31 October, 2008

కిరాయి మనుషులు

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు."ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా యేమిటి ఎవరూ కనిపించటంలేదు".
లేదు బాబూ! మన సుబ్బారావుబాబు తెల్లారీ సరికల్లాసచ్చిపోయారుట. యాదగిరిగారు ఫోన్లో చెప్తే మనోళ్ళంతా అక్కడికెళ్ళారు నేను ఆఫీసుకి కాపలా వుండి తరువాత వచ్చినవాళ్ళకి కబురు చెప్పడానికి వుండిపోయాను. ఎలక్రిక్ షాకు తగిలినట్లయింది,నిన్న సాయంత్రం బస్టాపులో విడిపోయేవరకు నవ్వుతూ కబుర్లు చెప్పిన సుబ్బారావుకి యింతట్లో యేంముంచుకొచ్చింది చెప్మా అనుకుంటూ,సరే నేనూ అక్కడికేవెళ్తాను.అంటూ ఆటోలో బయలుదేరాను బస్సులో అయితే లేటవుతుందని. సుబ్బారవు యిల్లు చేరేవరకు అతన్ని గురించే ఆలోచనలు చుట్టుముట్టాయి.సుబ్బారావు వంటరివాడు మహా అయితే ముఫైఅయిదేళ్ళుండవచ్చు.ఏదో మాటల సందర్భంలో చెప్పాడు చిన్నప్పుడే తల్లి తండ్రి పోయేరని,నా అనేవాళ్ళెవరూ లేరని. ఈ కార్యక్రమమంతా ఆఫీసువాళ్ళే చెయ్యాలనుకుంటాను,ఆలోచిస్తుండగానే అటో సుబ్బారావు వుండే వీధి చేరుకుంది. నాలుగడుగుల ముందుగా ఆటోనాపించి దిగిపోయాను.ఆతృతలో అడుగులు పడుతున్నా తొందరగా నడిచినట్లే అనిపించటం లేదు.గుండెల్నెవరో పిండుతున్నట్లు అనుభూతి కలుగుతోంది. అక్కడ యించుమించు మా ఆఫీసు స్టాఫంతా వుంది.ఇంటి ముందు అందరూ గుమిగూడి వున్నారు. సుబ్బారావు శరీరాన్ని చాప మీద పడుక్కోపెట్టారు, నిద్రపోతున్నట్లు ప్రశాంతంగా వుంది అతని ముఖం. ఇంటి వోనరు శ్రీనివాసయ్యంగారు అరవ యాసతో వివరిస్తున్నారు పక్కవాళ్ళతో రాత్రి కడుపుల నొప్పిగుంది మాత్తర యామన్నవుంటే యీమన్నాడు. పాపం యామి నొప్పొరొంబ కష్టమయింది హాస్పిటలుకి పోదామప్పా అంటే యినుకోలా ఇంతలో యింత అవుతాదనుకోలా శానా మంచివాడు. మురుగాకి దయ లేదు. మా బాస్ దగ్గరకి వెళ్ళి అడిగాను .సార్! యేర్పాట్లెవరు చేస్తున్నారు నేను చెయ్య వలసిన పని యేమైనా వుంటే చెప్పండి. యాదరిరి అన్ని యేర్పాట్లు చేసాడు, యింకొక్క అరగంట పడుతుందేమో. ఏమైనా దురదృష్టవంతుడు.యీమాటలు పూర్తి కానేలేదు యిద్దరు స్ట్రీలు పెద్దగా రోదిస్తూ వచ్చేసరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. వారు తిన్నగా సుబ్బారావు శరీరం మీదపడి యేమేమిటో వర్ణిస్తూ పెద్దగా యేడుస్తున్నారు. వారి భాష యాస చూడగా హైదరాబాద్ ప్రాంతం వాళ్ళ తీరుగా వుంది. ఎంతయినా తను మాత్రం మనిషి కాదా యేదొ పెళ్ళి జంఝాటం లో యిరుక్కోకుండా యీ స్ట్రీతో సబంధం పెట్టుకొని వుంటాడు. ఇద్దరూ తల్లీ కూతుర్లయి వుంటారు. చిన్నామెకు పాటికేళ్లుంటాయి. వాళ్ళు యేమంటు యేడుస్తున్నారో యేమీ అర్ధం కావడం
లేదు ఓదార్చాలన్నా యెటువంటి పరిచయం లేదు. ఒక పావుగంట గడిచింది. యాదగిరి మిగతా యేర్పాట్లు చూసాడు శ్మశానానికి అందరం బయలుదేరాం.నిన్న నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి నేడు కట్టెల్లో బూడిదవుతూంటే కళ్లు చెమర్చాయి.నా ప్రక్కనే వచ్చి నిలుచున్నాడు యాదగిరి. జేబులోంచి కర్చీఫ్ తీసి కన్నులొత్తుకుంటూసుబ్బారావు చాలా మంcఇవాడు కదా యెంత హఠాత్తుగా జరిగింది కలా నిజమా అన్నట్లుంది అన్నాను.ఏంటోనండి మొదట్నుంచి మనిషి నిరాశావాది,పెండ్లెందుకు చేసుకోలేదంటే పోనిద్దూ నాకింకో బంధకమందుకు యిలాగే హాయిగాఆరు.అందరితో వొకేలా మాట్లాడేవారు., ఒకరి విషయంలో అనవసరంగా జొక్యం చేసుకునేవారు.
అన్నట్లుయాదగిరీ నాకో చిన్న సందేహం సుబ్బారావు పెళ్ళీ పెడాకులూ చేసుకోలేదు కదా యిందాక ఏడ్చిన స్ట్రీలిద్దరూ యెవరంటావునీకేమైనా తెలుసా? ప్చ్! యేంచెప్పమంటారు సార్! చనిపోయిన వ్యక్తికోసం యేడ్చే మనిషి కరువయితే ఆత్మకి శాంతి కలుగదంటారు. ఇంతమందిమి వచ్చాంగాని వాళ్ళలా ఒక్కరిమయినా యేడవగలిగామా? ఇంతకూ వాళ్ళెవరో చెప్పనేలేదు. వాళ్ళు కిరాయికి దొరుకుతారు సార్! యిలాంటి కేసులు తటస్థ పడితే వాళ్ళకొక యాభయి రూపాయిలిస్తే అరగంట యేడిచి యింటికెళిపోతారు.

అవాక్కయిపోయాను చనిపోయిన సుబ్బారావుకి వాళ్ళకి యెటువంటి సంబధం లేదు. అతని ముఖమైనా యెరుగరు.అయినా గుండెలవిసేలా ఏడ్చారంటే వాళ్ళచే ఏడ్పించినవి రక్త సంబంధాలు మమతానురాగాలు కావు, "అదే ఆకలి"! యిప్పుడు నా జాలి సుబ్బారావు మీంచి ఆ కిరాయి మనుషుల మీదకి మరలింది.

30 October, 2008

ఈ వంటరితనం వద్దు

వయో భారం కన్న కొడుకు కోడలు మాటలే క్రుంగదీశాయి. రాత్రయితే భయపడే వారున్నారు గాని తెల్ల వారితే భయపడే దౌర్భాగ్యం తనది. సౌఖ్యానికేం లోటు లేదు కాళ్ళవద్దకు పేపర్లు పుస్తకాలు భోజనం చెయ్యాలనుకోగానే వ్డ్డన చేసే నౌకరు. తనేదన్నా కోరాలేగాని లేదనటానికి ఆస్కారమే లేదు. మరి యెందుకీ అసంతృప్తి? సర్దుకు పోవాలి గాని భగవంతుడిచ్చ్చిన వాక్కుని వుపయోగించుకునే అవుసరం లేదు అదే దౌర్భాగ్యం.

గుమస్తా కొడుకు గుమస్తానే అవటం తప్పనిసరి కాదని నిరూపించాడు తను. ఉన్న ఒక్క కొడుకు సుందర్ ని కష్టపడి ఐ.ఎ ఎస్ చెప్పించాడుఇష్ట పడిన అమ్మాయి సుశీలతో పెళ్ళి జరిపించాడు.కోడలు డక్టరని పదిమందితో చెప్పుకున్నాడు. ఇవన్నీ చూసి సంతోషించడానికి సహధర్మచారిణి లేకపోయిందేనని బాధ పడ్డాడు.రిటైరయిన తన వంటరి బ్రతుకులో ఆశాజ్యోతి మూడేళ్ళ కిరణ్ . ఇంత బంగారంవంటి బ్రతుకులో నిస్సారమైన ఆలోచనలేమిటని యెవరికయినా ఆశ్చర్యం కలుగవచ్చు.

మీకేమండి పార్థసారధిగారూ కలెక్టరు కొడుకు డాక్టరు కోడలు మీకేం లోటు? దర్జాగా వున్నారుపై వాళ్ళ వ్యాఖ్యానొ. తన వుద్దేశంలో తనకన్నా అవుట్ హవుసులో వుండే సోవన్న అదృష్టవంతుడు.రెండు పూటలా తినే ఆ పచ్చడి మెతుకులు కొడుకు కోడలు మనుమలతో కూర్చుని కబుర్లు చెప్పుకుంటూ తింటాడు.అదే తన కనులకు అపూర్వమయిన దృశ్యం.ఒక్క రోజయినా తన కుటుంబ సభ్యులు అలా కూర్చుని భోజనం చేశారా? ప్చ్! అదొక అపురూప స్వప్నం.నాలుగు రోజుల క్రితం సుశీల క్లిడిస్పెన్సరీకి వెళ్ళే ముందు సుందర్ తో అంటోంది చూడండి కిరణ్ మీ నాన్నగారితో అంత అటాచ్ మెంటు వుండటం మంచిది కాదు.ఆయనకి లంగ్స్ లో యిన్పెక్షన్ వున్నట్లు అనుమానంగా వుంది.పిల్లాడికి ఏమయినా ఎఫెక్ట్ అయితే బాద పడాలి. కాస్త వాడిని దూరంగా వుంచితే మంచిది కొడుకు గదిలో వున్న న్యూస్ పేపరు తెచ్చుకుందామని వెళ్ళబోతుంటే తన ప్రసక్తి వినిపించడంతో ఆగిపోవడం యాదృఛ్చికంగా మాటలు చెవిలో పడటం జరిగింది.సుందరు సమాధానం కోసం ఒళ్ళంతా చెవులు చేసుకుని విన సాగేను.ష్! నెమ్మది నాన్న వింటే బాధ పడతారు ఆయన ముదు మాత్రం అనకు. బాబిగాడిని కిండర్ గార్డెన్ స్కూల్లో వేసి అట్నుంచి బేబీ కేర్ సెంటర్లో సాయంత్రం వరకు వుండే యేర్పాటు చేస్తాను.రేపటి నుండి నువ్వు డిస్పేన్సరీ నుంచి వస్తూ వాడిని పికప్ చేసుకొస్తే కాసేపు ఆడుకుని నిద్ర పోతాడు.కాళ్ళ క్రింద భూమి కంపించినట్లయింది. నెనక్కి తిరిగి వెళ్ళి వాలు కుర్చీలో కూలబడ్డాను.మూడేళ్ళ పసివాడికి ఎనిమిది గంటలు యింటినుంచి దూరంగా కాదు కాదు తననుంచి దూరంగా వుంచడమా?

"అన్నీ అంగట్లో వుండి అల్లుడి నోట్లో శని" అన్నట్లు అన్ని సదుపాయాలు వున్నా యీ నాలుగు రోజులుగా కాలం స్థంభించి నట్లుగా నాలుగు యుగాలు గడిచి నట్లుగా అనిపిస్తోంది.పసివాడికి యేమి బొధించారో దగ్గరకు రావటం తగ్గించేసాడు.భార్యా భర్తలిద్దరూ వుద్యోగాల నుంచి వచ్చాక యేదో ఒక ఫంక్షన్ అటెండ్ అవటం వాళ్లిద్దరే కలిసి భోజనం చేయటం అరుదు.ఇక నా సంగతి చెప్పాలా? ఇంకెన్నాళ్ళు యిలా వంటరి బ్రతుకు బ్రతకాలో? ఇంతకన్నా యే వృధ్దాశ్రమం లోనో చేరిపోతే బాగుంటుందేమో! ఆలోచనలు పెడ మార్గాన పడుతున్నాయి.కాల చక్రంగిర్రున వెనక్కి తిరిగింది మూడేళ్ళసుందర్ తల్లి పోతే రాత్రంతా తల్లి కోసం ఏడుస్తున్న బిడ్డని భుజాన వేసుకుని తిప్పి బుజ్జగించి వుదయం అన్ని పనులు చేసుకుని పిల్లాడిని స్నేహితునింట్లోవుంచి ఆఫీసుకి వెళ్తుంటే కావలసిని వాళ్ళంతా అన్నారు మళ్ళీ పెళ్ళి చేసుకుంటే మీకు యీ తిప్పలుండవు కదా!అంటే ఒక్కటే జవాబిచ్చేవాడిని పెళ్లి చేసుకుంటే నాకు భార్య దొరుకుతుందే గాని పిల్లాడికి తల్లి దొరకదు నేనే వాడికి తల్లి తండ్రిలా పెంచుతాను.నాకు శక్తినిమ్మని భగవంతుడిని ప్రార్ధిస్తాను యీ విషయంలో మరేమీ నాకు చెప్పవద్దు అని.అటువంటి నాకు కూడా యిటు వంటి పరిస్తితిని యెదురుకొవలసి వస్తుందనుకోలేదు.ఛ! ఛ! యిలా అనుకో కూడదు నాకేం లోటు? నా కన్నా హీనస్థితిలో వున్న వాళ్ళెందరో! వాళ్ళ కన్నా నయం కాదూ! గట్టిగా మాటలు వినిపిస్తుంటే వరండాలో వెళ్ళి చూసాను తోట మాలి భార్య రంగి నాలుగేళ్ళ కొడుకుని గట్టిగా మందలిస్తోంది.వాడు తాత గుండెలో వొదిగిపోయి తల్లి వైపు దొంగ చూపు చూస్తున్నాడు.అది చూడగానే మానిన గాయం రేగినట్లయింది.నేను పోగొట్టుకున్నదేమిటో తేలిసింది. చంటివాడు తనకి దూరంగా తిరుగుతూ ఆటల్లో బిజీగా వున్నట్లునటిస్తుంటే గుండెలు పిండినట్లుగా వుంది. పిలిస్తే తప్పక వస్తాడు తనకే యిష్టం లేదు.నిముష నిముషగడవడ కష్టంగా వుంటే సంత్సరాలెలా గడపాలి? వెన్నులోంచి వణుకులా వచ్చింది.కళ్ళు చీకట్లయినట్లుగా అయింది.
ఆ చీకటి లో వెలుగు రేఖ నవ్వుతోంది.ఎవరో అని తల యెత్తి చూస్తే ఎదురుగా రోహిణి! పెద్దనాన్నా!అని వంగి కాళ్ళకి దండం పెట్టింది 
అమ్మా! రోహిణీ! బాగున్నవమ్మా? బా గున్నాను పెద్దనాన్నా నాకు బేంకులో వుద్యోగం వచ్చింది. అనాడు రైల్లో రైల్లో దొరికిన నన్ను అనాధని అని వదిలేయక తేచ్చి చదివించారు. ఆ శ్రమ వృధా కాలేదు.మీ ఋణం యెలా తీర్చుకోగలను పెద్దనాన్నా. నోటికి వుప్పగా తగిలే వరకు తెలియ లేదు కంటినీరు వుబికినట్లు.నా ఋణం తీర్చుకుందువుగానమ్మా! రోహిణీ! ఆనాడు నిన్ను చేరదీసి పెంచానంటే అందులో కొంత నా స్వార్ధం వుండెను. తల్లిలేని నాబిడ్డకి తోడుగా వుండి వాడికి వంటరితనం లేకుండా వుంటుందని భావించాను, కాని యిప్పుడు నా వంటరితనం పోవడానికి నన్ను నీ యింటికి టీసుకు పో అమ్మా. పెద్దనన్నా అని పిలిచి దూరంగా భావించకునాన్నా అని పిలువు తల్లీ.ఈ వయసులో యీ వంటరి బ్రతుకు బ్రతకలేనమ్మా. సుందర్ కి లెటర్ రసి పెట్టి నీతో వచ్చేస్తాను. సహనం హద్దులు దాటుకుని వచ్చేసాయి మాటలు.అంతకన్నానా పెద్దనాన్నా ! మీరు వస్తానంటే నా జన్మ ధన్యమైనట్లే భావిస్తాను.వంటరి బ్రతుకు యెంత దుర్భరమో నాకు బాగా టెలుసు. నిర్ణయం జరుగకనేపోవాలి ఆచరణ యెంతసేపు? సాయంత్రం కొడుకు కోడలు వచ్చి సోవన్న ద్గ్గరనుండి తాళాలగుత్తి తీసుకుంటున్నప్పుడు వారి ముఖాలలో కదలాడే భావాలను వూహించుకుంటూ రైల్లో ప్రయాణం సాగిస్తున్నాడు. "బాబూ! గవర్నమెంటు రిటైర్మెంటుకి వయోపరిమితి నిర్ణయించినట్లు భగవంతుడు బాధ్యతలైపోగానే వయసు కూడా నిర్ణయిస్తే బాగుండునుకదా! నా కోసం కంగారు పడవద్దు మీ అందరి శ్రేయస్సు కోరుతూ వెళుతున్నాను.రాసి పెట్టిన వుత్తరం చదువుకుని యెలా స్ఫందిస్తారోవూహించుకుంటూ నిట్టూర్చాను. నా మనసుని చదివినట్లు రోహిణి నా చేతిని తన చేతిలో తీసుకుంది వోదార్పుగా. .

27 October, 2008

యుగ ధర్మం


కళ్ళు తెరిచిన శ్యామల తనకెదురుగా నిల్చున్న డాక్టర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు తటతటలాడించిండి.చుట్టూ పరిసరాలు పరికిస్తే హాస్పిటల్ గాగుర్తించడంతో"టైమెంతయింది" అంది యెవర్నీ వుద్దేశించకుండా.
"రాత్రి పదయింది,సాయంత్రం మిమ్మల్ని హస్పిటల్లొ చేర్చారు."డాక్టర్ పల్స్ చూస్తూ అన్నాడు. సాయంత్రం జరిగిన దుర్ఘటన మనసులో మెదిలి భయంతో బిగుసుకుపోయింది.శ్యామల కళ్ళలో ప్రతిఫలిస్తున్న భయం చూసి ఇన్స్పెక్టర్ చిన్నగా నవ్వాడు పలకరింపుగా. అయినాయింకా చుట్టూ చూస్తుంటే "మీ భర్త పేరు ప్రభాకరేనా?"అవునన్నట్లు తలాడించింది.అతను బయట కూర్చున్నారు నేను వేసే నాలుగు ప్రశ్నలకు జవాబివ్వండి చాలుఅతన్ని లోపలకు పిలుస్తాను. అలాగేననట్లు తలాడించింది.అలా తలూపడంతో తలకితగిలినగాయం కలుక్కుమంది. "అబ్బా!" అంది.
"మీకీ గాయాలెలాతగిలాయి?" కార్లోంచి దూకటంవల్ల కూర తరుగుతూంటే చెయ్యి కోసుకుంది అని చెప్పి సాధారణంగా. "పరుగెడుతున్న కార్లోంచి దూకవలసిన అవసరం యేమొచ్చింది"ఆసమయంలొ యెక్కడినుండి వస్తూన్నారు?ఎక్కడికి వెళ్తున్నారు?" చూడండి ఇన్స్పెకరుగారూ మీరు నాలుగు ప్రశ్నలు వేస్తామన్నారెండవ ప్రశ్నలో మూడు ప్రశ్నలు యిరికించారు. జరిగినది క్లుప్తంగా చెపుతాను. నేను ప్లాస్టిక్ ప్రొడుక్ట్ కంపెనీ లో స్టెనొగా పని చేస్తున్నాను,ఇన్స్పెక్టర్ నోట్ చేసుకుంటున్నాడుప్రతి పదవ తారీకున మా స్టాఫ్ మీటింగు వుంటుంది. ఆరోజు తప్పని సరిగా లేటవుతుంది.ఈరోజు కూడా ఆరు దగ్గరవుతూండగాబస్టాపు చేరాను. మా మిగతా స్టాఫ్ కొందరు స్కూటర్ల మీద కొందరు సైకిల్స్ మీదా వెళ్ళిపోయారు.నేనుకాక ముగ్గురు మగవాళ్ళున్నారు.అయిదు నిముషాల్లో బస్సు వచ్చి స్టాపుకి పదడుగుల దూరంలో ఆగింది నేను గమనించి పరిగెత్తే లోగా స్టాపులో వున్న నాళ్ళు పరుగెడుతున్న బస్సునెక్కడం బస్సు కదిలిపోవడం జరిగింది. అసలే చలికాలం చీకటి పడుతోంది యిక బస్సు కోసం వెయిట్ చెయ్యడం మంచిదికాదని ఆటో వస్తోందేమోనని దూరానికి చూస్తున్న నేను చేయిగుంజినట్లయి యిటు తిరిగేలోగానే నన్ను కార్లోకి లాగి డోరువేసి అరవకుండా నోరు నొక్కారు ఏంజరుగుతోందో తెలుసుకొనే లోగానే కారు వేగం హెచ్చింది. కార్లో యెంతమందున్నారు?
వాళ్ళనెప్పుడయినా చూసారేమో చెప్పగలరా? డ్రైవరు కాక యిద్దరు ఫ్రంట్ సీట్లొ ఒకరు బేక్ సీట్లోఒకరుకూర్చున్నారు వాళ్ళని నేనెప్పుడు చూడలేదు.ఆ తరువాత యేమి జరిగిందొ చెప్పగలరా?
చెప్పడానికేముంది వాళ్ళు నావంటి మీదున్నది బంగారంగా భ్రమపడి యీ అఘాయిత్యానికి పూనుకున్నారేమొనని ఫ్రీగా వున్న చేతులతో
మెడలోని గొలుసు గాజులు తీసి అతనికిచ్చి దండం పెట్టాను అప్పుడు వాళ్ళు నవ్విన నవ్వు తల్చుకుంటే వెన్నులోంచి వణుకు వచ్చింది.నా మీద అత్యాచారం చెయ్యడమే వాళ్ల వుద్దేశం అనుకుని భగవంతుడిని మౌనంగా ప్రార్ధించసాగాను. నా అదృష్టం బాగుండి నా నోరు మూసి పట్టుకున్న వ్యక్తి సిగరెట్ జేబులోంచి తీసి వెలిగించుకొడానికి నన్ను కాసేపు వదిలాడు.ఆ సమయాన్ని వృధా చెయ్యకుండా ప్రాణం నిలుస్తే మానం నిలుస్తుందిలేకుంటె ప్రాణలామెగు నిలవదుకదా అని తెగించి పరుగెడుతున్న కారు డోర్ తెరుచుకుని దూకేసాను.ప్రక్కగా బైక్ ఆగడం తెలిసింది.అంతే హస్పిటల్ లోనే కళ్లు తెరిచాను.
మీ ధైర్యం మెచ్చుకో తగ్గది.ఎప్పుడైనా ఆ వ్యక్తులు తటస్త పడితే గుర్తు పట్ట గలరా?
లేదండి వాళ్ళనుంచి తప్పించుకోవడమెలా అనే తాపత్రయమ్ పడ్డానుగాని వాళ్ళు యెలావున్నారని నేను చూడ లేదు. థేంక్స్! పెద్దగా దెబ్బలు తగల లేదు త్వరగా డిశ్చార్జి చెయ్యొచ్చు అవసరం పడితే మళ్ళీ కలుద్డాం".
వెంటనే ప్రభాకర్ లోపలికొచ్చాడు. ముఖం విచారంగా దీనంగా వుంది.ప్రభాకర్ని చూడగానే యింటి వద్దనున్న పిల్లలిద్దరూ గుర్తుకి వచ్చి కళ్ళనీళ్ళు తిరిగాయి శ్యామలకి.
భర్త దగ్గరనుండి ఓదార్పునాశించిన శ్యామలకి ఆశాభంగమయింది. ఎవరో స్నేహితుడిని విసిట్ చెయ్యడానికి వచ్చినట్లు మంచానికి మూరెడు దూరాన నిల్చుని"నీకు ప్రమాదం జరిగినప్పుడు నీ పర్సులోని పర్టిక్యులర్సుని బట్టి నాకు తెలియ పరిచి నిన్ను హాస్పిటల్ లో
చేర్చారుట. ఏమిటో రోజులా కాకుండా యిందరి నోళ్ళలో నానటమయింది. చివరికి పోలీసులు అల్లరి". గాయాయాలకన్న బధించాయా మాటలు దుండగుల చేతుల్లోంచి రక్షింపబడ్డా అది పబ్లిసిటీ అవుతోందన్న బాధ ప్రభాకర్లో యెక్కువగా కనిపిస్తోంది. "పిల్లలేరీ?" మాతృప్రేమ వుగ్గబట్టుకోలేక అడిగింది."పక్కింట్లో అప్పజెప్పి వచ్చాను. పనిపిల్ల వెళ్ళిపోయింది,"అన్నాడు వుదాసీనంగా. "కూర్చోండి పరాయివాళ్ళలా యెంతసేపు నిలబడతారు?"స్టూలు లాక్కుని కూర్చున్నాడు ప్రభాకర్. సిస్టర్ వచ్చి హార్లిక్స్ త్రాగించింది,వొంట్లోకి కాస్త
శక్తి వచ్చినట్లయింది. "ఆఫీసు నుంచి వచ్చి కాఫీ అయినా త్రాగారా?ముఖం వాడి పోయింది.ఫ్రాక్చర్లేవీ లేవుట తొందరగానే యింటికి పంపించేస్తారుకంగారు పడకండి. స్త్రీ మమతానురాగాలు ప్రకటించింది.
"ఈ సంఘటన తెలిసినప్పటినుండి నా తల బాడ్డలయిపోతోందిశ్యామా!
ఈ అల్లరి యీ ఎంక్వయిరీలు విమర్శలు యింతటితో సరిపోవు. ప్రతివాళ్ళకి యిదో చర్చనీయాంశం అవుతుంది.నీ ఆఫీసులో నా అఫీసులో యిరుగు పొరుగు అందరినీ ఫేస్ చెయ్యాలంటే యెంత కష్టం".
"తిరిగి వచ్చినందుకు బాధగా వుందా?ప్రాణాలకు తెగించి మీ కోసం పిల్లల కోసం సాహసించాను.మీరు మెచ్చుకోలేదు సరికదా అదేదో నాదే తప్పయినట్లు మాట్లాడుతున్నారు".వుక్రోషంగా అంది.
మనం యెంత అభ్యుదయం సాధించినా మన దేశంలో స్త్రీలకు పవిత్రత ముఖ్యం కడా! సీతలాంటి సాధ్వికే రాముడు అగ్ని పరీక్ష పెట్టాడు.
రాముడు అడగ్గానేఅగ్నిలో దూకేసి మా అందరి దురదృష్టాలకు సింహద్వారం నిలబెట్టింది.సీత తనకు తానుగా రావణాసురుడికి లెటర్ రాసి పిలవలేదే?తీసుకుపోయేటప్పుడు కూడా యెంతో ప్రతిఘటించింది కదా యింకా ఎందుకు అగ్నిపరీక్ష?
బాగుంది అమె పవిత్రత లోకానికి చాటడానికి.
చాటించాడు బాగానే వుంది.ఆపైన ఎవడో ఏదో అన్నాడని వదిలేయడం ఎందుకు? ఆ సీతారాముల మాట దేముడెరుగును గాని నా పవిత్రత కోసం పరుగెడుతున్న కార్లోంచి దూకాను.నేనింకే అగ్నిలోను దూకలేను, ఆపైన మీ యిష్టం.
ఛ!ఛ! అందుక్కాదు, మనవాళ్ళు పవిత్రతకి అంత ప్రాముఖ్యం యిస్తారని చెప్తున్నాను.
నిజమే వెర్రి సీత కాకుంటే ఆరు నెలలు విడిగా వున్నదని అగ్నిపరీక్ష పెడితే తానివతలకి వచ్చిన తరువాత ,తమరుకూడా నాకు దూరంగా వున్నారు కదా ఏదీ మీరూ అగ్ని ప్రవేశం చేసి మీ పవిత్రత కూడా నిరూపించుకోండి ఆర్యపుత్రా! అని యెందుకనలేదు?ఆమె
పిరికితనమే మమ్మల్ని కాల్చుకు తింటోంది. హాస్పిటల్ అన్న మాట కూడా మర్చిపోయి తన నాటకానుభవం బయటపెట్టింది.
సరే నువ్వు రెస్టు తీసుకో, నేనేం మాట్లాడినా అపార్ధంగాభావిస్తున్నావు బాగుంది ప్రమాదం జరిగి గాయాలు నాకు తగిలాయి ఓదార్పు మీకు కావాలా? మీ సొత్తు నెవరో దోచుకోబోయారని అంత బాధ అనిపించినపుడు మీ సొత్తుని యింట్లోనే దాచుకో లేకపోయారా? భార్య తెచ్చే సంపాదన తీపి యిటువంటి సంఘటనలు చేదూనా? నాకు ధైర్యం చెప్పి వూరట కలిగించడం పోయి సీత పవిత్రత చింతకాయ పచ్చడీనా? ఆ నాటి సీత అరిచి గోల చేసిందేమో గాని నాలా ప్రాణాలకు తెగించి పరుగెడుతున్న కార్లోంచి దూకలేదు.చాలా ఆవేదనగా అంది.
శ్యామా నువ్విలా మాట్లాడటం బాగా లేదు.రేపు యీవార్త పేపర్లలోకెక్కుతుందేమో అని భయపడుతున్నాను.నీమీద నాకెటువంటి అనుమానాలు లేవు.
పేపర్లలో పబ్లిష్ అవకపోతే మీ భార్య తిరుగుయినా బాధలేదా? బోతచాలించు !ఏం మాట్లాడుతున్నావొ తెలిసే మాట్లాడుతున్నావా? మన రఘు రూపలని గుర్తు పెట్టుకునైనా మసలుకోవాలి.పిల్లల్ని కాదని ఏం చెయ్యగలం?
అవును పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎక్కడికి పోగలదులేఅన్న ధీమాతో ప్రతి మగవాడు భార్యని హింసించగలడు. మీకు కొన్ని సులువులు చెప్పనా?పిల్లల్ని పెంచగలనన్న ధైర్యం వుంటే మీరు మరో వూరు బదిలీ చేయించుకుని వాళ్ళమ్మ కారు అక్సిడెంట్ లొ పోయిందని చెప్పండి. అందరూ మీ మీద బోలెడు సానుభూతి కురిపించి పిల్లనిచ్చి పెళ్ళి చేస్తారు. పిల్లల్ని పెంచలేకుంటే నా వద్ద వదిలేయండి నేను పోషించుకోగలను. పాతికేళ్ళ కుర్రాడిలా పిల్లతోపాటు కట్నకానుకలు కూడా ముడతాయి.మీకీ పబ్లిసిటీ బాధ తప్పుతుంది.
మీ జీవితంలో శ్యామల కాటుక చుక్కలాగ సమసిపోతుంది గాని జీడి చుక్కలాగా వుండిపోదు. ఈ సంఘటన తరువాత కూడా మీరు పూర్వంలా నాతో బ్రతకదల్చుకుంటే రేపు వుదయాన్నే పిల్లలిద్దరినీ తీసుకు రండి.లేకుంటే మీకూ నాకూ సారీ! యిలా చెప్పేస్తే మీ సీతారాముల ప్రిన్సిపల్స్ కి సరిపడవు కదా.అయినా ఏం చెయ్యను యివాళ లోకులకు జడిసి నన్నింట్లో పెట్టుకున్నా, రేపు ఎదురింట్లోని మీసం రాని కుర్రాడు నన్ను చూసి నవ్వినా నా వల్లే తప్పన్నట్లు నిముష నిముషానికి నరక ద్వారాలు తెరుస్తారు. అంతకన్నా వివాహ బంధానికే ద్వారం మూసేయడం తప్పుకాదని భావిస్తున్నాను.
ఆ నాటి సీత అలా ప్రవర్తిస్తే అది త్రేతాయుగ ధర్మం.
ఈ నాటి శ్యామల యిలా ప్రవర్తిస్తే యిది యీ కలియుగ ధర్మం.

26 October, 2008

మధ్య తరగతి బ్రతుకు

మధ్యతరగతి బ్రతుకు
మింగలేదు మెతుకు
మీసాలకు సంపెంగ నూనె అతుకు
పొరుగువాని లొసుగు వెతుకు
మిథ్యా ప్రతిష్టలో చితుకు
మా తాతలు త్రాగారు నేతులు
వాసన చూడండి మా మూతులు
మాకు మేమే తవ్వుకుంటాం
సాంప్రదాయపు గోతులు
ఎవ్వరూ చెప్పనక్కరలేదు మాకు నీతులు
పై కెగురలేక క్రిందకు జారలేక
వ్రేలాడుతాం త్రిశంఖు స్వర్గంలో
ఎందుకు--------?
బూజుపట్టిన భావాల పొరలు తొలగించ లేక
కుల సాంప్రదాయపు సంకెళ్ళు త్రెంచలేక
వంశాచారపధ్దతుల పాకుడు రాళ్ళపై నిలువలేక
నేటి ఆర్ధిక పరిస్థితుల ఏటికెదురీదలేక
పయనిస్థాం లక్ష్యం లేని గమ్యానికి తప్పటడుగులు వేస్తూ
పడుతూ-------లేస్తూ

సామీప్యం

కఠిన శిలలనైన
కరకు గుండెలనైన
కరిగించగల శక్తి
సంగీతానికుంటే
మండుటెండనైన
మంచులా తలపించు
కారు చీకటినైన
వెన్నెల వలె మలపించు
శక్తిగలదొక్కటే
పసిపాప చిరునవ్వు.

ఓ మనిషీ యిదా నీ పంథా?

నీతి నియమాలకై సరిహద్దులేర్పరిచి
న్యాయ ధర్మాలకై కొలబద్ద్లుంచి
జాతి మతములటంచు విభజనలు గావించి
వీటన్నిటికి వేరు దైవాల నియమించి
మానవత్త్వపు మాట మరచావు నీవు
ఓ మనిషీ యిదా నీపంథా?

సత్యాహింసలు నీ మతమనుచు
ధర్మ మార్గమే నీ బాట యనుచు
ప్రజా క్షేమమే నీ లక్ష్యమనుచు
శాంతి పరిరక్షణే నీ గమ్యమనుచు
మారణాయుధములు చేతబూనావు
ఓ మనిషీ యిదా నీ పంథా?

రాజకీయములు నీ సర్వస్వమనుచు
పదవీ వ్యామోహమే పరమార్ధముగ నెంచి
రక్త సంబంధముల రచ్చకీడ్పించావు
రుధిరధారల యెల్లెడల చిందింపజేశావు
పరంధాముడిని కూడా పార్టీలో చేర్చావు
ఓ మనిషీ యిదా నీ పంథా?

స్త్రీలు తల్లి తోబుట్టువులా భావించమనుచు
తరుణుల ప్రగతియే దేశ సౌభాగ్యమ్మనుచు
మగువను గౌరవించనిదే మనుగడ లేదనుచు
ఉపన్యాసములలో నమ్మ బలికేవు
వెండితెరపై స్త్రీల వలువలిప్పించావు
ఓ మనిషీ యిదా నీ పంథా?

23 October, 2008

రేపటి నారి

(ఆరుమంది పాల్గొనే నృత్త్య నాటిక)
ఒక జంట అభినయించాలి

బంధువులారా స్నేహితులారా వినండోయ్ వినండి
మా ఇంట అబ్బాయి పుట్టాడయ్య ----అబ్బో అబ్బో--అబ్బో అబ్బో
మా వంశోధ్దారకుడు ఉదయించెనూ ---చాల సంతోషం-చాల సంతోషం
మా నోములు పండేను---ఆహా--ఆహా
మా యింట సంబరము---ఆహా--ఆహా

బంధువులారా స్నేహితులారా
వినండోయ్ వినండి మా యింట
అమ్మా యింట పుట్టిందయ్యా
అయ్యో పాపం అయ్యో పాపం
మా యింట మహ లక్ష్మి పుట్టిందయ్యా
పోనీలే ఎదో పిల్లా

అబ్బాయి: బూటులు వెయ్యాలి లేటెస్ట్ డ్రెస్సులు వెయాలి
తల్లి తండ్రి: వెయ్యి బాబు నువ్వు వెయ్యి బాబు
అబ్:అమ్మా పిక్చరుకెళ్ళాలి నాన్నా పిక్నిక్కెళ్ళాలి
తల్లి తండ్రి: వెళ్ళు బాబు నువ్వు వెళ్ళు బాబు
డాక్టరువవుతావా బాబు యాక్టరువవుతావా
కలెక్టరవుతావా బాబు ఇంజినీరవుతావా
ఫారెను వెళతావా బాబు ఫారెను వెళతావా
అన్నింటికి అవును అని తలవూపుతాడు అబ్బాయి

