05 November, 2008

వ్యర్ధ త్యాగం

ఇరవైనలుగు గంటలయింది గాని రాజయ్య ఆలోచన తెగి ఓ కొలిక్కి రాలేదు.ముందు రోజు సాయంత్రం రేడియోలో ఆ వార్త విన్నప్పటినుంచి మనసు క్షీరసాగర మధనంలా అల్లకల్లోలంగా వుంది.తను కొడుక్కిచేసే వుపకారం యేమీలేదని బాధ తను వాళ్లకి మరింత భారంగా వున్నానే అనే బెంగ రెండూ అహర్నిశలు మనసుని దొలిచేస్తున్నాయి ఇదిగో యిలాంటి సమయంలో అమృత వాక్కులా రేడియోలో వినిపించాయి,హరిజన వాడ అగ్నిప్రమాదానికి గురై ఎన్నో కుటుంబాలు దగ్ధమైపోయాయి చనిపోయినవారి కుటుంబాలకు అయిదు వేల చొప్పున నష్ట పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి తెలిపారు.చెవిలో తిరిగి యివే మాటలు తిరిగి తిరిగి మోగుతున్నాయి. సమయానికి కొడుకు కుటుంబంతో సహా బావమరిది యింటికి వెళ్ళాడు. రెండు రోజులై తను ఒక్కడే యింటిలో వుంటున్నాడు.గుడిసెలో విలువయిన వస్తువుల్లేవు కుక్కిమంచం కుండ మండ తప్ప. తను పోయినా కొడుక్కి అయిదు వేలు తనవల్ల వస్తే ,ఓ చిన్న బడ్డీకొట్టుపెట్టుకుంటాడు, లేదా రిక్షాకొనుక్కుంటాడు. రాత్రి పదయింది చీకటితోపాటు ఆలోచనకూడా చిక్కపడింది.జనసంచారం తగ్గేవరకు కాచుకుని సీసాలో వున్న కొద్దిపాటి కిరసనాయిలు గుడిసె మీద కొంత తన మీద కొంత వంపుకున్నాడు.భగవంతడిని తలుచుకుని అగ్గి పుల్లగీశాడు.ఊరికి పెడగా వాడకి కొసగా వొంటిగా వున్న గుడిశలో సజీవ దహనమయిన రాజయ్య మాత్రం కొండంత ఆశ గుండెనిండా నింపుకుని మరీ దహనమయ్యాడు.
కబురు తెలిసి లబోదిబోమంటూ కొడుకు రంగడు భార్యా బిడ్డలతో వచ్చాడు నేలకూలిన గుడిశనీ మట్టిలో కలిసిన తండ్రినీ తల్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించాడు. చుట్టూ వున్న నలుగురూ ఒదార్చారు.ప్రభుత్వం సహాయం చేస్తుందనీ పోయిన తండ్రిని తేలేక పోయినా కాలిపోయిన గుడిశ మళ్ళీ కట్టుకుని పిల్లలకు గూడు ఏర్పాటు చేసుకోవచ్చనీ నచ్చ చెప్పేరు.ఏడుస్తున్న రంగడిని మునసబు చలమయ్య దగ్గరకు తీసుకుపోయారు.అతని దీనగాధ వెళ్ళబోశారు నెలరోజులు కాళ్ళరిగేలా తిరిగితే ఎలా అయితేనేం ప్రభుత్త్వసహాయం రంగడి చేతిలో పడింది. అయితే రెడియోలో చెప్పేవి అయిదు వేలయితే చేతులు మారుతూ రంగడి చేతిలో పడ్డవి అక్షరాలా అయిదు పదులు. నష్ట పరిహారం చేతిలో పట్టుకుని నిస్సహాయంగా నిలుచున్న కొడుకు కోసం రాజయ్య ఆత్మ ఘోషంచింది. ఏం లాభం? మూగ ఘోష వినేదెవరు?

No comments: