23 July, 2013

మనసా కీడెంచకే

బంధువుల యింటికి పనిమీదవెళ్ళాను.నాలుగు రోజులయాక అమ్మా వాళ్ళ వూరు మర్నాడు వెళ్తానని ముందు రోజు వాళ్ళకి నా ప్రొగ్రాం చెప్పాను."చంటి పిల్లతో ఒక్కరూ రైల్లో ప్రయాణం ఎందుకు? సాయంత్రం మూడు గంటల రైలుకి నా కొలీగ్ వెళ్తాడు.అతనూ మీ అమ్మగారి వూరే వెళ్తాడు.యిల్లు చేరేవరకు సహాయంగా వుంటాడు.రైలు దిగాక బస్సు ప్రయాణం కూడా వుందికదా! యిబ్బంది లేకుండా వెళ్ళొచ్చు.యీ ఒక్క పూటా ఆగమ్మా."చుట్టాలాయని సలహా యిచ్చారు కాదనలేకపోయాను.
అయినా నసుగుతూ "ఆఖరి బస్సు తప్పిపోతే రాత్రి యిబ్బంది అవుతుంది"అన్నాను."అతను మూడు నెలలై బదిలీ మీద మీ వూరు నుంచి వచ్చడు,భార్యా పిల్లలు అక్కడే వున్నారు.ప్రతి శనివారం హాఫ్ డే తరువాత యీ రైలుకి వెళ్ళి సోమవారం వచ్చేస్తాడు.మీకేమీ భయం లేదు దగ్గరుండి మీ యిల్లు చేర్చుతాడు."
ఇంకేం మాట్లాడను,సరేనన్నాను.మర్నాడు స్టేషన్లో తన సహోద్యోగిని పరిచయం చేశారు  మా బంధువు,"యితను మా కొలీగ్ మోహనరావు.యీమె మా రిలేటివ్ వుదయం చెప్పాను కదా! మీకు కష్టం కలిగిస్తున్నాం.""అబ్బే! అదేం లేదు వెళ్ళవలసినది ఒక్క వూరేకదా మీరేం వర్రీ కాకండి."
రైలు వచ్చి బయలుదేరేసరికి నాలుగయింది.నాకు మనసులో కంగారుగానే వుంది.అమ్మగారి వూరు చేరేసరికి రాత్రి పదయినా అంతకన్నా ఎక్కువైనా బాధలేదు పుట్టి పెరిగిన వూరు.ఎటొచ్చీ రైలు దిగాక బస్సు దొరకక పోతే ఎలాగో అని మనసులో మల్లగుల్లాలు పడుతున్నాను.
అసలే పాసింజరు గంట ప్రయాణం తరువాత చిన్న స్టేషన్లో ఆగిపోయింది.గంటన్నరైనా కదలదు,కిందకు దిగి సమాచారం సేకరించిన వారు చెప్పిన వార్త ఏమంటే ముందు వెళ్తున్న గూడ్సురైలు యింజను ట్రబులిచ్చింది అది సరైతే ఈ రైలు కదులుతుంది.ఈ మాట విన్నాక నిస్పృహ ఆవరించింది.కూర్చోవడం తప్ప చేయగలిగందేమీ లేదు.పాపని ఒళ్ళో పెట్టుకుని మాట్లాడకుండా కూర్చున్నాను.
చివరికి రెండున్నర గంటల తరువాత రైలు బయిలుదేరింది.మేము దిగవలిసిన స్టేషను చేరేసరికి రాత్రి తొమ్మిదయింది.బయటికి వచ్చి బస్సు గురించి వాకబు చేస్తే ఆఖరి బస్సు వెళిపోయిందన్నారు.కిం కర్తవ్యం? అన్నట్లు మోహనరావుగారి వైపు చూశాను. కాని వెంటనే తేరుకుని "ఈ రాత్రికి లేడీస్ వైటింగ్ రూములో గడిపి వుదయాన్నే మొదటి బస్సుకి వెళ్దాం." "రాత్రంతా దోమలతో జాగరం ఎందుకండీ? ఈ వూర్లో మా స్నేహితుడున్నాడు,వాళ్ళింటికి వెళ్దాం ఉదయాన్నే బస్సుకు వచ్చేయవచ్చు."
"వద్దొద్దు యింకొకరికి రాత్రి పూట అసౌకర్యం కలిగించడం బాగుండదు.కావాలంటే మీరు వీళ్ళండి,నేను వైటింగు రూములో వుంటాను."
అయ్యో చిన్న పాపతో ఎలా వుంటారు? మీరు ఏమీ తినలేదు కూడాను."అంటూ రెండు రిక్షాలు పిలిచి ఒక దాంట్లో నా బేగు పెట్టి ఎక్కమని రెండవదాంట్లో తను కూర్చుని తనరిక్షాని ఫాలో అవమని చెప్పాడు.అవును కాదు అనే అవకాశమివ్వలేదు.
రిక్షాలు బయలు దేరాయి.నా మనసు కీడు శంకించసాగింది.బుద్ది పొరపాటై చుట్టపాయన మాట పట్టుకుని సాయంత్రం రైలుకి బయలుదేరాను.యిక్కడికి వచ్చాక ముక్కు ముఖం తెలియని బంధువు కొలీగ్ మాట కాదనలేక పోవడం నా మీద నాకే జాలి వేస్తోంది.యిది దేనికి దారి తీస్తుందో, రోజూ పేపర్లో చదివే వార్తలు కళ్ళ ముందు గిర్రున తిరుగుతున్నాయి.యీ మోహనరావు ఎటువంటివాడో అతని స్నేహితుడెలాంటివాడొ ఆలోచించే శక్తి కూడా మిగలలేదు.బుర్ర మొత్తం ఖాళీ అయిపోయి పాపని గట్టిగా గుండెలకి హత్తుకుని చింతించసాగేను.తోవపొడుగునా మనుషులనిగాని వచ్చెపోయే వాహనాలనిగాని గమనించలేదు.
ఆ రోజు శనివారం 'నాయనా ఏడుకొండలవాడా వెంకట రమణా యీ రాత్రి సురక్షితంగా గడిచి యిల్లు చేరితే నీకు కొబ్బరికాయ కొడతాను. ఐదు శనివారాలు వుపవాసం చేస్తాను.ఆ స్నేహితుడింటికి చేరేసరికి నన్ను రక్షించడానికి నువ్వక్కడ వుండు స్వామీ! నిన్ను నమ్మిన వాళ్ళని కాపాడతావన్న మాట ఋజువు చేసుకో !నన్ను రక్షించే పూచీ నీదే నీవు తప్ప ఆదుకునే వాళ్ళెవరు స్వామీ అంటూ ఎంతో దీనంగా వేడుకున్నాను.పగటిపూట ఎంతో ధైర్యంగా డాంబికంగా మాట్లాడగలనో ఆ సమయంలో నిస్సహాయంగా బేలగా ఆలోచిస్తున్నాను.సంత్సరన్నర పాప పాతికేళ్ళ నా వయసు ఎలా నన్ను నేను కాపాడుకోవాలో పాలుపోక మధనపడుతుండగా రిక్షా ఆగింది.
మోహనరావు దిగి రెండు రిక్షాలకి డబ్బులిచ్చి నా బేగు తీసుకుని నన్ను దిగమన్నాడు. గత్యంతరం లేక నెమ్మదిగా దిగాను పారిపోయే అవకాశమేదైనా వుందా అని చుట్టూ పరిసరాలు చూస్తున్నాను. తలుపులు తెరిచే వున్నాయి మోహనరావు యింటి ముందుకెళ్ళి "శామ్యూల్" పిలిచాడు. రెండు నిముషాల తరువాత నడివయసు స్త్రీ వచ్చి "మీరా! రండి అన్నయ్యా శామ్యూల్ బజారుకెళ్ళాడు యిప్పుడే వచ్చేస్తాడు లోపలికి రండి."అంది ఎంతో అభిమానంగా.
వెనక్కి తిరిగి నన్ను పరిచయం చేస్తూ "యీమె మా కొలీగ్ బంధువు,మా స్నేహితుని భార్య లీనా" "నమస్తే"అన్నాను సంతోషంగా.మా వూరు, వీరి అమ్మగారి వూరు ఒక్కటే మా రైలు లేటయింది ఆఖరి బస్సు వెళిపోయింది, యీ రాత్రికి మీకు యిబ్బంది కలుగజేస్తున్నాం."
"ఎంత మాటన్నయ్యా మీరు మా యింటికి రావడం మాకు సంతోషం మాకేమీ యిబ్బందిలేదు."రెండడుగులు ముందుకు వేసి ఆమె చెయ్యి అందుకున్నాను, అది షేక్ హేండు అనేకన్నా నా భయాన్ని కప్పి పుచ్చుకుంటూ మనసుకి ధైర్యం చెప్పుకుందికి అన్నట్ట్లుంది. ఈ లోగా లోపల్నుంచి నలుగురు పిల్లలు బిల బిల మంటూ వచ్చి "మామయ్యా"అంటూ మోహనరావుని చుట్టుకున్నారు.అప్పుడు తెలిసింది అతను వీళ్ళకెంత అత్మీయుడో.
గదిలో ప్రవేశించి తల పైకెత్తగానే జీసస్ క్రైస్ట్ ఫొటో నవ్వుతూ ఆశీర్వదిస్తున్నట్ట్లు కనిపించింది.
ఈ రూపంలో నన్ను రక్షించడానికి యిక్కడున్నావా దేముడా అనుకుని చేతులు జోడించి నమస్కరించాను.అది చూసి "ఏసు ప్రభువుని మీరూ కొలుస్తారా?"అంటూ లీనా ప్రశ్నించింది.
"జగద్రక్షకుడైన ప్రభువుని మనస్ఫూర్తిగా నమ్ముతాను."నిండు మనసుతో చెప్పాను.అల్లకల్లోలమైన మనసు నెమ్మదించి తేలికపడింది.
"పాపకేమైనా తినిపిస్తారా?"అడిగింది లీనా. అప్పుడు నా ఆకలి దప్పులు గుర్తుకొచ్చాయి.మోహనరావు బయిటికి వెళ్ళి యిడ్లీలు పొట్లం కట్టించుకొచ్చి మా ముందు పెట్టాడు.అవి చూడగానే నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి.అరగంట ముందు యీ మనిషిని శంకించి తీరని ఒత్తిడికి గురయాను.మంచితనం యింకా చచ్చిపోలేదు.కీడెంచడం మన వంతు మేలు చేయడం భగవంతుని వంతు.మనసా కీడేంచకే అనుకుంటూ తేలికగా వూపిరి తీసుకున్నాను.

No comments: