగా వుండే అవకాశమే లేదని అంటూండేది. నా పంచ ప్రాణాలు నా కొడుకు చుట్టూనే అల్లుకున్నాయి.నేనెక్కకి పోవడానికి నాకెవరూ లేరు.అప్పటికీ సాయంత్రం పూట వంటచేసి ఏగుడికో పోయి కూర్చుని భోజనాల సమయానికి వచ్చేదాన్ని.రోజూ ఎక్కడికమ్మా వెళ్లిపోతావని కొడుకడిగితే రామా కృష్నా అనుకుందికి గుడికెళ్లానంటూ సర్ది చెప్పేదాన్ని మూడేళ్లు మూడు యుగాల్లా గడిచాయి.నాకొడుకు నన్ను వదలడు నా కోడలు నేను వాడి ఛాయలకు పోయినా సహించదు.ఒక సారి చూచాయగా నాకొడుకుతో చెప్పాను ప్రతి క్షణం నాగురించి తలవడం కాదు భార్యా భర్తలిద్దరూ అన్యోన్యంగా వుండాలని.అన్యోన్యంగాలేమని సందేహమెందుకొచ్చింది నాకు నీ తరువాతే ఎవరైనా ఖచ్చితంగా చెప్పాడు.అలా అనకూడదు భార్య తరువాతే మిగతా వాళ్లంతా అన్నాను.తారాజువ్వలా లేచాడు.యిన్ని కష్టాలు పడి కంటికి రెప్పలా పెంచావు యిప్పుడు తనగురించి అలోచిస్తావేమిటి భార్యనైనా వదులుకుంటాను గాని కడుపుకట్టుకుని పెంచిన తల్లిని వదిలుకోను అన్నాడు. యిక నేనా యింట్లో వున్నకొద్దీ ఘర్షణ పెరగడమేకాని తగ్గదు. నాకు చదువు లేదు బయట ఎలా బ్రతకాలో తెలియదు.నాకొడుకు వున్న చుట్టుపక్కల నేనేదయినా అఘాయిత్యం చేసుకుంటే కోడల్ని బ్రతకనివ్వడు తను బ్రతకడు.హైదరాబాడు వస్తున్న రైలెక్కేశాను. దిగాక టిక్కెట్టు అడిగితే వెర్రి చూపులు చూశాను.నా అవతారం చూసి కసిరి పంపేశాడు.అలా నడుస్తూంటే పెద్ద బిల్డింగు కనిపించింది.దాని పైనుంచి దూకితే చావడం ఖాయం అని మెట్లు ఎక్కుదామని వెళ్తుంటే ఒక కుర్రాడు లిఫ్టుంది మామ్మగారూ రండి ఏ ఫ్లోరుకెళ్లాలి అడిగాడు పన్నెండు అన్నాను తడుముకోకుండా.రండని తీసుకెళ్లి పన్నెండో అంతస్తు రాగానే బయటికెళ్లమని తను యింకా పైకి వెళ్లాడు.బయటకు వచ్చాను.వరండాలావుంది అడ్డంకులేమీ లేవు ఎవరూ చూడటంలేదని చూసి గోడేక్కి దూకాను చావులో కూడా దురదృష్టమే వరించింది". కాసేపు కరువుతీరా ఏడవనిచ్చాం తరువాత తనే ప్రశ్నించింది "మీరంతా ఎవరు?యిదెవరిల్లు?"అంటూ. అప్పుడు మాగురించి వివరించాం.రెండుచేతులెత్తి నమస్కరించి నన్నిక్కడే వుండనివ్వండి నేను డబ్బులేమీ యిచ్చు కోలేను గాని మీ అందరికీ సహాయంగా పనులు చేయగలను.యిక కొడుకు కోడలి గురించి ఆలోచించను.రామా కృష్ణా అనుకుంటూ మీ అందరితో వుండనివ్వండి.మిగతా మెంబర్లతో సంప్రతించి ఆమెని మాతో వుంచాం.


ఆశ్రమం మొదలై ఆర్నెల్లయింది ఓవరాల్ గా చూసుకునే మనిషిని అపాయింట్ చేస్తే బాగుంటుందని తమ సంస్థలో పని చేసేందుకు ముఫై అయిదు నలభై మధ్య వయసు కలిగి గ్రాడ్యుయేట్ అయి ఎటువంటి బాదరబందీ లేకుండా ఆశ్రమంలోనే వుండి బాగోగులు చూసుకునేందుకు కావాలని ప్రకటన యిచ్చారు.వీరి ప్రకటన చూసి యిద్దరే వచ్చారు.ఒకామె నలభైయ్యేళ్లు భర్త త్రాగుబోతు రోజూ వచ్చి హింసిస్తుంటాడు.యిద్దరు పిల్లాలు పన్నెండు పది క్లాసులు చదువుతున్నారని చెప్పింది.ప్రకటన పూర్తిగా అవగాహన చేసుకోలేదో లేక తన అవసరం కోసం వచ్చిందో ఆమెని ల్లాభం లేదన్నాం.రెండో ఆమె యిరవైయెనిమిదేళ్లు భర్త మిలటరీలో చేస్తూ చనిపోయి రెండేళ్లయిందని.నా అన్నవాళ్లెవరూ లేరని చెప్పింది.యివన్నీ సరిపోయేయికాని వయసు ముఫై అయిదేళ్లుండాలని ప్రకటనలో రాశాముకదా అంటే వయసుదేముంది సార్! నా జీవితానుభవం యిరవైయెనిమిదేళ్లకే అరవైయేళ్లంత వుంది అంది.కామర్సు గ్రాడుయేట్ అని నాలుగైదు ఆఫీసులు మారాననీ ఎక్కడికెళ్లినా ఏవో చేదు అనుభవాలే ఎదురయాయని మేము రాసిన వయసు లేకపోయినా పెద్దవాళ్లమధ్య ఒక పిల్లలా అందరికి సేవచేస్తూ పొట్ట పోషించుకునేందుకు నిర్ణయించుకున్నానని చెప్పింది.ఆమె మాటల్లోని నిజాయితీ మమ్మల్ని ఆకట్టుకుంది.అపాయింట్ చేసుకున్నాం. ఆమె పేరు సుగుణ.
ఆమె ఆశ్రమంలో అడుగు పెట్టినప్పటినుంచి అశ్రమం చైతన్య శ్రవంతిగా మారింది.అచ్చటనున్న అందరినీ తాతయ్యగారూ బాబయ్యగారూ బామ్మగారూ పిన్నిగారూ అంటూ బంధుత్వంతో పిలుస్తూ వారి వారి అవసరాలు తీరుస్తుండేది.సత్యానంద్ గారిని మాత్రం బాబు గారూ అని పిలిచేది.ఒకరోజు నవ్వుతూ అడిగారు "ఏమ్మా! సుగుణా అందరితో బంధుత్వం ఏర్పరుచుకున్నావు నాతో బంధుత్వం లేదా?అని ప్రశ్నిస్తే "ఎందుకు లేదు బాబుగారూ భగవంతునికి భక్తునికి మధ్య వున్న బంధుత్వం.ఇంతమందికి మనోవేదనతీరే వుపాయం చూపిన మీరు అందరికీ దేముడే!అదే బంధుత్వం మనది".అనగానే సత్యానంద్ ఆప్యాయంగా తల నిమురుతూ "నువ్వొచ్చాక నాకు కాస్త రిలీఫ్ గావుందమ్మా.నేను మూడు నెలలకోసం అమెరికా వెళ్దామనుకుంటున్నాను".అంటే"బాబుగారూ మూడు నెలల్లో ఈ సంస్థ స్థాపించి ఒక సంత్సరం అవుతుంది కదా ఆ సమయానికి మీరు వచ్చేయండి చిన్న ఫంక్షన్ ఏర్పాటుచేద్దాం". అనగానే అలాగేనమ్మా నీ మీద యింకొక బాధ్యత పెడుతున్నాను.యిక్కడ చేరే వాళ్లంతా తమ తమ పరిస్థితులను కొంత చెప్పారు.అన్నింటినీ ఒక డైరీలో హింట్సులా రాశాను.అందరూ యిక్కడే వున్నారు కాబట్టి హింట్సుని కాస్త్ వివరంగా కనుక్కుని ఒక కధలా తయారు చెయ్యి.ముందు తరాలవారికి వుపయోగ పడవచ్చు.ఇక ముందు ఎవరైనా వస్తే వాళ్ల వివరాలు కూడా తెలుసుకుని రాసి వుంచు" సరేనంది.సత్యానంద్ వెళ్లేముందు అందరికీ వాళ్ల వాళ్ల డ్యూటీలు సెట్ చేసి అన్నీ సక్రమంగా జరిగేటట్లు చూడమని సుగుణకి అప్పచెప్పేడు.

