04 September, 2013

మరపు రాని సంఘటన

  మా నాన్నగారి వుద్యోగమంతా పల్లెటూర్లలోనే గదిచింది.బదిలీ అయినా ఒక పల్లె నుంచి మరో పల్లెకు వెళ్ళేవాళ్ళం,అలా నా చిన్నతనమంతా పల్లెటూర్లలోనే గడిచింది.ఒక పల్లెలో జరిగిన సంఘటన యిప్పటికీ నాకు అర్ధం కాక తికమకగానే వుంటుంది.

     నాకు పన్నెండు సంవత్సరాలు.మేమున్న ప్రాంతంలో ఏవో సంబరాలు జరుగుతూండేవి.ఏ సంబరమైనా డప్పుల మోత వినపడేది.అలా డప్పులమోత వినగానే వీధిలోకి పరుగెత్తి అరుగు మీద కూర్చునేదాన్ని.ఆ సందడంతా మా యింటి ముందునుంచి దాటాక యింట్లోకి వెళ్ళేదాన్ని.

     అలాగే ఒక రోజు డప్పుల మోత వినపడగానే వీధిలోకి పరుగెత్తాను.మా అమ్మ కేకవేస్తూ"వీధిలోకేమొచ్చినా పరుగెడతావు,నేను పనిలో వున్నాను వీధి తలుపు వేస్తాను, ఆ సందడయ్యాక తలుపు కొట్టు తీస్తాను అన్నయ్య పడుక్కున్నాడు" అంది.సరేనని వీధరుగు మీద కూర్చున్నాను.

     డప్పులమోత దగ్గరయింది.డప్పుల వాయిద్యగాళ్ళ వెనుక కొంతమది పిల్లలు పెద్దలు లయకి తగినట్లు నాట్యం చేస్తున్నారు.ఆ వెనుక ఒక స్త్రీ తడిబట్టలతో ఒంటినిండా పసుపు రాసుకుని నుదుట పెద్ద కుంకుమ బొట్టుతో తల మీద పూలతో అలంకరించిన బిందె(అమ్మవారికి  ఘటంతో మొక్కు తీర్చుకోవడం) బిందెపైన వెలుగుతున్న దీపం,కళ్ళు తెరవకుండా చేతులతో బిందె పట్టుకోకుండా నడుస్తున్నాది. ఆమె నడిచినంతమేరా పసుపునీళ్ళలో ముంచిన చీరలు  తోవంతా పరుస్తూన్నారు.వాటిపైన ఆమె నడుస్తున్నాది.ఆమె రెండు వైపులా ఒకరు ధూపం వేస్తూంటే ఒకరు వేపమండలతో విసురుతున్నారు.వెనుక యిద్దరు ఘటం పొరపాటుగానైనా ఘటం కింద పడకుండా చేతులు ఆసరా చూపిస్తూ నడుస్తున్నారు.అక్కద వాళ్ళు గ్రామ దేవతకి మొక్కు తీర్చుకునే ఒక ఆచారం.

    అవన్నీ వింతగా చూస్తున్నాను.మా యింటిముందుకి వచ్చి ఘటం పట్టుకున్నామె ముందుకు అడుగు వెయ్యకుండా నిల్చుండిపోయింది.ధూపం మరికొంత వేసి వేపమండలతో విసురుతూ "అడుగెయ్యి తల్లీ! ఏం కావాలమ్మా?సెప్పు తల్లీ లోపముంటే దిద్దుకుంటామమ్మా!"తలో విధంగా ప్రాధేయ పడుతున్నారు. ఆ స్త్రీ అంగుళం కూడా కదల్లేదు సరికదా 'వూ వూ---అంటు వూగిపోతోంది.చుట్టూ వున్న వాళ్ళు ఒకరి తరువాత ఒకరు ఆమె కాళ్ళకి దండాలు పెడుతున్నారు.

    "ఈ యింటి వాళ్ళని బయటికి పిలవండి.నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి గుమ్మం ముందునుంచి వెళ్తూంటే తలుపులేసుకుంటుందా?పిలవండి"వూగిపోతూనే చెప్పింది.

    నాకు కాళ్ళలోంచి ఒణుకు వచ్చింది.ఒక పెద్దతను వచ్చి అమ్మా అమ్మగారిని పిలువమ్మా నేకుంటే ఘటం కదల్దు."అనగానే తలుపు దబ దబా బదేను.అమ్మ విసుగ్గా  తలుపు తీసి ఏమాట అనేలోపున పెద్దతను వచ్చి "అమ్మగారూ ఒక  పాలి అమ్మోరి ఘటం ఎత్తుకున్న మడిసితో మాటాడండమ్మా."

       అమ్మ ఆశ్చర్యంగా వెళ్ళి ఏం కావాలి తల్లీ? మావల్ల ఏం అపరాధం జరిగింది?" అమ్మకి యిటువంటివి పరిచయం వున్నట్ట్లుంది.

    ఘటం ఎత్తుకున్నామె "అపరాధమంటావేం? నీకొడుకు ఒంటి మీద వచ్చి పదిహేను రోజులు నీ యింట వున్నాను. నాలుగు రోజుల కిందట నాకు నైవేద్యాలు పెట్టి, నీ గుమ్మం ముందునుంచి వెళ్తుంటే వసంతం నీళ్ళతో కాళ్ళు కడిగి పిల్లడిచేత దండం పెట్టించడం ఫోయి తలుపులేసుకుంటావా హూం?" హుంకరించింది.

    అమ్మ వెంటనే కాళ్ళకి దండం పెట్టి "క్షమించు తల్లీ తప్పైపోయింది క్షణంలో వస్తాను"అంటు లోపలికెళ్ళి పెద్ద చెంబుతో వసంతం ఒక గ్లాసు పానకం పసుపు కుంకుమలతో పాటు అన్నయ్యను కూడా తీసుకొచ్చింది. అన్నయ్యచేత వసంతం నీళ్ళతో ఆమె కాళ్ళు కడిగించి దండం పెట్టించింది.పానకం గ్లాసు అందించి అమ్మ నమస్కారం చేసి నాచేత నమస్కారం చేయించింది పసుపు కుంకుమలు సమర్పించి లెంపలు వేసుకుంది.ఘటం పట్టుకున్నామె మా ముగ్గురి తలల మీద ఒకరి తరువాత ఒకరికి చేయివేసి "చల్లగా వుండండి"అంటూ ఆశీర్వదించింది.

   యిప్పటికీ ఆ సంఘటన తల్చుకుంటే ఆశ్చర్యంగా వుంటుంది. నిత్యం యాసతో మాట్లాడే ఆమె ఆసమయంలో అంత స్వచ్చంగా ఎలా మాట్లాడింది? మా యింట్లో మా అన్నయ్యకి ఆటలమ్మ వచ్చిన తగ్గినట్ట్లు ఆమెకెలా తెలిసింది?యివన్నీ సందేహాలే.పెళ్ళయ్యాక పల్లెలు వదిలి పట్నానికి వచ్చినా అనాటి సంఘటన యిప్పటికీ ప్రశ్నార్ధకమే!

09 August, 2013

తొలి శ్రావణ మాసం

శ్రావణ మేఘాలలొ కనిపించె నీరూపు
చిరు చినుకుల సవ్వడిలో వినిపించె నీ పిలుపు......శ్రావణ

మబ్బు చివర మెరుపులో మొలక నవ్వుల సొంపు
పిల్లగాలి తెమ్మెరలో నీ చెక్కిలి తలపింపు......శ్రావన

నీ గజ్జెల మ్రోతలే నా గుండెల కదిలించి
నీ గాజుల గలగలలే గిలిగింతలు కదిలించి
పూల పరిమళాలు తలచి
నీ నడకల హొయలు తలచి ......శ్రావణ

అలుక లోని పెదవి విరుపు
కనుల కొసల కసరు విసురు
నీ వాల్జడ ఊపులోన
నా హృదయమె డోలలూగె ......శ్రావణ


వాన ధారలోన తడిసి
నీ తలపులె తలచి తలచి
నా మనసే పరుగు తీసె వాన నీటి పాయ లోనే
ఎంత మధురమో యీ తొలి శ్రావణ మాసమ్ము ......శ్రావణ

04 August, 2013

తప్పొప్పులు బాంధవ్యాలు

జీవితంలో ఆటుపోటులుంటాయి  గాని తన జీవితాన్ని తరిచి చూసుకుంటే అర్ధం  మారిపోతుందనిపిస్తుంది.  కొడుకు సుధీర్ జైలునుంచి మర్నాడు విడుదలవుతాడన్న కబురు తెలియగానే పాత జ్ఞాపకాలలోకి అసంకల్పితంగా వెళ్ళాడు సుబ్బారావు.
 సుధీర్  జైలుకెళ్ళాడన్నది స్నేహితులకి బంధువులకి అందరికీ తెలుసు,ముఖం ముందు ఏమీ అనరు వెనుదిరగగానే వాడి గురించే మాట్లాడుకుంటారు.లోకరీతి ఏం చెయ్యగలం? మొదట్లో ఆత్మహత్యా సదృశంగా వుండేది.భార్యని ఓదార్చడానికి,  తన ధైర్యం కూడదీసుకుని రోజులు వెళ్ళదియ్యడానికి అలవాటు పడ్డాను.బిడ్డల్ని కనగలం గాని వాళ్ళ అదృష్టాలని కనలేం.
సుధీర్ తొమ్మిదో క్లాసు వరకు బాగానే చదువుకునేవాడు.పధ్నాలుగో ఏట సుడి చుట్టుకుంది.చెడు స్నేహాలు చేసి ఎప్పుడూ జేబు ఖర్చుల కోసం వాళ్ళమ్మని పీడించేవాడు.నా దృష్టిలో పడకుండా ఆర్నెలలు గడుపుకొచ్చింది అనసూయ.ఆ పైన ఆమె వల్లకాలేదు. తనకి తెలియగానే చెడామడా తిట్టి మళ్ళీ యిటువంటివి సంభవిస్తే యింట్లోంచి బయిటికి నెట్టేస్తానని గట్టిగా మందలించాను.
తరువాత  యింట్లో చిన్న చితక వస్తువులు మాయమవడం గమనించి,మరోసారి గట్టిగా మందలించాను.అంతే!చెయ్యిదాటిపోయాడు. స్నేహితులతో కలిసి రాత్రివేళ వంటరిగా వచ్చేవారిని బెదిరించి పర్సులు వుంగరాలు వాచీలు సంగ్రహించి వాటిని అమ్ముకుని అవసరాలు తీర్చుకునేవాడు. నెత్తీ నోరూ బాదుకుని ప్రయోజనం లేకపోయింది.
ఒక రోజు పోలీసులు వచ్చి "మీ అబ్బాయిని అరెస్టు చేశాం స్టేషనుకి రండి" అనగానే కరచరణాలు ఆడలేదు.యిటువంటివి జీవితంలో వినలేదు కనలేదు.అనసూయకి చెప్పకుండా స్టేషనుకి బయలుదేరాను.అప్పుడు కూడా సుధీర్ ఏమీ జరగనంత నిబ్బరంగా వున్నాడు.
పోలీసుల వివరాలని బట్టి నలుగురు స్నేహితులు ఒక వ్యక్తిని అడ్డుకుని అతని వస్తువులు తీసుకోబోతుంటే తిరస్కరించాడుట. అందులో ఒకడికి కోపం వచ్చి "ఒక్కటిచ్చుకోరా ఏమిటి వీడి పొగరు" అనగానే ఎక్కడలేని ఆవేశం వచ్చి చేతిలోని హాకీ స్టిక్కుతో అతని తల మీద కొట్టాడుట.అదే సమయంలో చెట్టు చాటునుంచి ఒక వ్యక్తి మొబైల్ ఫోనుతో మొత్తం వీడియో షూట్ చేశాడుట.ఆ వ్యక్తి కింద పడగానే వీళ్ళంతా ఎగబడి అతని వస్తువలన్నీ ఒల్చుకు పోయారుట.
వీడియో తీసిన వ్యక్తి వెంటనే పోలీసులకి ఫోను చెసి జరిగినదంతా వీడియోలో చూపాడుట.అన్నిటికన్నా ఘోరం దెబ్బ తిన్న వ్యక్తి పోలీసులు వచ్చేసరికి చనిపోయాడు.నేరం అందరిదీ అయినా కొడుతున్నట్ట్లున్న ఫొటో సాక్ష్యాధారాలు సుధీర్ నేరాన్ని బలపరిచాయి. ముగ్గురికి మూడేళ్ళ జైలు శిక్ష సుధీర్ కి పధ్నాలుగేళ్ళ జైలు శిక్ష పడింది.నాకు నడుం విరిగినట్టయింది.కారణమేదయినా తప్పు జరిగిపోయింది శిక్షపడింది.సామాన్య కుటుంబీకుడికి యిది గొడ్డలి పెట్టే.
చివరగా సుధీర్ ని కలుసుకుందికి వెళ్ళినప్పుడు అనసూయ "నువ్వు నా కడుపున పుట్టలేదనుకుంటాను.పుట్టినా పురిటిలో పోయావనుకుంటాను.నువ్వు మా యింటిలో పెరిగిన రోజులన్నీ పీడ కలగా మర్చిపోతాను.నీలాటి కొడుకుకి తల్లినని చెప్పుకునేకన్నా గొడ్రాలినని చెప్పుకోవడానికి ఏమీ బాధ పడను"అంది.కళ్ళనీళ్ళతో.
అనసూయ భుజం చుట్టూ చేయి వేసి బయటికి తీసుకు వచ్చాను.ఆ తరువాత చూడటానికి వెళ్ళలేదు.ఇప్పుడీ వార్త గాయాన్ని కెలికి బాధని తాజా చేసింది.
సుధీర్ జైలుకెళ్ళిన ఆరు నెలలకేమో,విజయవాడ నుంచి హైదరాబాదు వెళ్తున్నాను.నేను కూర్చున్న చోటుకి కాస్త దూరంలో ఏదో గొడవ వినిపించి లేచి వెళ్ళి చూశాను.ఎనిమిదేళ్ళ పిల్లాడు మురికోడుతున్న బట్టలు తైల సంస్కారం లేని జుత్తు,బెక్కుతూ ఏడుస్తున్నాడు.వాడి లేత బుగ్గ మీద నాలుగు వేళ్ళ అచ్చులు పడి  ఎర్రగా కందిపోయింది. ఏమయిందని అడిగాను. ఒకాయన రొప్పుతూ "డర్టీ రోగ్ అడుక్కుందికి వచ్చి కాలి మీద కొట్టి మరీ అడుక్కుంటున్నాడు.ఒళ్ళు మండి ఒక్కటిచ్చుకున్నాను.అసలిటువంటివాళ్ళని పబ్లిక్ ప్లేసుల్లో ఎందుకడుక్కోనిస్తారో అర్ధం కాదు."యిసుమంతైనా జంకు లేకుందా అన్నాడు.పబ్లిగ్గా అడుక్కోకపోతే ప్రైవేటుగా వీళ్ళనెవరు పోషిస్తారు? నవ్వొచ్చినా ఆ పిల్లాడిమీద జాలి వేసి వాడి చెయ్యి పట్టుకుని నా సీటు వద్దకి తెచ్చాను.అందరూ నా చర్యని వింతగా చూస్తున్నారు.నేనేం చేస్తానో తెలియక బిక్క మొహం పెట్టాడా పసివాడు.
నీళ్ళ బాటిలు యిచ్చి తాగమన్నాను.పక్కన కూర్చోపెట్టుకుని,"నీ పేరేమిటి?" అడిగాను.
"భిక్కూ"
అదేం పేరురా?"
"ఎమో!" "అమ్మా నాన్న వున్నారా?"
"లేరు నన్ను పెంచిన అమ్మని మూడు రోజుల కిందట యీ రైల్లో కొట్టి దింపీసేరు.నేను పెట్టి కొసలో వున్నాను.నాకు తెలియదు.మా సిన్ని గాడు సెపితే తెలిసింది.
"మరిప్పుడేం చేస్తున్నావు?"
మావోల్లతో రైలెక్కి ఆల్లతోటే వుంతన్నా."
ఎనిమిదేళ్ళ పిల్లడు పొట్టకూటి కోసం పెంచిన తల్లేమయిందోనన్న ఆతృత, ఆరాటం లేకుండా రొటీనులో  పడ్డాడంటే వాళ్ళకి రోజు గడవడంకన్నా వేరే బంధవ్యాలు వుండవు."నాతో వస్తావా? చదివిస్తాను.యిలా అడుక్కోనక్కరలేదు.అందరిచేతా తిట్ట్లు దెబ్బలు వుండవు. రోజూ అన్నానికి  వెతుకులాడే  పని వుండదు. నాతో వస్తావా?"ఏమనుకున్నాడో దీర్ఘంగా నా ముఖంలోకి చూశాడు. నేను వాడి కళ్ళలోకి చూశాను ఒకరి నిజాయితీ ఒకరికి అర్ధమైనట్ట్లుంది.
""అల్లాగే వత్తాను"  అన్నాడు.
చాయ్ వాడు వస్తే కొని వాడికిచ్చి బేగులోంచి నాలుగు బిస్కట్లు తీసి యిచ్చాను.టి వాడూ  ఆశ్చర్యంగా చూసి "ఏందిరో సిరి పిట్టినట్టుంది?"వెక్కిరింపుగా అన్నాడు.రోజూ పరిచయం వాళ్ళది.
రైలు గమ్యం చేరే లోగా ఒక్ ప్రణాళిక తయారు చేసుకున్నాను.అది ఎంతవరకు సఫలమౌతుందో నాకూ సందేహమే. నేనున్న పరిస్తితిలో గాలికి అల్లాడుతున్న ఒక్క జీవితాన్ని సరిదిద్ద గలిగినా కొంత మెరుగనిపించింది.
హైదరాబాదులో రైలు దిగి స్టేషను బయటికి వచ్చి పేవుమెంటు మీద రెండు జతల బట్టలు పిల్లడికి సరిపోయినవి  కొన్నాను.మళ్ళీ స్టేషనుకెళ్ళీ ప్లాట్ ఫారం టికెట్టు కొని ప్లాట్ ఫారం చివర కొళాయివద్ద వాడికి సబ్బిచ్చి స్నానం చెయ్యమన్నాను.వాడి రూపం కాస్త మెరుగయింది.తువ్వాలుతో తల తుడిచి తలదువ్వాను.బాగున్నాడు.వాడి కళ్ళలో చక్కని మెరుపుంది.
"ఈ రోజునుంచి నీ పేరు గోవిందు అని ఎవరడిగినా చెప్పు.నీగురించి ఎవరేమడిగినా నువ్వేమీ చెప్పకు, నేను చెప్పినదానికి కాదనకు. అంతకన్నా కావలసినదేమీ లేదు."
ఏదేమయినా వీడిని ప్రయోజకుడిని చెయ్యాలని చాల దృఢనిర్ణయం చేసుకున్నాను.ఆటోలో యిల్లు చేరే లోగా వీడి గురించి అనసూయకి ఏం చెప్పాలో ముందే తయారు చేసుకున్నాను.
తలుపు తీసిన అన్సూయ నా వెనుకనున్న పిల్లాడిని  ఎవరన్నట్లు చూసింది. లోపలికెళ్ళాక చెప్పాను. "వీడు నా స్నేహితుడు శేషగిరి కొడుకు.విజయవాడలో వాడిని చూద్దామని వెళ్ళాని.అక్కడికెళ్ళాక తెలిసినదేమంటే, పదిహేను రోజుల క్రిందట వీడు వీళ్ళమ్మ నాన్న వెళ్తున్న ఆటో బోల్తా పడి వీళ్ళమ్మ అక్కడికక్కడే పోయిందట వీళ నాన్న మర్నాడు హాస్పిటలులో పోయాడుట.వీడిని యిరుగుపొరుగు వాళ్ళు చూస్తున్నారు. నేను వెళ్ళాక శేషగిరిగురించి భోగట్టా చేస్తుంటే పొరుగువాళ్ళు ఈ సమాచారం యిచ్చి వీడిని నాకిచ్చారు.అద్దె యిల్లు సామాన్లు ఎక్కువ లేవు.అన్నీ సెటిల్ చేసి వీడిని నాతో తెచ్చాను వీడి పేరు గోవిందు."
అదేమిటండీ?మన పెంపకం ఎంత దివ్యంగా వెలిగిందో సుధీర్ తో తేలిసింది కదా,యింకా యీ అబ్బాయిని పెంచి ఏం లాభం?మరో మనస్తాపం భరించే ఓపిక లేదండీ."
"వూరుకో అనసూయా మనిషి ఎప్పుడూ ఆశతోనే బ్రతకాలి.చూద్దాం మంచి పనికి దైవ సహాయం ఎప్పుడూ వుంటుంది.దిక్కు లేని పిల్లాడికి దారి చూపడం తప్పు,పాపం కాదు మరేమీ మాట్లాడకు.
ఆ రోజునుంచి గోవిందుని తీర్చి దిద్దటం ఒక యజ్ఞంలా భావించాను.మాటతీరు  చదువు నడవడిక ఒక ఒరవడిలో పెట్టడానికి చాల శ్రమ పడ్డాను.సంవత్సరాలు గడుస్తున్నకొద్దీ నన్ను ఆశా పథం వేపు నడిచేలా చేశాడు గోవిందు.ప్రతి క్లాసు మంచి మార్కులతో పాసవుతూ,పదవ తరగతి మెరిట్ లో పాసయాడు. తెలిసిన వాళ్ళు గోవిందు ప్రగతి చూసి పొగడకుండా వుండలేకపోయారు.యింటరు కూడా మంచి మార్కులతో పాసయాడు. డిగ్రీ ఏ సబ్జెక్టుతో చదువుతావని అడుగుతే "మీ యిష్టం బాబుగారూ మీరేది మంచిదని నిర్ణయిస్తే అదే చదువుతాను" అన్నాడు గోవిందు.
బి కాం లో చేర్పించాను.ఫైనలియరుకి వచ్చాడు,రెండు నెలల్లో ఫైనల్ పరీక్షలు యీ సమయంలో సుధీర్ విడుదలై వస్తున్నాడు.యింటికే వస్తాడా?ప్రవర్తనలో ఏమైనా మార్పు వచ్చి వుంటుందా?అన్నీ సందేహాలే!
అనసూయని అడిగాను "ఏం చెయ్యమంటావు?సుధీర్ ని యింటికి తీసుకు రమ్మంటావా?ఏం చెయ్యాలో నిర్ణయం వాడికే వదిలి పెట్టమంటావా?"
"మీరు వెళ్ళకండి వాడికి మనమీద అభిమానం వుంటే వాడే వస్తాడు.ఆనాడే వాడిని కాదని వచ్చేశాం,యీ రోజు వాడి మీద కొత్తగా మమకారం పెట్టుకోలేదు.రెండు నెలల్లో గోవిందు చదువు పూర్తవుతుంది.వాడిని చూస్తుంటే ముచ్చట వేస్తుంది.తన వల్ల ఎవరికి ఏ యిబ్బంది కలుగుతుందో అన్నట్ట్లు ప్రవర్తిస్తాడు.కన్న కొడుకు మనస్తాపమే మిగిల్చాడు. చూద్దాం వాడేంచేస్తాడో తొందరపడకండి."
తల్లికి పుత్రవాత్సల్యం ఒక పాలు ఎక్కువే అంటారు కాని కాఠిన్యం వహిస్తే తండ్రిని మించిపోతుందనిపించింది.
సుధీర్ విడుదలయినప్పటినుండి మూడు రోజులు ఎదురు చూసినా యింటికి రాలేదు.ఏమయితే అయిందని జైలుకెళ్ళి అధికారులతో మాట్లాడాను.సుధీర్ ఒక సంవత్సరం కాస్త పొగరుగా వున్నా తరువాత తనలో మార్పు వచ్చిందని, తనకి చదువుకోవాలని వుందని కోరినట్ట్లు చెప్పారు.పుస్తకాలు తెప్పించి యిచ్చామని ఇందిరా గాంధి ఒపెన్ యూనివర్సిటీ ద్వారా బి ఎ,ఎమ్మె చేశాడని విడుదలయే వరకు లైబ్రరీ నుంచి పుస్తకాలు తెప్పించుకుని చదివేవాడని చెప్పారు.ఎవరి జోలికి పోకుండా చక్కని ప్రవర్తనతో జైలు స్టాఫ్ మెప్పు పొందాడని చెప్పారు.వింటున్న నా కళ్ళు ధారాపాతంగా కారడం గమనించలేకపోయాను.
"యివన్నీ నాకెందుకు తెలియజేయలేదూ?"
"సుధీర్ మీకు చెప్పొద్దన్నాడు.విడుదలయాక ప్రయోజకుడై మీ ముందు నిలబడతానన్నాడు.దానికి తగినట్లు ఏదైనా వుపాధి కలిగించడానికి అధికారులు సహాయ పడతామన్నారు."
"ఇప్పుడెక్కడున్నాడు?"
"పధ్నాలుగు సంవత్సరాలు ఓపిక పట్టారు,మరికొన్నాళ్ళు వేచి చూడండి.మీ అబ్బాయి సత్ప్రవర్తనతో మీ వద్దకి వస్తాడు.మాకు పూర్తి నమ్మకముంది."
ఏం చెయ్యలేక యింటికి వచ్చాను. అనసూయకి వివరాలేమీ చెప్పలేదు.అక్కడ విన్న వాటికి ఏ కొద్ది పాటి భిన్నంగా జరిగినా తట్టుకోలేదు.పైగా గోవిందు పరీక్షలయేవరకు ఈ విషయం గోప్యంగా వుంచదల్చుకున్నాను.
ఆరు నెలల తరువాత సుధీర్ వచ్చి మాయిద్దరి కాళ్ళకు నమస్కరించితే నమ్మకం కుదరలేదు.అనసూయ బిగుసుకు పోయి నోట మాట రాలేదు.
"అమ్మా! నాన్నా! నన్ను క్షమించండి, మీకు యికపై ఎటువంటి మనస్తాపం కలుగకుండా మసలుకుంటాను."
"జైలు నుంచి విడుదలయాక యిన్నాళ్ళు ఎక్కడున్నావ్?
నా శ్రేయోభిలాషి యింట్లో ఒక నెల రోజులున్నాను.యిప్పుడు ఒక మారుమూల పల్లెటూరిలో సింగిల్ టీచర్ స్కూల్లో టీచరుగా పని చేస్తున్నాను. మీరు జైలుకెళ్ళి నాగురించి భోగట్టా చేశాక నేను ఈ వూరు వచ్చి మీకు తెలియకుండా దూరన్నుంచి మీ అందరినీ చూశాను.అప్పుదే గోవిందు గురించి తెలిసింది.చాలా మంచి పని చేశారు నాన్నా,మీ స్నేహితుని కొడుకుని చేరదీసి అతని భవిష్యత్తు తీర్చిదిద్దారు.గోవిందు చాలా అదృష్టవంతుడు నేను పొందలేని మీ యిద్దరి ప్రేమాభిమానాలు పొందేడు. యింకా చదువుకుంటానంటే చదివించండి." గోవిందు స్నేహితుడి కొడుకు కాదని రైల్లో అడుక్కుంటున్న వాడిని తెచ్చానన్న నిజం నాలోనే నిక్షిప్తం చేసుకున్నాను.
సుధీర్ లో వచ్చిన మార్పు చూసి అనసూయ అబ్బుర పడింది,"ఈ ప్రవర్తన ఆదిలోనే వుంటే ఈ కష్టాలే వుండకపోవును కదరా? ఎంత కఠినంగా మాట్లాడి వచ్చేశాను."అంది కళ్ళు తుడుచుకుంటూ.
నువ్వలా అని వచ్చేశాకే నాలో మథనం మొదలయింది.అదే సమయంలో నా వయసువాడే కొత్తగా జైలుకి వచ్చాడు.మా మధ్య స్నేహం ఏర్పడింది.మాటల మధ్య చెప్పాడు,అతనికి ఒక అక్క యిద్దరు తమ్ముళ్ళు వున్నారుట తండ్రి వుద్యోగం తప్ప వేరే ఆధారం లేదని. అటువంటి సమయంలో ఒక తుంటరి వాళ్ళ అక్కతో అసభ్యంగా ప్రవర్తిస్తూంటే వాళ్ళ నాన్న అడ్డుకుని చేతికందిన వస్తువుతో తలమీద కొట్టాడుట.
అతని చర్యని ఆపడానికే చేసినా దెబ్బతిన్న వ్యక్తి మరణించాడుట.అదే సమయంలో ఆ అబ్బాయి చూసి తండ్రిని ఆ ప్రదేశం నుంచి తప్పించి,కొట్టిన వస్తువుని తనచేతిలోకి తీసుకుని హతుని రక్తం తనకి అంటేలా చూసుకుని పోలీసులకి లొంగిపోయాడుట.
అలా ఎందుకు చేశావని అడిగితే ,ఆ పరిస్తితిలో తన తండ్రి జైలుకెళితే యింటిల్లిపాదీ నిరాధారమై రోద్దున పడతారని తన ఒక్కడికి శిక్ష పడినా మిగతా కుటుంబం బాగుపడుతుందని చెప్పాడు.
తండ్రి కోసం కుటుంబం కోసం నిరపరాధి శిక్ష అనుభవిస్తుంటే, నా సరదాలకోసం కుటుంబాన్ని బాధపెట్టి అవమానాలపాలు చేశాను .ఈ రెండింటినీ బేరీజు వేసుకుంటూ నాకు తెలియ కుండానే నాలో మార్పు వచ్చింది.యికపై నాగురించి చింత పడవద్దు.అంతా విన్న గోవిందు"బాబుగారి మంచితనం వూరికే పోదు అన్నాయ్యా!"అనగానే,యిన్ని సంవత్సరాలయినా యింకా బాబుగారేమిటి గోవిందూ నాన్నగారూ అని పిలువు.నిన్ను కొడుకులాగే పెంచుతున్నారు."
ఆ మాట విన్నాక అనిపించింది చట్టబద్ధంగా గోవిందుని దత్తత చేసుకోవాలని."సుధీర్ నువ్వుండగానేగోవిందుని దత్తత చేసుకుంటే మంచిదనుకుంటున్నాను,ఏమంటావు?"
మచిది నాన్నా అలాగే చేయండి."
సుధీర్ ఎప్పటికీ యిలా ఒంటరిగా వుండిపోతావా?"జంకుతూనే అడిగింది అనసూయ.
"లేదమ్మా మమ్మల్ని సరైన మార్గంలో పెట్టడానికి ఎన్ జి ఓలు జైలుకి వస్తుంటారు.అలా వచ్చే వారిలో సరళ అన్న అమ్మాయి వుంది.నా లోని పరివర్తన చూసి నేనంటే యిష్ట పడుతోంది.నాన్న, నువ్వు అంగీకరిస్తే ఆ అమ్మాయిని తీసుకు వస్తాను."
తప్పకుండా తీసుకు రమ్మన్నాం సంతోషంగా.గోవిందుని దత్తత చేసుకున్న రోజున సుధీర్ సరళల నిశ్చితార్ధం కూడా జరిపించేశాం.వచ్చిన స్నేహితులు బంధువులతో చెప్పాను.ఒక కొడుకు వజ్రపు తునక కాస్త మసకబారినా మళ్ళా ప్రకాశించుతున్నాడు.మరోకొడుకు మట్టిలో మాణిక్యం,అంటూ యిద్దరినీ చెరో వైపు పట్టుకుని దగ్గరకు తీసుకున్నాను.బంధువులు స్నేహితులు హర్షధ్వానాలు చేశారు.



29 July, 2013

జోగినాధం మాస్టారు

జోగినాధం మాస్టారికి 'బెస్ట్ టీచర్ అవార్డ్ దొరకబోతున్నదన్న వార్త నేను కాలేజీలో చేరిన సంవత్సరం తెలిసింది. ఆ! జోగినాధం మాస్టారికి బెస్ట్ టీచర్ అవార్డా? నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు ఆయన మా క్లాసు టీచర్.
ఆ రోజులు సినీమా రీలులా నా కళ్ళ ముందు మెదిలాయి .వెంటనే అతని రూపం గుర్తుకొచ్చింది.ముతక ఖద్దరు పంచ చొక్కా పై కండువా,కాస్త ఎత్తు పళ్ళు నూని రాసి నున్నగా దువ్విన క్రాఫుకళ్ళజోడు సగం సమయం ముక్కు చివరదాకా జారిపోతూంటుంది. క్లాసులో ప్రవేశించగానే బొంగురు గొంతుతో "యిప్పుడు ఏ పీరియడ్?" అని ప్రశ్నించి క్షణంలో అందరినీ పరికించి చూసేవారు ఎవరు తడబడుతున్నారో కళ్ళజోదులోంచి చూసేవారు.
బోర్డు మీద రాస్తున్నప్పుడు కూడా వెనుకనుంచి మేము ఏం చేస్తున్నామో గమనించేవారు. శిక్షించేటప్పుడు పక్షపాతం లేకుండా అందరికీ ఒకేలా వేసేవారు. అది మాలో కొం దరికి జీర్ణమయ్యేదికాదు.తెలివైన విద్యార్ధులను టీచర్లు కొంత అభిమానంగా చూస్తార, ని పక్షపాతం చూపిస్తారని విన్నాం,గాని మా జోగినాధం మాస్టారి వద్ద అవన్నీ అబధ్ధాలని రుజువైపోయింది.
స్కూలు ఆవరణలో వున్నంతసేపు ఏ క్లాసు కుర్రాడైనా కాగితం ముక్కగాని చెత్త గాని కింద పదేయడం చూస్తే వెంటనే వాడి చెవి పత్తుకుని చెత్త ఏరించి చెత్త కుండీలో వేయించేవారు.'స్కూలమంతా మాస్టారిదేలా ప్రవర్తిస్తారేమిటీ  అనుకునేవాళ్ళం.
ఒక రోజు  టీ చర్స్ కామన్ రూము లోంచి గట్టిగా మాటలు వినిపిస్తూంటే అదీ జోగినాధం మాస్తారి గొంతు వినిపించగానే తొంగి చూశాను ఏమిటా అని.చదివిన పేపరు చక్కగా మడిచి పెట్టలేదని మరో టీచర్ని మందలిస్తుంటే ఆశ్చర్యపోయాను .  పిల్లలమే కాదు టీచర్లు కూడా అతని జులుంకి బలి అయిపోతారని అర్ధమయింది.
జోగినాధం మాస్టారు ఒంటరి మనిషి ,మొదటి  భార్య పోయిన రెండేళ్ళకి మళ్ళీ పెళ్ళి చేసుకున్నారుట.ఆమె ఆర్నెల్లు కూడా బ్రతకలేదుట .అప్పటి నుండి తమ్ముని యింటి పక్కనే చిన్న యిల్లు అద్దెకి తీసుకుని తమ్ముని యింటిలో భోజనం చేస్తూ ఒక్కరే వుండటం అలవాటు చేసుకున్నారు.యితని చండశాసనత్వమ్ పడలేక యిద్దరు భార్యలు యీ లోకం విడిచి పోయారేమోనంటూ  పిల్లలం విమర్శ చేసుకునే వాళ్ళ చాటుగా.
వేసవి వచ్చిందంటే చాలు స్కూల్లో కొత్త కుండలు తెప్పించేవారు. వాటికోసం పిల్లల వద్దనుండే డబ్బులు వసూలు చేసేవారు. వాటిని ప్యూను చేత దగ్గరుండి నింపించి మూతలు పెట్టించేవారు.ఇంటర్వెల్ల్ సమయంలో పిల్లలు నీటిని వౄధా చేయకుండా కుండలు పగలకొట్టకుండా అందరూ నీళ్ళు తాగేలా చూసేవారు.
ఒక రోజు ఒక స్టూడెంట్ చేతిలోంచి గ్లాసు జారిపడి కుండ పగిలి పోయింది. వెంటనే ఆ కుర్రాడి పేరు క్లాసు కనిక్కుని కుండ ఖరీదు చెల్లించమని ఆర్డరు జారీ చేశారు.ఆ పిల్లాడు ఏడుస్తూ తను పేద విద్యార్ధినని, డబ్బులు యిచ్చుకోలేనని గోల పెట్టాడు. వెంటనే ఆ అబ్బాయి క్లాసుకి వెళ్ళి వున్న సంగతి పిల్లలందరికీ చెప్పి అందరూ తలో కాస్త వేసుకుని కుండ కొని యధాస్థానంలో పెట్టమని సలహా యిచ్చారు.పిల్లలందరికీ కోపం వచ్చి,"మేమెందుకు చెల్లించాలి? ఎవరు పగలగొట్టారో వాళ్ళనే చెల్లించమనండి."అంటూ వ్యతిరేకించారు."సరే రేపటినుంచి డ్రమ్ములో నీళ్ళు తాగండి.ఈ మాత్రం సహకారం లేకుంటే జీవితంలో చాలా కష్ఠ పడావలసివస్తుంది ఆలోచించుకోండి."అవి మాటలు కావు శిలా శాసనాలు.
యిలా క్లాసు  టీ చరుగా ఆ సంవత్సరంలో రోజూ తెలిసే విషయాలు యివన్నీ .అయితే స్కూలు చదువు పూర్తయేదాకా ఏదొ ఒక సందర్భలో పిల్లలందరికీ అతనితో భేటీ అవుతూనే వుంటుంది.అన్ని సంవత్సరాలలో అనారోగ్యంతోగాని వూరికి వెళ్ళో శలవు పెట్టడం చూడలేదు.అతన్ని ఎంత విమర్శించుకునీవాళ్ళమో కనిపించకుంటే అంత వెలితిగా భావించేవాళ్ళం.
సంవత్సరం పూర్తయి ఏన్యువల్ పరీక్షల ముందు చాలమంది టీచర్లు స్పెషల్ క్లాసులు పెట్టి కోర్సు పూర్తి చేసేవారు.కాని జోగినాధం మాస్టారు ఫిబ్రవరిమొదటి వారానికి కోర్సు పూరి చేసేసి రివిజన్ మొదలు పెట్టేవారు.మిగతా టీచర్లకి చాలా ఆశ్చర్యం అతను కోర్సు అంత త్వరగా ఎలా పూర్తి చెయ్యగలరా అని.అతని క్లాసులో పిల్లలు కూడా మంచి పర్సెంటుతో   పాసయ్యేవారు. ఒకరో యిద్దరో పరీక్షలో తప్పేవారు.ఒక స్టూడేంటుగా అతనిని పైపైన చూసినప్పుడు కొంత శాతమే అర్ధమవుతారు.
అదే సంవత్సరం ఏప్రిల్ నెలలో యింటికి వెళ్ళాను.  ఒక్కసారి జోగినాధం మాస్టారిని కలవాలనిపించింది. స్కూలుకి శలవలు ప్రారంభం కాలేదు. స్కూల్లోఅడుగు పెడుతూంటే ఒక అనిర్వచ్నీయమైన ఆనందం కలిగింది.ఇదే స్కూల్లో నా బాల్యం, పెద్ద చదువులకి పునాది ఏర్పడింది దానికై దోహదం కల్పించిన మాస్టాలందరికీ జోహార్లర్పిస్తూ టీచర్స్ రూము ముందు నిలబడ్డాను అనుమతికోసం.
నీడకదలగానే,"ఎవర్రా?"గొంతు జోగినాధం మాస్టారిదే. "నేనే మాస్టారూ సతీష్ ని మీ స్టూడెంటుని,"
"ఓరి! నువ్వా? రా! రా! ఎలా వున్నావ్? ఎక్కడ చదువుతున్నావ్?"యింత ఆప్యాయంగా మాట్లాడటం మాస్టారి స్వభావమే కాదు ఎంతో విచిత్రమనిపించింది. కంగ్రాట్యులేషన్స్ మాస్టారూ! మీకు బెస్ట్ టీచర్ అవార్డ్ వచ్చిందని నా స్నేహితుడు రాశాడు. అది తెలిసి మిమ్మల్ని కలవకుండా వుండలేకపోయాను," అన్నాను వినయంగా.
"నాకు అవార్డ్ రాకపోతే నన్ను కలియవురా? పోనీలే అలాగైనా నన్ను చూడాలనుకునే వాడు ఒకడున్నాడన్న సంతోషంకలిగింది.అన్నట్లు హెడ్మాస్తర్ గారు నా కోసమని చిన్న సన్మానం లాంటిది చేద్దామని టీచర్లని పిల్లలని కూడపెడుతున్నారు.స్కూల్లో ఏ ఫంక్షనయినా ఏర్పాట్లన్నీ నేనే చూసే వాడిని,కాని యిది నాకు సంబంధించినది కావటంతో నేను కాస్త ఎడంగా వుండాల్సి వస్తోంది.  నువ్వు ఓల్డ్ స్టూడెంటువి నీ సహాయం తీసుకుంటారేమో ఒక్క సారి హెడ్మాస్టర్ గారిని కలుసుకో." అంటూ పురమాయించారు.
మంచి సమయంలోనే వచ్చాననిపించిది. మే ఐ కమిన్ సార్!" హెడ్మాస్టర్ గారు తల తిప్పి చూసి ఎవర్న్నట్లు నొసలెగరేశారు.
"నా పేరు సతీష్ సార్! లాస్టియర్ బేచ్ స్టూడెంట్ ని.యిప్పుడు ఇంటరు తెనాలిలొ చదువుతున్నాను.జోగినాధం మాస్టారికి అవార్డ్ వచ్చిందని తెలిసి ఆయన్ని అభినందించుదామని వచ్చాను.మిమ్మల్ని కలవమన్నారు.మీరు మాస్టారికి సన్మానం చేసే ఏర్పాట్లు చేస్తున్నారని మీకు సహాయపడమని చెప్పారు."
"ఓ! రా కూర్చో." ఫరవాలేదు సార్!యీ ఫంక్షన్ పనుల్లో నేనూ సహాయం చేస్తాను, యీ విధంగా మాస్టారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను."
మన గోపాలం మాస్టారి వద్ద వివరాలన్నీ వున్నాయి,తెలుసుకుని నీకు చేతనైన సహాయం చెయ్యి. అవసరమైన దబ్బు అతని వద్దే వుంది సంకోచించకుండా తీసుకో.ఈ సందర్భం మన స్కూలుకే గర్వ కారణం."
"అవును సార్!మరి నేను వస్తాను."
రెండు రోజుల తరువాత శనివారం సాయంత్రం ఆరు గంటలకి సన్మానం. సింపుల్ గా హాలునలంకరించాం. పుష్ప గుచ్ఛాలు పూలమాల ఒక శాలువ తెచ్చాం.పిల్లలు కొంతమంది,టీచర్లు సమావేశమయ్యాం.
ఆ రోజు కూడా ముతక ఖద్దరు దుస్తులు ధరించే వచ్చారు జోగినాధం మాస్టారు. తన ప్రక్కనున్న కుర్చీలో కూర్చోపెట్టారు హెడ్మాస్టరుగారు .జోగినాధం మాస్టారి మెడలో పూల దండ వేసి శాలువ కప్పి చేతికి పుష్ప గుచ్ఛ మిచ్చారు.
"శ్రీ జోగినాధం మాస్టారు అత్త్యుత్తమ వుపాధ్యాయునిగా పురస్కారం అందుకోవడం మన స్కూలుకే గర్వకారణం.నిగర్వి,నిరాడంబరుడూ, నిజాయితీపరుదు యిన్ని 'ని ' లని తనస్వంతం చేసుకున్న యితను నిస్వార్ధపరుడు కూడా.టీచరంటే యిలాగే వుండాలనిపించేలా అర్ధం చెప్పారు మనందరికీ.
ఈ సందర్భంగా యితన్ని సన్మానించడం మనని మనం సన్మానించుకున్నట్లే. యితని ప్రవర్తన బాహ్యంగా కనిపించినదానిక్ పూర్తిగా భిన్నం.మాట ఎంత కరుకో మనసు అంత వెన్న.
స్కూలు కార్యక్రమాలన్నింటిలోను సహాయపడుతూ ఏవి కొనాలన్నా ఎవరికీ అవకాశం యివ్వకపోతే ,మొదట్లో డబ్బులు మిగుల్చుకునేందుకా అని అపోహ చెందాను. కాని అది ఎంత తప్పో తరువాత తెలిసి వచ్చింది.కొనేటప్పుడు చౌకగా అమ్మేటప్పుడు లాభసాటిగా చేసి ఎంతో కొంత మొత్తం మిగిల్చి పేద విద్యార్ధులకు ధన సహాయం చేసేవారు
పాత పుస్తకాలకు బైండు చేయించి మరుచటి సంవత్సరంలో కొనుక్కోలేని విద్యార్ధులకు యిచ్చేవారు. మన స్కూల్లో అందమైన పూలతోట మాస్టారి అభిరుచే.మనం వృధా చేసే నీటిని వుపయోగించి పూలు పూసేలా చేయించారి.ఈ స్కూల్లో జోగినాధం మాస్టారు చాలా సంవత్సరాలనుంచి పని చేస్తున్నారు.నేను వచ్చిన ఆరు సంవత్సరాలలో ఆరు నెలలు అతనిని అపార్ధం చేసుకున్నాను.నెమ్మదిగా అతని ఆశయాలు ఆలోచనలు గ్రహించాక అతనికి అండగా నిలిచాను.
ఎవరేమనుకుంటారోనన్న జంకు లేదు. ప్రతివారు తన వెనుక విమర్శలు చేస్తున్నారని తెలిసినా లెక్క చేయక అతని ఆశయ సిధ్ధికై ముందడుగు వేస్తున్నారు.తనకంటూ ఎవరూ లేరని బాధపడుతూ కూర్చోక తన జీతంలో కొంత భాగం ఆదా చేస్తూ వచ్చారు.పేద విద్యార్ధులకై వినియోగించాలని అతని ఆశ.ఒక్క రూపాయి కూడా వృధా కాకుండా ఆదా చేయగల నేర్పు జోగినాధం మాస్టారికే వుంది.
పై విషయాలన్నీ తెలిశాక జోగినాధం మాస్టారంటే ఏమిటో అందరికీ తెలిసిందనుకుంటాను.ఎవరికీ తెలియని విషయం మరొకతుంది. ఈ మధ్యనే హైదరాబాద్ వెళ్ళి తన మరణానంతరం తన అవయవాలు యితరులకు వుపయోగించమని దాన పత్రం రాసి వచ్చారు.(కరతాళ ధ్వనులతో హాలు మారు మ్రోగింది) యీ పురస్కారం దొరకటం జోగినాధం మాస్టారికే కాదు మనందరికీ కూడా గర్వ కారణం ." అంటూ తన ప్రసంగం ముగించారు.
జోగినాధం మాస్టారు యోగిలా అంతా విన్నా చివరలో కనులు చెమర్చి పై కండువాతో తుడుచుకున్నారు. మిగతా టీచర్లు కూడా అంతకు ముందున్నా అభిప్రాయం మార్చుకుని జోగినాధం మాస్టారి సుగుణాలే నాలుగేసి మాటలు చెప్పారు. పిల్లల తరఫున నేను మాస్టారిపై వ్రాసుకొచ్చిన కవిత చదివాను.
జోగినాధం మాస్టారంటే పిల్లలకి హడల్
ముతక ఖద్దరు దుస్తులు
ముక్కు మీదకు జారే కళ్ళజోడులోంచి నిశిత ధృక్కులు
మాటేమో కరకు - పిల్లలకు అది వింటే ఒణుకు
తప్పు చేసినందుకు లేదు బాధ
మాస్టారు చూసి కేకలేస్తారేమోనన్న వ్యధ
యివన్నీ మాస్టారి బాహ్య రూపం
తన మంచితనం కనిపించనీయక గోప్యం
మంచి గంధపు సువాసనని అరికట్టలేనట్లు
మాస్టారి ఆశయాలకు లేవు ఆనకట్టలు
పిల్లలు,వారి విద్యాభ్యాసం వారి లోకం
స్కూలు పరిశుభ్రత వారి ప్రపంచం
మీ వద్ద నుండి దూరమైన తరువాతనే గ్రహించాం
మీ మాటల విలువ ప్రతి క్షణం
మీ వృత్తిలో వున్న అంకిత భావం
పొందింది అత్త్యుత్తమ వుపాధ్యాయ పురస్కారం
విన్న మేమంతా ధన్యులం
జోహారు జోగినాధం మాస్టారూ జోహారు
ఓపికగా విని అంతా అభినందించారు.హెడ్మాస్టరుగారు లేచి యిప్పుడు జోగినాధం మాస్టారు మాట్లాడతారు.
జోగినాధం మాస్టారు లేచి అందరికీ నమస్కరించారు. "నేను చేతలవాడినే గాని మాటలవాడినికాను.నేను ఏదో చేశానని భావించటం లేదు.యింకా ఏమేం గలనా అని ఆలోచిస్తున్నాను.నా ప్రియ శిష్యుడు సతీష్ నాపై తమకున్న అభిప్రాయం ,అభిమానం కవిత రూపంలో తెలియ జేశాడు, చాలా బాగుంది. హెడ్మాస్టరుగారు నా సహోద్యోగులు నాపై చూపిన అభిమానానికి చాలా కృతజ్ఞుడిని.నా దగ్గర వున్నంత వరకు నాశిష్యులు నాపై ఏ అభిప్రాయంతో వున్నా,నాకు తెలుసు యీ స్కూలు వదిలి బయట ప్రపంచంలో అడుగిడితే నా మాటల ప్రభావం పరోక్షంగా పని చేస్తుంది.
నాకు కావలసినది అదే! నా ముందు ముఖస్తుతి నాకొద్దు.యిక హెడ్మాస్టరుగారు చెప్పినట్లు నన్ను అపార్ధం చేసుకుందికే ప్రతి వాళ్ళు ప్రయత్నిస్తారు.'నీటిని తేరిస్తే గాని పరిశుభ్రత తెలియదు,అలాగే నా ఆలోచల్ని ఆశయాలని తేర్చిచూస్తే గాని అందులో విలువ తెలియదు '.
నా విద్యాభ్యాసానికి ఒక దాత అజ్ఞాతంగా ధన సహాయం చేశారు.నేనూ పేద విద్యార్ధినే.అందుకనే పేదవిద్యార్ధులు ధన సహాయం లేక వంచింప బడకూదదు. అది నా ధృఢ సంకల్పం. నా సహోద్యోగులకు నా విన్నపం నెలలో ఒక రూపాయి అయినా దాచండి.ఎవరికి జీవితాన్ని ప్రసాదించడానికి వుపయోగపడుతుందో. యిక పోతే పారితోషికాలూ పొగడ్తలూ తాత్కాలికం మన ఆదర్శమే మనకి శాశ్వతం కావాలి! యింతకన్నా చెప్పడానికేమీ లేదు.యింత అభిమానంతో నాకు చేసిన యీ సన్మానానికి కృతజ్ఞుడిని.
యిన్ని సంవత్సరాల వుపాధ్యాయ వృత్తిలో వుత్తమ వుపాధ్యాయునిగా ఎన్నికవటం మాటలు కాదు జోగినాధం మాస్టారు చండశాసనుడే కాదు ఆల్ రౌండర్  కూడా."హేట్సాఫ్ మాస్టారూ"  అని మనసులోనే జోహారులర్పించాను.జీవితంలో కొంత భాగం వృత్తికై వినియోగించే వాళ్ళుంటే, జీవితమే వృత్తిగా భావించేవాళ్ళు జోగినాధం  మాస్టారిలాంటివాళ్ళు.

రైలు ప్రయాణం-రిజర్వేషను గొడవ

మేము అయిదుగురు స్నేహితురాళ్ళం భిలాయి నుంచి భోపాల్ బయలుదేరాం.అక్కడ చదువుకుంటున్న మా అమ్మయిలని కలిసి రావడానికి. నా ఒక్కర్తికే రానూ పోనూ రిజర్వేషను అయింది మిగతా వాళ్ళు వచ్చేటప్పుడు రైల్లో చేయించుకుంటాం అని వూరుకున్నారు.
రెండు రోజుల తరువాత తిరుగు ప్రయాణం.నా రిజర్వుడు బెర్త్ లో నేను కూర్చున్నాను. అదే కంపార్టుమెంటులో మా స్నేహితులు ఎక్కి టీ టీ యిని అదే పెట్టెలో వాళ్ళకి బెర్తులు అలాట్ చేయమని కోరారు.ఆ పెట్టెలో వీలుకాదని వేరే బోగీలో అలాట్ చేస్తామన్నారు.
"ఒక్క రాత్రి ప్రయాణం మీరంతా ఒకచోట వుంటారు బెర్తులు వేరే చోట తీసుకోండి నాకిక్కడ ఒక్కర్తిని అన్న భయం లేదు"అన్నాను. అందరికీ ఒక్ చోట బెర్తులిమ్మని చాలా బతిమాలేరు. ఇక తప్పదని నాతో సహా మా అందరికీ వేరే బోగీలో బెర్తులు అలాట్ చేశారు.
అందరం అక్కడ కూర్చుని 'హమ్మయ్య!'అనుకున్నాం.వెళ్తూ వెళ్తూ ఆ టీ టీ యి నాతో "మేడం!వేరే టీ టీ యీ వచ్చి అడిగితే పొరపాటూన కూడా మీరు వేరే బోగీ నుంచి యిక్కడికి వచ్చినట్లు చెప్పవద్దు,"అని హెచ్చరించాడు.
ఇందులో ఏదో తిరకాసుంది చూద్దాం ఏమవుతుందోనని దుప్పట్లు వేసుకుని నిద్రకుపక్రమించాం.
ఇటార్సీ స్టేషను దాటిన పావుగంటకి వేరే టీ టీ యీ వచ్చి లైటు వేసి "టికెట్"అన్నారు.నా టికెట్ చూడగానే "మీరిక్కడెలా కూర్చున్నారు? ఎస్-4 లో మీ బెర్తు కదా"అన్నారు గద్దించుతూ.నా పనైపోయిందనుకున్నాను.
మళ్ళీ అడిగారు విసుగ్గా"ఈ కంపార్టుమెంటులో మీ బెర్తు లేదు యిందులో ఎందుకు కూర్చున్నారు?"స్వరంలో  అధికార దర్పం వుంది.ఏంచెయ్యాలో పాలుపోలేదు,అయినా స్థిరంగా "నాకు తెలియదు,నాకు చదువురాదు. భోపాల్ లో టి టీ యి కి టికెట్ చూపించి ఎక్కడ కూచోవాలని అడిగితే యీ జాగాలో కూర్చోమన్నారు.కూర్చున్నాను.అంతకుమించి నాకేమీ తెలియదు"అన్నాను.
ఎగాదిగా చూసి గొణుక్కుంటూ వెళ్ళారు.అతను వెళ్ళారని నమ్మకం కుదిరాక మావాళ్ళంతా లేచి"మిసెస్ రావ్! అంత ధైర్యంగా అబద్ధమెలా చెప్పారు?మరోకటీ మరికటీకాదు ఏకంగా చదువురాదని,బాప్ రే!"అనగానే "ఏం చెయ్యాలి మీ అందరికోసం నా బెర్తు వదులుకుని వచ్చాను.ఏ మాత్రం నసిగినా పినాల్టీ వడ్డించేస్తారు.ఎలాగో తప్పించుకోవాలి, అదే చేశాను."
వారిజాక్షులయందు 
వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
బొంకవచ్చునధిప పొందదఘము.అన్న పద్యం గుర్తుకొచ్చింది.ఈ పద్యార్ధం మా వాళ్ళకి బోధపరిచే ఓపిక లేక దుప్పటి ముసుగు పెట్టేసుకున్నాను.

23 July, 2013

గణ మేళన

అవి మా చిన్నబ్బాయికి సంబంధాలు చూస్తున్న రోజులు.ముంబై వచ్చిన కొత్త,పెద్దగా పరిచయాలు ఏర్పడలేదు.ఏ అమ్మాయి వివరాలు వచ్చినా మా వూరి పురోహితునికి అమ్మాయి అబ్బాయి జాతకాలు పంపేవారు మావారు.
అవి పరిశీలించి కుదిరింది లేనిది వుత్తరం రాసేవారు.ఈ తతంగానికి పదిహేను యిరవై రోజులు పట్టేది.ఇలా లాభం లేదని జాతకాలు కొరొయర్ చేసేవారు. ప్రతి జాతకంలో ఏవో లోపాలుచెప్పేవారు పురోహితుడు.చూస్తూ చూస్తూ జాతకం కుదరలేదని తెలిసి ఎలా చేస్తాం?
ఈ కొరియర్లు పోస్తు కోసం ఎదురు చూపులు గమనించి మా అబ్బాయి (అదే పెళ్ళి కొడుకు)"జాతకాలు మేచ్ చేసే సాఫ్ట్ వేర్ వుంది. అది మన కంప్యూటరులో డౌన్ లోడ్ చేస్తాను. జాతకాలు సరిపడ్డాయో లేదో మనమే చూసౌకోవచ్చు. మేచయిన సంబంధం వివరాలు పురోహితునికి పంపి తెలుసుకుంటే సులువవుతుందికదా! మీ యిద్దరి కష్టాలు చూడలేకపోతున్నాను."అంటూ సాఫ్ట్ వేర్ ఇన్ స్టాల్ చేశాడు.
ఆదివారం వుదయం "అమ్మా! అమ్మాయివి నావి వివరాలు యిస్తే మేచ్ చేసి చూస్తాను "అన్నాడు.
"అయ్యో! నిన్ననే వాళ్ళ జాతకం తిప్పి పంపేశాము.ఏ అమ్మాయి జాతకం లేదు.మళ్ళీ ఎవరివైనా వస్తే చూద్దాం." ఇన్ స్టాల్ చేశాక ఎవరిదో ఒకరిది చూసేదాకా మావాడికి తోచలేదు.
"నాన్నది నీది పుట్టిన తేదీ సమయం సంవత్సరం వివరాలన్నీ రాసి యివ్వు చూస్తాను" అన్నాడు.
"మాయిద్దరివీ మేచ్ చెయ్యడం ఎందుకురా? పెళ్ళై నలభై ఏళ్ళయింది ముగ్గురు మనుమలు పుట్టారు యిప్పుడు చూసేదేముంది? అవ్వ! నవ్విపోతారు"నోరు
నొక్కుకున్నాను.
'ఏమీ ఫరవాలేదు,యీ మేచ్ చెయ్యడం ఎంతవరకు నమ్మవచ్చో తెలుస్తుంది. మీ యిద్దరిదయితే సందేహం వుండదుకదా రాసివ్వమ్మా!" అనునయించాడు.
రాసి యిచ్చాను."ఒరేయ్ స్నానం ధ్యానం చేసి ఆ పని చెయ్యి"
నవ్వుతూ "ఆల్రెడీ పెళ్ళైపోయింది స్నానం చెయ్యకున్నా తప్పులేదు."అంటూ వివరాలన్నీ ఒకటీ ఒకటీ ఎంటర్ చేస్తున్నాడు.ప్రక్కన కూర్చుని విచిత్రంగా చూస్తున్నాను.కంప్యూటరు ఏం చెపుతుందోనన్న ఆతృత.కాలింగ్ బెల్లు మోగితే తలుపు తియ్యడానికి వెళ్ళాను. పని మనిషి వచ్చింది.
లోపలికి వస్తూండగానే "అమ్మా!"అని గావు కేక పెట్టాడూ.ఏమయింది చెప్మా! మా గణ మేళన అంత అద్భుతంగా చూపిందా కంప్యూటరు అనుకుంటూ ఒక్క అంగలో వెళ్ళాను.మావాడు పడీ పడీ నవ్వుతూ కంప్యూటరు స్క్రీను వైపు చూపించాడు.ఏముందా అని చూస్తే NOT SUITABLE FOR MATCH
ఆ!!!నోట మాట రాలేదు.యిప్పుడు నాట్ సూటబులా!అల్లుడొచ్చి,కోడలొచ్చి ముగ్గురు మనుమలు పుట్టి పెళ్ళైన నలభై ఏళ్ళకి నాట్ సూటబులా?యిది అసంభవం కంప్యూటరు మేచింగు తప్పు" అన్నాను.
"అలా తప్పులు దొర్లవు, ఎందరో మేధావులు కష్టపడి తయ్యారు చేసిన ప్రొగ్రాం .మీ పెళ్ళికి పురోహితుడు లంచం పుచ్చుకుని వుంటాడు."సాఫ్ట్ వేర్ ఇంజనీరు తప్పు ఒప్పుకోలేదు.
"మరి యిన్ని సంవత్సరాలయా కాపురం చేస్తున్నాం కదురా?"అన్నాను కంప్యూటరు చెప్పినది రుచించక.
"అక్కడే వుంది కిటుకు జాతకాలు సరిపోయాయంటే అన్నీ అద్జస్ట్ అయిపోతాయి.అవి కుదరలేదంతే మన ఆలోచనలు వేరేగా వుంటాయి.ఇవాన్నీ అంత డీప్ గా తీసుకోనవసరం లేదు అనడానికి మీ యిద్దరే నిదర్శనం." ఆ షాక్ నుంచి తేరుకుందికి గంట పట్టింది.

మనసా కీడెంచకే

బంధువుల యింటికి పనిమీదవెళ్ళాను.నాలుగు రోజులయాక అమ్మా వాళ్ళ వూరు మర్నాడు వెళ్తానని ముందు రోజు వాళ్ళకి నా ప్రొగ్రాం చెప్పాను."చంటి పిల్లతో ఒక్కరూ రైల్లో ప్రయాణం ఎందుకు? సాయంత్రం మూడు గంటల రైలుకి నా కొలీగ్ వెళ్తాడు.అతనూ మీ అమ్మగారి వూరే వెళ్తాడు.యిల్లు చేరేవరకు సహాయంగా వుంటాడు.రైలు దిగాక బస్సు ప్రయాణం కూడా వుందికదా! యిబ్బంది లేకుండా వెళ్ళొచ్చు.యీ ఒక్క పూటా ఆగమ్మా."చుట్టాలాయని సలహా యిచ్చారు కాదనలేకపోయాను.
అయినా నసుగుతూ "ఆఖరి బస్సు తప్పిపోతే రాత్రి యిబ్బంది అవుతుంది"అన్నాను."అతను మూడు నెలలై బదిలీ మీద మీ వూరు నుంచి వచ్చడు,భార్యా పిల్లలు అక్కడే వున్నారు.ప్రతి శనివారం హాఫ్ డే తరువాత యీ రైలుకి వెళ్ళి సోమవారం వచ్చేస్తాడు.మీకేమీ భయం లేదు దగ్గరుండి మీ యిల్లు చేర్చుతాడు."
ఇంకేం మాట్లాడను,సరేనన్నాను.మర్నాడు స్టేషన్లో తన సహోద్యోగిని పరిచయం చేశారు  మా బంధువు,"యితను మా కొలీగ్ మోహనరావు.యీమె మా రిలేటివ్ వుదయం చెప్పాను కదా! మీకు కష్టం కలిగిస్తున్నాం.""అబ్బే! అదేం లేదు వెళ్ళవలసినది ఒక్క వూరేకదా మీరేం వర్రీ కాకండి."
రైలు వచ్చి బయలుదేరేసరికి నాలుగయింది.నాకు మనసులో కంగారుగానే వుంది.అమ్మగారి వూరు చేరేసరికి రాత్రి పదయినా అంతకన్నా ఎక్కువైనా బాధలేదు పుట్టి పెరిగిన వూరు.ఎటొచ్చీ రైలు దిగాక బస్సు దొరకక పోతే ఎలాగో అని మనసులో మల్లగుల్లాలు పడుతున్నాను.
అసలే పాసింజరు గంట ప్రయాణం తరువాత చిన్న స్టేషన్లో ఆగిపోయింది.గంటన్నరైనా కదలదు,కిందకు దిగి సమాచారం సేకరించిన వారు చెప్పిన వార్త ఏమంటే ముందు వెళ్తున్న గూడ్సురైలు యింజను ట్రబులిచ్చింది అది సరైతే ఈ రైలు కదులుతుంది.ఈ మాట విన్నాక నిస్పృహ ఆవరించింది.కూర్చోవడం తప్ప చేయగలిగందేమీ లేదు.పాపని ఒళ్ళో పెట్టుకుని మాట్లాడకుండా కూర్చున్నాను.
చివరికి రెండున్నర గంటల తరువాత రైలు బయిలుదేరింది.మేము దిగవలిసిన స్టేషను చేరేసరికి రాత్రి తొమ్మిదయింది.బయటికి వచ్చి బస్సు గురించి వాకబు చేస్తే ఆఖరి బస్సు వెళిపోయిందన్నారు.కిం కర్తవ్యం? అన్నట్లు మోహనరావుగారి వైపు చూశాను. కాని వెంటనే తేరుకుని "ఈ రాత్రికి లేడీస్ వైటింగ్ రూములో గడిపి వుదయాన్నే మొదటి బస్సుకి వెళ్దాం." "రాత్రంతా దోమలతో జాగరం ఎందుకండీ? ఈ వూర్లో మా స్నేహితుడున్నాడు,వాళ్ళింటికి వెళ్దాం ఉదయాన్నే బస్సుకు వచ్చేయవచ్చు."
"వద్దొద్దు యింకొకరికి రాత్రి పూట అసౌకర్యం కలిగించడం బాగుండదు.కావాలంటే మీరు వీళ్ళండి,నేను వైటింగు రూములో వుంటాను."
అయ్యో చిన్న పాపతో ఎలా వుంటారు? మీరు ఏమీ తినలేదు కూడాను."అంటూ రెండు రిక్షాలు పిలిచి ఒక దాంట్లో నా బేగు పెట్టి ఎక్కమని రెండవదాంట్లో తను కూర్చుని తనరిక్షాని ఫాలో అవమని చెప్పాడు.అవును కాదు అనే అవకాశమివ్వలేదు.
రిక్షాలు బయలు దేరాయి.నా మనసు కీడు శంకించసాగింది.బుద్ది పొరపాటై చుట్టపాయన మాట పట్టుకుని సాయంత్రం రైలుకి బయలుదేరాను.యిక్కడికి వచ్చాక ముక్కు ముఖం తెలియని బంధువు కొలీగ్ మాట కాదనలేక పోవడం నా మీద నాకే జాలి వేస్తోంది.యిది దేనికి దారి తీస్తుందో, రోజూ పేపర్లో చదివే వార్తలు కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి.యీ మోహనరావు ఎటువంటివాడో అతని స్నేహితుడెలాంటివాడొ ఆలోచించే శక్తి కూడా మిగలలేదు.బుర్ర మొత్తం ఖాళీ అయిపోయి పాపని గట్టిగా గుండెలకి హత్తుకుని చింతించసాగేను.తోవపొడుగునా మనుషులనిగాని వచ్చెపోయే వాహనాలనిగాని గమనించలేదు.
ఆ రోజు శనివారం 'నాయనా ఏడుకొండలవాడా వెంకట రమణా యీ రాత్రి సురక్షితంగా గడిచి యిల్లు చేరితే నీకు కొబ్బరికాయ కొడతాను. ఐదు శనివారాలు వుపవాసం చేస్తాను.ఆ స్నేహితుడింటికి చేరేసరికి నన్ను రక్షించడానికి నువ్వక్కడ వుండు స్వామీ! నిన్ను నమ్మిన వాళ్ళని కాపాడతావన్న మాట ఋజువు చేసుకో !నన్ను రక్షించే పూచీ నీదే నీవు తప్ప ఆదుకునే వాళ్ళెవరు స్వామీ అంటూ ఎంతో దీనంగా వేడుకున్నాను.పగటిపూట ఎంతో ధైర్యంగా డాంబికంగా మాట్లాడగలనో ఆ సమయంలో నిస్సహాయంగా బేలగా ఆలోచిస్తున్నాను.సంత్సరన్నర పాప పాతికేళ్ళ నా వయసు ఎలా నన్ను నేను కాపాడుకోవాలో పాలుపోక మధనపడుతుండగా రిక్షా ఆగింది.
మోహనరావు దిగి రెండు రిక్షాలకి డబ్బులిచ్చి నా బేగు తీసుకుని నన్ను దిగమన్నాడు. గత్యంతరం లేక నెమ్మదిగా దిగాను పారిపోయే అవకాశమేదైనా వుందా అని చుట్టూ పరిసరాలు చూస్తున్నాను. తలుపులు తెరిచే వున్నాయి మోహనరావు యింటి ముందుకెళ్ళి "శామ్యూల్" పిలిచాడు. రెండు నిముషాల తరువాత నడివయసు స్త్రీ వచ్చి "మీరా! రండి అన్నయ్యా శామ్యూల్ బజారుకెళ్ళాడు యిప్పుడే వచ్చేస్తాడు లోపలికి రండి."అంది ఎంతో అభిమానంగా.
వెనక్కి తిరిగి నన్ను పరిచయం చేస్తూ "యీమె మా కొలీగ్ బంధువు,మా స్నేహితుని భార్య లీనా" "నమస్తే"అన్నాను సంతోషంగా.మా వూరు, వీరి అమ్మగారి వూరు ఒక్కటే మా రైలు లేటయింది ఆఖరి బస్సు వెళిపోయింది, యీ రాత్రికి మీకు యిబ్బంది కలుగజేస్తున్నాం."
"ఎంత మాటన్నయ్యా మీరు మా యింటికి రావడం మాకు సంతోషం మాకేమీ యిబ్బందిలేదు."రెండడుగులు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకున్నాను, అది షేక్ హేండు అనేకన్నా నా భయాన్ని కప్పి పుచ్చుకుంటూ మనసుకి ధైర్యం చెప్పుకుందికి అన్నట్ట్లుంది. ఈ లోగా లోపల్నుంచి నలుగురు పిల్లలు బిల బిల మంటూ వచ్చి "మామయ్యా"అంటూ మోహనరావుని చుట్టుకున్నారు.అప్పుడు తెలిసింది అతను వీళ్ళకెంత అత్మీయుడో.
గదిలో ప్రవేశించి తల పైకెత్తగానే జీసస్ క్రైస్ట్ ఫొటో నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్ట్లు కనిపించింది.
ఈ రూపంలో నన్ను రక్షించడానికి యిక్కడున్నావా దేముడా అనుకుని చేతులు జోడించి నమస్కరించాను.అది చూసి "ఏసు ప్రభువుని మీరూ కొలుస్తారా?"అంటూ లీనా ప్రశ్నించింది.
"జగద్రక్షకుడైన ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్ముతాను."నిండు మనసుతో చెప్పాను.అల్లకల్లోలమైన మనసు నెమ్మదించి తేలికపడింది.
"పాపకేమైనా తినిపిస్తారా?"అడిగింది లీనా. అప్పుడు నా ఆకలి దప్పులు గుర్తుకొచ్చాయి.మోహనరావు బయిటికి వెళ్ళి యిడ్లీలు పొట్లం కట్టించుకొచ్చి మా ముందు పెట్టాడు.అవి చూడగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.అరగంట ముందు యీ మనిషిని శంకించి తీరని ఒత్తిడికి గురయాను.మంచితనం యింకా చచ్చిపోలేదు.కీడెంచడం మన వంతు మేలు చేయడం భగవంతుని వంతు.మనసా కీడేంచకే అనుకుంటూ తేలికగా వూపిరి తీసుకున్నాను.

పేరులో ఏముంది?

పద్మనాభంగారింటి పక్కవాటాకి 'టు లెట్'బొర్దు పెట్టిన నాలుగు రోజులకి యిల్లు చూడటానికి కుటుంబరావు వచ్చాడు.పద్మనాభం యిల్లు చూపిస్తూ,"మా అబ్బాయిలిద్దరూ పెద్ద చదువులకి వచ్చాక వాళ్ళకోసం ఈ రెండు గదులు కట్టించాను.వుద్యోగాలకై ఒకడు అమెరికా మరొకడు అస్సాం వెళ్ళారు.ఆర్నెల్ల క్రితం ఒక గదిని వంటిల్లుగా మార్చి చిన్న వాటా చేశాను.చిన్న కుటుంబానికి పనికివస్తుందని."క్లుప్తంగా చెప్పారు.
"యిల్లు బాగుంది,అన్నట్లు నా పేరు కుటుంబరావే గాని నాకు కుటుంబం లేదు.ఒంటరివాడిని.ఎ జి ఆఫీసులో అకౌంటెంటుగా పని చేస్తున్నాను.నాలుగు నెలల క్రిందట ట్రాన్స్ఫరు మీద యీ వూరు వచ్చాను.యిన్నాళ్ళు ఒక స్నేహితునితో కలిసి వున్నాను.నేను స్వయంగా వంట చేసుకుంటాను.నా కంటూ ఒక వాటా వుంటే బాగుంటుందని వచ్చినప్పటినుంచి వెతుకుతున్నాను."
"పెళ్ళి కాలేదా? బ్రహ్మచారులకి అద్దెకిస్తే యిబ్బందికరంగా వుంటుందని ఆలోచిస్తున్నాను.యింతవరకు ఎవరికీ యిల్లు అద్దెకి యివ్వలేదు." నసిగారు పద్మనాభంగారు.
"నాకింకా పెళ్ళికాలేదు.బ్రహ్మచారినని మీరు శంకించే పనిలేదు.నాకెటువంటి దురలవాట్లు లేవు.స్నేహితులు, తిరుగుళ్ళు నాకలవాటులేదు.వుదయం వంట చేసికుని అన్నం తిని పదింటికి ఆఫీసుకెళితే అయిదున్నరకి యిల్లు చేరుకుంటాను.రాత్రి కొసం వండుకోవడం తొందరగా భోజనం చేసి ఏదైనా పుస్తకం చదువుకుని నిద్రపోవడం. నావల్ల మీకెటువంటి యిబ్బంది కలుగదు.మీకంగీకారమై అద్దె ఎంతో చెపితే వచ్చే వారం సామాన్లతో వస్తాను."
"ఒక సారి నా భార్యతో కూడా సంప్రతించి చెపుతాను.మా యింట్లో కాసేపు కూర్చోండి,"అంటూ ఆహ్వానించారు.
'సరే'నంటూ వాళ్ళ వాటాలోకి వెళ్ళాడు కుటుంబరావు.పద్మనాభం గారిని అన్నపూర్ణమ్మని చూస్తే ఎంతో గౌరవభావం కలిగింది.అద్దె నాలుగు వేలు రెండు నెలల అద్దె అద్వాన్సు చెప్పేరు.రెండో మాట లేకుండా పన్నెండు వేలు చేతిలో పెట్టాడు.చూడటానికి మర్యాదస్తుడిలా వున్నాడు,యిల్లు ఖాళీగా వుండేకన్నా ఎవరో ఒకరుంటారని సంతృప్తి పడ్డారు.
మరుచటివారం సామాన్లతో వచ్చాడు కుటుంబరావు.చిన్న సంసారానికి తగిన అన్ని హంగులు వున్నాయి.శనివారం వచ్చి ఆదివారం సాయంత్రానికి అన్నీ అమరికగా సర్దుకుని,సోమవారం పదయేసరికి ఠంచనుగా ఆఫీసుకు స్కూటరు మీద బయలు దేరాడు.అన్నపూర్ణమ్మగారి పని మనిషిని వుదయాన్నే యిల్లు శుభ్రం చేసి గిన్నెలు తోమటానికి కుదుర్చుకున్నాడు.నెల రోజులు అతని దినచర్య చూసిన పద్మనాభందంపతులకి ముచ్చటవేసింది.రోజూ రాత్రి ఎనిమిదిన్నర అయేసరికి భోజనం చేసి వీధి వరనండాలో కుర్చీ వేసుకుని ఒక అరగంట కూర్చునేవాడు.అదే సమయానికి పద్మనాభంగారు కూడా బయట కూర్చునేవారు.వరండా కామన్ అవటంతో ఆ అరగంటా కుశల ప్రశ్నలు పిచ్చాపాటీ నడుస్తుండేది.
పద్మనాభంగారు కూడా ఎ జి ఆఫీసులో సూపరెంటెండెంటుగాచేసి రిటైరు అయ్యారు. ఆ కారణాన కుటుంబరావుని అభిమానంగా చూసేవారు.
ఏ సమయంలో కుటుంబరావు వుంటున్న వాటాలోకెళ్ళినా యిల్లు అద్దంలా వుండేది.యిల్లాలు వున్న యింట్లో కూడా అంత తీరుగా వుండదేమో అనిపించేది.వంటింట్లో గిన్నెలూ డబ్బాలు సర్దుకున్న తీరు చూసి అన్నపూర్ణమ్మగారు "బాబూ నీ యిల్లు చూడముచ్చటగా వుంది. బ్రహ్మచారులకు కూడా యిల్లు యివ్వ వచ్చని నిస్సందేహంగా చెప్పొచ్చు.నిన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు."
"అలా అనకండి పిన్నిగారూ!నా తలిదండ్రులు ధన్యులేమో గాని నేను ధన్యుడినిగాను.నా చిన్నప్పుడే అమ్మా నాన్నాపోతే తాతగారూ నాయనమ్మా నన్ను పెంచారు.మా నాయనమ్మకి ప్రతి పనిలో సహాయపడేవాడిని.వాళ్ళిద్దరూ కాలం చేసి అయిదేళ్ళవుతోంది.
"అయ్యో అలాగా మరి మీ స్వగ్రామం?"
"వేములవాడలో మా తాతగారి యిల్లు కొంత ఆస్తి వున్నాయి ఎప్పుడైనా చూసి వస్తుంటాను."
ఆర్నెలలు గడిచాయి,కుటుంబరావుని కొడుకులా చూసుకునేవారు.అతను కూడా యింటి యజమానులలా కాకుండా పెద్దలనే గౌరవాభిమానాలతో మసలుకునేవాడు.
ఒక రోజు రాత్రి అన్నపూర్ణమ్మ బెడ్రూములో వాళ్ళింటిని కలిపే తలుపుని గట్టిగా తడుతూ "బాబూ కుటుంబరావ్ ఒక్కసారి లేస్తావా?"కాస్త గట్టిగానే పిలుస్తున్నాది.వెంటనే లేచి వెళ్ళాడు.
"మీ బాబయ్యగారు బాత్రూముకని లేచి మంచినీళ్ళు అడిగితే యిచ్చాను.గ్లాసు పట్టుకోలేదు.అడ్డంగా మంచం మీద పడిపోయారు.మన స్పృహలేదు పిలిస్తే పలకటం లేదు."
ముఖం మీద నీళ్ళు జల్లి తువ్వాలుతో తుడిచాడు."మీరేం కంగారు పడకండి,ఆటో తెస్తాను హాస్పిటల్ కి తీసుకెళ్దాం."క్షణం ఆలస్యం చేయకుండా స్కూటరు తీసి ఆటో తెచ్చాడు.
ఆటో డ్రైవరు సాయంతో పద్మనాభంగారిని ఆటోలో కూర్చో పెట్టి అన్నపూర్ణమ్మగారిని పట్టుకు కూర్చోమని, స్కూటరుతో ఫాలో అయాడు.అన్ని పరీక్షలు చేసి బి పి లో అయిందని మందువేసి డ్రిప్సు పెట్టారు. నాలుగు రోజులు హాస్పిటల్లో వుంచి పరీక్షిస్తామన్నారు దాక్టర్లు.
"కంగారు పడకండి పిన్నిగారూ అంతా సర్దుకుంటుంది.బాబయ్యగారికేమీ కాలేదు.మీ అబ్బాయికి ఫోను చెయ్యమన్నారా?"
"ఫోను చేసి హాడావిడి పెట్టొద్దు బాబూ,కోడలు వుద్యోగం పిల్లల చదువులు.అవకాశం చూసుకుని వచ్చి చూడమని చెపుతాను.యిక్కడికి పది కిలో మీటర్ల దూరంలో వున్న పల్లెటూర్లో మా ఆడబిడ్డ,వాళ్ళమ్మాయి వున్నారు.వాళ్ళకి ఫోను లేదు.మనిషి వెళ్ళి తీసుకొస్తే వెంటనే వస్తారు."
"అడ్రసు యివ్వండి నేను వుదయాన్నే వెళ్ళి తీసుకువస్తాను."
"మా ఆడబిడ్డకి వుత్తరం వ్రాస్తాను,నువ్వెవరో ఆమెకి తెలియదుకదా. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు."
వుదయం టాక్సీ తీసుకెళ్ళి వుత్తరం చూపించి పద్మనాభంగారి చెల్లెలిని మేనకోడలిని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు కుటుంబరావు.వాళ్ళిద్దరినీ చూడగానే అన్నపూర్ణమ్మకి కొండంత ధైర్యం వచ్చింది. పద్మనాభంగారి ఒంట్లో కూడా కాస్త నెమ్మదించింది.కుటుంబరావు సహాయానికి పదే పదే ధన్యవాదాలు చెప్పారు భార్యా భర్తలిరువురూ.
"మీరేమీ వర్రీ అవకండి బ్బాబయ్యగారూ, ఏ సహాయం కావాలన్నా మీ అబ్బాయికి చెప్పినంత చనువుగా చెప్పండి. ఈ రోజు ఆఫీసుకి శలవు పెడతాను."ఈ మాటలు విన్న అన్నపూర్ణమ్మకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
పద్మనాంభంగారి చెల్లెలు సుభద్రమ్మ ఆశ్చర్యపోయింది. యింట్లో అద్దెకున్న అబ్బాయి యింటి మనిషిలా సాయం చేస్తూంటే,"ఏ అమ్మ కన్న బిడ్డో గాని ఈ కాలంలో యిటువంటి వాళ్ళుండటం అరుదు" అంది వదినతో.
"వదినా నువ్వు అన్నయ్య దగ్గరుండు నేను,రాజీ యింటికెళ్ళి వంటచేసి మీ యిద్దరికీ భోజనం తెస్తాము."
"పిన్నిగారూ మీరూ యింటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవండి. మీరు భోజనం చేసి వచ్చేవరకు నేను బాబాయిగారి వద్ద వుంటాను.'
"నీకింకా శ్రమ నాయనా.రాత్రినుండి ఒక్క క్షణం విశ్రాంతి లేదు."
"మీరు పెద్దవారు మీరు రెస్టు తీసుకోండి నాకేమీ శ్రమలేదు."
యింటికెళ్ళిన వదినా ఆడబిడ్డలిద్దరూ పద్మనాభంగారి అనారోగ్యం కన్నా కుటుంబరావు మంచితనాన్నే గుర్తు చేసుకున్నారు.
నాలుగోనాడు డిశ్చార్జి అయి యింటికొచ్చారు పద్మనాభంగారు.మందులు వాడుతూ రెస్టు తీసుకోమన్నారు డాక్టరు. ఆ రోజే పెద్దకొడుకు ఫ్లైటులో వచ్చి ఒకరోజుండి వెళ్ళాడు శలవు లేదంటూ.
సుభద్రమ్మ తనూ వెళ్తానంది."అయ్యో అప్పుడేనా నాలుగు రోజులుండు తొందరేముంది?" నిలదీసింది ఆడబిడ్డని.
"యింటి దగ్గరున్న ఖాళీ స్థలంలో మనిషిని పెట్టి కూరలు పండించుతున్నాను.మాకు కావలిసినవి అట్టే పెట్టుకుని మిగిలినవి మార్కెత్లో అమ్మించి వచ్చిన డబ్బులు నేనుసగం పనివాడు సగం తీసుకుంటాం.నేను లేకుంటే పనులు సజావుగా సాగవు కావాలంటే మళ్ళీ వస్తాను"
"సరే నువ్వంత చెప్పాక కాదనడమెలా? పోనీ రాజేశ్వరిని ఒక నెలరోజులు నాకు సహాయంగా వుంచు."సరేనని సుభద్రమ్మ ఒక్కతే వూరికి వెళ్ళింది.
పద్మనాభంగారు హాస్పిటలు నించి యింటికొచ్చిన దగ్గరనుండి రోజూ ఆఫీసుకెళ్ళేముందు ఎలా వున్నారో పరామర్శించి,ఏమైనా కావాలా అడిగి వెళ్ళేవాడు కుటుంబరావు.సాయంత్రం వస్తూ పండో కాయో స్వీటొ తెచ్చి చేతిలో పెట్టేవాడు.
'ఏ నాటి ఋణమో యిలా తీర్చుకుంటున్నావు నాయనా! నీ వద్ద అద్దె వసూలు చెయ్యటానికి జంకుగా వుందయ్యా కుటుంబరావ్."
"అంత మాటనకండి బాబయ్యగారూ మీతో వుంటే నేను ఒంటరి వాడినన్న విషయం జ్ఞప్తికి రాదు."
ఆ రోజు అన్నపూర్ణమ్మ భర్తనడిగింది,"మీ చెల్లిని సంప్రతించి కుటుంబరావుకి రాజేశ్వరినిస్తామని అడిగితే బాగుంటుందనుకుంటున్నాను,మీరేమంటారు?మీ బావ పోయాక రాజీకి సంబంధం చూసే బాధ్యత మీమీదే వుందికదా!మూడేళ్ళు తండ్రి జబ్బుతో వున్నాడని పెళ్ళికి సుముఖత చూపలేదు. తండ్రి పోయాక తల్లి ఒంటరిదైపోతుందని ఆగమంది. చూస్తూ చూస్తూ ముఫై రెండేళ్ళు దాటుతున్నాయి. కుటుంబరావు  ముఫై అయిదేళ్ళన్నాడు. యింత మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?"
ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళ బుర్ర పాదరసంలా పని చేస్తుందనుకున్నాడు.ఆలోచనలో అంకురార్పణ జరగగానే క్రియా రూపానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు పద్మనాభం దంపతులు.
సుభద్రమ్మని అడగగానే తన అంగీకారం తెలిపింది.అద్దెకున్న అబ్బాయితో పెళ్ళి ప్రస్తావన తేవడం యిష్టమేనా అని రాజేశ్వరిని అడిగింది అన్నపూర్ణమ్మ.
"అన్నీ బాగున్నాయిగాని పేరే బాగులేదు.కుటుంబరావు అనగానే గంపెడు పిల్లలు పేదరికంతో క్రుంగిపోతున్న బడుగు వ్యక్తి కళ్ళముందు కనిపిస్తాడు."వినగానే ఘొల్లున నవ్వింది,"నయం నాతో అన్నావు సరిపోయింది యింకెవరితో అన్నా నవ్విపోతారు." "యిప్పుడు నువ్వు కూడా నవ్వావు కదా అత్తా!"
ఒక్క సారి ఆ అబ్బాయి యిల్లు చూస్తే ఆ మాటనవు.అతని వుద్దేశమేమిటో కూడా తెలుసుకోవాలి.నీ పెళ్ళయిపోతే మీ అమ్మకి నిశ్చింత.సరిగ్గా చెప్పు అడగమన్నావా? లేదా?"
మీ యిష్టం అత్తా మీ అందరికీ ఏది మంచిదనిపిస్తే అదే చేయండి."
ఆదివారం నాడు తమ యింటికి భోజనానికి ఆహ్వానించారు కుటుంబరావుని.
"పిన్నిగారిని శ్రమ పెడతారెందుకు? నాకలవాటే కదా వండుకోవడం."
"మాతోపాటే పట్టెడన్నం పెట్టడానికి శ్రమేమిటయ్యా,మరేమీ అడ్డు చెప్పకు."పరంధామయ్యగారు నిక్కచ్చిగా చెప్పారు,కాదనలేకపోయాడు.
భోజనానికి వస్తూ పళ్ళు స్వీట్లు తీసుకొచ్చాడు కుటుంబరావు."యివన్నీ దేనికయ్యా?యిచ్చేది ఈత పండు తీసుకునేది తాటి పండు అన్నట్లుంది."
"భలే సామెత చెప్పేరుగాని మీ అభిమానాన్ని ఈత పండుతో పోల్చడం భావ్యం కాదు."
భోజనాల సమయంలో రాజేశ్వరి వడ్డనలో సహాయం చేస్తుంటే గమనించాడు,చామన ఛాయ అయినా చారెడేసి కళ్ళు నల్లగా ఒత్తయిన పొడవాటి జడ నవ్వు ముఖం కళైన పిల్లే అనుకున్నాడు.యిన్ని సార్లు చూసినా ఒక్క మాటైనా మాట్లాడటం వినలేదు అనుకున్నాడు.వెంటనే ఆ కోరికా తీరింది.
"పెరుగు వడ్డించమ్మా."
"అలాగే మామయ్యా."వీణమీటినట్లుంది స్వరం మనసులోనే అనుకున్నాడు.ఈ రోజు మనసెటు పోతోంది అనుకుంటూండగానే కంచంలో సగానికి పెరుగు వేసింది రాజేశ్వరి.
"అరెరే! యింత వేసేశారేమిటి నేను చూసుకోలేదు." ఫక్కున నవ్వి లోపలికెళ్ళిపోయింది.
భోజనాలయాక హాల్లో కూర్చుని లోకాభిరామాయణం మొదలుపెట్టారు.మాటల మధ్య చెల్లెలి కుటుంబ స్థితిగతులు బావ పోవటం తరువాత చెల్లి మేనకోడలు కలిసి ఆస్థిపాస్థులు చక్కబెట్టుకుంటూ పల్లెటూర్లో నెట్టుకు రావటం చెప్పుకొచ్చారు.
"మీ మేనకోడలి చదువు ఆ పల్లెటూర్లో ఎలా సాగింది?"
"పదో క్లాసు వరకు అక్కడి స్కూల్లో పూర్తి చేసింది.ఇంటరు రెండేళ్ళు మా యింట్లో వుండి చదువుకుంది. పైవేటుగా బి ఎ, ఎం ఎ చేసింది చాలా తెలివైన పిల్ల.కుటుంబం కోసం పెళ్ళి వాయిదా వేసుకుంది.తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తల్లి ఒంటరిదైపోతుందని చింత.యిలా ఎన్నాళ్ళు చెప్పు? ఈ సంవత్సరం రాజీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాం.అమ్మాయిని చూశావు, నీకు ఆమెని చేసుకునే వుద్దేశం వుంటే చెప్పు.తొందరేం లేదు అలోచించుకుని చెప్పు.యిలా డైరెక్టుగా అడిగానని మరోలా అనుకోకు నీకు తండ్రిలాంటి వాడిని.కావాలంటే రాజేశ్వరితో మాట్లాడు."
యింతలో ఆడవాళ్ళ భోజనాలయి హాల్లోకి వచ్చారు.
"రాజీ వక్క పొడిగాని, ఏలకులుగాని తెచ్చిపెట్టమ్మా." లోపలికెళ్ళి ఏలకులు తెచ్చింది.ఏలక పండు తీసుకుంటూ రాజీ కళ్ళలోకి చూశాడూ కుటుంబరావు.ఈ ప్రస్తావన ఆమెకి ముందుగానే తెలిసినట్ట్లు అర్ధమయింది.
సాయంత్రం పెరట్లో పువ్వులు కోస్తుండటం గమనించి,రాజీని నిలదీసి అడిగాడు.
"మీ మామయ్యగారు నీ గురించి ప్రపొజ్ చేశారు.నీ వుద్దేశమేమిటో స్వయంగా తెలుసుకుందామని,"అగాడు.
సిగ్గు పడి పారిపోయే చిలిపి వయసు కాదు నిర్మొహమాటంగా చెప్పింది."మీ గురించి విన్నాక అభ్యంతరం చెప్పడానికేమీ లేదు.మీ పేరొక్కటే నచ్చలేదు.పాత కాలం వాళ్ళలాగ 'యిదిగో' 'మిమ్మల్నే' అనలేను.మీ పేరుని ఏ విధంగాను పొట్టి చేసి పిలవలేను అదొక్కటే సమస్య."
పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చినా అతి కష్టం మీద ఆపుకున్నాడు."ఈ సమస్యకి పరిష్కారం వుంది.వున్న పేరుని ప్రస్తుతం మార్చుకోలేను. మా తాతగారు నన్ను 'చంటీ' అని పిలిచేవారు,మా నాయనమ్మ 'బబ్లూ' అని పిలిచేది. ఈ రెండింటిలో ఏ పేరుతోనైనా పిలవచ్చు,లేదా కొత్తగా ముద్దు పేరేదైనా పెట్టుకోవచ్చు.ఈ సమస్య సెటిల్ అయనట్లనిపిస్తే పెద్దవాళ్ళకి మన అంగీకారం చెప్పేద్దాం.ఓ కే నా?"అనుకున్నంత బుద్ధావతారం కాడు సరసుడే! అనుకుంది."సరే ముందు మన అంగీకారం తెలియజేద్దాం,తాపీగా ఏ పేరుతో పిలవాలో ఆలోచిస్తాను."
సంగతంతా విన్న అన్నపూర్ణమ్మ పద్మనాభంగార్లు ' ఓర్నీ! వీళ్ళిద్దరూ అసాధ్యుల్లా వున్నారే'అని నవ్వుకున్నారు.

కిరణోదయం

గిరిజకి అమ్మ వద్దనుండి ఫోను వచ్చింది."హలో! గిరిజా సంక్రాంతి పండక్కి నువ్వూ గాయత్రి వస్తే బాగుంటుంది.తనకి కూడా చెప్తాను. మూడేళ్ళయింది మీరంతా వచ్చి అన్నయ్యకి రావటానికి వీలు పడదన్నాడు.మీరిద్దరూ రావడానికి ప్రయంతించండి. అల్లుడు కూడా శలవు పెట్టి వస్తే మాకు సంతోషం.అరుణ్ ఎలా వున్నాడు?"అమ్మ కామా పుల్ స్తాపు లేకుండా చెప్పేసింది .
"సరే రావటానికి ప్రయత్నిస్తాను.నాన్నా నువ్వూ బాగున్నారుకదా?"
గాయత్రి వీలు కాదంది , మా వారు శలవు లేదన్నారు. నేనయినా అరుణ్ ని తీసుకుని వెళ్తే అమ్మా నాన్నా సంతోషిస్తారని పండగ నాలుగు రోజులుందనగా బయలు దేరాను. మా వూరు చేరగానే అమ్మని అడిగిన మొదటి ప్రశ్న జానకి ఎలా వుందని.
"ఏమోనే నాకూ వెళ్ళటానికి వీలుంపడటం లేదు.వెంకటాద్రి మామయ్య పోయాక నాన్న వెళ్ళటం తగ్గించేశారు. నేను ఏ పూజకో పేరంటానికో బయటకు వెళ్తే ఒక సారి వాళ్ళింటికి వెళ్తుంటాను."
మర్నాడు జానకి యింటికి వెళ్ళాను.జానకి పెద్ద కొడుకు తలుపు తీశాడు."అమ్మేదిరా?'అనగానే అమ్మమ్మా! గిరిజత్తయ్య వచ్చింది చూడు."అని లోపలికి వెళిపోయాడు.కమలత్తయ్య వచ్చి "ఎప్పుడొచ్చావు గిరిజా?"అంది ?నిన్ననే అత్తయ్యా జానకేదీ?" "యింట్లో లేదమ్మా పని మీద వెళ్ళింది.రావడానికి టైము పట్టవచ్చు. యింట్లోకి రమ్మన లేదు కూర్చోమనలేదు. ఏమయింది అత్తయ్య యిలా ప్రవర్తిస్తున్నాది.అనుకుంటూ "సరే నేను వచ్చానని జానకికి చెప్పు తరువాత వస్తాను" అని వచ్చేశాను.
ఇంటికి వచ్చి విషయం అమ్మకి చెప్పి "ఆశ్చర్యంగా వుంది ,జానకి యింట్లో లేకపోతే కనీసం నన్ను యింట్లోకి రమ్మన లేదు. మన రెండిళ్ళమధ్య వున్న యింత స్నేహం ఏమయిందమ్మా?"అంటూ వాపోయాను."పోనీలే మామయ్య పోయినప్పటినుండి అత్తయ్య చాల ఒంటరి అయిపోయింది. అందుకే అలా ప్రవర్తించి వుండవచ్చు.తాపీగా కనుక్కుందాంలే"
జానకి గిరిజ స్నేహితులు క్లాసుమేట్లు, యింతే కాక గిరిజ తండ్రి జానికి తండ్రి క్లాసుమేట్లు.ఏనాటి స్నేహమో ఎప్పుడు కలిసినా ఆప్యాయంగా పలకరించుకోవడమే తప్ప ముఖం తిప్పుకోవడాలు ఎప్పుడు జరగలేదు.
ఈ సంఘటన పక్కన పెట్టి పండుగ పనుల్లో సహాయం చేయసాగింది గిరిజ.పండుగ నాడు "పసుపు కుంకుమ పళ్ళు యిచ్చి వద్దాం వస్తావా?"అని తల్లి అడిగితే "యింటికి వచ్చే ముత్తయిదువులకు నేను తాంబూలం యిస్తాను.నువ్వెళ్ళి రామ్మా"అన్నాను.
రెండో వీధిలో వుండే జానకి యింటికే బయలు దేరింది సరస్వతి.తలుపు తట్టగానే కమలమ్మ తలుపు తీసింది,"రా వదినా బాగున్నావా?గిరిజ రాలేదా?""లేదు పిల్లడు ఒక్కడే యింట్లో వుండాలి అందుకే రాలేదు.అన్నట్లు జానకి ఏదీ బొట్టు పెట్టి తాంబూలం యిస్తాను."
చేయి పట్టుకుని మూల గదిలోకి తీసుకెళ్ళి "ఏం చెప్పమంటావు వదినా, అల్లుడి ప్రవర్తన ఉప్పూ నిప్పూలా వుంది.జానకిని చూస్తే మండి పడుతున్నాడు.ఆరోజు జానకి వచ్చినప్పటికి మూడు రోజులనుంచి ఘర్షణ నడుస్తోంది. పిల్ల తిండి నిద్ర మరిచి కంటికీ మింటికీ ఏడుస్తోంది.పెద్దరికం వున్నా ఆడదాన్ని ఏమీ మాట్లాడలేకపోతున్నాను. మీ అన్నయ్య వుంటే ఏం పరిష్కారం చేసే వారో.ఒక్కగానొక్క పిల్ల అని రాఘవని యిల్లరికం తెచ్చుకున్నాం.ఏడాదికొకరు చొప్పున ముగ్గురు కొడుకులు పుట్టారు.అంతా బాగుందనుకుంటున్న సమయంలో శని దాపురించింది. రెండు నెలలై ఎవ్వరికీ మనశ్శాంతి లేదు.
"కారణం ఏమిటి వదినా? నాకు చెప్పు మీ అన్నయ్య రాఘవని మందలిస్తారు."
"అబ్బో రాఘవ యిప్పుడు చాలా ఎత్తుకెదిగిపోయాడు వదినా ఎవరి మాటలు వినే స్థితిలో లేడు తను చెప్పిందే వేదం.యింక మా యింట పండుగ పున్నం లేదులా వుంది."
శాంతంగా కూర్చోబెట్టి అసలు విషయం తెలుసుకుంది సరస్వతి.జానకికి మూడో అబ్బాయి పుట్టగానే రాఘవ వేసక్టమీ ఆపరేషను చేయించుకున్నాడు.అదో పెద్ద వార్తలా పల్లెటూర్లో బాగానే ప్రచారమైంది. చిన్నవాడు ఎనిమిదేళ్ళ వాడయాక జానకి గర్భవతైంది.రెండు నెలలయేదాకా ఏమీ అనుకోలేదు.తరువాత నర్సు పరీక్షించి నిర్ధారణగా తెలిపింది.అప్పటినుంచి యింట్లో తుఫాను మొదలైంది.తను ఆపరేషను చేయించుకున్నాక జానకి గర్భవతెలా అయిందని రోజూ గొడవ.ముగ్గురు బిడ్డల తల్లిని అనుమానించటం పాపం అని ఏడ్చినా జాలి కలగలేదు.
రోజూ ఏదో ఒక సందర్భంలో మాటల యీటెలతో జానకిని బాధ పెట్టడం,ఎవరితోనూ మాటా పలుకూ లేకుండా బయట తిరిగి రావటం చేస్తున్నాడు రాఘవ. జానకి వేసే ఒట్లు సత్యాలు ఎందుకూ కొరగాకుండా పోతున్నాయి.
విషయాలన్నీవిన్నాక  సరస్వతి అడిగింది"జానకి ఏదీ?
"ఈ రెండు నెలలై స్టొర్ రూములో వుండటం పడుక్కోవడం చేస్తున్నాది.వంట పని చూసి లోపలికెళిపోతోంది.నేనే అల్లుడికి పిల్లలకి అన్నం పెడుతున్నాను పిల్లలు యీ పరిస్థితి చూసి బెంగ పడిపోతున్నారు.నాకు దారీ తెన్నూ కనిపించటం లేదు.ఈ వార్త బయటికి పొక్కితే దావానలంలా వ్యాపించి మా కుటుంబాన్ని రాబందుల్లా పీక్కు తింటారు.అందరం కట్టగట్టుకు ఏ గంగలోనో దూకడం మినహా గత్యంతరం లేదు వదినా." అంటూ భర్త పోయిన నాటి కన్న ఎక్కువ దుఖంతో చెప్పింది కమలమ్మ.
తిన్నగా స్టొరులోకెళ్ళింది సరస్వతి. అశోకవనంలో సీతలాగే అనిపించింది జానకి. ముగ్గురు బిడ్డల తల్లయినా పచ్చగా పసిడి బొమ్మలా వుండే జానకి నలుపు రంగుకి మారి కళ్ళ చుట్టూ మసి పూసినట్ట్లయి జీవం లేనట్ట్లుంది. "జానకీ" అనగానే సరస్వతిని అల్లుకుపోయి "అత్తయ్యా! నా ముఖం అందరికీ ఎలా చూపించను? నేను నిర్దోషినని ఎలా నిరూపించుకో గలను? గిరిజ వచ్చిందని తెలిసినా బయటకు వచ్చి స్నేహితురాలిని పలుకరించలేని అశక్తత.ఏం చూసుకుని బ్రతకాలి?"బావురుమంది.
" వూరుకో జానకీ ఏడవకు.నీ కొడుకుల్ని చూసుకుని బ్రతకాలి నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకోసం బ్రతకాలి.నేను చెప్పేది జాగ్రత్తగా విను.యిలా అధైర్యంగా బేలగా ఏడుస్తుంటే నీ భర్త ఎప్పటికీ నువ్వు నిర్దోషివనుకోడు.నువ్వు అమాయకురాలివి, నువ్వు ఏ తప్పు చేయలేదు ఊరందరూ ఆమాట ఒప్పుకోగలరు అందులో ఏమీ సందేహం లేదు. నీ భర్తకి ఒక్కటే చెప్పు పట్నం వెళ్ళి పెద్ద హాస్పిటల్ లో యీ పరిస్థితి వివరించితే ,తన ఆపరేషను విఫలమయిందా లేదా అన్నది వాళ్ళు పరీక్షించి చెపుతారు. బిడ్డ పుట్టిన తరువాత ఒక పరీక్ష వుంటుంది.అది తండ్రీ బిడ్డలిద్దరికీ చేస్తారు.అదికూడా చేయించుకోమను.వీటి ఫలితాలని బట్టి నీకు ఏ శిక్ష వేసినా భరిస్తాననిచెప్పు.కనీసం తన పరీక్ష అయేదాకా శాంతంగా వుండమను.ఏమీ భయపడకుండా నిలిచి పోరాడు,నీవెనుక మేమంతా వున్నాం.అంటూ బొట్టు పెట్టి తాంబూలం యిచ్చి కమలమ్మకి కూడా ధైర్యం చెప్పి, మరింకే యింటికి వెళ్ళే మనసు లేక యిల్లు చేరింది సరస్వతి.
తల్లి చెప్పిన విషయం విని గిరిజ నిర్ఘాంతపోయింది.ఎంత అన్యోన్య దాంపత్యామైనా నమ్మకం తగ్గగానే బ్రతుకు నరకం అయిపోతుందన్నదానికి జానకి నిదర్శనం. మూడొ నాడే తన ప్రయాణం వెళ్ళి కలుసుకోవాలా వద్దా అని మీమాంస పడింది. అమ్మ చెప్పినట్లు అమలు చేస్తే పరిస్థితి చక్కబడుతుంది.తను వెళ్ళి బాధని కెలకడం ఎందుకని ఊరు ప్రయాణమైంది.
మరుచటి వారం అమ్మ ఫోను చేసింది రాఘవ పట్నం వెళ్ళి పరీక్ష చేయించుకుంటే ఆపరేషను విఫలమైందని ,యిటువంటి సంఘటనలు వేలలో ఒకటి సంభవించవచ్చని భార్యని అనుమానించకుండా జాగ్రత్తగా చూసుకోమని పెద్ద దాక్టరు చెప్పారుట.అప్పటినుంచి రాఘవ కాస్త శాంత పడ్డాడుట. అమ్మయ్య! కొంత నిశ్చింత అనిపించింది.పాపం జానకి ఈ పరిస్థితి నెలా భరించిందో.నిజంగా భూదేవికున్నంత సహనం వుందనుకున్నాను.
తొమ్మిదినెలలు నిండగానే పట్నం తీసుకెళ్ళి హాస్పిటల్లో పురుడు పోసుకున్నాక డాక్టరు సలహా మీద జానకికి ఆపరేషను చేయించారు. ఆడపిల్ల పుట్టింది.మూడోనాడు డి ఎన్ ఎ పరీక్ష చేసి రాఘవే ఆ బిడ్డకి తండ్రి అని సర్టిఫికేట్ యిచ్చారు.అది చూశాక రాఘవ చాలా సిగ్గు పడ్డాడు,చదుకున్న తనే మూర్ఖుడిలా ప్రవర్తిస్తే యిక చదువులేని వాళ్ళ సంగతేమిటి అని జానకికి పదే పదే క్షమాపణ చెప్పాడు.
కారు మబ్బులు విడిచినట్లుందని తల్లితో అంది జానకి."అమ్మా అసలు జానకి ఆరు నెలలు పరాయి యింట చెరలో వుంటే నా యింట్లోనే నేను ఏడు నెలలు చెరలో వున్నాను.నాచెర విడిచినా ఊర్లో యీ సర్టిఫికేటు చూపిస్తూ తిరగం కదా, యీ బిడ్డని గూర్చి ఏమని చెప్పాలి?"
అక్కడే వున్న రాఘవ"యీ విషయంలో నువ్వేమీ చింత పడకు.వూర్లోవాళ్ళకి చెప్పడం నావంతు."నిశ్చింతగా వూపిరి తీసుకుంది జానకి.
"పిచ్చిదానా అనేవాళ్ళు ఎప్పుడూ అంటూనే వుంటారు.వాళ్ళకి కూడా తెలియాలి అప్పుడప్పుడు యిటువంటి విడ్డూరాలు కూడా జరుగుతుంటాయని."తల్లి జానకిని ఓదార్చింది.
అనుకోకుండా గిరిజ పుట్టింటికి వచ్చింది.జానకిని అభినందించి,"నీ జాతకంలో ఆడపిల్ల రాసి పెట్టి వుంటుంది.ఎంత కాదనుకున్నా డాక్టర్లని సవాల్ చేస్తూ యీ పాప పుట్టింది.ఏం పేరు పెడతావ్?బాలసార ఘనంగా చెయ్యి.జరిగిందంతా పీడకలలా మర్చిపో."అంటూ స్నేహితురాలిని వుత్సాహ పరిచింది గిరిజ.వీళ్ళ మాటలు విన్న రాఘవ "నాలాంటి మూర్ఖుడు మరొకడుండడు. యిన్నాళ్ళూ కలిసి బ్రతికి ఎంత హీనంగా ప్రవర్తించానో గుర్తుకొస్తే నా మీద నాకే అసహ్యమేస్తోంది. సరైన సమయంలో మీ అమ్మగారు సలహా యివ్వకుంటే యీ సంసారం ఛిన్నాభిన్నమైపోయి వుండును."
బాలసారనాడు నామకరణం చేస్తూ"కిరణ్మయి"అని పేరు పెట్టాడు.కొంత విషయం ముందుగానే తెలిసినా వచ్చిన బంధువులకు స్నేహితులకు తన కధ వినిపించి, ఎప్పుడయినా యిటువంటివి సంభవించినప్పుడు మనో ధైర్యం వీడకుండా ప్రవర్తిస్తే చాలా బాగుంటుది. చంటి బిడ్డని ఎత్తుకుని ముద్దాడుతూ పై మాటలు చెప్పాడు. జానకిలోని బెరుకు పోయి వెన్నెలకురిసినట్లు మల్లెలు విరిసినట్లు నవ్వింది.

21 May, 2013

జీవన సంఘర్షన


కధ ప్రారంభించటానికి కాకులు దూరని కారడవి చీమలూ దూరని  చిట్టడవి అంటూ మొదలు పెట్ట నక్కర లేదు. అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి, అక్క బాల వితంతువు చెల్లి నడి వయసు వితంతువు.పిల్ల పీచూ బాదరాబందీ లేదు.ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి  కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త   వదిలి వెళ్ళిన  చిన్న ఇల్లు. వూరి వాళ్ళంతా చింత పడేవారు ఈ ఇద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి  లాగించుతారని . భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.
బ్రతికినంత కాలం బ్రతుకు ని లాగుకునో  నెట్టు  కునో  నడపాల్సిందే!   చిన్నామెకు  దిష్టి మంత్రం ,తేలు మంత్రం  యిరుకు మంత్రం చప్పి మంత్రం  వచ్చు.పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు.. యుక్తిగా తేలు మంత్రం వేయించు కునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు.మంత్రించిన తరువాత రూపాయి కొంత పప్పు బియ్యం ఉంచుకుని కొద్దిగా పప్పు బియ్యం మిగిల్చి ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తెలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్ద మానేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .
దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదరగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు.వీటితో వారి దినం తిరుతూందా అంటే తీరదు  కానీ వారి కాఫీ లోకి కొంత పంచదార సరిపోతుంది.ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు.ఆవిధంగా పిల్లలు వారితో పాటు తల్లులు వచ్చేవారు.
ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి  వెళ్లి " ఏం చేస్తున్నారు అమ్మడూ ?"అంటు పలకరించేది .ఫ్రిజ్ లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి మంచి వాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి ,"అమ్మడూ !యీ నాలుగూ ఎండి పోయాయి తీసుకు వెళ్ళనా ? నువ్వైనా అవతల వేసేదే కదా ! ఏదో పెద్ద వాళ్ళం కురో పచ్చడో చేసుకుంటాం ,సరేనా అమ్మా!" అన్నాక కాదనడానికి ఇల్లాలికి నోరు రాదు .
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి "అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి  చేసింది ."ఉన్నంత లో గిన్నెలో పోసే వారు .తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు .
వారి స్వభావాల్ని చూసి వూరి వాళ్ళు ఏదో విధంగా వారికి సహాయం చేద్దామని ,మహాలయ పక్ష మని స్వయం పాకము వాళ్ళు కట్టుకునే తెల్ల చీరలు బెల్లం ముక్క యిచ్చేవారు .కాయ కూర పండు ఎవరు అభిమానం తో ఏమిచ్చినా కాదనకుండా స్వీకరించే వారు .చదువు లేకున్నా వుద్యోగాలు లేకున్నా కేవలం మాట మంచి తనం ,యుక్తి తో జీవిత రధాన్ని నడప వచ్చని రుజువు చేశారు ,ఆ వితంతు సోదరీ మణులు .

పాము భయం


Image
"ఇంటిలొ పాము దూరింది బాబోయ్ సాయానికి రండి,పాము పాము"అంటూ సోమిదేవమ్మ పెట్టిన కేకలు విని, వీధిలో వెళ్తున్నకరీం భాయ్ గోద పక్కనున్న కర్ర చేతిలో తీసుకుని "ఎక్కడ?ఎక్కడ?అంటూయింట్లో కి దూసుకెళ్ళాడు.భయంతో బిక్క చచ్చి గోడకతుక్కుపోయి నోటమాట రాక పాము దూరిన వైపు చేయి చూపింది.పాత కాలం యిల్లు పట్ట పగలైనా వెలుతురు తక్కువగావుండి మసకగా వుంది.
ఏ సామాన్ల సందులో యిరుక్కుందో తెలియదు ఎంత ప్రమాదమైన పామో తెలియదు. ఒక గది లోంచి వేరే గదిలో దూరిందా? వంటింటిలో ప్రవేసించిందా?పాపం ఒక్కామె యింట్లొ వున్నట్ట్లుంది అనుకుంటూ కరీం భాయ్ "లైటు స్విచ్ ఎక్కదమ్మా"అనగానే తన తల దగ్గరున్న స్విచ్ వేసింది సోమిదేవమ్మ.
ఆ గదిలో సామాన్లు ఎక్కువ లేవు దాక్కొనే అవకాశం లేదు, పక్క బెడ్రూములో పెట్టెలు జరిపి మంచం కింద చూశాడు. ఎక్కడా కనిపించ లేదు.ఇక వంటింటిలో దూరి వుంటుందనుకుని అక్కదా వెతకడానికి అడుగు ముందుకు వేశాడో లేదో "ఆ! ఆ! లోపలికెళ్ళకు మడి వస్తువులన్నీ మైల పడిపోతాయి!"
"అయితే పాముతో పాటే వంటిట్లో పని చేసుకుంతారమ్మా?ఒక్కరే వున్నట్లున్నారు విషం పామయితే కుట్టినా ప్రమాదం కదా?మైల పడితే మళ్ళీ మడి చేసుకోండి." అంటూ వినిపించుకోకుండా వంటింట్లో జొరపడ్డాడు కరీం భయ్.చేసేది లేక నిలువు గుడ్లేసుకుని చూస్తుంటే ,"అమ్మా! మీరు మంచం మీద కాళ్ళు పైన ప్ట్టుకుని కూచోండి పాము దొరికాక మిమ్మల్ని పిలుస్తాను ."
"అయ్యో! నన్ను పిలవదమెంసుకు? దాన్ని చంపృయ్ నా కసలే పామంటే చచ్చే భయం."మంచం మీద మఠం వేసుకుని కూర్చుంది సోమిదేవమ్మ .
వంటిల్లా ? అది పెద్ద యుధ్ధరంగంలా వుంది.నీళ్ళ ఎద్దడి నుంచి నాలుగు బిందెల నీళ్ళు పట్టి వున్నాయి.పప్పులు బియ్యం సామాన్లు పోసుకున్న డబ్బాలు లెక్క లేదు."ఎంత మంది వుంటున్నారో మరీ యిన్ని సామాన్లా?"అనుకున్నాడుకరీం భాయ్.ఒక్కొక్క సామాను జరిపుకుంటూ పోతే వంట గట్టు కింద చివర వూరగాయ జాడీలు ఏదెనిమిది వున్నాయి.వాని కదిలించబోతే 'బుస్స్!'మన్న శబ్దం వినిపించింది.
"అమ్మ గారూ! దొరికింది"అన్న మాట వింటూనే ఒక్క అంగలో వంటింట్లోకి వచ్చి "ఎక్కడ?" అంది సోమిదేవమ్మ."యిదిగో యీ వూరగాయ జాదీల వెనుక . '
అయ్యో! అయ్యో! నా మడి ఆవకాయలన్నీ మండిపోయాయి ఈ పాముకేం పోయేకాలమొచ్చిందో నాఅవకాయ జాడీల దగ్గిరేచోటు దొరికిందా?ఏడాదంతా ఎలా గడపాలి? ఆవకాయలేందే ముద్ద దిగదే నా ఖర్మ."
"ఇంతకూ చంపాలా వదిలేయనా వేగంగా చెప్పండి నాకవతల పని వుంది." "బాబ్బాబు చచ్చి నీ కడుపున పుడతాను మా వారు వూరు వెళ్ళారు.అతను వచ్చే దాకా వంటింతిలో పాముతో నేనెలా వుండాలి? చంపేయ్ బాబూ నీకు పుణ్యముంటుంది."
అంతే! మరి ఆలోచించకుండా ,అయితే మీరు బెడ్ రూము తలుపేసుకుని కూర్చోండి రెండు నిముషాల్లో దీని పని పూర్తి చేస్తాను."
అయిదు నిముషాలు క్ష్టపడి జాడీలు జరిపి పాముని చంపాడు కరీం భాయ్.
"అమ్మా పాము చచ్చింది ,బయటికి రండి పెద్దగానే వుంది." అనగానే తలుపు తెరుచుకు ఒక్క ఛెంగులో బయటికి వచ్చింది సోమిదేవమ్మ.
చచ్చిన పాముని చూసి నిశ్చింతగా ఫీలయింది."దాన్ని బయట పారేయ్ నాయనా ఎంతైనా పామనగానే భయపడి మనకి హాని చేస్తుందో లేదో గాని దాని ప్రాణం మనం తీసేస్తాం." కరీం భాయ్ చచ్చిన పాముని దూరంగా పారేసి కర్ర గోడవారగా పెడుతూంటే,సోమిదేవమ్మ యాభయ్ రూపాయలు చేతిలో పెడుతూ "మైల పడ్డవన్నీ పార్వ్సి స్నానం చెయ్యాలి. నీ వుపకారాం మార్చిపోలేను నాయనా."
పై మాట వినగానే"అమ్మా! మీరు పారేయదల్చుకున్నవేమిటో చెప్తే, రిక్షా తెచ్చుకుని నేను పట్టుకెళ్ళి పోతాను.పిల్లలవాడిని మీ పేరు పాము పేరు చెప్పుకుని నాలుగు రోజులు తింటాం.బయట పారేయకండి. అమ్మా!అన్నట్లు కొంత సేపు ముందు చచ్చి నా కడుపున పుడతానన్నారుకదా? నేను ముట్టుకుంటే ఎలా మైల పడ్డాయి?నేను ముట్టుకుంటే మైల పడ్డాయా?పాము ముట్టుకుంటే మైల పడ్డాయా? నేను కాక ఎవరొచ్చినా యివన్నీ తీసి పాముని చంపుతారు."అంటూ ఆమె యిచ్చిన యాభయ్ రూపాయలు తీసుకున్నాడు.
సోమిదేవమ్మకి అర్ధం అయింది ప్రాణ భయం వున్నప్పుడు మాట్లాడిన మాటలు భయం తీరాక వుండవని."ఆగాగు నీ పిల్లల కోసం కాస్త ఆవకాయ పొట్లం కట్టి యిస్తాను.మరెప్పుడూ యిలా మాట్లాడను.యిలాంటి సంఘటనలు నాలుగైదు ఎదురైతే నా ఛాదస్తం తగ్గుతుందేమో."
ఆవకాయ కాస్త పెద్ద పొట్లమే కట్టి యిచ్చింది సోమిదేవమ్మ. సంతోషంగా తీసుకున్నాడు కరీం భాయ్.
మర్నాడు సాయంత్రం భర్త అవధాని వూరినుంచి వచ్చాడు.కాఫీ చేసి గ్లాసుల్లో పోసి వీధి అరుగు మీద కుర్చీల్లో కూర్చుని తీరికగాపాము దూరిన వుదంతం భర్తకి వివరిస్తోందిసోమిదేవమ్మ. ఇంతలో కరీం భాయ్ అటుగా వెళ్తుండటం చూసి "యిదిగో అబ్బాయ్! మాట ఒక్ సారి యిలా రా !"అంటూ సోమిదేవమ్మ పిలిచింది."మళ్ళీ పాము వచ్చిందేమిటమ్మా?పిలుస్తున్నారు.""లేదు నాయనా మా వారు యిప్పుడే వూరినుంచి వచ్చారు. నీ గురించే చెప్తున్నాను,అనుకోకుండా నువ్వు కనిపించావు.నిన్ను మావారికి చూపిద్దామని పిలిచాను.యితడేనండీ నిన్న ఎంతో సాహసంతో పాముని చంపాడు."
చాలా సహాయం చేశావు నాయనా! సమయానికి దేవుళ్ళా వచ్చి మా ఆవిడ భయం పోగొట్టావు ."
'దానిదేముంది బాబూ! ఎవరయినా అంతే చేస్తారు.అన్నట్లు అమ్మగారూ మీ వూరగాయ తిన్నాక తెలిసింది అంత రుచి గల వూరగా తినలేక పోయినా వాసనయినా చూద్దామని వచ్చి వుంటుంది ఆ పాము. పాపం దానికి ఆయువు మూడి పోయింది."
"భలేగా చెప్పావు భాయ్! నీ మేలు మర్చి పోలేము."అన్నాడు అవధాని నవ్వుతూ."వస్తాను బాబూ శలవు" అంటూ నిష్క్రమించాడు కరీం భాయ్.