24 November, 2008

అమెరికా అల్లుడొస్తున్నాడు హాస్య నాటిక

పాత్రలు:- రఘునాధరావు---తండ్రి
పార్వతి----తల్లి
లక్ష్మి----పెద్దకూతురు
వెంకట్---అల్లుడు
వసంత---చిన్నకూతురు
తెర లేచేసరికి పధ్దెనిమిది సంత్సరాల వసంత ఫోన్లో మాట్లాడుటూంటుంది
వసంత: హలో!ఆ ఆ వున్నారు పిలవనా మట్లాడతావా సరే అలాగా ఆహా తప్పకుండా అమ్మకి న్నాన్నకి చెప్తున్నా అలాగే ఫోను పెడుతున్నా మరి (సైడు కర్టెను వైపు చూస్తూ) అమ్మా నాన్నా త్వరగా రండి . ముందుగా తల్లి ఆ వెనుకగా తండ్రి ప్రవేసిస్తారు.
తల్లి: ఏమయిందే? కొంపలంటుకున్నట్లు కేకలు పెడుతున్నావు? నాకసలే బ్లడ్ ప్రెషరు కంగారు పెట్టక త్వరగా చెప్పు
వ్సంత: అక్క బావగారు యీ రోజు ఇండియా వచ్చేరుట మనకి ముందుగా మెసేజి యివ్వటం కుదరలేదుట రేపు యిక్కడికి వస్తున్నారుట. బావగారి స్నేహితుడు కూడా వాళ్లతో వచ్చేడుట అతన్ని హొటల్లో దింపి అక్కయ్య బావగారు యింటికి వస్తామన్నారు.
తండ్రి: ఏ బండిలో వస్తున్నదీ చెప్పలేదమ్మా?
వసంత: ఏమో మనని కంగారు పడవద్దని అక్కయ్య వుందిగా యిల్లు కనుక్కుందికి అన్నారు బావగారు.
తల్లి: అమ్మో ఒక్కరోజులో అరేంజిమెంట్లు ఎలా చెయ్యగలం? మనింటిని మోడరన్ గా మార్చవద్దూ.
వసంత: అమ్మా మరీ మోడరన్ గా మార్చేస్తే అక్కయ్య మనిల్లు పోల్చుకోలేదేమో.
తల్లి: ఏయ్ వసంతా బావగారి ముందు యిలా అమ్మా అసిరమ్మా అంటూ పిలవకు అతను అమెరికాలో పుట్టి పెరిగాడు. అక్కావాళ్లున్నాన్నాళ్లు మమ్మీ లేదా మామ్ అని పిలువు.
వసంత: అమ్మో అమ్మకి అమెరికా జ్వరం మొదలైనట్లుంది.(తల్లి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తుంది)
తల్లి:చాల్లే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది. యిదిగో మిమ్మల్నే అల్లుడున్న వారం రీజులూ యీ దిక్కుమాలినపంచలు లుంగీలూ మాని యించక్కా సూటు బూటు వేసుకోండి. లేకుంటే అత్తమామలు మరీ యింత పాతకాలం వాళ్లా అనుకుంటాడు. అన్నట్లు యింకో మాట నన్ను పార్వతీ పార్వతీ అని పిలవకండి (దగ్గరగా వచ్చి గారంగా) యించక్కా పారూ అంటూ పిలవండి.
తండ్రి: బాబోయ్ యిదెక్కడి గోలే పారు పారూ అంటూంటే భగ్నప్రేమికుడు దేవదాసులా చేతిలో బాటిలు ఖళ్లు ఖళ్లుమంటూ దగ్గుతూ జగమే మాయా బ్రతుకే మాయా యివే కళ్లముందు మెదులుతాయి.
తల్లి: చాల్లెంది మరీ బడాయి ఏది ఏమయినా యీవారం రోజులూ నేను చెప్పినట్లు వినాల్సిందే లేకుంటేఅల్లుడు మనగురించి ఏమనుకుంటాడు మనల్ని అనాగరికులమనుకుంటాడు .
తండ్రి: నీ ధోరణి నీదె గాని ఎవరిమాట వినవు కదా తొలిసారిగా అమ్మాయి అల్లుడు యింటికి వస్తున్నారంటే బొబ్బట్లు చేసిపెడతాను పెరుగు గారెలు చేసిపెడ్తాను అనే అత్తగార్లని చూసానుగాని పారూ అని పిలవండి సూట్లేసుకోండి నా మతి పోతోంది భగవంతుడా!(లోపలికి వెళ్తాడు)
తల్లి: (ఫోను డయల్ చేసి) హలో నవీన్ యింటీరియర్ డెకొరేటర్స్? నేను ప్రొఫెసర్ రఘునాధరావుగారి భార్యని మాట్లాడుతున్నాను. మాయింటిని మోస్ట్ మోడ్రన్ గా మార్చాలి ఎన్నాళ్లా అబ్బే రేపటిలోపున ఏమిటి అంత షార్ట్ టైమ్ లో వీలుకాదా సరే (నిస్పృహగా ఫోను పెట్టేస్తుంది)
వసంత: అమ్మా(అని నాలిక కొరుక్కుని) ఆమ్ (కాదన్నట్లు చెయ్యి దులిపి)అమ్మీ
తల్లి: ఏమిటే మమ్మీ లేకుంటే మామ్ అనమంటే ఆమ్ అమ్మీ యిదేం పిలుపే?
వసంత: ఏంచెయ్యమంటావు చిన్నప్పటినుండి అమ్మా అమ్మా అనేదాన్ని పట్టుకుని మమ్మీ మామ్ అనమంటె యిలాగే వుంటుంది. అమ్మా నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. అక్కయ్య పరాయిదా మనింట్లో పుట్టి పెరిగింది. బావగారు అక్కయ్యని నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నారు. నీ హడావిడితో మా మతులు పోగొడుతున్నావు. అక్కయ్య అమెరికా వెళ్లాక యీరెండేళ్లలో తనకిష్టమైనవి తినగలిగిందో లెదో చేగోడీలు కోవాబిళ్లలూ చేద్దామా పద పద (అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళుతుంది తల్లి నుదురు కొట్టుకుంటు వెళ్తుంది)
తెర పడుతుంది తెర లెచేసరికి వసంత పరికిణీవాణీవేసుకుని పదహారణాల తెలుగు అమ్మాయిలా ముస్తాబయి సోఫాలమీది కవర్లు సర్దుతూ వుంటుంది యీలోగా తల్లి కాస్త మోడర్న్ హెయిర్ స్టైల్తో నాజూకైన చీరతో చేతి గాజులు సవరించుకుంటూ ప్రవేశిస్తుంది.
తల్లి: వసూ యింకా అలాగే వున్నావేమిటె అక్కావాళ్లూ వచ్చే టైము అయింది వెళ్లి మామయ్య బొంబాయినుంచి తెచ్చిన స్కర్టుమిడి టాపు వేసుకో
వసంత: అమ్మా అక్కయ్యవాళ్లు వున్న వారం రొజులూ అదే డ్రెస్సు వేసుకోవాలా యింకొకటి మార్చవద్దా?
(తండ్రి సూటు బూటు తో ప్రవెశిస్తాడు)
తండ్రి: పార్వతీ లక్ష్మీ అల్లుడు హొటల్నుంచి బయలు దేరారుట ఏక్షణంలోనైన వచ్చేస్తారు నాచిట్టి తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వుంది.(జేబు లోంచి రుమాలు తీసి కళ్లు తుడుచుకుంటాడు)
తల్లి: నిన్నటినుంచి చెప్పి చెప్పి నా నోరు నొప్పేగాని మీ యిద్ద్రికీ ఏమాటా చెవుల్లో దూరటం లేదు ఆ చిట్టీ పొట్టీ ఏమిటి? అల్లుడిముందు కూడా యిలాగే మాట్లాడతారా? అల్లుడితో మనకున్న పరిచయం చాలా కొంచం అతని అభిరుచులేమిటో అలవాట్లేమిటో తెలియదు మన పాత పధ్దతులు నచ్చుతాయోలెదో తెలుసుకోవాలికదా
తండ్రి: నిజమే పర్వతీ నేనంతగా ఆలొచించలేదు
వసంత: అమ్మా పెళ్లిలో బావగారు లక్షణంగా పంచ కట్టుకున్నారుకదే!
తల్లి: ఆ...ఆ..పెళ్లిలో నలుగురూ ఏమనుకుంటారోననికట్టుకుని వుంటాడు. అమెరికాలో పుట్టి పెరిగి వుద్యోగంచేస్తున్న కుర్రాడికి కోనసీమ కొరివికారం నచ్చుతుందా?
వసంత: కోనసీమ పిల్ల నచ్చినప్పుడు కొరివికారం కూడా నచ్చవలిసిందే.(యింతలో లక్ష్మి భర్త ప్రవేశిస్తారు.అల్లుడు సాదా పైజామా కుర్తాలోను లక్ష్మి పట్టు చీర తలనిండా పువ్వులతోను వుంటారు)వాళ్లని చూడగానే పరుగున వెళ్లి అక్కయ్యాబాగున్నావా అంటూ వసంత లక్ష్మిని భుజం మీద చేయి వేసి తెస్తుంది
లక్ష్మి: ఆ !వసూ నువ్వెలావున్నావ్? అమ్మానాన్నా లేరా?
వసంత:యీ యిద్దరూ అమ్మా నాన్నే! మరీ పోల్చుకోలేనంతగా మారిపోయారా? బాగున్నారా బావగారూ?
తలవంచి విష్ చేసినట్లు నవ్వుతాడు తండ్రి దగ్గరగా వచ్చి
తండ్రి: లక్ష్మి తలమీద చేయి వేసు నిమురుతూ రా నాయనా కులాసానా? అమ్మా లక్ష్మీ బాగున్నావమ్మా?
లక్ష్మి: తండ్రిని ఎగాదిగా చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా నాన్నా?సూటు బూటులొ వున్నారు?
తండ్రి: ఏం చెప్పమంటావమ్మా? నిన్న మీరు వస్తారని తెలిసినప్పటినుండి నన్ను వూదరగొట్టి మీ అమ్మ ఈ పగటి వేషం వేయించింది
లక్ష్మి: అమ్మా నేను వచ్చిన దగ్గరనుండి ఒక్క మాటకూడ మాట్లాడలేదు ఏమయిందమ్మా?(దగ్గరగా వచ్చి తల్లి భుజంమిద తలపెట్టుకుండి
వసంత: అక్కయ్యా అమ్మని అమ్మా అసిరమ్మా అంటూ పిలవ్వద్దంది.
లక్ష్మి: అరే ఎందుకని?
తల్లి: అమెరికాలో మామ్ మమ్మి అంటారుకదా
.వెంకట్: నమస్కారమ్ అత్తయ్యగారూ మీరూ మామయ్యగారూ మా పెళ్లిలో ఆది దంపతుల్లా కనిపించారు మాకు మిమ్మల్నలా చూస్తేనే బాగుంటుంది.అది సరె రాత్రి భోజనంలో ఏం చెస్తున్నారు?
తల్లి: సేండ్ విచ్ వెగిటబుల్ సలాద్ (మాట పూర్తి కాకముందే )
వెంకట్: స్వర్గానికి వెళ్లినా సవతి పొరు తప్పనట్లు శాన్ ప్రాన్సిస్కోవదిలినా శాండివిచ్ వదలదా? అత్తయ్యగారూ చక్కటి గోంగూర పచ్చడి మెంతి వంకాయ కూర ఆవకాయ గడ్డపెరుగు తిన్నాలని మేం వస్తే రోగిష్టి భోజనం పెడతానంటారెమిటి?
తండ్రి: మరే నాయనా మీకేం కావాలంటె అదె చేసి పెడుతుంది. పద పార్వతీ ఆ ఏర్పాట్లు చూడు
అవును నాయనా మీ స్నేహితుడు మీతొ వచ్చాడన్నావు మనిల్లుండగా అతన్ని హొటల్లొ వుంచడమెందుకు? అతన్ని యిక్కడికే తీసుకు వస్తే అందరం కలిసి సరదాగా వుందాం.
వెంకట్: మామయ్యగారూ మేమొక వుద్దేశంతొ యిక్కడికి వచ్చాం.అమెరికాలొ వున్నవాళ్ల మనసులు ఆలోచనలు అలవాట్లు యిండియాలో వున్నట్లే వుంటాయి. మేము ప్రతిక్షణం పగలు రాత్రి మన దేశ సౌంస్కృతి ఆచార వ్యవహాల పట్ల అభిరుచి పెంచుకుని పక్కా భారతీయులుగా ఏప్రాంతం వారు ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలను పాటిస్తుంటాం. అందుకే తెలుగమ్మాయి కావాలని మీ అమ్మాయిని చేసుకున్నాను.
వసంత: బావగారూ మా అమ్మ నిన్నటి నుండి మాకు యిన్ స్ట్రక్షన్స్ యిచ్చి యిచ్చీ అలిసి పోయింది మీ మాటలు అమ్మని చాలా నిరుత్సాహ పరిచినట్లున్నాయి. చూడండి ఎలా ముఖం వ్రేలాడేసుకుందో.
లక్ష్మి: అమ్మా అమెరికాలో వున్నవాళ్లు మనుషులుకారూ? యిక్కడ దొరికే అన్ని వస్తువులు అక్కడకూడా దొరుకుతాయి. తేడా యేమిటంటే యిక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి అక్కడ మామూలుగా కొన్ని దొరికితే కొన్ని ఫ్రోజెన్ దొరుకుతాయి. ఒక సారి పనసకాయ కూర చేసాను తెలుసమ్మా?
తల్లి: అదేమిటే లక్ష్మీ మరీ అంత పల్లెటూరి భోజనాలు చేస్తారా?
(అందరూ గొల్లున నవ్వుతారు)
వెంకట్: అత్తయ్యగారూ! కొడుకు దేశాధ్యక్షుడయినా తల్లి ఏరా నాయనా అని పిలవకుండా వుంటుందా? ఏయ్! మరదలు పిల్లా కాస్త మంచి నీళ్లు తెచ్చి అతిథి మర్యాదలు చెయ్యి
(వసంత లోపలికి వెళుతుంది)
వెంకట్: మామయ్యగారూ నా స్నేహితుడు డాక్టరు మంచివాడు లక్ష్మిలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని తరుచు నాతో అనేవాడు మన వసంత ఫొటో చూపిస్తే నచ్చుకున్నాడు. యిక్కడికి రావటానికి అవకాశం కలిగింది. అందరికీ అంగీకారం అయితే ఆ శుభకార్యం జరిపించేద్దాం ఏమంటారు? నయం అతన్ని హొటల్లో దింపడం మంచి పని చేశాను యిక్కడి వాతావరణం చూసి నెక్స్ట్ ఫ్లైటులో వెళ్లిపోయేవాడు. వుద్యోగరీత్యా ఎన్నో దేశలు తిరగవచ్చుగాని కన్న తల్లిని స్వదేశాన్ని మరిచిపోకూడదు. అత్తయ్యగారూ యిప్పటికయినా అమెరికా జ్వరం నుంచి బయట పడితే మా స్నేహితుడు మోహన్ని తీసుకు వస్తాను ఏమంటారు మామయ్యగారూ?
తండ్రి: ఏమంటాను నాయనా నామీద నాకే సిగ్గు వేస్తున్నాది. మీ అత్తగారు చెప్పగానే ముందూ వెనుకా ఆలోచించకుండా యీ గంగిరెద్దు వేషం వేసెసుకున్నాను. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం నాయనా అల్లుడివయినా కొడుకువయిన నువ్వే.
(వసంత ట్రేలో మంచి నీళ్లు తెస్తుంది)
వెంకట్: ఏం మరదలుపిల్లా అమెరికాలో వసంత కోకిలలా మోహనరాగం ఆలాపిస్తావా?
వసంత: (జడతిప్పుతూ) పొండి బావగారూ!
లక్ష్మి: పొండి అంటే ఎలా పోతామే నిన్నుకూడ తీసుకునే వెళ్తాము. అమ్మా నువ్వేమీ అనటంలేదేమిటీ?
తల్లి: ఏమీ అనడానికి మిగల్లేదు. మీ నాన్నగారు చెప్పినట్లు బొబ్బట్లు పులిహొర ఆవడలు చెయ్యటానికి వంటింట్లోకి వెళ్తున్నాను.(అందరూ మనసారా నవ్వుకుంటారు)
శుభం

22 November, 2008

అమ్మాయే కావాలి

అమ్మాయే కావాలి
ఆడపిల్ల పుట్టింది ఈమాటలు మగతలోవున్న శారద చెవుల్లో పడ్డాయి. ఆతృతగా బిడ్డని చూడాలని కళ్ళుతెరచి "నర్స్ పాప పుట్టిందా"? "అవునమ్మా యిదిగో చూడు పాపని అంటూ ట్రేలో పడుకోపెట్టిన బిడ్డని చూపిండి. అమాయకంగా ముద్దుగా వున్న బిడ్డని చూడగానే శారద తను పడ్డ కష్టమంతా మర్చిపోయి ఆప్యాయంగ బిడ్డని తడిమింది,వార్డులో బెడ్డుమీదకి తీసుకురాగానే"ఆనవాయితీ తప్పలేదమ్మా నా లాగే నీకూ ఆడపిల్లే పుట్టింది."ఆస్వరంలొ వున్న తృణీకారం మనసులోముల్లు గుచ్చినట్లయింది
మధ్యతరగతి కుటుంబంలో నాలుగో ఆడపిల్లగ జన్మించిన శారద ఆడపుట్టుకలొ అనుభవించవలసిన చిన్నచూపు తృణీకార భావం అంతా బాల్యం నుంచే చవి చూసింది. పన్నెండేళ్ళ వయసు వచ్చేసరికి ఒక దృధాభిప్రాయానికి వచ్చింది ఎలాగైనాసరే ఆడపిల్ల యేవిషయంలోను తీసిపోదన్న విషయం నిరూపించాలని.మనసుకి తగిలిన ప్రతి గాయపు చేదుని ఒక్కొక్క సవాల్ గాతీసుకుంది.పొడుపు మాటల్ని పోగు చేసి పట్టుదలగా మలచుకొంది.దాని ఫలస్వరూపమే పదవ తరగతిలో రాష్ట్ర స్థాయిలో ప్రధమస్థానం లభించింది.ఆరోజున కూడా తల్లి మూతి విరిచింది, మగమహారాజుకి చదువబ్బితే కుటుంబాన్ని పోషిస్తాడు ఆడపిల్ల చదివి యెవర్ని వుధ్దరించాలి? అంటూ దీర్ఘాతీసింది.వెనుకంజ అన్న పదం శారద నిఘంటువులోంచి తొలగించివేసింది. ఇంటరులో స్కాలర్ షిప్పు దొరికింది, చదువుకోసం ప్రత్యేకించి ఖర్చులేడు చదువు మాన్పించితే పెళ్ళి చెయ్యాలి శారద ముగ్గురి అక్కలలో యిద్దరి పెళ్ళిళ్ళయ్యాయి. మూడో అమ్మాయి పెళ్ళి ప్రయత్నాలుజోరుగా అవుతున్నాయి. ఈ పరిస్థితిలో శారద గురించి పట్టించుకునే వాళ్ళులేరు.ఇంటరు,బి ఎ పూర్తి చేసి బేంకు పరీక్షలు యిచ్చి సెలెక్టు అయింది.ఇంటిలో వాళ్ళు శారద గురించి ఆలోచించే లోపున ఆమె బేంకు వుద్యోగి అయింది.
శారద తమ్ముడు మోహన్ తల్లి తండ్రులకు ముద్దు బిడ్డడు. కోరాలేగాని కొండమీది కోతినైనా తెచ్చి ముందుంచేవారు,అంతంత మాత్రం చదువుసాగింది.గ్రాడ్యుయేషన్ దాకా వచ్చి బండి ముందుకి సాగదని చదువు మానేసాడు గారాల కుమారుడు. అన్నీ సమయానికి అమర్చుతూంటే అది లేదు యిది లేదు అంటూ తల్లిమీద అక్క మీద కేకలువెయ్యడం తప్ప ప్రత్యేకమైన పనిలేదు.ఒక రోజు పనిమీద వెళ్తున్నతండ్రి సైకిలు జీపుతో గుద్దుకుని కాలు విరిగి హాస్పిటల్ పాలయ్యాడు.ఆరోజున అన్నింటికీ అండగా నిల్చింది శారద.కాలు నయమై యింటికి వచ్చినా ఆరు నెలలు విశ్రాంతి అవసరం అని డాక్టరు చెప్పడంతో యింట్లోనే కర్ర సహాయంతో తిరుగు తున్న తండ్రికి శారదలొ వొక ప్రత్యేకత కనుపించింది
తల్లి మాత్రం ఆడపిల్లకెందుకు వుద్యోగాలు పెళ్ళి చేసి వొక అయ్య చేతిలో పెట్టడమేగా అంటూ రోజూ దీర్ఘాలు తీసేదిగాని యీమధ్యకాలం అంతా ఆ అడపిల్లే సంసారాన్ని సజావుగా నడిచేటట్ట్లు చేసిందని వొప్పుకుందికి మనసొప్పలేదు. తమ్ముణ్ణి దారిన పెడదామని శత విధాల ప్రయత్నించి విఫలమైంది.ఏదైనా చిన్న వ్యాపారం పెట్టిద్దామనుకుంది చిన్న చిన్న వ్యాపారాలు చెయ్యడానికి మోహన్ యిష్టపడలేదు.చేసేదిలేక తన వుద్యోగం మీద శ్రధ్ద పెట్టి వొకతపస్సులా ఏడు సంత్సరాలు గడిపింది బేంకు పరీక్షలన్నీ పాసై ఆఫీసరుగా ప్రమోషను పొందగలిగింది. ఆరోజున తల్లి తండ్రులు ఆమె వున్నతిని పరిపూర్ణ హృదయంతో ఆమోదించలేక కించపరిచే ధైర్యం లేక నిర్లిప్తత ప్రదర్శించారు. శారద కొత్తగా బాధ పడనూలేదు ప్రోత్సాహం ఆశించనూలెదు.తన జీవితంలో కూడా వసంతం వస్తుందని వూహించని శారద తన తోటి వుద్యోగి తనను పెండ్లి చేసుకునే వుద్దేశంవ్యక్త పరుస్తే ముందు ఆశ్చర్యపోయింది వచ్చిన అవకాశం జారవిడువడం అవివేకమనుకుంది.తను వున్న పరిస్తితిలో పెండ్లి చేసుకుని వొక్కసారిగా బయట పడితే తల్లి తండ్రులు నిస్సహయులవుతారని తనను కోరుకున్న శేఖరుకి రెండు షరతులు పెట్టింది ఒకటి తన తల్లి తండ్రుల పోషణకు అభ్యంతరం వుండకూడదు. రెండవది తనకి ఆడపిల్ల పుడితే హీనదృష్టితో చూడకూడదు. రెండు షరతులు బేషరతుగా వొప్పుకున్నాడు .తనకి అమ్మాయే కావాలంటూ మనస్ఫూర్తిగా శారద చేయినందుకున్నాడు.
అంతా నిర్ణయించుకున్నాక తల్లితండ్రులకు తెలియజెప్పింది. తమకున్న ఒక్క బాధ్యత తీరుతున్నందుకు సంతోషించారు. తరువాత తమగతేమిటని వ్యాకుల పడ్డారు. తన తరఫున యెవరూ లేకపోవటంతో శేఖరు వాళ్లతోనే వుంటూ శారద తల్లితండ్రులను తన వారిగానె భావించి గౌరవించడంతో వారి మనసు తేలిక పడింది. శారదకి పెండ్లి అయినట్లు పరాయి అయినట్లుగాఅనిపించలేదు.
అప్పుడప్పుడు తన గురించి యితరులతో మా శారద యిలాగ అలాగ అంటూ చెప్పినప్పుడు రవ్వంతాప్యాయత తల్లి స్వరంలొ విన్నప్పుడు మాత్రం శారద కొద్దిగా చలించేది.పెండ్లయిన యేడాదికి శారద గర్భవతి అయింది. బిడ్డ పుట్టేవరకు కాలం చాలా ఆహ్లాదకరంగానే గడిచింది శారదని కాలు కింద పెట్టనివ్వకుండా కావలసినవి చేసి పెట్టి తల్లి చాలా అపురూపంగా చూసేది
మర్నాడు ప్రసవిస్తుందనగా ముందు రోజు శేఖరుతో అంది శారద "అందరూ నన్నింత బాగా చూసుకుంటున్నారు. నాకుగాని పాప పుడితే పాపని యింత అపురూపంగానూ చూసుకుంటారా?"" నీ కెందుకాసందేహం నాకు ఆడపిల్లే కావాలి సరేనా నిశ్చింతగా నిద్రపో."అంటూ ముంగురులు సవరించాడు శేఖర్.ఈ సంభాషణ జరిగిన యిరవై నాల్గు గంటల్లో శారదకి ఆడపిల్ల పుట్టింది.తల్లి తన అలవాటులో వున్న డైలాగులు అంటూవుంటే శారద మనసు మెలి పెట్టినట్ట్లయింది. ఎప్పటికి వీళ్ళలో మార్పు కలిగేది నిస్పృహగా నిట్టూర్చింది.నర్సు పాపని తెచ్చిపక్కలో పరుండ పెట్టిండి. అపురూపంగా రెండు చేతుల చుట్టిహ్రృదయానికి హత్తుకుంది శారద యీజన్మకీ వరం చాలు అన్నట్ట్లుగా. ఇంతలో జిగ్గుమన్న వెలుగుతో వులిక్కి పడింది.ఎదురుగా శేఖర్ పసిబిడ్డకీ తనకీ కలిపి ఫొటో తీసాడు.ఏమిటీ పని అంటే నాకు ముందే తెలుసు పాపంటె నీకు చాల యిష్టమ్ మోదటిసారిగా మాతృప్రేమని చవి చూస్తున్న మన పాపని, నీకళ్ళలో తొణికిసలాడుటున్న మమకారాన్ని ఫొటోలో బంధించి యీ అపురూపమైన దృశ్యాన్ని మళ్ళీమళ్ళీ చూసుకోవాలని యీ పని చేసాను.
ఎందుకంటే మళ్ళీ మళ్ళీ పిల్లల్ల్ని కంటామంటే ప్రభుత్త్వం వొప్పుకోదు కదా! వాతావరణంలో యెంతటి వుల్లాసం .పై మాటలు విన్నాక ప్రపంచాన్ని జయించినట్లనిపించింది శారదకి.నాలుగోనాడు యింటికి తీసుకు వెళ్ళారు తల్లినీ బిడ్డనీ. బాలసారె జరిపించి బేంకువుద్యోగుల్ని పిలుద్దామంటే తల్లి గొణిగింది మగ పిల్లాడైతే యివన్నీ చెయ్యోచ్చుగాని ఆడపిల్లకీ ఆడంబరాలెండుకే అంది."అమ్మా!యీ క్షణంనుంచి ఆమాట మర్చిపో యీ బిడ్డ నా జీవన జ్యోతి. ఏ ఆడపిల్ల గురించి న్యూనత చూపించకు". గట్టిగానే మందలించటంటో తల్లి మౌనం వహించింది "బంగారూ నీకేం పేరు పెట్టాలమ్మ" అంది మురిపెంగా ప్రక్కనే కూర్చున్న శేఖర్ యిప్పుడే అన్నావుగా నా జీవన జ్యోతి అని జ్యోతి పేరే పెట్టు.
బిడ్డని ప్రేమగా హృదయానికి హత్తుకుంటూ టి వి వైపు చూస్తే అందులో కేర్ ఫర్ ద గర్ల్ చైల్డ్ అంటూ వచ్చింది. అది చూసి మనసారా నవ్వుకున్నారు.

21 November, 2008

అపరిచిత అనుబంధం

శ్రీధర్ హౌస్ సర్జన్ కొర్సు పూర్తయి పోస్టిన్గ్ ఆర్డర్స్ వచ్చాయి. వూరి పేరు చూడగానే తన చిన్నప్పటి ఙాపకాలు పుస్తకంలోని పుటల్లా తెరుచుకున్నాయి. ఆవూరు రామాపురం, సముద్రతీరమున్న చిన్నపల్లె. తండ్ర్ల్ వుద్యోగరీత్యా బదిలీమీద ఆవూరు వెళ్లేసరికి తనకి ఆరేళ్లు.తాము వుండే యిల్లు సముద్రతీరానికి నడక దూరంలో వుండేది. పచ్చని చెట్లు చల్లని గాలి ఎంతో బాగుండేది. పట్టణం లక్షణాలు తక్కువ బస్సు సౌకర్యమయితే వుండేది, తన తోటి పిల్లలంతా తోటలో ఆడుకునేవారు.దగ్గరలో ఒక ఆంగ్లవనిత యిల్లు వుంటూండేది. ఆమె యిల్లు చిన్నగా వున్నా చుట్టూ ఆవరణ చాలాపెద్దది అందులో పళ్లచెట్లు వుండేవి కోళ్లు బాతులు పెంచేది ఆనే జీవనోపాధి ఎలాగో గాని కావలిసినవారికి పళ్లు కరివేపాకు గుడ్లు అమ్ముతుండేది. పిల్లలు గేటు దగ్గరకొచ్చినా కాంపౌండు పైనుంచి తొంగి చూసినా కర్ర పట్టుకుని వెంటపెట్టేది. ఆమె పేరేమిటో ఎవరికీ తెలియదు గాని డూడాబాయి డూడాబాయి అంటూ పిల్లలు వెక్కిరించి పారిపోయేవారు. ఒకనాడు మా పిల్లల దండంతా ఆమె యింటి వయిపువెళ్లాం. గేటు తెరిచివుంది డూడాబాయి ఎక్కడా కనిపించలేదు. చెట్టు నిండా సపోటాపళ్లు నోరూరిస్తుంటే అందరం తలోపండు కోసుకునేలోపున డూడాబాయి రానే వచ్చింది. ఏయ్ పిల్లలూ ఏం చేస్తున్నారక్కడ పొండి పొండి అంటూ కేకలు పెడుతూ చేతిలో కర్రతో మావెంట పడింది.అందరం కాలికి బుధ్ది చెప్పాం.అమె కర్ర విసరటంతో చివర్లోనున్న నాకాలికి తగిలింది.ఏడుస్తూ యింటికి పోయాను జరిగినదంతా వెక్కిళ్లు పెడుతూ అమ్మకి చెప్పాను. కర్ర తగిలిన చోట కాలు ఎర్రగా కందిపోయి తట్టు కనిపిస్తోంది. అమ్మకి చాలా కోపం వచ్చింది. ఆవూరు వచ్చి నాలుగు నెలలే అయినా వాళ్ల వల్ల వీళ్లవల్ల డూడాబాయి గురించి విని వుందేమో ఆమె ప్రవర్తన చికాకనిపించింది.పిల్లలు పళ్లకోసం వెళితే కర్రతో కొట్టడం ఏమిటి? ఒక్క మనిషి ఏం చేసుకుంటుంది అవన్నీ? నయం కాలు విరగలేదు. సంగతేమిటో కనుక్కుందామని శ్రీధర్ చెయ్యి పట్టుకుని డూడాబాయి యింటికి వెళ్లింది.గేటు మీద చెయ్యి వేశాక కాస్త జంకుగా అనిపించింది. ఆమె యిల్లు పళ్లతోట పిల్లలు దూరి పాడు చేస్తే కసురుకోవడం న్యాయమే! తల్లి మనసు ఆపుకోలేక కొడుకు వకాల్తా కోసం పరుగెత్తుకొచ్చింది తను ఎటూ తేల్చుకునేలొపున ఆలస్యమైపోయింది. గేటు తెరిచిన చప్పుడుకి డూడాబాయి బయటికి వచ్చింది. ఏం మాట్లాడాలో అర్ధంకాక మేడమ్ మా అబ్బాయి కాలుకి మీరు విసిరిన కర్ర తగిలింది చెప్పడానికి వచ్చాను నీళ్లు నములుతున్నట్లే అన్నాను.కమ్ యిన్సైడ్ మై చైల్డ్ కమ్! కమ్! రామ్మా స్వరంలో ఎంతో మృదుత్వం. పిల్లల్ని అదిలించే స్వరం లేదు. లోపలికెళ్లింది నాపేరు సుమతి మేము యీ వూరు బదిలీ మీద వచ్చి నాలుగు నెలలైంది.సారీ పిల్లలిదీ తప్పే మిమ్మల్ని విసిగిస్తుంటారు ,అంటూ తలెత్తిన సుమతి ఆమె చర్యకి నిశ్చేష్టురాలయింది. ఆంగ్లవనిత కింద కూర్చుని శ్రీధర్ కాలు చేతిలో తీసుకుని కందిపోయిన భాగాన్ని చేతితో నిమురుతూ అయామ్ వెరీ వెరీ సారీ మై చైల్డ్ రియల్లీ వెరీ సారీ అంటూ కంట నీరు పెట్టుకుంది. అయ్యో అలా అనకండి నేను కంపైంటు చెయ్యడానికి రాలేదు.మావారు వూరెళ్లారు వీడు ఏడుస్తూ రాగానే వేరే ఆలోచన లేకుండా మీ దగ్గరకు పరుగెత్తుకొచ్చాను.నేనే మీకు క్షమాపణ చెప్పాలి. లేదమ్మా కంప్లైంటని నేననుకోవటం లేదు.ఏదో విధంగా నా యింటిలోపలికి వచ్చిన వ్యక్తివి అందరూ నా గురించి ఏమేమో అనుకుంటూ వుంటారు. నా గురించి సింపుల్గా చెప్పాలంటె, నేను నా భర్త యీ వూరు వచ్చేసరికి నాకు యిరవై ఏళ్లు. నేను నా భర్త పీటర్ ఆఫీస్ వర్క్ అయాక బీచిలో గంటలతరబడి గడిపేవాళ్లం. మావారికి పిల్లలంటే చాలా యిష్టం.నేను గర్భవతినని తెలిసిన రోజు పీటర్ సంతోషానికి హద్దులు లేవు.ఆరోనెల నడుస్తుండగా మెడిసిన్స్ తేవటానికి సిటీకి వెళ్లి తిరిగి వస్తుండగా జీపు ఆక్సిడెంటయి చనిపోయాడు.నా లైఫ్ లో దురదృష్టకరమైన రోజు.ప్రతి రోజు నాతో అనేవాడు మన యింటి చుట్టూ యింత ప్లేసు వుంది పళ్లచెట్లు వేస్తే పదిమంది పిల్లలు వాటికోసం వస్తారు. వాళ్లే మన బిడ్డకి ఫ్రెండ్స్ అవుతారు అని. అతని కోరిక మీద యీ పళ్ల చెట్ట్లు నాటించాను. మరి మీ బిడ్డ? అది మరొక బేడ్ లక్ పీటర్ పోయిన వార్తతెలిసి తెలివి తప్పి పడిపోయిన నేను మూడు రోజుల తరువాత హాస్పిటల్లో కళ్లు తెరిచాను. డాక్టర్లు నెమ్మదిగా చెప్పారు తెలివి తప్పి పడటంలో అబార్షన్ అయిందని. జీవించడానికి ఆశ ఏమాత్రం మిగల్లేదు. నాపేరెంట్స్ వచ్చి యింగ్లాండు వచ్చేయమన్నారు. నేనిష్టపడలేదు. నా పీటర్ నామీద పెట్టిన బాధ్యత నెరవేర్చడానికి యిక్కడేవుండడానికి నిర్నయించుకున్నాను. యింత జరిగినా పిల్లలని నేను కసురుతానని మీఅందరికీ నామీద దురభిప్రాయం కాని ఏమాత్రం రెసిస్ట్ చెయ్యకపోతే వాళ్లకి మళ్లీ రావటానికి క్రేజ్ వుండదు.వాళ్లనలా అదిలించగానే వెంటనే వస్తారు. ఈ రోజు అనుకోకుండా చేతిలో కర్ర జారి మీ బాబుకి తగిలింది. సారీ అమ్మా సారీ శ్రీధర్! అంటు లొనికి వెళ్లి ప్లేటులో సపోటా పళ్లు కోసి పెట్టి తీసుకోండి అంది. అయ్యో ఎందుకు మేడమ్ శ్రమ.ఫరవాలేడమ్మా తీసుకోండి అంది మొహమాటంగా సపోటా ముక్క తింటూ నాకో సందేహం మేడమ్ మిమ్మల్నందరూ డూడాబాయి అంటారు మరి మీపేరు? నా పేరు మేరీడొనాల్డ్ పీటర్ నన్ను డోడా అంటూ పిలిచేవాడు. అది విన్న యిక్కడివాళ్లు డూడాబాయి అంటూ పిలవడం పిల్లలకి పెద్దలకి అలవాటయింది ఇన్ని సంత్సరాలు గడిచాక నా అసలు పేరేమిటో నేనే మర్చిపోయాను. నేను శ్రీధర్ తన యింటికి వెళ్లడంతో ఎంతగా సంతోషించిందో ఆమె కళ్లలొ ప్రతిఫలించింది.ఇక వెళ్తాం అని లేవడంతొ అప్పుడప్పుడు రామ్మా నా కాంపౌండు గోడవరకు వచ్చే వాళ్లేగాని గేటు లోపలికి ప్రవేసించిన వ్యక్తివి నువ్వే. 
తప్పకుండా మేడమ్ శ్రీధర్ని కూడా తీసుకుని వస్తాను అంటూ బయలుదేరింది. ఇచ్చిన మాట ప్రకారం ఆవూళ్లో వున్న నాలుగు సంత్సరాలు అప్పుడప్పుడు డూడాబాయి యింటికి వెళ్లి ఆమె యోగక్షేమాలు కనుక్కుంటూ వుండేది సుమతి. ఒకసారి భర్తని తీసుకువెళ్లి పరిచయం చేసింది.మావారు మేడమ్ పేరు సత్యమూర్తి. వెరీ గ్లాడ్ టు మీట్ యు అంటూ ఆదరంగా కూర్చోపెట్టింది.యోగక్షేమాలు అడుగుతూ మీ మిసెస్ కలిసినప్పటినుండి నాకి చాలా క్లోజ్ అయింది. నా జీవితంలో మళ్లీ బంధుత్వాలు ఏర్పడ్డట్ట్లయింది. నాకు కూతురులా అనిపించింది బిడ్డలు లేని లోటు తీరింది సుమతి శ్రీధర్ల పరిచయంతో. మీ అభిమానం మేడమ్ థేంక్స్! మొహమాటంగా జవాబిచ్చాడు సత్యమూర్తి. ఇంక నేనెన్నాళ్లు జీవిస్తానో తెలియదు,నా యిల్లు తోట అంతా ఒక హాస్పిటల్ గా మార్చటానికి డొనేట్ చేద్దామనుకుంటున్నాను.వాటికి తగిన ఏర్పాట్ట్లు చెయ్యగలరా? ఈ వూర్లో ఒక్క మీ ఫేమిలీతోనే యింత చనువు ఏర్పడింది. అభ్యర్ధించింది మావారు సివిల్ యింజినీరు పదిహేను రోజులు తిరిగి కాగితాలు సిధ్దంచేశారు. ఆమె తదనంతరం ఆయింటిని హాస్పిటల్ గా మార్చడానికి అగ్రిమెంటయింది. ఆవూర్లో వున్న నాలుగేళ్లు నాలుగు నెలలుగా గడిచిపోయాయి. మేము మరో వూరు వెళ్తున్నామని చెప్పటానికి వెళ్తే ఆమె శ్రీధర్ నుదుటిని ముద్దాడి పెద్దయాక పెద్ద డాక్టరువై నా హస్పిటల్లొ సేవచెయ్యి బాబూ! మే గాడ్ బ్లెస్స్ యూ! అంటూ మనసారా ఆశీర్వదించింది. ఏనాటి అనుబంధమొ వూరు వదిలి వెళ్లటానికి గుండె బరువై కళ్లనీళ్లు వుబికాయి. పధ్దెనిమిది సంత్సరాలు గడిచాక మళ్లీ ఆవూరి పేరు వినగానే గత ఙాపకాలన్నీ మనసులొ మెదిలాయి.ఆవూరు చేరి హాస్పిటల్లొ అడుగుపెట్టిన శ్రీధర్ గోడమీద మేరీ డొనాల్డ్ ఫొటో పెద్దది చందనం మాల వేసివుంది ఫోటో చూడగానే కమాన్ మై చైల్డ్! అంటూ నవ్వుతూ ఆహ్వానించిన అనుభూతి పొందాడు శ్రీధర్. ది

16 November, 2008

పిచ్చి(తల్లి) పోలి

భళ్లున తెల్లవారడంటోనే పోలి ప్రసవించింది పండంటి మగపిల్లాడిని కన్నది అన్న వార్త వూరంతా పాకింది.శాంతకు తెలియకుండానే పోలికి పుట్టిన బిడ్డ కోసం లావాదేవీలు మొదలయ్యాయి.సరుకులకొట్టు కాంతయ్యకు పెళ్లయి యిరవై యేళ్లయినా పిల్లలు కలగలేదు,దగ్గిరబంధువుల పిల్లలని పెంచుకుంటే రోజూ వాళ్లువచ్చి యేదోవొకదానికి పేచీలేస్తారని యిన్నాళ్లు ఆలోచించాడు.పోలి కొడుకయితేతల్లి పిచ్చిది కులంలోంచి వెలివేయబడ్డది అటువంటి బిడ్డని డత్తత చేసుకుంటే యెవరిప్రమేయం వుండదనిపోలి తల్లి తండ్రులవద్దకెళ్లి తన అభిప్రాయాన్ని తెలియజెప్పి వాళ్లకి కొంత డబ్బాశచూపాడు.కులపెద్ద చలమయ్య మధ్యవర్తిత్త్వం చేసి కొంత డబ్బు తప్పు చెల్లిస్తే పోలిని కులంలో కలుపుకుంటామని పోలిని యింటికి తెచ్చుకోవచ్చని ప్రకటించాడు. ఈవిషమంతా శాంత గోపాలరావులకు తరువాత వీరమ్మ ద్వారా తెలిసింది.అందరూ కూడగట్టుకుని పదిగంటలకి గోపాలరావింటికి వచ్చారు. శాంత ఆశ్చర్యంగా భర్తని చూసింది. ఏమీ మాట్లడవద్దని సౌంఙ్ఞ చేసాడు. వాళ్లు పోలి వద్దకు వెళ్లి పిచ్చి పోలీ బాగున్నావా? నీబిడ్డని కాంతయ్యకిస్తే నువ్వు మీఅమ్మ కాడకి యెలిపోదువుగాని నిన్ను కులంలో కలుపుకుంటామని చలమయ్య అనగానేపోలి రియాక్షన్ యెలావుంటుందోనని మావుభయులం కుతూహలంగా గమనిస్తున్నాం. యెప్పుడూ నోరువిప్పి మాట్లాడని పోలి సమాధానం ఎలాచెప్తుంది ఏమిటిచెప్తుంది అని. ఈమాటలు వినగానే పోలి పసివాడిని బట్టలోచుట్టి జాగ్రత్తగా గుండెలకి హత్తుకుంది,అందరివైపు చూసి "నా కొడుకుని నానెవ్వురికి యియ్యను నానే పెంచుతా చలమయ్యమామా! నానే కులంలో పెరిగినానో నాకెరికనేదు నానెక్కడికి రాను కూలి నాలి సేసుకుని నాకొడుకుని పెంచి పెద్దసేసుకుంటాను నాకొడుకుని యెవురికి యివ్వను" అంటూ బిడ్డని గుండెల్లో దాచుకున్న ఆమాతృ హృదయ్యాన్ని అర్ధంచేసుకున్న మేము అవక్కయ్యాము.పోలి నోటివెంట వచ్చిన ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క ఆణిముత్యం. అక్కడున్నవారంతా నిశ్చేష్టులై నిలుచున్నారు అపైన ఒక్కముక్క మాట్లాడటానికి సాహసించలేదు. ముందుగా గోపాలరావు తేరుకుని వాళ్లతో యిపాటికైనా అర్ధం అయిందికదా యింకా ఆమెని పిచ్చిది అంటే మర్యాదగా వుండదు. ఇకనైనా ఆమె బ్రతుకుని ఆమె యిష్టానికి వదలి వెళ్లండి.మాటలు శాంతంగావున్నా అందులో వున్న దృఢత్త్వంవారికి అర్ధమయి వెనుతిరిగారు. యిప్పటికీ పోలిని పిచ్చిపోలి అనడం యెంత అవివేకమో వచ్చిన నలుగురికీ అర్ధమయివుంటుంది గోపాలరావు చర్యతో ఆకాశమంత యెత్తుకెదిగిపోయాడు శాంత దృష్టిలో గర్వంగా చూసింది భర్తని. శాంత యీ షాకునుండి తేరుకుని పోలికి తినడానికి యివ్వాలని లోపలికి వెల్ళింది .
మధ్యాహ్నం తీరికగా కూర్చున్న సమయంలో రెండేళ్ల క్రితం తను ఆవూరు వచ్చినప్పటి నుండి
సినీమా రీలులా కదిలింది. ఆచిన్న వూరికి సోషల్ డెవలెప్ మెంట్ ఆఫీసరుగా భర్తకి బదిలీ అవడంతో అవూర్లో వుండటానికి వసతి అయిన యిల్లు వెతుక్కొవడం చాలా కష్టమయింది దొరికిన యింటికి చుట్టూ పూరిళ్లే అందరూ కాయకష్టం చేసుకుని బ్రతికేవాళ్లే యిల్లు సదుపాయంగా వున్నప్పుడు మిగతావాటికి ప్రాముఖ్యత యివ్వాల్సినపనిలేదని వాళ్లతో యిబ్బందివుండదు అని ఆయింట్లో దిగారు. వున్న ఒక్క కొడుకు యింజినీరింగు చదువుకని వేరేవూర్లో వుంటున్నాడు.ఉద్యోగరీత్యా పల్లెటూర్లు తిరగటం అలవాటే.గోపాలరావు ఆఫీసుపని మీద టూరుకుడా వెళ్లవలసివస్తూంటుంది.శాంత పేరుకేకాదు స్వభావంలో కూడా శాంతే.చుట్టు పక్కల వున్నవారి యోగక్షేమాలు కనుక్కోవడం ఆరోగ్యసూత్రాలు చెప్పడం తోచిన సహాయం చెయ్యడం వీటితో శాంతమ్మగారంటే చుట్టుపక్కల అంద్రికీ గౌరవం అభిమానం కొద్దిరోజుల్లోనే యేర్పడింది.
ఆరోజు భర్త ఆఫీసుకెళ్లాక వీధిలో యేదో గొడవగా వుందని బయటికి వచ్చింది శాంత.తమ యింటికి నాలుగిళ్ల అవతల పిచ్చిపోలిని తల్లి తండ్రి గద్దించుతున్నారు "ఆడెవుడో పేరు సెప్పు కులానికి సెడ్డ పేరు తెచ్చినావు " యెంతగా అడిగినా పెదవి యిప్పలేదు దాంతో నాలుగుతన్ని యింటినుంచి బయటికి తోసేశారు. యేడుస్తోమ్దే తప్ప పోలి యెటూ పోలేదు ఒకపక్కగగా ఒదిగి కూర్చుంది. జనం పదిమందీ పోగయి విచిత్రం చూస్తున్నారు. చివరికి తండ్రి నిన్నింటిల పెట్టుకుంటే నన్ను కులంనుంచి యెలేస్తారు పో నీ బతుకెలా బతుకుతావో నీ యిట్టం అంటూ రోడ్డు మీదకు నెట్టాడు. తల్లి గోలున యేడుస్తోంది ఏమై వుంటుందా అని అలోచిస్తున్నాను.యింతలో పనిమనిషి వీరమ్మ వచ్చింది.ఆతృతనాపుకోలేక యేమయింది వీరమ్మా పోలిని యింట్లోంచి వెళ్లగొట్టేరెందుకు? అంటే ఆల్లుమాత్తరమేటి సేత్తారమ్మా యీడొచ్చిన పిల్ల మతిలేదు గాని పెల్లిపెటాకులునేకుండ నెలతప్పినాదంటే యింటిల యెట్టా యెట్టుకుంటారమ్మా? దాన్ని యింటిల వుంచితే కులంలోంచి యెలేస్తామని కులపెద్ద సెప్పాడు.వున్న ముగ్గురు పిల్లల నోటికింత బువ్వ పెట్టలంటే యీ పిల్లని బయటికి తోలక తప్పదుకదమ్మా? నిశ్చేష్టురారినయ్యాను. యిటువంటివి హైసొసటీలో జరిగితే గుట్టు చప్పుడు కాకుండా బయటపడతారు. అన్నిటికన్నా పోలి మతిమాలిన పిల్ల యిటువంటి పరిస్తితిలో బయటి ప్రపంచంలో యెలా బతుకుతుంది అదే అడిగితే వీరమ్మ అన్నిటికీ బాగమంతుడే వున్నాడమ్మా నారు పోసినోడు నీరుపొయ్యకుండ వుంటాడా? వూరిల యింతమందుండగా పిచ్చిదాని గురించి సింత పడతారెంటమ్మా? వీళ్లకున్న ధైర్యం మనకి వుండదు చింతపడకుండాయెలా? యీ వూరు వచ్చిన దగ్గరనుంచి చూస్తున్నాను.విచిత్రమైన ప్రవర్తన పోలిది. స్నానం చెయ్యటానికి గొడవచ్ఱ్స్తుండి వంటినున్న బట్టలు మాసి చిరిగినా మార్చటానికి యిష్టపడదు చిరిగిన బట్టలని ఎక్కడికక్కడ ముడులుకట్టడుతూంటుంది జుట్టు అట్టలు కట్టినా దువ్వనివ్వదు. ఒకసారి పోలి తల్లిని పోలి గురించి అడిగితే నాలుగేళ్ల వరకు బాగుండేదని ఒకసారి చెట్టు మీందనుంచి పడి తలకి దెబ్బ తగిలిందని అప్పటినుండి విచిత్రంగా ప్రవర్తిస్తోందని చెప్పింది. ఆకలివేసినా అన్నం తింటాననేది కాదు తల్లి ఏదో ఒక వేలకి కసిరితే యింత తినడం. అప్పటినుంచి పిల్లలూ పెద్దలూ పిచ్చిపోలి అంటూ పిలవడం మొదలు పెట్టారు. తనకేం కావాలో తెలియని పిల్లని రోడ్డు మీదకు నెట్టేయడం ఎంత సమంజసమోఅర్ధం కాలేదు.తప్పో ఒప్పో తెలియని మనస్థితి అది అర్ధం చేసుకునేవాళ్లే లేరు చుట్టూ మూగిన జనం తలో మాట టూ అనుకుంటూ వెళ్లారు. ఇదే సహజంగా పెళ్లై నెలతప్పితే ఎంతో అపురూపంగా కాలు కిందపెట్టకుండా చూసుకుంటారు. పోలి జీవితం ఎలా గడుస్తుంది అనుకుంటూ లోపలికెళ్లాను.
రోజులు వారాల్లోకి నెలల్లోకి మారుతున్నాయి. పోలి గర్భవతి అన్న విషయం స్పష్టంగా తెలుస్తోంది. వీరమ్మని అడిగాను పోలి యిన్నాళ్లనుంచి ఎలాబతుకుతొందని చెరువు దగ్గర శివకోవిల డగ్గర ఎక్కువకాలం గడుపుతుందని కోవెల పూజారి ప్రసాదంపెడుతూంటాడని చెప్పింది. అరోజున అదృశ్యశక్తికి జోహార్లర్పించాను. పూర్వంలా పోలి తనలో గొణుక్కోవడం బట్టలు ముడులు కట్టడం చేయడంలేడని గమనించాను.కడుపులో బిడ్డ పెరగడంతోపాటు ఆమె మనస్తితి కూడా మెరుగుపడుతోందనుకున్నాను. ఒక రోజు గుమ్మం ముందు నిలుచున్న పోలిని అడిగాను ఏమయినా తింటావాఅని, సరే అన్నట్లు తలూపింది. లోపలినుంచి నాలుగు యిడ్లీలు చట్నీ యిచ్చాను అపురూపంగా తిన్నది. పాతచీరలు రెండు యిచ్చాను మర్నాడు కట్టుకుని వచ్చింది.చూసి చాలా ఆశ్చర్యపోయాను. నెలలు నిండుతూంటే ఆమె స్థితికి కడుపు తరుక్కుపోయింది.ఆరాత్రి మావారిని అడిగాను.వూర్లో యింతమంది వుండి పోలిని ఎవరూ పట్టించుకోరేం? మీరు సొసైటీని ఉధ్దరించడానికే కదా యిటువంటి పరిస్థితి బాగుచెయ్యడానికి వుపాయమేం లేదా? అంటే యిది మరీ బాగుంది నేనేం చెయ్యగలను? అంటూ తప్పించుకున్నారు. పోనీ మీరు పర్మిషనిస్తే మన పెరటి షెడ్డులో ప్రసవించేదాకా వుండమనవచ్చుకదా! ఆస్థితిలో వున్న అడదానికి రెండుపూటలా యింత అన్నం పెడితే మనకేమీ తరిగిపోదుకదా? యిటువంటి సలహా అయినా మీరు చెప్పవచ్చుకదా అంటే మావారు నవ్వుతూ సరే నువ్వు దీనజనోధ్దరణ చెయ్యాలనుకుంటే నాకేం అభ్యంతర లేదు,కానీ నాకై నేను సలహా యిస్తే యిందులో నాహేండుందని అనుమానించే ప్రమాదం వుంది.ఈ భయానికే వూర్లోవాళ్లు జాలిపడ్డా సహాయం చెయ్యడానికి ముందుకి రాలేదేమో. భర్త అంగీకారం దొరకడమే తరువాయి మర్నాడు పొద్దుట వీరమ్మని పంపి పోలి ని మా పెరట్లోని షెడ్డులో వుండే ఏర్పాటు చెయ్యడం క్షణాల్లో జరిగింది.అప్పటికి హమ్మయ్య! అనుకుంది శాంత. ఆరోజు యింటికి బంధువులు రావడంతో వుదయంనుండి రాత్రివరకు అతిధి మర్యాదలు చేస్తూ అలిసిపోయింది రాత్రి పోలికి అన్నం పెట్టి నిద్రపోయిందిరాత్రి పదకొండు నుంచి వురుములు మెరుపులతో వాన విపరీతంగా పడింది. అలిసి పడుక్కున్న శాంతకు యిదేమీ తెలియ లేదు. తెల్లవారు ఝామున నాలుగు గంటలకు లేచిన శాంత వాతావరణంలో మార్పు గమనించి బయటకు చూస్తే వాన పడుతోమ్ది పోలి ఎలా వుందోనని టార్చి తీసుకుని షెడ్డులోకి పరిగెత్తింది అక్కడి డృశ్యం చూసి నోటమాట రాలేదు.లైటు స్విచ్చి వేసింది. షెడ్డులో ఒక మూల పోలి మూలుగుతోంది కాళ్లడగ్గర మురికిలో బాలభాస్కరుడిలా మగబిడ్డ కదులుతున్నాడు. వెంటనే భర్తని లేపి వీరమ్మని పిలిచి మిడ్వైఫుని తెప్పించి పిల్లడికి బొడ్డు కోయించి స్నానం చేయించిఆ ప్రదేశం అంతా శుభ్రం చేయించింది. పోలిని బిడ్డని పొడిగా వెచ్చగా వున్న ప్రదేశంలో పడుక్కోపెట్టించి చాలా హడావిడి పడింది శాంత. తెల్లవారేవరకు పోలి నెలతప్పిన నాటినుంచి జరిగిన సంఘటనలు తలుచుకుంటూ గడిపింది. అట్టలు కట్టిన జుత్తు దుర్గంధభూయిష్టమయిన శరీరం మసిబారి ముడులుకట్టిన జీర్ణ వస్త్రాలు యిటువంటి పోలినిమీద మనసు పడ్డ మహానుభావుడెవరోగాని తనకి యీ సహాయం చేసే అవకాశం కలిగించాడు.అనుకుని మనసులోనే నవ్వుకుంది.పోలికి యింత అన్నం వండిపెడదామని తయారు చేస్తూంటే పదింటికి పోలి తల్లి తండ్రి కాంతయ్య చలమయ్యలు రావడంతో వాతావరణం వేడెక్కింది.కాని పోలి యిచ్చిన సమాధానంతో మబ్బులు విడిపోయినట్లయింది.యివన్నీ చూసిన తరువాత కూడా పోలిని పిచ్చి పోలిఅనడం ఎంత పిచ్చితనమో అర్ధమయింది యిక పోలి జీవితం గురించి చింత పడాల్సిన పనిలేదని నిబ్బరంగా వూపిరి తీసుకున్నాం.

06 November, 2008

మర్మమెరుగని మనిషి

సంధ్యచీకట్లతోపాటు రాజారావుగారింట్లో వెండికంచం పోయిందన్న వార్త కార్చిచులావూరంతా వ్యాపించింది. అసలే పల్లెటూరు అక్కడున్న యిళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.రాజారవుగారు ఆవూరు వచ్చిఆరేళ్ళయింది. వచ్చిన నాటినుండి ప్రజల అభిమానం చూరగొన్నారు. వృత్తి ధర్మం అయాక సాయంత్రం పిల్లలకి వుచితంగా చదువు చెప్పేవారు.దాంతో అందరూ ఆయన్ని రాజారావుమాష్టారనే పిలుస్తారు. ఆయనవద్ద చదువుకుందికి పిల్లలు లేనివారుకూడా ఆయన కనపడితే ఆదరంగా పలకరించడం యోగక్షేమాలు కనుక్కోవడం చేస్తూంటారు. అలాంటి రాజారావుమాష్టారింట్లో వెండికంచం పోవడమా? wలా పోయింది ఎప్పుడు పోయింది అంటూ ఒక్కొక్కరే వచ్చి ప్రశ్నిస్తూన్నారు. కొందరు పోలీసు కంప్లైంటు యివ్వమని సలహా యిచ్చారు. రాజారావుగారి మనసు అతి సున్నితం పోలీసు కంప్లైంటు యివ్వడానికి ఒప్పుకోలేదు.'నాకెవరిమీదా అనుమానంలేదు వస్తువు తీసినది ఒకరు నిందపడేది మరొకరు అవుతారు నా నిజాయితీ మీద నాకు నమ్మకం వుంది నా వస్తువే అయితే నట్టేట్లో పడేసినా నట్టింటికొస్తుంది'. రాజారవుగారి భార్యయితే కళ్ళనీళ్ళు పెట్టుకోవటం మినహా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. "ఒక్కగంట యింటికి తాళం పెట్టి పేరంటానికి వెళ్ళాను వేసితాళం అలాగే వుంది తక్కిన వస్తువులన్నీ వుండి ఆఒక్క కంచమే పోవడం ఆశ్చర్యంగా వుంది. అంతామాయలా వుంది.అది వారి తాతగారి కంచం ఆయనకెంత బాధగావుందో పైకేమీ అనటం లేదు". కామేశ్వరమ్మ వచ్చినవాళ్లతో చెప్తోంది. ఆపూట భోజనాల మాటే మర్చిపోయారు రాజారావుగారి ఆప్తమిత్రుడు సాంబయ్య వస్తూనే" ఏంటి మాష్టారూ! మీయింట్లో వస్తువు పోవడమేమిటి? మీ నౌకరు సత్తెయ్యే తీసుంటాడు. యింతకు ముందు కూడా వొకరింట్లో మారుతాళంతో తలుపు తీసి వెండిపళ్లెం దొంగిలించాడు. రేపు నేను టౌను పోలీస్టేషన్లో కంప్లైంట్ యిస్తాను."అంటు లేచాడు .ఎందుకులే సాంబయ్యా నాకు ప్రాప్తముంటే అదే దొరుకుతంది.ఈ ఆశావాదం సాంబయ్య ఒప్పుకోలేదు పోయిన వస్తువు తన స్వంతమన్నట్లు మర్నాడు పోలీసు కంప్లైంటు యిచ్చి వచ్చాడు. సాబంఅయ్య యిచ్చిన కంప్లైంటు తో పోలీసుయిన్స్పెక్టర్ రాజారావుగారి యిల్లు సోదాచేసి ప్రశ్నించి కంచం నూరు తులాలదని దాని వెనుక వారి తాతగారి పేరు పొడి అక్షరారున్నాయని రాసుకుని వెళ్లేరు. రాజారావుగారు యింటికి రాగానే వాలుకుర్చీలో కూలబడ్డారు . కామేశ్వరమ్మ భర్తకోసం మంచినీళ్లు తీసుకెళ్లి ఏమయిందండీ అలా వున్నారు అని ప్రశ్నించింది .చూడు కాముడూ ఈ పోలీసు కంప్లైంటులు అవీ అందుకే వద్దన్నాను .అయ్యో ఏమయిందంఢీ? అనగానే ఏం చెప్పమంటావు? నా ఆఫీసు దగ్గరికి మన సత్తెయ్యని తెచ్చి నా కళ్లముందు వాడిని యిష్టంవచ్చినట్లు కొడుతూంటే చూడలేక వాడినలా కొట్టవద్దని అనుమానంవుంటే లాకప్పులో పెట్టండి గాని ఈ అకృత్యం నేను చూడలేను అని ఖచ్చితంగా చెప్పేను.
అయ్యో ఎంతపని జరిగిందండీ! పాపం సత్తెయ్య భార్యకి పురిటిరోజులు కూడానూ భగవంతుడా ఈ పాపం చుట్టుకోకుండా మమ్మల్ని కాపాడు నాయనా! అంటూ కామేస్వరమ్మ కనుపించని వేలుపుని వేడుకుంది. మూడురోజులు ఎలాగడిచాయో ఆ దంపతులిద్దరికే తెలుసు. ఆరోజు మధ్యాహ్నం కామేశ్వరమ్మ వీధి వరండాలో కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. అక్షరాలు కళ్లముందున్నా ధ్యాస దానిమీదలేదు.కంచం పోయిననాటి ఙ్నాపకాలు ముసురుకున్నాయి.జానికమ్మగారింటికి పేరంటానికి వెళ్లి వచ్చి హడావిడిగా వంటచేసి అన్నాలు పెడదామని కంచాలు పెడుతుంటె ఆయన కంచం కనిపించలేదు.పిల్లలనడిగితే మాకేం తెలుసు?ఎదురు ప్రశ్నించారు ఏం చెయ్యాలొ పాలుపోక ఆయనతో చెప్తే సరిగా వెతకండి ఎక్కడో పెట్టి వుంటారు. యింట్లోని వస్తువు ఎక్కడికి పోతుంది అన్నారేగాని యిలా మాయం అయిపొతుందనుకోలేదు.అన్ని సామాన్లు వుండి అ ఒక్క కంచం లేకపోవడమేమిటి? యిలా ఆలోచనలో మునిగి వున్న ఆమె శంకరం రావటం గమనించ లేదు. అతన్ని చూడగానే "ఏమిటి నాయనా చేతిలో సంచీ వుంది వూరెళుతున్నావా?" అవునండి పట్నం వెళుతున్నాను రెండు రోజుల్లో వస్తాను .అంటే మంచిది నాయనా శుభం! శంకరరం వెళ్లాక గీత చదువుతోందీ ఒక శ్లోకం వద్ద ఆగిపోయింది.
అనన్యాశ్చింత యంతోమాం
ఏజనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్
కృష్ణా! నిన్ను మనసారా నమ్మి నీ మీద భారం వేసి అన్నీ నీకు వదిలి పెడితే మా యోగక్షేమాలు నువ్వే చూసుకుంటానన్నావు కదయ్యా? ఏదీ దొంగ మారు తాళాల్తో తలుపు తీసుకుని కంచం పట్టుకుపోతుంటే నువ్వేంచేసావు?నువ్వు గీతలో చెప్పినవన్నీ నిజమని నమ్మాను ఆయనగాని నేనుగాని యితరులకి చేతనైన సహాయమే చేసాం గాని చీమకైనా అపకారం చెయ్యలేదు. గీతలో నువ్వు చెప్పిన విధంగా పరోపకారం చేస్తూ బ్రతుకుతున్నాం.మాకు దొరికిన ప్రతిఫలం యిదా? అన్యాయంగా ఆర్జించి ఆస్తులు కూడబెట్టకుంటెమానె తాతలనాటి వస్తువైనా నిలబెట్టుకోలేపోయాం. ఇదేనా నువ్వు చూసే యోగక్షేమం? కామేశ్వరమ్మ మనసులోనె గీతాచార్యునితో వాదిస్తోంది. పనిమనిషి పిలుపుతో యీ లోకంలోకి వచ్చింది.
ఈ మూడు రోజులై ఎవరో వొకరు రావడం మీ కంచం పోయిందట మీ యింటిలో దొంగతనం జరిగిందట అంటూ పరామర్శ చేస్తూంటే వాళ్లకి అభిమానం వ్యక్తం చేసినట్లుందిగాని మాకు మాత్రం వీళ్ల మాటలతో గాయం కెలికినట్లవుతోంది. రాత్రయినా ప్రశాంతంగా నిద్రపోదామంటే నిద్రాదేవి కరుణించలేదు. మనమేయిలా నీరుగారిపోయినట్లున్నాము,కాని యింకొకరయితే ధైర్యంగావుందురు . అయినా మనం అదృష్టవంతులమనే చెప్పుకోవాలి వచ్చిన దొంగ యింకేమీ పట్టుకెళ్లకుండా కంచమొక్కటె పట్టుకెళ్లాడు.రాజారవుగారు భార్యని వోదారుస్తున్నారు.నిజమేనండీ నయంకాదూ వొక్క వస్తువుతో సరిపెట్టుకున్నాడు. మధ్యాహ్నం కోపం వచ్చి దేముడినే తిట్టాను. ఎంత అవివేకం నాది? అంటూ వాపోయింది. పోన్లే రామదాసంతటివాడు రాముణ్ణి తిట్టాడు నువ్వూ ఆకోవకి చెందుతావేమో!నవ్వుతూనే సమాధానం యిచ్చారు. రాత్రి వొంటిగంట అయింది తలుపు తట్టిన చప్పుడుతో మెలకువ వచ్చింది రాజారావుగారికి తనపేరుపెట్టి పిలుస్తున్నారెవరో,పక్క నున్న కామేశ్వరమ్మకు కూడా తెలివి వచ్చేసింది తలుపు తియ్యబోయిన భర్తని అడ్డుకుంది ఎవరో ఏమిటో కనుక్కోకుండా తలుపు తియ్యకండి అసలె మొన్న దెబ్బ తిని వున్నాం. ఎవరు అవతల? రాజారావుగారి కంఠం ఖంగుమందీ నేనండీ యిన్స్పెక్టర్ కేసవరావుని తలుపు తియ్యండి మీకొచ్చిన భయమేమీలేదు. ఆశ్చర్యంలొ మునకలు వేస్తు తలుపు తీశారు. రండి కూర్చోండి .ఆరోజు పరిచయం తప్ప స్నేహం లేకపోయినా సభ్యత అనిపంచిన మాటలు.కేసవరావు లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి వచ్చి కూర్చున్నాడు. ఇది మరీ విడ్డూరమనిపించింది.ఏదో తిరకాసుంది లేకుంటే యితనిలా ప్రవర్తించడు. మనసులోనే అంచనా వేస్తున్నారు రాజారావుగారు. అమ్మా! కాస్త మంచినీళ్లివ్వండి రాత్రి పూట మీకు శ్రమకలిగించినా సంతోషం కలిగించే వార్త తీసుకొచ్చాను.కామేశ్వరమ్మ సంశయం సంభ్రమంగా మారింది.లోనికెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చింది.మాష్టారూ మీ కంచం దొరికింది.నిజంగా మీరు చాల అదృష్టవంతులు.అంటూ బేగులోంచి కంచంతీసి టేబిలు మీద పెట్టాడు .యింతకూ ఎవరు తీసారు సార్ నాకు చాలా కుతూహలంగా వుందిఈ వూరు వచ్చిన ఆరు సంత్సరాలలోను ఈ వూరందరి అభిమానం పొందగలిగేను నాకే కష్టం కలిగినా తమకే ఆకష్టం వచ్చినట్ట్లు భావిస్తున్నారు ఈ పల్లె ప్రజలు అటువంటిది నా యింటిలో దంగతనం చేసి అదీ ఒక్క కంచం పట్టుకెళ్లిన వ్యక్తి ఎవరుసార్! నాకు చాల ఆతృతగా వుంది రియల్లీ ఆయామ్ ఫీలింగ్ వెరీ యాంక్షస్! కేశవరావు రెండు చేతులూ జోడించి ఈ విషయం చెప్పడానికి నాకు జంకుగా వుంది మాష్టారూ! నా వుద్యోగం ఎలాటిదో మీకు తెలుసు రోజూ కత్తి మీద సామే అది చెప్తే మాత్రం మీ వూరివాళ్లు నాకు భూమిమీద నూకలు చెలగొట్టెస్తామన్నారు క్షమించండి. మీరు చెప్పే విషయం ఈ నాలుగు గోడలు దాటదు మా యిద్దరి మనసుల్లోనే సమాధి అవుతుంది మీ సంకోచం నన్ను అసలు నిలువనియ్యటంలేదు".మీ యింటి వారబ్బాయి శంకరం"
ఆ! యిద్దరూ వొక్కసారే ఆశ్చర్యపోయేరు. ముందుగా కామేశ్వరమ్మ తేరుకుని అదేమిటండీ మన శంకరం మధ్యాహ్నం నా ముందునుంచేగా పట్నం వెళ్తానని బయలుదేరాడు. ఏదొ మందు తెచ్చుకోవాలన్నాడు అయినా మీరు సరిగ్గా విచారించారా? ఆ అబ్బాయి అటువంటివాడుకాడు. ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చింది కేశవరావుకి . మీ ముందు నుంచి ఎన్ని గంటలకు బయలుదేరేడమ్మా? రెంఢు అంది నాకు మూడు గంటలకు దొరికాడు.అతని సంచీలో మీ కంచం దొరికింది తన నేరం వొప్పుకున్నాడు, యింకా మీరతన్ని మన శంకరం అంటున్నారమ్మా? మీరతన్ని ఎలా అనుమానించరు సార్? వెరీసింపుల్ మా దృష్టి ఎంతసేపూ చుట్టూ వున్నవారి ముఖ కళవళికలు గమనిస్తూంటాం. నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి కబురొచ్చింది అర్జంటుగా రమ్మని. సమయానికి జీపు పాడై బస్సులో బయలు దేరాను. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఈ వూరు దాటిన రెండు మూడు కిలోమీటర్లు దాటాక శంకరం బస్సాపించాడు లెఫ్టు సైడులో నిలుచోవడం నుంచి నా దృష్టిలొ పడ్డాడు. యూనిఫాంలో వున్న నన్ను చూడగానే వులిక్కిపడటం క్షణంలో నా దృష్టినుంచి తప్పించుకోలేదు. బస్సెక్కను వెళ్లిపోమని సౌంఙ్నచేశాడు. నాకు ఆశ్చర్యమేసింది. తిట్టుకుంటూ బస్సు స్టార్టు చేసాడు డ్రైవరు. నేను కిటికీలోంచి మరొక్కసారి అతన్ని చూసాను ఎక్కడో చూసిన ముఖంలాగుంది. నేను అతన్ని చూడటం గమనించి చేతిలో వున్నబేగుని చంకలో యిముడ్చుకుని తలవంచుకుని అడుగులు వేస్తున్నాడు అతని వద్ద సారా బాటిల్సు వున్నాయో యేమో నన్ను చూసి జంకుతున్నాడని బస్సు ఆపమన్నాను. వెనక్కి నడిచి వెళ్లి అతన్ని కలుసుకున్నాను.బస్సువెళ్లటమే గమనించాడు గాని తలొంచుకుని నడుస్తున్న అతను బస్సాగటం గమనించలేదు నేను దిగి వెనక్కి వెళ్లి అతని ఎదురుగా నిల్చున్నాను. ఒక్క క్షణం కంగారుపడ్డాడు తప్పించుకునే అవకాశం యివ్వలేదు. వూరు పేరు ఎవరి తాలూకా అన్నీ వివరాలడిగాక సంచిలో ఏముందన్నాను కాసేపు నసిగాడు .గట్టిగా అడిగి సంచిలోంచి తీస్తే మీ వెండికంచం! వెనక తిప్పి చూస్తే మీరు చెప్పిన ప్రకారం మీ తాతగారి పేరు వుంది. యికనే అక్కడే నాలుగు తగిలించి బస్సులో నా పక్కనే కూర్చోపెట్టుకున్నాను.బస్సులో ఎవరికీ అనుమానం రానివ్వవద్దని ప్రాధేయ పడ్డాడు.ఫ్రెండ్సులా కబుర్లు చెప్పుకుంటూ టౌను చేరాం.ఆ రాత్రి టౌన్లో చింతామణి నాటకం ఈ వూరి ప్రముఖులంతా అక్కడే వున్నారు. ఆ నాటకమేం చూస్తారు ఈ నాటకం చూడమని కబురు చేసాను.సంగతి తెలిసి లబోదిబో మన్నారు. ఈ సంగతి నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని గోలపెట్టారు. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే మీ కంచం మీకు భద్రంగా అప్పగించమన్నారు.ఆ వస్తువు మీ యింట్లోనే దొరికినట్ట్లు అందరికి చెప్పమన్నారు. కేసులేకుండా శంకరాన్ని వదిలి పెట్టమని నా కాళ్లు పట్టుకున్నారు.ఇంటరెస్టింగుగా వింటున్న రాజారావుగారు కేశవరావు కళ్లలో చూసి యింకా? అన్నారు రాజారావుగారి కళ్లలోని కాంతికి యిన్స్పెక్టరు చలించినట్ట్లయింది. ఈ విషయం చెప్పకూడదుగాని నాకో అయిదు వేలిచ్చారు.మీ వస్తువు మీకు దొరికింది అది మీ యింట్లోనె దొరికినట్లు చెప్పాలి మాషారూ ప్లీజ్ నాకొసం మాటివ్వండి అంటూ బతిమాలుతున్న యిన్స్పెక్టరుతో అల్లాగే మావస్తువు మాకు దొరికింది మీరు నిశ్చింతగా వుండండి సార్! అంటూ లోపలికి వెళ్లి అయిదువందలు కేశవరావు చేతిలో పెట్టి నేను పేదవాడిని వేలు యివ్వలేను యీ సొమ్ము తీసుకుని మా సత్తెయ్యని రేపు పొద్దుటే విడిపించండి సార్ వాడిభార్య నిన్న ప్రసవించింది . వాడిని చూడటానికి నాకు ముఖం చెల్లదు. కెశవరావు ముఖం ఎర్రగా కందిపోయింది.మష్టారు నన్నింకా సిగ్గు పడేలా చేయకండి.మీ వద్డ డబ్బు తీసుకోవడం నావుద్యోగానికే కళంకం. వస్తానౌ మష్టారూ వస్తానమ్మా అంటూ బయటకు నడిచాడు. అప్పటికి తేరుకున్నకామేశ్వరమ్మ వెంటనే పెరట్లోకి వెల్ళ్లి కాళ్లు కడుక్కుని దేముడికి దండంపెట్టి లెంపలు వేసుకుని క్షమాపణ వేడు కుంది మధ్యాహ్నం నిన్నన్ని మాటలన్నాను పన్నెండు గంటలు కాకుండానే మా సొమ్ము నట్టింట్లో పెట్టించావు.నాది అఙ్నానం తండ్రీ!నన్ను క్షమించు! అంటు దండాలు పెట్టింది .యింతలో రాజారావుగారు వచ్చి చూసావా కాముడూ గట్టిగా దెబ్బలాడేసరికి పౌరుషం వచ్చి నిముషాలమీద దొంగని పట్టించేసాడు. ఇప్పటి కాలంలో తిట్టందే దేముడుకూడా పన్లు చెయ్యటం లేదు. చాల్లెండి కృష్ణుడు గీతలో చెప్పినట్లే చేశాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే /

దుష్ట శిక్షణ మాటెలా వున్నా శిష్ట రక్షణ మాత్రం చెయ్యలేదు .అమాయకుడు నేరం చేయని వాడు నిందపడి దెబ్బలు తిని జైలుకెళ్లాడు. నేను పడ్డ మానసిక సంక్షోభం వివరించలేను.ఒకరు మానవతా వాది యింకొకరు ఆస్తిక వాది యిరువురినీ మనసారా అశిర్వదించాడు భగవంతుడు. మర్నాడుదయం పదిగంటలయింది కమేశ్వరమ్మ వంట పూర్తయింది. కాముడూ! ఎవరొచ్చెరో చూడు అన్నారు రాజారావుగారు సంతోషంగా వచ్చినవాడు స్వంత తమ్ముడే అన్నట్లు.బయటికి వచ్చిన కమేశ్వరమ్మ సత్తెయ్యని చూడగానే సంతోషం దు:ఖం కలిగాయి .వాడు మాష్టారి కాళ్లు పట్టుకుని నాను దొంగని కాదు బాబూ గంజితాగీ నాకు యెండికంచవెందుకు బాబు,అమ్మగారూ మీరూ నన్నేదొంగననుకున్నారమ్మా? రాజారావుగారు వాడి భుజాలుపట్టుకుని లెవనెత్తి లేదురా నువ్వు దొంగవికావు నీది దొరబతుకు.మావల్లే పొరపాటుజరిగింది . కాముడూ వీడికి అన్నంపెట్టు ఒరేయ్ కాళ్లూ చేతులూ కడుక్కుని అన్నం తిను. అమ్మగారివాళ చింతకాయ పులుసు పెట్టిందితిను. వీది అరుగుమీద ఆకువేసి స్వయంగా అన్నం వడ్డించారు.వాడు అవురావురని అన్నం తింటుంటె యింటి కెల్లి నీ భార్యని కొడుకుని చూశావురా?అన్నారు నేదు బాబూ కొండంత నింద నెత్తినేసుకునిఎల్లానా? ఆల్లేటి సెప్పకుండ మాష్టారిడిపించీమన్నారని వొదిలీసినారుబాబూ మీ నోటితో నాను దొంగనికాను అన్న ముక్కింటెగాని యింటికెల్లబుధ్దికానేదుబాబూ. ఇంతకూ మీ కంచం దొరికిపోనాదా బబూ ఎవరికెన్ని గుండెలు బాబూ మీయింటిల దూరి కంచవట్టుకెల్లటానికి. ఆ మాటలు వింటూంటే కాళ్లకింద భూమి కంపించినట్లయింది దంపతులిద్దరికి. మా తెలివి తక్కువరా సత్తెయ్యా మా బట్టల బీరువాకింద దొరికింది ఏచెయ్యో తగిలి దొర్లిపోయి వుంటుంది .కనిపించలేదనగానే వూరంతా నిన్నే అనుమానించారు .ఇప్పటికీ నా వస్తువు పోయిన బాధకన్నా నిన్ను దొంగ అని నిందించి బాధించిన దానికే ఎక్కువ బాధపడుతున్నాను. చిన్నవాడివయినా నన్ను క్షమించరా సత్తెయ్యా. నా మనస్సాక్షే నన్ను నిలదీస్తోంది. అంత మాటనకండి బాబూ మీ లాటోల్లు భూమ్మీదుండబట్టి యింకా యీ పెపంచం యినాగయినా వున్నాది.

05 November, 2008

వ్యర్ధ త్యాగం

ఇరవైనలుగు గంటలయింది గాని రాజయ్య ఆలోచన తెగి ఓ కొలిక్కి రాలేదు.ముందు రోజు సాయంత్రం రేడియోలో ఆ వార్త విన్నప్పటినుంచి మనసు క్షీరసాగర మధనంలా అల్లకల్లోలంగా వుంది.తను కొడుక్కిచేసే వుపకారం యేమీలేదని బాధ తను వాళ్లకి మరింత భారంగా వున్నానే అనే బెంగ రెండూ అహర్నిశలు మనసుని దొలిచేస్తున్నాయి ఇదిగో యిలాంటి సమయంలో అమృత వాక్కులా రేడియోలో వినిపించాయి,హరిజన వాడ అగ్నిప్రమాదానికి గురై ఎన్నో కుటుంబాలు దగ్ధమైపోయాయి చనిపోయినవారి కుటుంబాలకు అయిదు వేల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.చెవిలో తిరిగి యివే మాటలు తిరిగి తిరిగి మోగుతున్నాయి. సమయానికి కొడుకు కుటుంబంతో సహా బావమరిది యింటికి వెళ్ళాడు. రెండు రోజులై తను ఒక్కడే యింటిలో వుంటున్నాడు.గుడిసెలో విలువయిన వస్తువుల్లేవు కుక్కిమంచం కుండ మండ తప్ప. తను పోయినా కొడుక్కి అయిదు వేలు తనవల్ల వస్తే ,ఓ చిన్న బడ్డీకొట్టుపెట్టుకుంటాడు, లేదా రిక్షాకొనుక్కుంటాడు. రాత్రి పదయింది చీకటితోపాటు ఆలోచనకూడా చిక్కపడింది.జనసంచారం తగ్గేవరకు కాచుకుని సీసాలో వున్న కొద్దిపాటి కిరసనాయిలు గుడిసె మీద కొంత తన మీద కొంత వంపుకున్నాడు.భగవంతడిని తలుచుకుని అగ్గి పుల్లగీశాడు.ఊరికి పెడగా వాడకి కొసగా వొంటిగా వున్న గుడిశలో సజీవ దహనమయిన రాజయ్య మాత్రం కొండంత ఆశ గుండెనిండా నింపుకుని మరీ దహనమయ్యాడు.
కబురు తెలిసి లబోదిబోమంటూ కొడుకు రంగడు భార్యా బిడ్డలతో వచ్చాడు నేలకూలిన గుడిశనీ మట్టిలో కలిసిన తండ్రినీ తల్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. చుట్టూ వున్న నలుగురూ ఒదార్చారు.ప్రభుత్వం సహాయం చేస్తుందనీ పోయిన తండ్రిని తేలేక పోయినా కాలిపోయిన గుడిశ మళ్ళీ కట్టుకుని పిల్లలకు గూడు ఏర్పాటు చేసుకోవచ్చనీ నచ్చ చెప్పేరు.ఏడుస్తున్న రంగడిని మునసబు చలమయ్య దగ్గరకు తీసుకుపోయారు.అతని దీనగాధ వెళ్ళబోశారు నెలరోజులు కాళ్ళరిగేలా తిరిగితే ఎలా అయితేనేం ప్రభుత్త్వసహాయం రంగడి చేతిలో పడింది. అయితే రెడియోలో చెప్పేవి అయిదు వేలయితే చేతులు మారుతూ రంగడి చేతిలో పడ్డవి అక్షరాలా అయిదు పదులు. నష్ట పరిహారం చేతిలో పట్టుకుని నిస్సహాయంగా నిలుచున్న కొడుకు కోసం రాజయ్య ఆత్మ ఘోషంచింది. ఏం లాభం? మూగ ఘోష వినేదెవరు?

04 November, 2008

వరలక్ష్మి--భాషా ప్రావీణ్యం

వరలక్ష్మిని ఏరికోరి పెళ్ళి చేసుకుని భాష తెలియని భోపాల్ తీసుకు వచ్చాడు కృష్ణారావు. వరలక్ష్మి కృష్ణలంకలో పుట్టి పెరిగింది హైస్కూలు చదువు పూర్తి చేసింది.బి హెచ్ ఇ ఎల్ లో వుద్యొగం చేస్తున్న కృష్ణారావు పెండ్లాడి భాష తెలియని వూరువచ్చేసింది,హిందీ మాట్లాడటంఏనాడు వినక పోవడంనుండి అక్కడికి వచ్చిన దగ్గరనుండి ప్రతి దానికి ఆశ్చర్యం భయం"కొద్ది రోజులు ప్రయత్నించావంటే తప్పకుండా నీకూ హిందీ మాట్లాడటం వచ్చేస్తుంది. తరుచూ హిందీవాళ్ళతో మసలుతూంటే సరి ఈ భయం జంకు పోతాయి.వూరికే కంగారు పడుతూ కూర్చుంటే లాభంలేదు వరం". భార్యకి ధైర్యం చెప్పాడు కృష్ణారావు.భర్త యింటిలో వున్నంతసేపు ఎంతో చలాకీగా తిరిగేది అతను డ్యూటీకి వెళ్ళగానే డల్ల్ గా తయారయ్యేది.అతను లేని సమయంలొ ఎవరైనా వస్తే ఎలా మాట్లాడాలి అన్నదే ఆమె చింత. వరలక్ష్మి స్వతహాగా మాటకారి, వాళ్ళవాళ్ళు కాసేపు వూరుకుంటావా? నీకేమైనా ఇచ్చుకుంటాంఅని బతిమాలినా వినకుండా వాగుతుండే వరలక్ష్మి ,యిక్కడికి వచ్చాక యించుమించు మూగదైపోయినట్లయింది.
స్వంత కాపరానికి వచ్చిన పదిహేను రోజులకేమో కృష్ణారావు ఫేమిలీ ఫ్రెండు గోయల్ ఫేమిలీతో వచ్చాడు.అతిధి మర్యాదలు చెయ్యడానికి తలకిందులవుతున్నాడు. కొత్త భార్య చేత బజ్జీలు చేయించాడు. వాళ్ళు వద్డంటున్నా కొసరి కొసరి ప్లేట్లో వడ్డించాడు.గొయల్"కాఫీ హై బస్ కరో"అనేసరికి వరలక్ష్మి కాఫీ కావాలంటున్నారనుకుని,తనకి వాళ్ళ మాటలు అర్ధమౌతున్నాయి అనితెలియాలని వుబలాటపడి చక్కగా స్ట్రాంగు కాఫీ చేసి పట్టుకొచ్చింది.ఒక గుక్కడు కాఫీ తాగి ఆముదం తాగినట్లు ముఖం పెట్టారు."అయ్యో! కాఫీ యెందుకు చేసావు వరం? వాళ్ళు తాగరు" కృష్ణారావు బాధపడుతూ."అదేమిటండీ విడ్డూరం వాళ్ళే కదా కాఫీ కాఫీ అంటే కాఫీ చెయ్యమన్నారనుకున్నాను"."పిచ్చిదానా కాఫీ అంటె చాలు యింక వద్దు అని"."మరి టీ అనడానికి ఏమంటారు?"సర్లె నీకు హిందీ నేర్పడం నా వల్ల కాదు".వీళ్ళిద్దరి సంభాషణతో గాభరా ఎత్తిపోయి అంత స్ట్రాంగు కాఫీ గటగట మూడు గుక్కల్లొ తాగేసారు. ఒక రోజు డ్యూటీలో కృష్ణారావుని పట్టుకుని సిన్హా బజకడిగేశాడు."మీ ఆవిడకి మంచి మర్యాదా తెలియదు.మేం వెళితే అసహ్యంగా తిడుతోంది. నువ్వు యింట్లో లేవు సరేలే కొత్త అని వూరుకుని వెంటనే వచ్చేసాము.ఇన్నాళ్ళ నీ స్నేహం మనసులో వుంచుకుని వూరుకున్నాను"ప్రవాహంలా సాగిపోతున్నాయి సిన్హా మాటలు. కృష్ణారావుకి మూర్ఛ వచ్చినంత పనయింది.ముందు రోజు డ్యూటీలో పని ఎక్కువగా వుండి యిల్లు చేరేసరికి రాత్రి పదయింది.ఇంటికి వెళ్ళగానే వరం చెప్పింది ఎవరో ఫేమిలీతో వచ్చేరని ఎంత రమ్మన్నా లోపలికి రాలేదని ఎందుకో చిరచిరలాడుతూ వెళిపోయారని.వాళ్ళు ఎవరా అనుకుంటే యిప్పుడు లింకు తెలిసింది వచ్చినది సిన్హా ఫేమిలీ అని."పోనీ ఏం తిట్టిందో చెప్పు భాయ్ నేను క్షమాపణ కోరుకుంటాను".బతిమాలాడు కృష్ణారావు. "మరోటీ మరోటీనా రండి రండి అని చాలా అసహ్యంగా తిట్టింది"అన్నాడు కృష్ణారావు పొట్ట చెక్కలయేటట్లు నవ్వడం మొదలుపెట్టాడు."నీ ముద్దుల భార్య మమ్మల్ని తిట్టి అవమానిస్తే నీకు అంత నవ్వుగా వుందా?"కినుకగా ప్రశ్నించాడు సిన్హా.రండి అన్న మాట తెలుగులో ఎంత మర్యాదయిన పిలుపో నచ్చ చెప్పేసరికి కృష్ణారావుకి తాతముత్తాతలు కనిపించారు.కృష్ణారావు పొరుగునే కపూర్ కుటుంబంవుంది వరలక్ష్మిని భోపాల్ తెచ్చిన వెంటనే వాళ్ళకి పరిచయం చేసి ఆమెకి హిందీ రాదని తను యింట్లో లేని సమయాల్లో ఏ అవసరమైనా సహాయం చెయ్యమనీ వాళ్ళ ముగ్గురు పిల్లలతో పాటు ఆమెనీ చూసుకోమని అప్పచెప్పెడు. వరలక్ష్మి వచ్చీరాని హిందీ మాటలు ముద్దుముదుగా పలుకుటూంటే వాళ్ళకి ఎంతో ముచ్చట.మాట అర్ధమయేలా చెప్పే తాపత్రయంలో మాట తొందరగా చెప్పలేక చేతులు తిప్పుతూ తన వుద్దేశాన్ని తెలియజేయటానికి ఆమె పడే అవస్థ చూస్తే సరదాగా వుండేది.అయినా ఏ విషయంలోను విమర్శించకుండా నెమ్మదిగా మాట్లాడించడానికి ప్రయత్నించేవారు. ఒక నెల గడిచింది వరలక్ష్మి హిందీ కాస్త మెరుగయింది.మాటల్లో కృష్ణారావు తోటకూర పులుసులో బెల్లం వేస్తే యిష్టమని చెప్పేడు. ఆరోజు తోటకూర పులుసు చెయ్యడానికి సిధ్దపడింది. తీరా డబ్బాలో చూస్తె బెల్లం లేదు పోనీ కపూర్ వాళ్ళింటినుంచి తెస్తే మళ్ళీ యిచ్చెయ్యొచ్చు యిప్పటికి పనైపోతుంది భర్తకి నచ్చిన విధంగా వండి అతని మెప్పు పొందుదామని ఆశపడింది.బెల్లాన్ని హిందీలో ఏమంటారో గుర్తు రాలేదుసరేలే ఎలాగో ఒకలా తెలియజెప్పి పనిజరిగేలా చూద్దామని వెళ్ళింది "భాభీ బెదరఖ్ దేనా"అంది గాభరా పడ్డారు యింటిల్లిపాదీ వరలక్ష్మి ఏమంటోందో వాళ్ళకర్ధం కాలేదు ఎన్నిసార్లడిగినా అదే మాట.ఇంతలో వరలక్ష్మికో వుపాయం తట్టింది.కూరలబుట్టలోంచి అల్లం ముక్క తీసి ఏ అదరఖ్ హైనా? అవునన్నారుఅలా అయితే బెదరఖ్ ఎందుకు తెలియడు అంది.ఆమెకేం కావాలో తెలుసుకోలేక అయోమయంలో వుంటే వరలక్ష్మికి మరో అయిడియా వచ్చింది.పంచదారలా తియ్యగా వుంటుంది చాక్లెట్ కలర్ లాగా వుంటుంది ముక్కలాగ వుంటుంది అంటూ వివరించింది .పది నిముషాలు అవస్థ పడితే కపూర్ భార్య మీనా బెల్లం ముక్క చూపించి యిదేనా అనడిగే సరికి ఎవరెస్ట్ ఎక్కినంత గర్వంగా ఫీలయింది. సాయంత్రం కృష్ణారావు డ్యూటీ నుంచి వచ్చాక కపూర్ కుటుంబ సభ్యులంతా వరలక్ష్మి సాహసోపేతమైన యీ సంఘటన చెప్పి నవ్వుకున్నారు కృష్ణారావు సందేహంగా "బెల్లాన్ని బెదరఖ్ అంటారని నీకెవరు చెప్పారు?"అడిగాడు." నాకేం తెలుసు? అల్లం బెల్లం అనటంలే మనం అలాగే వీళ్ళు అదరఖ్ బెదరఖ్ అంటారనుకున్నాను".నవ్వడానికి కూడా ఓపిక మిగల్లేదు కృష్ణారావుకి.వరలక్ష్మి వచ్చి ఆరు నెలలు గడిచాయి.హిందీ చక్కగా మాట్లాడటం నేర్చుకుంది.కాని భార్య హిందీ పాండిత్యం మీద కృష్ణారావుకింకా పూర్తి నమ్మకం కలగలేదు.ఒక రోజు సాయంత్రంవేళ కపూర్ యింటికి యిద్దరు పఠాన్లు వచ్చారు. అంతకు ముందురోజు కపూర్ తన తల్లికి సీరియస్ గా వుందని ఢిల్లీ వెళ్ళేడు.వచ్చిన పఠాన్లు మీనాతో గట్టిగా వాదిస్తున్నారు సంగతేమిటోనని వెళ్ళింది వరలక్ష్మి.చాల అత్యవసర పరిస్తితిలో వాళ్ళ వద్ద వెయ్యిరూపాయిలు అప్పు చేశారని కపూర్ వూళ్ళో లేని విషయం తెలుసుకుని తనని బెదిరించాలని వాళ్ళు వచ్చారని కన్నీళ్ళతో వరలక్ష్మికి చెప్పింది. అవసరం పడి అప్పు చేసినంత మాత్రాన యింటి యజమాని వూళ్ళో లేని సమయంలో కుటుంబాన్ని రచ్చకీడ్చడం ఏం మర్యాదని దుమ్మెత్తి పొసింది.మీ భార్యా బిడ్డల్ని దూరా భారాన వుంచి డబ్బే సర్వస్వం అని యిక్కడ స్త్రీలనిలా దుఃఖపెట్టి వ్యాపారం చేస్తె మీ కుటుంబాలకి శ్రేయస్సేనా అంటూ ప్రశ్నించింది.మర్యాదగా వినకుంటె పొలీసుల్ని పిలిచి న్యూసెన్సు కేసు పెడతానంది వచ్చిన పఠాన్లిద్దరూ మాట్లాడకుండా వెనుతిరిగి వెళిపోయేరు,సంగతేమిటో తెలుసుకుందామని వచ్చిన కృష్ణారావు భార్య అనర్గళంగా హిందీలో వుపన్యసిస్తూ పెద్ద పులుల్లాటి పఠాన్లని బెదిరించడం చూసి తబ్బిబ్బయిపోయాడు.ఇంతలో కపూర్ భార్య వున్నట్లుండి విరుచుకు పడిపోయింది, ఆమె అయిదు నెలల గర్భిణి దాంతో వరలక్ష్మి హడావిడిగా ఆటో తెప్పించి భర్త సహాయంతో హాస్పిటల్ తీసుకెళ్ళింది ఆమెని పరీక్షించిన డాక్టరు విసుగ్గా నలుగురేసి పిల్లలయితే యిలా తెలివి తప్పకేమవుతుంది డాక్టర్ల సలహా పాటించక ప్రాణాలమీదకు తెచ్చుకుని మా ప్రాణాలు తియ్యడంఏం బాగుందని కామా ఫుల్ స్టాపు లేకుండా తిడుతోంది. మానసికమయిన బెంగవల్ల యిలా జరిగిందని వరలక్ష్మికి తెలుసు అయినా నచ్చచెప్పే మూడ్ లో లేదు. డాక్టర్ మీరు చాలా శాంతంగా ఓర్పుగా పేషెంట్లనిచూస్తారని తెలిసింది.అయినా రోజూ వందల కొద్ది పేషెంట్లొస్తే మీరు మాత్రం విసుక్కోరా? నయం మీరు కాబట్టి ఈ పాటేనా శాంతంగా వున్నారు, యింకో డాక్టరయితేనా? అప్పటికే సగం అయిసయిపోయింది.మీనాని పరీక్షించి మందులు రాస్తోంది. వరలక్ష్మి ఒడుపుగా యోగక్షేమాలు విచారిస్తూ మీ యింట్లో మీరు ఎన్నో వారు డాక్టర్? నాకు కొద్దిగా ఆస్ట్రాలజీ వచ్చు మీ తెలివి తేటలు చూస్తుంటె మీరు అయిదో లేక ఆరో వారో పూర్తిగా బుట్టలో పడిపోయింది డాక్టరు. నువ్వు చాలా కరెక్ట్ నేను ఆరోదాన్ని చాలా వుత్సాహంగా జవాబిచ్చింది. చూశారా మీ తలి తండ్రులు డాక్టర్ల సలహా పాటించి వుంటే మాకింత మంచి డాక్టరు లభ్యమయేదెట్లా? హిందీలో నవరస భరితంగా వినిపిస్తున్న సంభాషణ విని "ఔరా! ముందొచ్చిన చెవులకన్నా వెనుకొచ్చిన కొమ్ములు వాడిలా వుంది ,వరం! హేట్సాఫ్ నీ సంభాష్ణా చాతుర్యానికి". మనసులోనే భార్యని అభినందించేస్తున్నాడు కృష్ణారావు.
.

ఓ జానకి కధ

"అబ్బబ్బా! కాస్త రేడియో కట్టవే చిన్నీ!మాట తోచదు సముద్ర ఘోషే దిక్కుమాలిన కామెంట్రీ" వంటింట్లోంచి జానకి విసుగ్గా. చిన్నికింకా విసుగ్గా వుంది స్కోరు చెప్పే సమయానికే అమ్మ యేదో వొకటంటుంది. విసురుగా ట్రాన్సిస్టరు తీసుకుని పెరట్లో జామిచెట్టు క్రింద కూర్చుంది. భర్త కోసం కాఫీ పట్టుకెళ్ళి టేబిలు మీద పెట్టి "ఏమండి!" అంది జానకి వుపోద్ఘాతంగా."ఏమిటి?" చికాగ్గా ముఖంపెట్టాడు శ్రీనివాసరవు.ఇంతలోనే క్రికెట్ కామెంటరీలో కొంపలంటుకు పోతున్నట్లు కోలాహలం."చిన్నీ1 ట్రాన్సిస్టరెందుకు పట్టుకుపోయావ్?యిలాతే",జానకి వైపు తిరిగి కోపంగా "యెప్పుడూ న్యూసు వినేవేళ కామెంటరీ వినేవేళ కట్టుకున్న మొగుడు ఎక్కడికి పొతాడోనన్నట్లు ఏమండీ! ! ఏమండీ! యెన్ని సార్లు చెప్పినా బుర్రకెక్కదు మరెప్పుడూ టైముదొరకనట్లు మంచి స్కోరు డిక్లేరు చేసే వేళకితయారు.
ప్రవాహంలా శ్రీనివాసరవు దండకం సాగుతూనే వుంది. ,నోట్లో మాటలు నోట్లోనే కుక్కుకుని వంటింట్లోకి వెళ్ళింది జానకి వుదాసీనంగా.
ఛ! ఛ! ఎన్నిసార్లు యిటువంటి అవమానాలు పొందినా నాకే బుధ్దిలేదు.మనసులోనే తిట్టుకుంది.పెళ్ళై రెండు దశాబ్దాలయినా అతనితో యేవిషయంచర్చించి అవగాహన చేసుకునే అవకాశమే యివ్వటంలేదు.అయితే నిర్లక్ష్యంగా వూరుకునే విషయం కాదే! ముందురోజు జగన్నాధం మావయ్య కమల కోసం సంబధం గురించి చెప్పిన దగ్గరనుండి మనసాగటం లేదు,పిల్లాడు ఇంజనీరుట.అతని తలి తండ్రులు తెలిసిన వాళ్ళింటికి ఈవూరే వచ్చారుట .ఈ రోజు శలవే కదా యిద్దరం వెళ్ళి చెప్తే యెంత బాగుంటుంది! ఏమో! పిల్ల అదృష్టం బాగుంటే ఈ సంబధం ఖయం కావచ్చు. అయినా అరటి బోదల్లే పిల్ల కళ్ళముందు తిరుగుతూంటే సంబంధం చూసి పెళ్ళిచెయ్యాలనే ధ్యాస లేకుంటే యెలా? పొనీ పిల్లల అవసరాలు పట్టించుకోరా అంటే అదీలేదు.కమల ఫాబ్రిక్ పైంటింగు సెట్టు కావాలంటే మర్నాటికల్లా రెడీ! బాబు ఒక్కసారి చెప్పాడు తనకి క్రికెట్ సెట్టు కావాలని పూర్తి సెట్టు వాడిముందు పెట్టారు ఇక చిన్ని కోరితే కొండ మీది కొతి దిగి వచ్చేస్తుంది వాళ్ళ నాన్న వెనుకనే నడుచుకుని మరీను. ఎటుకీ పొందని దాన్ని నే నే!
నాది అన్న అభిప్రాయం వెలి బుచ్చనివ్వరు.కానీ నాకేనా నష్టం? అతనికి మాత్రం పిల్ల పెళ్ళి బాధ్యత లేదూ? ఆలోచనా తరంగాలలోజానకి మనసు వూగుతోంది.మౌనంగా అందరి అవసరాలు చూడసాగింది. రున్నింగ్ కామెంటరీ వింటూనే భోజనాలు పూర్తయ్యాయి.
సాయంత్రం అయిదవగానే బాబు ఆటకి వెళ్ళాడు చిన్ని కధలపుస్తకం పట్టుకుంది.కమలకి కాలేజీ పుస్తకాలే ప్రపంచం.శ్రీనివాసరావు గబగబ తయారయి "జానకీ! నా ఫ్రెండు ఒకతను హాస్పిటల్లో వున్నాడు చూసి రావాలి" జవాబు కోసం చూడకుండానే గుమ్మం దాటాడు. జానకికి కోపం బాగానే వచ్చింది.కానీ జగన్నాధం మావయ్య మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి.
"పిల్లడి గుణం బంగారం అనుకో వెనుక బాధ్యతలెమీలేవు చక్కని వుద్యోగం.ఇటువంటి సంబధం వదులుకోకు జానకీ! వూరుకుంటే లాభంలేదు" నుదురు కొట్టుకుంది వూరుకోక వురిపెట్టుకోనా? ఈయనకేమో బొత్తిగా ఇల్లు పట్టదు. భార్యా భర్తలు మాట్లాడుకొడానికి అపాయింటుమెంటు తీసుకోవాలో ఏమో ఖర్మ! ఇంతకూ దాని నొసట భగవంతుడెలా రాసి పెడితే అలా జరుగుతుంది. నేను కంగారు పడి ప్రయోజనం లేదు"వేదాంత ధోరణిలో స్వగతం పలికింది కర్మభూమిలో పుట్టిన జానకి.

రాత్రి తొమ్మిదింటికి వచ్చిన భర్తను పలుకరించ లేదు.భోజనాల సమయంలో పిల్లాల కబుర్లతో హడావిడే. "నాన్నా ఈసారి ఇండియాకి హోప్ లేదు కదా? డ్రా అయితే అదే గొప్ప" బాబు వ్యాఖ్య. మన వాళ్ళకి ఒకసారి గెలిస్తే మరి పట్టపగ్గాలుండవు. టీమంతటిలో యెవరో ఒకరు లాగకపోరులే యింకా రేపంతా వుంది శ్రీవారి ఆశావాదం. భోజనాల టైమంతా క్రికెట్ భాషే ,అన్నం మీద యెవరికీ ధ్యాసే లేదు.సాంబారన్నంలో నెయ్యే వేసుకుంటున్నారో నూనే వేసుకుంటున్నారో తెలియటంలేదు. ఆప్రకరణం ముగిసింది,పని ముగించుకుని పక్కమీదకు చేరేసరికి శ్రీవారు గదిలో పచార్లు చేస్తున్నారు. ఆశ్చర్య పోయింది జానకి సావకాశంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తూండటంతో మాట్లాడకుండా వెళ్ళి మంచం మీద పడుక్కుంది. సాయంత్రం నుంచి భార్య తనతో మాట్లాడలేదన్నవిషయం అప్పుడే గుర్తించినట్లు మంచం మీద సావకాసంగా కూర్చుంటూ "అన్నట్లు జానకీ వుదయం యేదో చెప్పబోయేవు యేమిటి సంగతి?" పీకదాకా కోపం వచ్చింది అడిగేరు కదా అని యేకరువు పెడితే అలుసయిపోతావ్! మనసు హెచ్చరించింది. ముఖంలోకి నవ్వు తెచ్చుకుని" అబ్బే ముఖ్యమైనదేం కాదు స్కోరెంత?"అని అడుగుదామని. "నిజం"! ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు.'అసలు అందరికీ యింతో అంతో క్రీడారంగంలో యింట్రస్టు వుండాలి. ఎన్నాళ్ళకి శ్రీనివాసరావు భార్యననిపించావు. గుడ్! అలా వుండాలి! సంతోషం పట్టలేక వెన్ను తట్టి మరీ ప్రోత్సహించాడు. అవును అలాగే వుండి పై వాడి లీల యెలా వుందో చూడాలి.జానకి మనసు మూల్గింది.


 కట్నాల వ్యధ


కన్య రూప గుణ విశేషాలు
విద్యా వినయ సంపదలు
ఇవేవీ కావు వివాహార్హతలు
వరకట్నాల బేరసారాలతో
పడుతున్నాయి పీటముడులు
ఎందరో ప్రమదలు అవుతున్నారు
వరకట్న మారణ హోమానికి సమిధలు
తమలపాకులతో అలరించే మురిపాలు
తందూరీ పొయ్యలపాలు
ఇకనైనా ఆపండి కట్నాల కోసం వధలు