అతను అమెరికా వెళ్లే ముందు రోజు ఒక ఫోను వచ్చింది.హైదరాబాదులో పోష్ లొకాలిటీ నుంచి తమకు తాముగా రాలేమని ఎవరినైనా సహాయం పంపితే వస్తామన్నారు. సుగుణని పంపితే వచ్చారు. ముసలాయనకి డెభ్భైఅయిదేళ్లు భార్యకి డెభ్భైయేళ్లు వుంటాయి.సుగుణ డ్రైవరు నడిపించి తెచ్చారు.ఆఫీసుగదిలో కూర్చోపెట్టాము సత్యానంద్ శివకామయ్య యిద్దరూ కూర్చుని వారి గురించి వివరాలడిగేరు."నా పేరు సారంగపాణి నా భార్య ప్రియంవద.మాకు నలుగురు పిల్లలు.ఆస్థి పాస్థులకు లోటు లేదు.ముగ్గురు మగ పిల్లలు అమెరికాలో సెటిల్ అయారు.అమ్మాయి సింగపూరులోవుంది.వాళ్లంతా వెళ్లిన కొత్తలో మూడేళ్లకి అయిదేళ్లకి వచ్చేవారు మమ్మల్ని చూడటానికి.ఇప్పుడు వాళ్ల పిల్లలు పెద్ద చదువులకి వచ్చాక యిండియా రావటం తగ్గిపోయింది.వచ్చినా చుట్టం చూపుగా మూడునాలుగు రోజులు మావద్ద వుండి సైట్ సీయింగుకని పిల్లలిని తీసుకు వెళ్లిపోతారు.నాకు శక్తి వుడిగిపోయింది నడవలేకపోతున్నాను.నాభార్య కూడా వయసు పైబడి పూర్వంలా తిరగ లేకపోతోంది.మా యింట్లో మేము కాక నౌకర్లు అన్నింటికీ వున్నారు.ఈ మధ్య మా అసహాయత చూసి చెప్పకుండా శలవలు పెట్టేయటం చేయవలసిన పనులు సమయానికి చేయక అడిగితే తల బిరుసు సమాధానాలు చెప్పడం చేస్తున్నారు. డబ్బు వుండగానే సరిపోదు.శరీరంలో శక్తి అయినా వుండాలి లేదా పిల్లలన్నా దగ్గరుండాలి.ఈ రెండూ కాని పక్షంలో యిటువంటి సంస్థలే మమ్మల్ని ఆదుకుంటాయని భావిస్తున్నాను.మేము అక్కడ వుంటే మాజీవితాలకి రక్షణలేదు.చిన్నగా నవ్వి ఈ వయసులో రక్షణ దేనికి అనిపిస్తుంది గాని చావు సహజంగా రావాలిగాని మాధనం కోసం ఆశపడి ఎవరు ఎలాంటి అఘాయిత్యానికి పూనుకుంటారో తెలియదు.మీరు చెప్పిన ఫీజే కాక చెరో లక్ష విరాళంగా యిస్తాను.వైద్యానికి మందులకి నేనే ఖర్చు చేస్తాను.మా ఆలనా పాలనా చూసే బాధ్యత మాత్రం మీది".అనగానే "తప్పకుండా మీ డబ్బు కోసం కాకకున్నా మీ వయసుని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తగా చూసుకుంటాం మీరెప్పుడు వస్తారో చెపితే మీకోసం రూము అరేంజి చేస్తాము"అన్నారు శివకామయ్య. "అయితే యింకొక విన్నపం మా కారు యిక్కడే వుంచుదాం మాకేకాదు ఎవరికి అవుసరమయినా వాడుకోవచ్చు"."సరే అలాగే చేద్దాం మేము ఒక వేను కొనాలన్న వుద్దేశంలొ వున్నాం నేను రేపు అమెరికా వెళ్తున్నాను మూడు నెలల్లో తిరిగి వస్తాను అవుసరమయితే తొందరగానే వచ్చేస్తాను"అన్నారు సత్యానంద్.వాళ్లు వెళ్లగానే సుగుణ అంది" ఈ రోజుల్లో ఓల్డేజి యింత అభిశాపమా?వీళ్లని జాగ్రత్తగా చూసుకుని మన సంస్థ పేరు నిలపెట్టాలి". నీ మీద నాకు నమ్మకముందమ్మా నువ్వు కారు డ్రైవింగు నేర్చుకొ ఏ అర్ధరాత్రయినా అవుసరమైనప్పుడు సమయానికి చేరగలుస్తాము" అన్నారు సత్యానంద్.వాళ్లిద్దరూ మర్నాడే వచ్చి సభ్యులుగా చేరారు.

సత్యానంద్ అమెరికా వెళ్లినా శివకామయ్య రంగనాధంలు అన్నీ చూసుకునేవారు.సత్యానంద్ వెళ్లిన వారానికి ఒకాయన వచ్చ్చాడు మనిషి చాల ఆందోళన పడుతున్నట్లు వుండెను.ఆఫీసులో కూర్చోపెట్టి వివరాలు సేకరించాం.అతని పేరు వెంకట్రామయ్య,బట్టల వ్యాపారం సిటీలో పెద్ద షోరూం వుంది.అయిదుగురు పిల్లలు నలుగురు కొడుకుల్లో పెద్దవాడు వ్యాపారం చూసుకుంటున్నాడు.మిగతా వాళ్లు వుద్యోగస్తులు.యిద్దరు ఈ వూరే ఒక్కడు చెన్నైలో వున్నాడు.కూతురు భర్తతో ఢిల్లీలో వుంటోంది.నలుగురు కోడళ్లలో యిద్దరు వుద్యోగస్తులు యిద్దరు యింటిపట్టునే వుంటారు. "ఈ వివరాలతో మీరు యిక్కడికి వచ్చిన కారణం?","అదే చెప్తున్నాను.నా భార్య లక్ష్మి పిల్లల పెళ్లిళ్లయి యిన్ని సంత్సరాలయినా ఎవరింట్లోను వారం రోజులు మించి వుండదు.పైగా కోడళ్లని ఏదో ఒకటి అంటూంటుంది.వాళ్లు చేసే పని నచ్చదు.పోనీ అమ్మాయి వద్ద నాలుగు రోజులుందామని వెళ్తే అక్కడకూడా ఏదో అసంతృప్తి కోడళ్లు జవాబివ్వకుండా మా యిద్దరి అవసరాలు జాగ్రత్తగా చూసుకుంటారు.అయినా ఆమెని మెప్పించలేరు.ఈ విధంగ ఎవరిదగ్గరా వుండలేకపోతే మేమిద్దరమే వుందామని వేరే కాపురం పెట్టాను.అక్కడ మూడు రోజులు వుండలేకపోయింది.డాక్టరుని సంప్రతించాను.డాక్టరనటం తనకన్నా చిన్నవాళ్ల మధ్య తన ఆధిక్యత చూపించుకుందికి అలా ప్రవర్తిస్తున్నదేమో తన వయసు వాళ్లతో మసలుతూ వాళ్ల సమస్యలు అవీ గ్రహిస్తే ఏమైనా మార్పు కనిపించవచ్చునని సలహా యిచ్చారు. ఈ సంస్థలో ఆమెని వుంచవచ్చునా?మీరడిగిన ఫీజు యిచ్చుకుంటాను".అంటూ ఆగారు,ఏంచెప్పాలో శివకామయ్యగారికి తోచలేదు.రంగనాధంగారు చెప్పారు"అయ్యా మీ సమస్య అంత సులువుగా పరిష్కారం కాకపోవచ్చు.మీ భార్యనొక్కరినే వుంచడంకాక మీరిద్దరూ ఒక వారం రోజులకోసం వచ్చి వుండండి.మేమంతా ఆమెని అర్ధం చేసుకుందికి ప్రయత్నిస్తాము.వారంరోజులు యిక్కడ ఆమె బాగానే ప్రవర్తిస్తే ఒక నెలకోసం ఫీజు కట్టండి.తరువాత ఆమె యిక్కడ అడ్జెస్ట్ అవగలరనుకుంటె సభ్యులుగా చేరండి కాని ఎట్టి పరిస్థితిలోను ఆమెని ఒక్కర్తినీ యిక్కడ వుంచకండి.వుండదలుచుకుంటే యిద్దరూ వుండండి" అంటూ సలహా యిచ్చారు.ఈ సలహా బాగుందని మర్నాడు చిన్న బేగుతో వచ్చారు.వీళ్లందరూ యిక్కడెందుకున్నారని ప్రశ్నించింది.ముసలి వయసులో ప్రశాంతత కోసం అందరూ ఒక చోట చేరామని చెప్పాం.వారం రోజులు ట్రయలుగా వుందామని వచ్చిన వెంకట్రామయ్య లక్ష్మిలు ఆశ్రమ వాతావరణం అందరి దిన చర్య చూసి ముగ్ధులయారు.ముఖ్యంగా లక్ష్మి అక్కడున్న ఆడవాళ్లందరి దగ్గర కూర్చుని వాళ్లగురించి విన్నాక తనెంత అదృష్టవంతురాలో అర్ధమయింది.తన పిల్లలు కోడళ్లు మనుమలు తననెంత అభిమానంగా చూసుకున్నా తనకెందుకు నచ్చేదికాదో బోధపడలేదు.అది వాళ్ల చర్యలలో కాదు తన అసంతృప్తి అని అర్ధం చేసుకుంది.వెంకట్రామయ్య మరో ఆలోచన లేకుండా సభ్యత్వం తీసుకున్నాడు.వూరిలో తన వాళ్లంతా వున్నారు కావున ఎప్పుడైనా చూడాలనుకుంటే వెళ్లవచ్చన్న అభిప్రాయం వెలిబుచ్చాడు.

లక్ష్మి మనస్తత్వంతోనే విచిత్రంగా ఫీలవుతున్న ఆశ్రమ సభ్యులకు మరొక విచిత్ర స్వభావంగల వ్యక్తి భానుమూర్తి రావదంతో ఖంగు తిన్నారు.భానుమూర్తిగారిని అతని కొడుకు తీసుకు వచ్చాడు. భానుమూర్తి గురించి జయ రాంని అడిగారు షివకామయ్యగారు"మీ నాన్నగారిని యిక్కడ ఎందుకు వుంచదలిచారు?" "ఏముంది నా పీడ వదిలించుకుందికి" అని దురుసుగా జవాబిచ్చారు భానుమూర్తిగారు.డెభ్బైఏళ్లవ్యక్తిలో వుండవలసిన పెద్దరికం గాంభీర్యం లేవుసరికదా చిన్నపిల్లాడిలావుంది ఆ జవాబు."ప్లీజ్! నాన్నగారూ! సార్! మా నాన్నగారిముందు నేనేం చెప్పినా అతను హర్టవుతారు.మేము అతన్ని సరిగా చూసుకోలేకపోతున్నాము. మీ ఫేజు సంవత్సరంది అడ్వాన్సుగా కడుతున్నాను. అతను యిక్కడ వుండటానికి యిబ్బంది పడితే నాకు తెలియజెయ్యండి నేనే వచ్చి తీసుకెళిపోతాను.నాన్నగారూ!యిక్కడంతా మీ వయసువాళ్లే కాలక్షేపానికి లోటుండదు.మీకు నచ్చకపోతే బలవంతమేమీలేదు.నేను వచ్చే వారం మళ్లీ కలుస్తాను".అంతూ చిన్న పిల్లాడిని బోర్డింగు స్కూల్లో వదిలినట్లు విడిచి వెళ్లాడు జయరాం.
భానుమూర్తిగారినెలా టాకిల్ చెయ్యాలో కాస్త తికమక అనిపించింది .రూము చూపించి యిక్కడి పధ్ధతులు వివరించింది సుగుణ ముభావంగా తలూపాడు.మర్నాడు భానుమూర్తి అలా తిరిగి రావాలని బయలుదేరితే బయట వాచ్ మేను అడ్డుకున్నాడు.చిరాకుగా తిరిగివచ్చి శివకామయ్యగారితో పేచీవేసుకున్నాడు.బయట తిరగకూడదంతే యిదేమన్నా జైలా?ఎటువంటి స్వతంత్రం లేకుండా యింత వయసు వచ్చాక యిక్కడెందుకు వుండటం అంటూ గట్టిగానే వాదించాడు. శివకామయ్య మాత్రం శాంతంగా. "అలా బయట తిరగాలంటే ఆశ్రమం చుట్టూ యింత ఆవరణ వుంది,అక్కడ తిరగండి ఒక్కరూ బయట యీ వయసులో తిరగడం మంచిదికాదు. మీ మంచి చెడ్డలు మా బాధ్యత మీ పిల్లలకి మేము జవాబిచ్చుకోవాలి సంస్థలో వుంటే యిక్కడి నిబధనలు పాటించాల్సి వుంటుంది ప్రతివారికి.అంతమాత్రాన జైలనుకుంటే ఎలా? అందరూ ఎలా కాలక్షేపం చేస్తున్నారో అలాగే మీరూ కాలక్షేపం చెయ్యండి.పేపర్లున్నాయి పుస్తకాలున్నాయి. యివికాక యింతమందిమి వున్నాం మీ ఫీలింగ్సు షేర్ చేసుకోవచ్చు.అందరం యించుమించు వొకే వయసువాళ్లమే". ఇన్ని మాటలు విన్నాక ముభావంగా తన గదికి వెళ్లిపోయాడు.యితన్ని టేకిల్ చెయ్యడం కష్టమే అనుకున్నారు శివకామయ్యగారు మనసులో.

జయరాం వధ్ధ నుంచి ఫోను వచ్చింది,"నాన్నగారు ఎమీ యిబ్బంది పెట్టడం లేదుకదా?"వెంటనే ముందు రోజు జరిగినది చెప్పి "అసలు అతని స్వభావం అంచనా వెయ్యడానికి మీ ఫేమిలి బేక్ గ్రౌండ్ తెలిస్తే తగిన విధంగా చర్య తీసుకోగలం."శివకామయ్యగారు చెప్పారు " క్షమించండి మీకు శ్రమ కలిగిస్తున్నాను .మీకు కవర్లో పెట్టి యిచ్చిన చెక్కుతోపాటు మా కుటుంబం గురించి వివరంగా రాసి పెట్టాను.మా నాన్నగారి ముందు ఆవిషయాలేమీ చెప్పలేను.అంధుకే ముంధుగా రాసి పెట్టాను. అలా రాసినట్లు తెలిసినా అతనికి కోపం వస్తుంది. ప్లీజ్! మీరది చదువుకుని అర్ధం చేసుకోండి.నేను రెండు మూడు రోజులకోసారి ఫోను చేస్తాను.పరిస్తితి యిబ్బందికరంగా వుంటే అతన్ని తీసుకెళిపోతాను.మాకెలగూ అలవాటే అతని ప్రవర్తన.ఏమయినా మార్పు వస్తుందేమోనని మీలాంటి పెధ్ధలమధ్య వదిలి పెట్టాను తప్ప మాకు తండ్రి బరువై కాదు.అతని ప్రవర్తన నుంచి వూహ తెలుస్తున్న మా పిల్లల మీద ప్రభావం పడుతోంది.ఇంతకన్నా వేరే కారణం లేదు.మరోలా భావించకండి "అర్ధిస్తున్న స్వరంతో చెప్పాడు జయరాం."వర్రీ అవకండి మా శాయ శక్తులా ప్రయత్నిస్తాము".అంటూ ఫోను పెట్టేశారు.సుగుణని పిలిచి జయరాం వుత్తరం యిచ్చి దీనిని స్టడీ చేసి భానుమూర్తిగారి స్వభావాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నం చెయ్యి. మన సంస్థ సాఫీగా నడుస్తున్నాది. లక్ష్మిగారిని భానుమూర్తిగారిని దారిలో పెట్టడం మనకొక చాలెంజే!"అంటూ కాగితలని సుగుణకిచ్చారు.అమె చదవడం మొదలుపెట్టింది.

శ్రీ సత్యానంద్ గారికి
నమస్కరించి వ్రాయునది. మీసంస్థలో చేరే ముందు ఫేమిలి గురించి వ్రాయాలని మీ అప్లికేషనులో వుంది ఈ వివరాలన్నీ రాస్తున్నాను. మరోలా భావించకండి.మా అమ్మ నాన్నలకు మేము నలుగురు పిల్లలం ఒక అక్క యిధ్ధరు తమ్ముళ్లు నాకు. మా నాన్నగారు ఒక ప్రైవేటు కంపెనీలో చేశారు.మా చదువులు పూర్తయేలోపునే మా అక్క పెండ్లయింది.మా ముగ్గురం మంచి వుద్యోగాల్లో సెటిలయాం మా పెళ్లిళ్లయాయి కాని మా చిన్నతనంనుంచి మా అమ్మ వద్దనున్న చనువు వుండేదికాదు.మా నాన్నగారి వధ్ధ వుండేదికాదు.మా నలుగురిలో ఎవరినీ చేరదియ్యడంగాని ముద్దు చెయ్యడంగాని మేమెరుగం.ఆ ముధ్ధు మురుపాలన్నీ మా అమ్మ వధ్ధే లభించేవి.చివరికి అతని రిటైర్మెంటు తరువాత కూడ అతని అవుసరాలు చూసేది సలహా చెప్పేది మా అమ్మే.అతని భావాలు మా వరకు వచ్చేవి కాదు. మా పిల్లలు జూనియర్ కాలేజీకి వచ్చారు అయినా మా నాన్నగారంటే మాకు జంకు.ఇటువంటి పరిస్తితిలో రెండేళ్ల క్రిందట మా అమ్మ జబ్బు చేసి చనిపోయింది.అప్పటినుండి మా నాన్నగారు మా ఎవరివధ్ధ అద్జస్ట్ అవలేక పోతున్నారు. మా అక్క కూడా తీసుకెళ్లింది. వారం రోజులకన్నా వుండలేకపోయారు నేను మా తమ్ముళ్లు అడిగాం అతనికి మాలో ఎవరి వధ్ధ సంతోషంగా అనిపిస్తే అక్కడే వుండమని అతని జవాబు విన్నాక మాకేమీ పాలు పోలేదు."మీరంతా మీ మీ పనుల్లో వుంటారు. మీ అమ్మ వుంటే నా ఆలనా పాలనా చూసేది.తనులేని ఏ ప్రాంతం నాకు నచ్చటం లేదు నన్ను విసిగించకండి".యిది వినాక ఏం చెప్పాలో తెలియలేదు.మా బంధువు ఒకాయన సలహా యిచ్చారు మీ సంస్థలాంటి చోట వుంచితే అందరూ అతని వయసు వాళ్లే వుంటారు.వాళ్ల మధ్య యితని మనసు కుదుట పడుతుందేమోనని.మీ అందరి మధ్య కూడా అతను వుండలేకపోతే యిక మా అదృష్టం అంతే అనుకుంటాం.కృతజ్ఞతలతో శలవు .
జయరాం
ఈ వుత్తరం చదివి దీర్ఘంగా నిట్టూర్చింది సుగుణ.యిప్పటివరకు వున్న సభ్యులతో సాఫీగా గడుస్తోంది గాని యికపై లక్ష్మిగారితో భానుమూర్తిగారితో ఏం సమస్యలొస్తాయో అనుకుంది.ఒక నెల గడిచేసరికి లక్ష్మిలో మార్పు వచ్చింది. అందరి విషయాలు విన్న తరువాత ఆమె అనేది" నా పిల్లాలు మనుమలు నన్నెంత అభిమానంగా చూసుకునే వారు నేనే అత్తగారిలా పెత్తనం చెలాయించాలని వాళ్లనేదో ఒకటి అనేదాన్ని". సీతమ్మ ఆమెని వూరడించి, మనిషన్నాక ఏవో బలహీనతలుంటాయి.అవి మనకి తెలియకుండానే బయట పడుతుంటాయి. మీలా ఒప్పుకునేవాళ్లెంతమంది చెప్పండి?"
ఒక రోజు సారంగపాణిగారు సుగుణని పిలిచి "కాలక్షేపం అవటం లేదమ్మా పుస్తకాలు చదవాలంటే కళ్లు లాగుతున్నాయి".అనగానే మీకు నచ్చిన పుస్తకం యివ్వండి కాసేపు చదువుతాను" అంది. "కాసేపు ఏమైనా కబుర్లు చెప్పు అన్నారు." మాలాంటి వాళ్లకి మనుషులు మాటలు కావాలి అంతకన్నా లేదు".అంది ప్రియవద నవ్వి "బాబయ్యగారూ మనం రోజూ ఒక టైము అనుకుని టిఫిను తినే ముందు తయారై హాలులో అందరం కూర్చుని పాటలు లేదా శ్లోకాలు చదువుకుని అరగంట ప్రార్ధనలా చేసుకున్నాక డైనింగు హాల్లో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ టిఫిను చేసి ఎవరి గదులకు వాళ్లు ఎవరి పనులకు వాళ్లు వెళితే బాగుంటుందికదా? యిది నా అయిడియా మీరు పెద్దవాళ్లు మీరు ఓకె అంటే అందరితో సంప్రతించి రేపటినుంచి అలా చేద్దాం"."ఈ అయిడియా బాగుందమ్మా టైము నిర్నయించు నేను ఆంటీ రెడీగా వుంటాం.నువ్వే వచ్చి నన్ను తీసుకెళ్లాలి"."అదెంతపని అందరికీ ఈ మాట చెప్పి వస్తాను"అంటూ లేచింది.అందరూ సరేనన్నారు,భానుముర్తిగారు మాత్రం అంత ప్రొద్దుటే లేచే అలవాటు లేదన్నారు."ఒక రోజు ట్రై చెయ్యండి అంకుల్ అందరం కలిసి ప్రార్ధన చేసి తిఫిను తిని కబుర్లు చెప్పుకుంటే మనం ఒంటరి వాళ్లం కాదు అన్న ఫీలింగు వస్తుంది" . "సరే చూద్దాం ఉదయం నా తలుపు తట్టు తయారవుతాను" అన్నారు."అమ్మయ్య! "అనుకుంది. మర్నాడు ఉదయం అందరూ ఎనిమిది గంటలకు హాలు చేరుకున్నారు.అందరికీ కుర్చీలు వేసి వుంచింది.ఒక చిన్న టేబిలు మీద దేముడి పఠం పెట్టి పూలదండ వేసి దీపం వెలిగించింది.వచ్చిన వాళ్లంతా బాగుందమ్మా సుగుణా అన్నారు శుక్లాం బరధరం విష్ణుం అంటూ గణేషు స్తుతి చేశారు.లక్ష్మి ఒక పాట పాదింది అందరూ ఫాలొ అయారు.మీనాక్షి అష్టకం చదివింది."మరి మగవాళ్లేం పాడరా?" అంది సుగుణ సారంగపాణిగారు కృష్ణుడి మీద పాట పాడేరు.అతని కఠం చాలా బాగుంది.ఆంటీ మీరు పాడరా?" అడిగింది సుగుణ " రేపు మేమిద్దరం కలిసి పాడుతాం" అంది ప్రియంవద.ప్రార్ధనా కార్యక్రమం మొదలు పెట్టాక అందరిలో వుత్సాహం పెరిగింది మరిచిపోయిన పాటలు ఖాళీ సమయాల్లో గుర్తు చేసుకుని మరీ పాడుతున్నారు.
మనుషులు ఏదో ఒక పనిలో నిమగ్నమయి వుంటే అనారోగ్యాలగురించి తలుచుకుని చింత పడటం తగ్గుతుందని సుగుణ అభిప్రాయం.భానుమూర్తిగారు రోజూ వుదయం ప్రార్ధనలో పాల్గొంటారు తప్ప పాటలో కంఠం కలపడం యిష్టం వుండదు.ఎవరు ఏ విషయం మాట్లాడినా దానికి వ్యతిరేకంగా వాదించడం అతని అలవాటు.ఒక రోజు అతనితో మాట్లాడిన వాళ్లు రెండవ రోజు మాట్లాడటానికి యిష్టపడరు.ఈ కొద్దిమందితో యిలా వుంటే నెల రోజుల్లో యితను తిరిగి వెళిపోతారనుకునేది అదేమాట సుగుణ. అదే మాట శివకామయ్యగారితో అంటే "అతనికి యింటరెస్టయిన సబ్జెక్టు ఏమిటో తెలిస్తే ఆ విషయం మీదే మాట్లాడితే సరిపోతుంది" అన్నారు. "అలా గ్రహించడం చాలా కష్టం బాబయ్యగారూ అతనికి ఏ విషయం మీద నిర్దుష్టమయిన అభిప్రాయాలున్నట్లు లేదు.చూద్దాం కాలమే అతన్ని సరి చేస్తుందెమొ"అంది. ఒక రోజు అతన్ని లేపడానికి వెళ్లి తలుపు తడితే ఎంతకీ తియ్యలేదు.శివకామయ్యగారిని పిలిచింది.నలుగురూ వచ్చి కంగారు పడుతూ వచ్చారు.బలవంతంగా తలుపు తెరిచారు.భానుమూర్తిగారు పూర్తి తెలివిలొ లేరు బట్టలలో వాంతి విరోచనం అయి ఆ దుర్గంధంలొ పడివున్నారు.అతని స్తితి చూసి అందరికీ నోట మాట రాలేదు. వెంటనే అంబులెన్సుకోసం ఫోన్ చేశారు. సుగుణ పూనుకుని ఆ దుర్గంధంలోంచి అతన్ని బయటికి తీసి సుగుణ అంది అంకుల్ ని నేను చూసుకుంటాను బాత్రూం వరకు సాయంపట్టి తీసుకెళ్లి శుభ్రం చేసి బట్టలు మార్చి పని మనిషి చేత పక్కబట్టలు మార్పించి ఫినాయిలు వేసి శుభ్రం చేయించింది యీలోగా అంబులెన్సు వచ్చింది.హాస్పిటల్ చేరేక దాక్టరు చూసి కడుపు అప్సెట్ అయింది తప్ప మరే చికాకు లేదని యింజక్షనిచ్చి గ్లూకోజ్ ఎక్కించారు. సుగుణ అంది "అంకుల్ ని నేను చూసుకుంటాను.వాళ్లబ్బాయికి ఫోను చెయ్యండి వీలయితే వస్తారు లేదా యింతకు ముందెప్పుడయినా యిలా జరిగిందేమో కనుక్కోండి" అంది. "వద్దమ్మా ఈ పాటిదానికి అతన్ని కంగారు పెట్టడమెందుకు రెండు రోజుల్లో అంతా సర్దుకుంటుంది ఆమాత్రం మనం చూసుకోలేమా?"అని శివకామయ్యగారన్నారు.సాయంత్రానికల్లా లేచి కూర్చున్నారు భానుమూర్తిగారు. "సుగుణా నిన్న రాత్రి కడుపులో వికారం అనిపించి బాత్రూముకి వెళ్దామనుకునేలోపున పెద్ద వాంతి అయింది లేవలేకపోయాను.బెడ్దు పక్కన అలారం స్విచ్ వుందన్న మాట గుర్తు రాలేదు ఎంతసేపు అల్లా పడున్నానో తెలియలేదు.మీ అందరికీ శ్రమ కలిగించాను.ఆ గలీజంతా ఎవరు తీశారమ్మా? నాకు చాలా సిగ్గుగా వుంది"అన్నారు. "నేనే తీసాను అంకుల్, మనిషికి మనిషి సహాయం చేయకపోతే మరెవరు చేస్తారు?""నా భార్య వున్నప్పుడు యివన్నీ చూసుకునేది తను పోయాక నేను ఒంటరివాడినయిపోయాను".అనగానేసుగుణ నవ్వి "అంకుల్ మీ మేరీడ్ లైఫ్ ఎన్ని సంత్సరాలు గడిపారు?" "ముఫై ఏడు సంత్సరాలు"."మన ఆశ్రమంలో వున్న సీతమ్మగారు ఆర్నెల్ల వైవాహిక జీవితం గడిపాక భర్త దేశాలు పట్టిపోయాడు బ్రతికి వున్నాడో లేదో కూడా తెలియదు.ఆమెకున్న ధైర్యం మీకు లేదేంటి?యిక నా సంగతికొస్తే మిలట్రీ వ్యక్తిని పెళ్లి చేసుకుని అతను అవగాహన కాకముందే కార్గిల్ వార్ లో పోయాడు.మేమంతా వాళ్లు లేరే అని బాధపడుతూ కూర్చోలేదు.ఆమెకి నాకు వెనుక చూసుకుందికి ఎవరూ లేరు.అలాగని మేమెవరిని నిందిస్తాం క్షమించండి అంకుల్, జీవితం అన్నాక ఆటు పోటులు వస్తూనే వుంటాయి. మీకేం జీవితం చాల వరకు సాఫీగానే గడిపారు.అయిదుగురు పిల్లాలున్నారు. వున్నవాళ్లని లెక్క చెయ్యక పోయిన మీ భార్యని తల్చుకుంటూ మిగతా జీవితాన్ని వ్యర్ధం చేసుకుంటున్నారు.మీకున్న శక్తిని ఏదైనా సహాయ కార్యక్రమాలకై వుపయోగించండి.మీకు చాలా తృప్తినిస్తుంది".
"లేదమ్మా సుగుణా యిక మీదట నీ మాటల్ని పాటించడానికి ప్రయత్నిస్తాను.మొదటినుంచి పిల్లలు నా పెద్దరికాన్ని గౌరవించి నా అవసరాలు తీరుస్తుండాలని కోరుకున్నానే గాని వాళ్ల యిబ్బందులని లెక్క చెయ్య లేదు.ఏమయినా నా ప్రవర్తన సరికాదని ఎత్తి చూపిన వ్యక్తివి నువ్వే. చాల ధైర్యవంతురాలివి". మర్నాడు అతన్ని డిశ్చార్జి చేశారు.


మర్నాడు వుదయం ప్రార్ధనా సమయానికి ముందుగా తయారయి సుగుణతో అన్నారు"సారంగపాణిగారిని నేను నడిపించుకు తెస్తాను నువ్వు వేరే పని చూసుకో".భానుమూర్తిగారు సారంగపాణిగారిని నడిపించుకుంటూ వస్తున్న దృశ్యం చూసి అందరూ ఆశ్చర్యపోయారు.వెంకట్రామయ్యగారన్నారు "నా భార్యే తలతిక్క మనిషనుకుంటే ఆమెని మించి ఈయన హెడ్ స్ట్రాంగ్ గా వుండేవాడు రెండు రోజులు హాస్పిటల్లో వున్నాక ఏమందు పని చేసిందోగాని మనుషుల్లో పడ్డాడు"."మన సుగుణ యిటువంటి విషయాల్లో ఎవరితో ఎలా లౌక్యంగా మాట్లాడాలో బాగా తెలుసు అదే పనిచేసి వుంటుంది".

మూడు నెలలు సాఫీగా సాగిపోయాయి.సత్యానంద్ అమెరికా నుంచి వచ్చారు.అతన్ని చూడగానే ఆత్మబంధువుని చూసినంత ఆనంధించారు.ప్రశాంతాశ్రమం వార్షికోత్సవం చెయ్యడానికి ఏర్పాట్లు చేశారు.ఆశ్రమానికి కొద్ది దూరంలో వున్న వనాధాశ్రమం పిల్లల్ని పనిచేసేవారిని ఆరోజు ప్రొద్దుట భోజనాలు పెట్టారు.సాయంత్రం కార్యక్రమానికి సోషల్ ఆర్గనైజర్ శ్రీనివాసమూర్తిగారిని ఆహ్వానించారు. పదిమంది కాలేజి స్టూడెంట్లు వృధుల జీవితాలపై ఆర్టికల్ రాస్తున్నారు వాళ్లని మీ ఫంక్షనుకి తీసుకురావచ్చా అనడిగారు శ్రీనివాసమూర్తిగారడిగారు. తప్పక తీసుకు రమ్మన్నారు సత్యానంద్.సాయంత్రం ఆరుగంటలకల్లా అందరూ వచ్చారు. స్టూడెంట్లలో ఆరుగురబ్బాయిలు నలుగురమ్మాయిలు వున్నారు.ప్రార్ధనా గీతం తరువాత సత్యానంద్ మాట్లాడేరు. "ఈ ఆశ్రమం స్థాపించడానికి ప్రేరణ కలిగించిన సంఘటన నా చిన్ననాటి స్నేహితుడు శివకామయ్య వ్రాసిన వుత్తరం.ఆ తరువాత మేమిద్దరం కలిసి ఈ ఆశ్రమానికి ఒక రూపం కలిపించాం.ప్రారంభించిన సంవత్సరం పూర్తయేసరికి వారం క్రితం చేరిన సత్యనారాయణగారితో కలిపి పన్నెండు మంది సభ్యులయారు. విభిన్న మనస్తత్వాలుగల వ్యక్తులు తమతమ యింటి పరిస్తితులను బట్టి యిక్కడ చేరారు.అందరినీ ఒక తాటిమీద నడిపించే వ్యక్తి సుగుణ. వయసులో చిన్నదయినా అందరినీ తల్లిలా చూసుకుంటుంది.ప్రతివారి అలవాట్లను ఆకళింపు చేసుకుని అందరి అవసరాలను గమనించి సమయానికి అందేలా చూసుకుంటంది. ఆమె సేవ గురించి యీ రోజు చెప్పకపోతే యీ కార్యక్రమానికి పరిపూర్ణత ఏర్పడదు. మా సభ్యులు ఏ కారణంతో యిక్కడికి చేరారో వారు చెప్పిన విషయాలన్నీ నోట్ చేసుకుంటాము అందువల్ల వారి మనస్థితిఏమిటో అంచనా వేసే అవకాశం వుంటుందని అన్నీ నోట్ చేసుకున్నాం.ఆ మేటరంతా ఒక ఆర్డర్లో రాసి పెట్టింది సుగుణ.అది మీతో వచ్చిన స్టూడెంట్లకి వుపయోగపడుతుందంటే తెలుసుకోవచ్చు". అనగానే స్టూడెంట్లనుంచి ఒక అమ్మాయి లేచి "అంకుల్ మీలో ఎవరయినా ఒకరు తమ జీవిత విశేషాలు చెప్తే మేము వివరంగా తెలుసుకుంటాం.మీరు రాసిన మేటరు కూడా చదువుతాం.అయితే వివరంగా చెప్తే అందరం ఒకసారి వినటానికి వీలవుతుంది అభ్యంతరం లేకుంటేనే ప్లీజ్"అంది. అప్పుడు సత్యనారాయణగారు లేచి నేను కొత్తగా వచ్చాను, నాగురించి చాల కొద్దిగా చెప్పాను.ఈ రోజున వివరంగా చెప్తాను అలా చెప్పడంవలన మాగురించి తెలుసుకోవడమేకాదు యువతరం మీ బాధ్యత ఏమిటో పెద్దలయెడల ఎలా ప్రవర్తిస్తే బాగుంటుందో మీరే నిర్ధారించుకోండి.మా జీవితాలు సంధ్యా సమయానికి చేరుకున్నాయి.కాని వృధ్ధులంతా ఆశ్రమాలకి చేరుకునే పరిస్థితి కల్పించకుండా ఏం చెయ్యాలో మీరే నిర్నయించుకోండి. అంటూ తన గురించి చెప్పడం మొదలు పెట్టారు.

నా పేరు సత్యనారాయణ నేను క్రిమినల్ లాయరుగా చేసి రెటైర్ అయ్యాను. నాకు నలుగురు కొడుకులు.మా నాలుగోవాడు పుట్టినప్పుడు నా స్నేహితుడు "నీకేమిటోయ్ దశరధ మహారాజులా నలుగురు కొడుకులు.చాలా అదృష్టవంతుడివి"అనగానే ఏనుగు అంబారీ మీద వూరేగినంత సంబరమయింది.భార్య కాంతం అనుకూలవతి.లాయరుగా సంపాదనకు లోటు లేదు.అంతో యింతో తాతలనాటి ఆస్తి యిల్లు వున్నాయి.స్వంత వూరు హితులు స్నేహితులు జీవితం పూలబాట మీద నడుస్తున్నట్లుండేది.మా పెద్దవాడు రమేష్ చదువులో చాలా చురుకు పదవతరగతిలో స్టట్ ఫస్ట్ వచ్చాడు. ఏ సబ్జెక్ట్ తీసుకుంటావని అడిగితే తనకి మెడిసిన్ చదవాలనుందన్నాడు.లా చదివితే నా ప్రాక్టీసు అందుకోవచ్చు కదా అంటే "వద్దు నాన్నా అన్ని కాలాల్లోను ఆ నల్ల కోటు తొడుక్కుని కోర్టుల చుట్టూ తిరగడం నాకిష్టం లేదు అయినా మెడిసిన్ చెప్పిస్తారా లేదా?"అంటూ ఖండించాడు."వూరికే అడిగాను కన్నా నీకు నచ్చిన సబ్జెక్టు చధువుకో "అన్నాను.పన్నెండు తరువాత ఈజీగా మెడిసిన్ లో సీటు దొరికింది
.యిక రెండో వాదు పదకొండో క్లాసుకి రాగానే అడిగాను మేథ్సు తీసుకుని యింజినీరింగు చదుతానన్నాడు.లా చదవమని సూచనప్రాయంగా అడిగితే వాడి జవాబు విని ఆశ్చర్యపోయాను."పగలనక రాత్రనక నేరాలు నేరస్థుల గురించి ఆలోచిస్తూ పెద్ద పెద్ద లా పుస్తకాలు తిరగేస్తూ మీరేం సుఖపడ్డారు నాన్నా?నాకయితే ఒక్క రోజు కూడా వూపిరి సలపదు మీ లా పుస్తకాల మధ్య నేను సాఫ్ట్ వేర్ యింజినీరింగు చేద్దామనుకుంటున్నాను. దాని కోసమే కృషి చేస్తాను" నా పిల్లలకి నా వృత్తిమీద యింతటి ఘోరమయిన అభిప్రాయాలున్నాయని తెలియదు. చెప్పడమే కాదు ఎంట్రన్సులో మంచి రాంకు తెచ్చుకుని కంప్యూటర్ సైన్సులో సీటు సంపాదించుకున్నాడు సురేష్.వున్న యిద్దరినీ అడిగే సాహసం చెయ్యలేదు. మిత్రులు బంధువులు మా పిల్లాల ప్రగతిని మెచ్చుకుంటూంటే ఎంతో గర్వంగా ఫీలయాను.పెద్దవాడు ఎం బి బిఎస్ పూర్తి చేసి కార్డియాలజీలో ఎమెస్ చెయ్యడానికి అమెరికా వెళ్లాడు. రెండేళ్ల తరువాత సురేష్ యింజినీరింగు పూర్తి చేసి ఎమెస్ చెయ్యడానికి అమెరికా వెళ్లాడు.అక్కడకూడా అన్నదమ్ములిద్దరూ ఒకరు దక్షిణప్రాంతం యింకొకడు ఉత్తరప్రాంతం.నా సంపాదనమీద మీద వారి చదువులకై అధారపడలేదు. ఇక వాడు సారధి వంతు రాగానే ఏ సబ్జెక్టు చదువుతావని అడిగితే ఏ చదువు చదివినా వుదయం ఆఫీసుకెళ్లి సాయంత్రం యింటికి వచ్చి భార్యా బిడ్డలతో హాయిగా గడిపే వుద్యోగం చేస్తాను సబ్జెక్టు ఏది దొరికినా ఫరవా లేదు అన్నాడు.మేథ్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు.బనారస్ యూనివర్సిటీలో పి హెచ్ డి చెయ్యడానికి వెళ్లాడు .

ఇక చిన్నవాడు మిగిలాడు.వాడిచదువు, వీళ్లందరి పెళ్లిళ్లు ఎన్ని బాధ్యతలు మిగిలాయి.అనుకుంటూనే యాభయ్యో పడిలో పడ్డాను. కాంతం రోజూ సణుగుతుండేది."నలుగురు పిల్లలన్నమాటే గాని పెద్ద చదువులంటూ తలో దిక్కు వెళ్ళిపోతున్నారు,మనదగ్గర వుండేదెవరు" అంటూ."వాళ్ల భవిష్యత్తుకై చదువుకుందికి వెళ్తున్నారు ఎప్పటికీ చిన్నపిల్లలుగా గోరుముద్దలు తినిపిస్తూ పిల్లల్ని నీ చుట్టూ వుంచుకోవాలనుకుంటే ఎలా? వాళ్లని ప్రయోజకుల్ని చేసేవరకు మన బాధ్యత ఆపైన వాళ్లిష్టం"అని సర్ది చెప్పాను. నాలుగోవాడు గోపాల్ని లా చదవమని అడకముందే ఎంబిఏ చదువుతానని తెలియజేశాడు."నలుగురిలో ఎవరూ లా చదవకపొతే నాన్న ప్రాక్టీసు యిన్ని లా పుస్తకాలు ఏం చేసుకోవాలి కన్నా"అంటూ ముద్దుగా అడిగింది కాంతం."ఆ పుస్తకాలు వ్వుత్తినే పోతాయని మేము లా చదవాలమ్మా?నాన్న పుస్తకాల షెల్ఫ్ దగ్గరకెళితే చాలు తుమ్ములు దగ్గులు వస్తాయి అంత దుమ్ము పేరుకుంది.రోజూ నాన్న జూనియర్ తాతారావు వస్తాడుగా యివన్నీ అతనికి ధారాదత్తం చేస్తే యింట్లో కాస్త జాగా వుంటుంది". "నీ యిష్టం బాబూ నీకేం చదవాలనుకుంటే అదే చదువుకో కాని నాన్న యింత కష్టపడి మిమ్మల్ని చదివిస్తుంటే అతని వుద్యోగాన్నే వెక్కిరించే వాళ్లయ్యారు కలికాలం".నా భార్య అమాయకత్వానికి నవ్వొచ్చింది.అయిదేళ్ల తరువాత రమేష్ సురేష్ లు నెల రోజులకోసం వస్తున్నారన్న కబురు తెలియగానే వాళ్ల పెళ్లి గురించి అదిగాను.రెండోవాడు యింజినీరింగు చేసిన పిల్లని చూడమన్నాడు. పెద్దవాడు అక్కడ తనతో డాక్టరుగా చేస్తున్న తెలుగమ్మాయిని చేసుకునే వుద్దేశం వుందన్నాడు.

రేండో వాడికోసం ప్ర్యత్నాలు చేశాను నా తోటి లాయరు రంగనాధం కూతురు శ్యామల యింజినీరింగు చేసి గేట్ రాసిందని సీటు వచ్చే అవకాశం ఉందని చెప్పాడు. ఫొటో యిస్తే వాడు వచ్చే లోపున పంపుతాను కొంత పని అవుతందని అంటే "యింకా ఏకాలంలో వున్నావు?ఇంటర్ నెట్ లో చూసుకుని మాట్లాడుకుని యిష్టపడితే మనం అన్నీ సిధ్ధం చేద్దాం".అన్నాడు.కాంతం "అమ్మాయి జాతకమైనా యివ్వండి జాతకాలు సరిపోయాక మీ పధ్ధతులు కానివ్వండి"అంది.పాతకాలం మనిషని సర్ది చెప్పుకున్నాడు రంగనాధం.కాంతానికి మరో అయిడియా వచ్చింది "యిక్కడున్న పిల్లని అమెరికాలో చూడొచ్చంటే అక్కడున్న పిల్లని మనంకూడా చూడ వచ్చు కదా?"అంది.మనింట్లో కంప్యూటర్ లేదుకదా అన్నాను గోపాల్ అన్నాడు"నేను అన్నతో మాట్లాడి ఏ రోజు ఏ టైముకి తను ఆ అమ్మాయిని చూపిస్తానంటే ఆ టైముకు మనం సైబరుకేఫు తీసుకెళ్లి కాబోయే కోడల్ని చూపిస్తాను దిగులు పడకమ్మా "అన్నాడు. అన్నీ సరిపోవడం రెండు పెళ్లిళ్లూ ఒకేసారి జరిపించి అమ్మయ్య అనుకున్నాం.

మూడో వాడికి కాలేజ్ ప్రొఫెసర్ గా నార్త్ లో వుద్యోగం వాచ్చింది .రేండేళ్ల తర్వాత వాడి పెళ్లి సంగతి కదిపాను."నా గురించి శ్రమ పడకండి నాకు యిటువైపు అమ్మాయి నచ్చింది,రిజిష్టర్ మేరేజ్ గాని ఆర్యసమాజంలో గాని పెళ్లి చేసుకుంటాను."అన్నాడు."సరే ఎప్పుడు చేసుకుంటావో అదేనా చెప్తావా లేదా?""అలాగేం కాదు మీకు ముందుగా తెలియపరుస్తాను.ప్రతి దానికి టెన్షన్ పెట్టుకోకండి"అన్నాడు. కాంతానికి చెప్తే "కలికాలం మన పెంపకంలో పిల్లలు యిలా తయారయారేమిటండీ? చదువులు వాళ్లిష్టం పెళ్లు వాళ్లిష్టం యిక మన పెద్దరికమెందుకూ?" అంది బాధపడుతూ. "చూడు పిల్లలమీద మన యిష్టాయిష్టాలు రుద్దకూడదు.అప్పుడే వాళ్లకి వికాశం మనకి మనశ్శాంతి. చిన్నవాడుకూడా సెటిల్ అయిపోతే రామా కృష్ణా అనుకోవచ్చు".శాంతంగా చెప్పినా స్వరంలో అసంతృప్తి నాకే ధ్వనించింది.మరో ఆర్నెల్లకి సారధి వద్దనుంచి పిలుపు వచ్చింది.అమ్మాయి తలితండ్రులు ఢిల్లీలో వున్నారని పంజాబీ అమ్మాయని పెళ్లి తారీకు చెప్పి ఒకరోజు ముందుగ మీరంతా వచ్చేయండి అడ్రస్సు చెప్పాడు."అదేమిటండీ వీడి వుద్యోగం వేరే చోట అయితే డిల్లీ అమ్మాయి ఎలా తారసపడింది?మరీ ఒక్క రోజు ముందు దూరపు బంధువుల్లా వెళ్లడమేమిటి అసలు అమ్మాయి పేరేమిటో కులమేమిటో కనుక్కోకుండా వాడు చెప్పినవాటికి సరేనంటారేమిటి?

"వాడు మనని టెన్షన్ తీసుకోవద్దన్నాడు ఎందుకు వూరికే ఆరాట పడటం?వెళ్లాక అన్నీ తెలుస్తాయి.అక్కడికి వెళ్లి వాళ్లకి నాలుగక్షింతలు వేసి ఆశీర్వదించి మన పెద్దరికం నిలబెట్టుకుందాం"అంటూ వూరడించాను.అక్కడికి వెళ్లాక తెలిసింది అమ్మాయి పేరు సీమా సారధితోనే పని చేస్తోందని.తోవపొడుగునా ఏమనుకున్నా అమ్మాయిని చూడగానే మనస్ఫూర్తిగా "పిల్ల బాగుందండీ చిదిమి దీపం పెట్టుకోవచ్చును" అంది.మమ్మల్ని పరిచయం చెయ్యగానే కాళ్లకి నమస్కరించి "నమస్తే మమ్మీజి నమస్తే పాపాజి"అంది.పెళ్లి బాగా జరిగింది.మర్యాదలు బాగా చేశారు. కోడలికి నల్లపూసల గొలుసు ఒక వుంగరం పట్టు చీర యిచ్చింది కాంతం." నాకేమీ లేదా అమ్మా"అడిగాదు సారధి."నీకో మొట్టికాయ వేస్తాను"అంటూ ప్రేమగా కొడుకుని కోడల్ని దగ్గరకు తీసుకుని నుదుటి మీదముద్దు పెట్తింది.సారధికి పదివేలిచ్చాను ఎటైనా తిరిగి వస్తారని.మనింటికి రమ్మనలేకపోయారా?అంది కాంతం "వాళ్లెప్పుడు వస్తే అప్పుడే నీ ముచ్చటలన్నీ తీర్చుకో.అన్నలు దూరాన వున్నారు తమ్ముడికి పరీక్షలు ఎవరూ రాకుండానే పెళ్లి జరిగిపోయింది అనుకుంటూ యిద్దరం యింటి దారి పట్టాం.
గోపాలు అనుకున్నట్లుగానే ఎంబిఎ పూర్తి చేశాడు.ప్రయత్నాలేమి చేసుకున్నాడో గాని నెల రోజుల్లో దుబాయిలో జాయిన్ అవాలన్నాడు."అయ్యో!నలుగురు పిల్లలూ పక్షులకు రెక్కలొచ్చినట్లు ఎగిరిపోతున్నారు."ఎంతో అవేదనగా అంది కాంతం.రెక్కలొచ్చాక పక్షి పిల్ల ఎగరకపోతే తల్లి పక్షి గూట్లోంచి నెట్టేస్తుంది. కాబట్టి యిదేమీ ప్రకృతి విరుధ్ధంకాదు"అంటూ సర్ది చెప్పాను.గోపాలుకూడా దూరప్రాంతానికి వెళ్తున్నాడన్న చింత నాకూ వుంది నేనే అధైర్యపడితే కాంతం నిలదొక్కుకోలేదని గాంభీర్యం ప్రదర్శించాను.
యిక వారం రోజులకి వెళ్తాడనగా ఒక రోజు చీకటి పడుతుండగా గోపాలు యింకో అమ్మాయి మెడలో దండలతో గుమ్మంలో నిలుచున్నారు. తలుపు తెరిచిన నేను నోరు కూడా తెరుచుకుని వుండిపోయానని కొంతసేపటివరకు తెలియలేదు.వాళ్లని అక్కడే నిలబడమని లోపలికి వెళ్లి కాంతాన్నీ ప్రిపేరు చేశాను."గోపాలు పెళ్లి చేసుకుని కోడలితో గుమ్మంలో నిలుచున్నారు. హారతిచ్చి దిష్టి తీసి లోపలికి తీసుకురా కాంతం. ప్రస్తుతంఏమీ మాట్లాడకు లోపలికి వచ్చాక అన్నీ మాట్లాడుకుందాం సరేనా".అంటూసిధ్ధం చేయించి తీసుకు వచ్చాను.
హారతి ఎర్రనీళ్లు సిద్దం చేసి తెచ్చింది.యిద్దరికీ హరతిచ్చి దిష్టి తీసి పోసి లోపలికి రమ్మంది.వచ్చి సోఫాలో కూర్చున్నారు.లోపలికి వెళ్లి చక్కెర్ తెచ్చి యిద్దరికీ కాస్త కాస్త నోట్లో వేసింది.నేను చల్లటి మంచినీళ్లు పెట్టాను.ఎదురుగా కూర్చుని కొడుకు ముఖంవైపే చూస్తూ "యిప్పుడు చెప్పు యింత హడావిడిగా పెళ్లి ఎందుకు చేసుకోవలసి వచ్చింది? ఎవరీ అమ్మాయి? నువ్వు చేసిన పని తప్పు అననుగాని మాకు చెప్పకుండా రహస్యంగా చేసుకున్నావు అది నువ్వు చేసిన తప్పు.వూర్లో నలుగురూ ఏమనుకుంటారు ఒక్కసారి ఆలొచించావా?ఒక్క ముక్క మా చెవిన వేసివుంటే యీ పెళ్లి మేమే చేసి వుందుంకదా.ఒక్క క్షణం నేను గాని నాన్నగాని గుర్తు రాలేదా?"ఆవేదన కన్నీళ్ల రూపంలొ బయటికి వచ్చింది.
ఆమె మాటలకి అందరి కళ్లలో కన్నీరుబికింది.యిద్దరూ కాళ్లకి నమస్కరించారు. గోపాలు చెప్పాడు.అమ్మాయి పేరు వసుధ తనతో ఎంబిఎ చేసిందని పెళ్లి చేసుకుందామన్న నిర్నయం రెండేళ్ల క్రితమే చేసుకున్నారని,వేరే కులం కావటంనుంచి అమ్మాయి తలితండ్రులు యిష్టపడలేదని దుబై ప్రయాణం సడన్ గా రావటంతో నలుగురు స్నేహితులసమక్షంలో వేణుగోపాలస్వామి ఆలయంలో పెళ్లి చేసుకుని అట్నుంచి రిజిష్టారాఫీసుకెళ్లి ఫార్మాలిటీ పూర్తి చేసుకుని వచ్చామని చెప్పాడు". ఆమె తరఫువాళ్లు కాదన్నా మీరు ఆశీర్వదిస్తారన్న నమ్మకంతో తీసుకువచ్చాను.క్షమించండి వాళ్లవాళ్లు కాదన్న దగ్గరనుండి ఏడుస్తూనేవుంది.ఎన్నో కేసులు పరిష్కరించిన మీరు యీ చిన్న కేసు పరిష్కరించలేరా నాన్నా?"
"నా వృత్తి మీద నీకు గౌరవంలేదు గాని నీ సమస్య పరిష్కరించాలంటే నన్ను నా వృత్తిని అడ్డం వేసుకుంటావా?" నవ్వుతూనే ఛురకవేశాను ." మమ్మల్ని యింత వాళ్లని చేసిన మీరంటే ఎంతో గౌరవం భూదేవిలాటి అమ్మంటే కొండంత ప్రేమ.ఏం చెయ్యాలి యిది మా జీవితం"."ఎంత మాటకారివయావురా!మాకు మీ యిద్దరిమీద కోపం లేదు చెప్పకుండా చేశారన్న బాధతప్ప.సరే యిదేమీ సమస్యకాదు.సమాజంలో యిటువంటి సంఘటనలు సర్వ సాధారణం .చింతపడకండి నేను చూసుకుంటాను". రాత్రికి రాత్రి స్నేహితులకి బంధువులకి ఫోన్లు చేసి మా అబ్బాయి వివాహం జరిగిందని ఆదివారం సాయంత్రం రిసెప్షను యిస్తున్నాను తప్పక రమ్మని చెప్పాను.రిసెప్షనుకి వచ్చినవాళ్లంతా ఆశ్చర్యం ప్రకటించారు.క్లోజ్ ఫ్రెండ్సు మా ఔదార్యాన్ని పొగిడారు.కాంతం చాలా హుందాగా వ్యవహరించింది. ఏమయితేనేం చిన్నవాడి పెళ్లి ముచ్చటకూడా కొంత తీరింది.మూడు రోజుల తరువాత వాళ్లిద్దరూ దుబయి వెళ్లిపోయేరు.మాకున్న బాధ్యతలు పూర్తయాయి.మళ్లీ మా రొటీను మాకు మిగిలింది.
జీవితంలో ఏదో చెయ్యవలసిన పని మిగిలి వుంటే ఆ జీవితం నడక లక్ష్యంతో కొనసాగేది.పిల్లలంతా ప్రయోజకులయారన్న సంతోషం తప్ప వుత్సాహం తగ్గింది.నాకంటే కోర్టు కేసులు మనుషుల మధ్య గడిచేది.సాయంత్రం వరకు కాంతం యింటి పనులు దేముడి పూజ తప్ప వేరే వ్యాపకం పెట్టుకునేదికాదు.సాయంత్రాలు తప్పని సరిగా తనదగ్గరే కూర్చుని ఏవో కబుర్లు చెప్తూ నాకేదో తినాలని వుందని చేయించుకుని ఒకపూటయినా తనని బిజీగా వుంచేవాడిని.పిల్లలు వారానికోసారి పదిహేను రోజులకోసారి ఫోన్లో మాట్లాడేవారు.
పెద్దవాడి వద్దనుంచి శుభసమాచారం వచ్చింది కోడలు నెలతప్పిందని. యిక కాంతం కాలు భూమి మీద నిలవ లేదు ఆ రోజు మైసూరుపాక్ చేసి పాలవాడు పనిమనిషితో సహా స్వీటు చేతిలో పెట్టి పెద్ద కోడలు విశేషం అంటూ చెప్పింది.అమ్మాయి తలితండ్రులు అమెరికాలోనే వుండటంతో మా సహాయం అవుసరమవలేదు.అబ్బాయి పుట్టాడని ఫోను వచ్చింది."మన వంశోధ్ధారకుడిని చూడటానికే లేదా ? యిదేం దురదృష్టమండీ?"అంటూ వాపోయింది.సమయం వచ్చినప్పుడు వెళ్దాం మన పిల్లల కుటుంబాలని చూసి వద్దాం అంతవరకు ఓపిక పట్టమని నచ్చచెప్పాను.
"పోనీ సారధిని ఒక సారి రమ్మనండి కాలేజీకి శలవలుంటాయికదా!ఆ అమ్మాయిని కలలో చూసినట్లే అనిపించింది"."నీ కోడళ్లంతా కలలో కనిపించే వాళ్లే ఎవరు నాలుగు రోజులు వున్నారు కనుక?ఫోను చేస్తాను రమ్మని. అన్నాను. వాడి జవాబు విన్నాక ఎందుకడిగానా అనిపించింది. యిక్కడికి వస్తే వేడి తట్టుకోలేరుట తన భార్యతో మాట్లాడటానికి మాకు హిందీ రాదని మా యింటి వాతావరణంలో ఆ అమ్మాయి కంఫర్టబుల్  గా వుండదని చెప్పాడు. వాడు చెప్పిన కారణాలు యథాతధంగా కాంతానికి చెప్తే గుండె పగిలిపోతుందని "వాళ్లకిప్పుడు రావటానికి వీలుకాదుట తరువాత వస్తామన్నారు మనమే ఎటైనా తిరిగి వద్దామా?కాస్త మార్పుగా వుంటుంది".అన్నాను. వద్దంది మనసులో లేని వుత్సాహం ఎటో వెళితే వస్తుందా? అనవసరంగా హైరానా పడటమెందుకు?
యాంత్రికంగా రోజులు గడుస్తున్నాయి. కాంతం పైకి చెప్పటంలేదుకాని లోలోపల క్రుంగిపోయేది. పెద్దవాడికి చెప్తే అమ్మని మంచి డాక్టరుకి చూపించి బలానికి టానిక్ యిప్పించమన్నాడు. డాక్టర్లకి మందులగురించి తప్ప మనసులగురించి తెలియదనిపించిది. సురేష్ తో మాట్లాడేను."మా జీవితాలు ఎంత బిజీ అంటే పని చెయ్యడానికే జీవిస్తున్నట్లుంది కాని జీవితంగడవడానికి పని చేస్తున్నట్లు లేదు.మీకు కావలిసినంత తీరిక సమయం వుందికాబట్టి యిన్ని ఆలోచనలు పెట్టుకుంటారు. యిద్దరూ ప్రశాంతంగా వుండండి అన్నీ సర్దుకుంటాయి"అంటూ సలహా యిచ్చాడు.
ఒకరోజు కూర్చుని కాంతానికి బోధపరిచాను"మనకి అన్న వస్త్రాకి లోటులేదు.పిల్లలంతా వృధ్ధిలోకి వచ్చారు.పెళ్లిళ్లు చేశాం మనుమడు పుట్టాడు యింకా ఏదో వెలితి ఫీలవుతున్నావు ఏమిటి నీ బెంగ?అనడిగాను."మనిద్దరం యిలా దిక్కుమాలిన పక్షుల్లా వుంటూ కొడుకన్నవాడు దగ్గరలేకుండానే దాటిపోతానేమో అనిపిస్తోంది"అంటూ కళ్లు తుడుచుకుంది.ఒక్కసారి వెన్నులోంచి వణుకు వచ్చింది.నిజమే కాంతం భయంలో యదార్ధముంది.కాని చేయగలిగిందేమీ లేదు.అమెరికాలో వున్న యిద్దరన్నదమ్ములూ కూడబలుక్కుని సీజను చూసి తమవద్దకు మూడేసి నెలలకోసం రమ్మనిపిలిచారు. పాస్ పోర్టులు వీసాలు మనుమడు పుట్టినప్పుడే రెడీ చేసి వుంచాను ఎప్పుడయినా వెళ్లవచ్చునని.మనుమడు మూడేళ్లవాడయాక అవకాశం వచ్చింది.పదిరోజులలో ప్రయాణం,పిల్లడికోసం ఏవేవో కొంది.కొడుకులకిష్టమయినవి కొన్ని చేసిపట్టుకుంది.ఆఫీసుపని తాతారావుకు అప్పగించి బయలుదేరాం.
ముందుగా పెద్దవాడున్న ప్రదేశానికి వేళ్ళాం.ఎయిర్ పోర్టుకి వచ్చి యింటికి తీసుకువెళ్లాడు.ఆ రోజు ఆదివారం అందరూ యింటిలో వుండటంతో బాగానే అనిపించింది.చంటివాడికోసం చేతులుజాచింది కాంతం.వాడు సిగ్గుగా వాళ్ల అమ్మవెనుక దాక్కొన్నాడు.రెస్టు తీసుకుని లేచాక ఏవి ఎక్కడ వున్నాయో ఎలా వుపయోగించాలో చెప్తుంటే ఏమిటిదంతా అనుకున్నాను.మర్నాడు తెలిసింద్ తెల్లవారేసరికి వంట టిఫిను తయారుచేసుకుని పిల్లాడిని తయారుచేసి చెరోకార్లోని వెళ్లారు.పిల్లాడిని బేబీ కేర్ లో దింపి హాస్పిటల్ కి మాలతి వెళ్లింది వెళ్తూ వెళ్తూ "అత్తయ్యగారూ అన్నీ సిధ్ధంగా వున్నాయి మీకు తినాలనిపించినప్పుడు వేడి చేసుకుని తినండి అన్నం చల్లారిపోతుందని వండలేదు,టైము చూసుకుని బియ్యం పెట్టుకోండి.దేనికీ మొహమాటపడకండి.భోజనం చేసి రెస్టు తీసుకోండి"అంది."సాయంత్రం ఎన్ని గంటలకి వస్తారమ్మా?"అడిగింది కాంతం.సాయంత్రం ఎక్కడ రాత్రి ఎనిమిది దాటుతుంది"అంటూ కారు స్టార్టు చేసింది.ఇక్కడా మేమిద్దరమే.ఒకరి ముఖం ఒకరు చూసుకున్నాం. మర్నాడు "చంటివాడిని వుంచేస్తే బాగుంటుంది మాయిద్దరికీ కాలక్షేపం"అన్నాను."నాన్నా మీరుండే మూడు నెలల కోసం వాడి రొటీను మారిస్తే తరువాత మాకిబ్బంది"అన్నాడు రమేష్. శలవరోజులు వస్తాయి ఆ సమయంలో బండెడు పనులు వాళ్ల బిజీలో వాళ్లుంటే "ఏమయినా చేసేదమ్మా" అని వెనుక వెళితే " మీరు పెద్దవాళ్లు మీరు రెస్టు తీసుకోండి మాకివన్నీ అలవాటే" అనగానే చిన్నబుచ్చుకుని నాపక్కన కూర్చునేది కాంతం. "మన వూళ్లోనే బాగుందండి పాలవాడు పనిమనిషి పేపరువాడు చాకలి అప్పుడప్పుడు యిరుగుపొరుగు వాళ్లు మాట్లాడటానికి వుంటారు.కొన్నాళ్లయితే మాట్లాడటం మరిచిపోతామేమో".మూడునెలల్లో చుట్తుప్రక్కల ప్రాంతాలు చూపించాడు బాగానే గడిచిపోయింది.
సురేష్ వచ్చి తనున్న ప్రదేశానికి తీసుకెళ్లాడు.కాంతం ఆశపడింది శ్యామల మావూరమ్మాయి అక్కడ తనకి కాస్త ఫ్రీగా అనిపించవచ్చని.రెండు రోజులలో అదీ అడియాసే అనిపించింది.వీళ్ల దినచర్య వాళ్లకి భిన్నంగా లేదు.సాయంత్రంఏడు గంటలకి యిల్లు చేరితే అరగంత తినడానికి త్రాగటానికి కేటాయిస్తారు.సురేష్ లేప్ టాప్ మీద పని చేసుకుంటూంటే శ్యామలకి చదువు కొద్దిగా మిగిలిందని రాత్రి పదకొండు గంటలవరకు కూర్చునేవారు.మమ్మల్ని భోజనాలు టైముకి తినేయమని వాళ్లు లేటుగా తినేవారు.శని ఆదివారాలొస్తే కూరలు సాంబారు ఎక్కువగా చేసి ఫ్రిజ్ లో పెట్టుకుని రోజూ కొద్ది కొద్దిగా వెచ్చపెట్టుకుని తినడం,
"నేనున్నాను కదా శ్యామలా రోజూ కూర చేస్తాను యింత కష్టపడి వారం రోజులకోసం ఒక్క సారి చేసుకోవడం ఎందుకని అడిగింది"మాకు యివన్నీ అలవాటే ,మీరిలా అలవాటు చేస్తే మీరెళ్లాక చేసుకోలేకపోతాను"ఈ మాట విన్నాక వూరుకుంది కాంతం.పగలంతా ఆగిన్నె యిటు పెట్టి పుస్తకం తిరగేసి ఆగదిలోంచి ఈ గదిలోకొ తిరుగుతూ గడిపేది.
నెల రోజులయేసరికి కాంతం పూర్వంలా తిరగలేకపోతోంది. రాత్రి పడుకున్నప్పుడు వూపిరి తీసుకోవడం కష్టంగా వుంది.చలిఎక్కువగావుండెను. కండిషన్ రమేష్ తో మాట్లాడితే వాతావరణం మార్పునుండి కంగారుపడవలసినదేమీ లేదని సురేష్ ని ఏవో మాత్రలు కొని వేయమని చెప్పాడు.యిక కాంతానికి సహనం పోయింది."యిక్కడికెందుకొచ్చామో అర్ధం కావటం లేదు. వీళ్ల బాధలు చూడలేకపోతున్నాను ఇంకా రెండు నెలలు గడపాలంటే నా వల్లకాదు. యింత కష్టపడి పని చేసి వేడిగా ఎప్పటికప్పుడు యింత వండుకు తినలేని బ్రతుకేమిటండీ యీ వయసులో కొత్త ప్రాంతాలు చూడాలన్న అసక్తి నాకయితే లేదు. యింత కష్టపడి పనిచేసి వేడిగా ఎప్పటికప్పుడు వండుకుని తినలేని బ్రతుకేమిటండీ?"అంటూ గోల చేసింది.కొడుకుతో శాంతంగా చెప్పింది "నాయనా మీరెంచుకున్న జీవితం మీ పధ్ధతిలో జీవించండి. మిమ్మల్ని చూడాలనుకున్నాం చూశాం.యికపై మీకు వీలున్నప్పుడు మావద్దకు రండి.యింకిక్కడ వుండలేను మా ప్రయాణానికి ఏర్పాటు చెయ్యి"ఖచ్చితంగా చెప్పింది.మరుచటి వారానికి టిక్కట్లు అరేంజయ్యాయి.రోజూ రాత్రి యిబ్బంది పడుతూనే వుంది.అమెరికా వెళ్లేముందు ఎంత సంబరపడిందో తిరిగి వస్తూ అంత నిర్లప్తంగా నిరాసక్తంగా వుంది.
ఫ్లయిటు కూర్చున్నాం యిరవైనాలుగు గంటల్లో మా వూరు చేరుతామన్న వూహే నాకు రిలీఫ్ అనిపించింది. కాంతం ఏమీ తినడానికి తాగడానికి యిష్టపడలేదు. పోనీ బిస్కట్లు తిను అన్నా "ఏమీ వద్దు చేరే వరకు కళ్లు మూసుకుని కూర్చుంటాను వూరికే అవస్థ పెట్టకండి"అంటూంటే ,యిక్కడికి వచ్చిన దగ్గరనుండి కలిగిన మానసిక అలజడి సర్దుకోనీ అని వూరుకున్నాను.యిరవై గంటల ప్రయాణం గడిచింది.
నిద్రపోతున్న నన్ను కుదిపింది కాంతం వూపిరి తీసుకుందికి కష్టంగావుంది.పరిస్థితి చూస్తే ఆందోళనకరంగా వుండెను.ఎయిర్ హోస్టెస్ ని పిలిచాను ఆమె చూసి ఆక్సిజన్ మాస్క్ పెట్టింది.పావుగంట తరువాత శాంతించింది".నిద్రపట్టింది యిక ఫరవాలేదు, మూడు గంటల్లో చేరిపోతాము డిస్టర్బ్ చెయ్యకండి" అంది
.కాంతానికి షాల్ కప్పి కూర్చున్న నాకు ఆమె నిద్రలోకి కాదు దీర్ఘ నిద్రలోకి జారిపోయిందని గ్రహించలేకపోయాను. దిగే సమయంలో సామాన్లు తీయాలని బెల్టు వూడదీసి "లేస్తావా కాంతం"అన్నాను సగం శరీరం వాలిపోయింది.అందరూ దిగే హడావిడి,ఏం చెయ్యాలో అర్ధంకాక తిన్నగా కూర్చోపెట్టి ముక్కుదగ్గర వేలుపెట్టి చూశాను.గాలి ఆడుతున్న సూచన లేదు.కొంత ఖాళీ అయాక ఫ్లైటు స్టాఫ్ కి తెలియజేశాను పరిస్థితి.స్ట్రెచరు తెచ్చి బయటకు తీశాక డాక్టరు వచ్చి పరీక్షించి చనిపోయినట్లు నిర్ధారించారు.తాతారావుకి విషయమంతా చెప్పాను. రంగనాధం తాతారావు మరో యిద్దరు స్నేహితులు వచ్చి యిల్లు చేర్చారు. వెళ్తున్నప్పుడు యిద్దరం నడుచుకుని వెళ్లాం వస్తున్నప్పుడు భుజాలమీద తీసుకు రావలిసి వచ్చింధి.స్నేహితుడు వియ్యంకుడు అయిన రంగనాధం ప్రక్కన అండగా నిలుచున్నాడు.
పిల్లలకి కబురు వెళ్లింది.అమెరికానుంచి పిల్లలు వచ్చే ప్రసక్తిలేదు. సారధి రెండో రోజుకి చేరాడు గోపాలు వాతావరణం బాగుండక మూడో రోజుకి వచ్చాడు.ఆమె కొడుకుల్ని చూడలేకపోయినా ఆమె శరీరాన్ని కొడుకులు చూశారు.చేయవలసినవి యాంత్రికంగా జరిగిపోయాయి. వచ్చిన వాళ్లు వచ్చినట్లే వెళ్లారు. ఎప్పుడు రావాలనిపిస్తే తమవద్దకు రమ్మని చెప్పి వెళ్లారు. నా పరిస్థితి వూహించుకోలేకపోయాను.
కాంతం ఎందుకలా పిల్లలు అంటూ కలవరించిందో అర్ధమయింది.ఈ వయసులో వంటరి జీవితం దుర్భరం.తాతారావు చిన్నవాడే తనభార్య యిద్దరు పిల్లల్ని తెచ్చి మా యింటిలో వుంచి నాకు ఒంటరితనం అనిపించకుండా పిల్లల్ని నా చుట్టూ తిరిగేలా చేసి భోజనసదుపాయం చూశాడు.ఒక వారం చూశాక అనిపించింది ఈ పని కాంతం వుండగా చేసి వుంటే తను బ్రతికి వుండేదేమో.తిరుణాలలో చేయి విడిపోయి తప్పిపోయిన పిల్లలా వెళ్లిపోయింది.ఎప్పటికీ పిల్లలు వాళ్ల కుటుంబాలతో వాళ్ల వుద్యోగాలతో వుక్కిరిబిక్కిరి అయేవాళ్లే గాని నాలాటివాడికోసం టైము కేటాయించలేరు.ఈ వేడి తగ్గాక తాతారావు కూడా తనదారి చూసుకుంటాడు.యింకేదయినా మార్గం ఆలోచించాలి అనుకుంటున్న సమయంలో ఈ ప్రశాంతాశ్రమం అడ్వర్టైజ్ మెంటు చూసి సంప్రతించాను. యిక్కడికి చేరడానికి కారణాలు యివి.
అతని కధ మొత్తం వుగ్గబట్టుకుని విన్నారందరూ. కొందరికయితే కనులు చమర్చాయి.శ్రీనివాసరావు లేచి మాట్లాడటం మొదలు పెట్టారు.నేడు ఈ వృధ్ధాశ్రమాలు చాలా స్తాపించబడుతున్నాయి. దేశకాల పరిస్థితులను బట్టి భార్యా భర్తలిరువురూ వుద్యోగం చెయ్యకపోతే గడవని పర్థితి కొందరికీ వూపిరిసలపని దినచర్య పిల్లల చదువులు వీటన్నిటినీ మనం సమస్యలని అనుకోలేం. ప్రతి వృధ్ధ వ్యక్తి యిలా ఆశ్రమాల్లో చేరడం సంభవమేనా ఆలోచించండి.
మన దేశంలో వుమ్మడి కుటుంబాలకి యిప్పటికీ గౌరవం వుంది.అందులో కొన్ని యిబ్బందులుండవచ్చు,సదుపాయాలు కొన్ని వుండవచ్చు.గుణదోషాలన్నవి అన్నింటా వుంటాయి.అడ్జస్టయే మనస్తత్వం పిల్లలకు పెద్దలకూ సమంగా వుండాలి.మనలో సగం మంది పిల్లలు విదేశాలలో వుండి పెద్దలు యిబ్బందులకు గురవుతున్నారు. వారికిటువంటి ఆశ్రమాలు తప్పదు. కాని పరిస్తితులు అనుకూలంగా వున్నా పిల్లలు మనని చక్కగా చూసుకుంటున్నా మన స్వేచ్ఛకి భంగం వాటిల్లిందని భావించి పిల్లల్ని వదులుకుని ఆశ్రమాల్ని నమ్ముకోవడం అంత భావ్యంకాదేమో ఆలోచించండి. విధి వక్రించి జీవితాలని అస్తవ్యస్తం చేసిన పరిస్తితులలో తప్పనిసరిగా ఆశ్రమాలని ఆశ్రయించండి.స్కూళ్లని కాలేజీలని ప్రోత్సహించినట్లు అనాధాశ్రమాలని వృధ్ధాశ్రమాలని ప్రోత్సహించలేం.అయితే యిటువంటివి తప్పనిసరి పరిస్తితుల్లో తీసుకోవలిసిన నిర్నయాలు.మీరంతా పెద్దలు మంచి చెడ్డలుఆలోచించగలవారు.
ఎవరయినా బిడ్డల వద్దకు వెళ్లాలన్న వుద్దేశం కలిగిననాడు అనవసరమైన అభిమానంతొ వెనుకడుగు వేయకండి.క్షమించండి సత్యానంద్ గారూ మీ ఆశ్రమాన్ని నిరుత్సాహపరుస్తున్నాననుకోకండి. వృధ్ధాశ్రమాల ప్రారంభోత్సవంనాటికన్నా అవి మూతపడిననాడు ఎక్కువ సంతోషిస్తానన్న మహాత్మ గాంధిగారి మాటలు గుర్తుకివచ్చి పై మాటలు చెప్పాను.తప్పనిసరిగా చేరిన మీరంతా సంతోషంగా సోదరభావంతో మెలగాలని మీ అందరూ ఆయురారోగ్యాలతో సుఖంగా వుండాలని భగవంతుడిని కోరుతూ ముగిస్తున్నాను నాకు మాట్లాడే అవకాశమిచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు.
పిల్లలూ! సత్యనారాయణగారి కధ నా మాటలు విన్నాక భవిష్యత్తులో పెద్దలతో ఎలా మసలుకోవాన్నది నేర్చుకోండి.వ్యాసాలు రాసి మర్కులు తెచ్చుకోవడంకాదు,పెద్దలని అర్ధంచేసుకుని వారి ఆశీస్సులు పొందండి". అందరూ సరదాగా భోజనాలు చేసి కార్యక్రమాన్ని ముగించారు.