అమ్మాయి తల్లి తండ్రి అభినయించాలి
అమ్మాయి: డ్రెస్సులు వెయ్యాలి మంచి డ్రెస్సులు వెయ్యాలి
తల్లి: డబ్బులు కావద్దా వాటికి డబ్బులు కావద్దా
పిక్చరుకెళ్ళాలి అమ్మా పిక్నిక్కెళ్ళాలి
తల్లి: అలా కాదమ్మ ఆడపిల్లకి తగదమ్మా
అమ్మాయి: కాలెజికెళటాను బాగ చడువుకుంటాను
డాక్టరునవుతాను లేదా ఇంజినీరవుతాను
తండ్రి: పెళ్ళి చెయ్యొద్దా దానికి డబ్బులు కావద్దా
అసలు ఆడ పిల్ల ఎలా వుండాలంటే

తలవంచి నడువు వడలొంచి పనచేయి పెద్దలమాటకు ఎదురాడకు
ఒప్పుగ ఒద్దికగ ఉండాలి---తందానాఓతానె తండాన
ఓర్పుగ నేర్పుగ మెలగాలి--తందానాఒతానె తందానా
అత్తవారి యింట మెప్పు పొందాలి--తందానాఓతానె తందానా
పుట్టినింటికి నీవు పేరు తేవాలి--తందానా ఓతానెతందానా
తల్లి:అమ్మాయికి యుక్త వయసు వచ్చిండి వరుని కొరకు అన్వేషణ చెయ్యాలి

నలుగురు నాలుగు దిక్కుల వెతుకుతారు
వరుడు దొరక లేదు అంతవరకు చదువు సాగించు
వరుడు దొరక లేదు అంత వరకు సంగీతము నేర్చుకొ
వరుడు దొరక లేదు అమ్తవరకు కంపూటరు నేర్చుకో
అబ్బాయి తల్లి తండ్రి ఒక ప్రక్క అమ్మయి తల్లి తమ్డ్రి ఒక ప్రక్క ఉంటారు
అమ్మాయి తండ్రి :వివాహ ప్రస్తావన మీముందంచాం మా అమ్మాయి అందాల బాలా
వరుని తండ్రి:అందం కొరుక్కు తింటామా నాలుగు లక్షలు యివ్వాలి
అమ్మాయి తల్లి:మా అమ్మాయి సుగుణాల ప్రోవు
వ.త:సుగుణాల మాటకేమి మాకొక కారు యివ్వాలి


అమ్మాయి తండ్రి:మా అమ్మాయి చదువుల సరస్వతి
వ:త: చదువులు మా కోసమా యిల్లు ఫర్నీచరివ్వాలి
అమ్మాయి తల్లి:మా అమ్మాయి పని పాటలలో చురుకు
వ:తల్లి:పనిపాటల మాటకేమి బాల తొడుగు ముఫై తులాలు
యివి కాకుండా లాంచనాలు వీడియోలు వేడుకలు విందులు
అమ్మాయి తండ్రి: ఇన్ని కోర్కెలు నేను తీర్చ లేను
కనికరించక పోతే మరణమే శరణ్యం
యిలా అంటూ పై మీద కండువా తీసి వరుని తండ్రి పాదాల
వద్ద వుంచుతాడు

అమ్మాయి ఆపండి! వద్దు నాన్నా మీఆత్మాభిమానాన్ని
వీరి పాదాల ముందుంచవద్దు ఙ్నానం తెలిసినప్పటినుంచి
చూస్తున్నాను ఆడపిల్ల అయ్యో పాపం పోనీలె
యివే మాటలు వినీ వినీ విసిగి వేసారి పోయాను
నా మాటని నా చదువుని నా నడకని నా నడతని
శాశించారు నా మనసుని నా బ్రతుకుని శాశించడం
తగదు నాన్నా యీ సమాజాన్ని అడుగుతున్నాను
అబ్బాయిల తల్లి తండ్రులారా మీకు రాబోయే కోడళ్ళు
ఆడ పిల్లలే కదా ఎక్కడ యీ లోపం?

మా యింట అమ్మాయి పుట్టిందంటే ---అబ్బో--అబ్బో
అనే రోజు రావాలి మా యింట మహలక్ష్మి పుట్టిందంటే ఆహా ఆహా
అనే రోజు రావాలి ఆ రోజు రావాలి
అందరూ శాంతంగా నిలుచుంటారు నెమ్మదిగా అబ్బాయి తల్లి తండ్రులు
అబ్బాయి చేతిని అమ్మాయి చేతిని కలుపుతారు
అందరూ హర్షధ్ద్వానాలు చేస్తారు

నేటికీ మన సమాంజంలో యిప్పటికీ అక్కడా అక్కడా
ఆఏడపిల్ల అనగానే అయ్యో అనడం వింటూంటాం
ప్రకృతి ధర్మం లొ ఆడ మగ సమానం అంటువున్నా
విఙ్నానం అభివృద్ది చెంది తల్లి గర్భంలో వుండగానే
ఆడశిశువు అని తెలుసుకుని వూపిరి పోసుకోకముందే
అస్ఢ్థిత్త్వాన్ని కోల్పోతోంది నేడు వన సంరక్షణ
వన్యమృగ సంరక్షణలతో పాటు బాలికలను సంరక్షించమంటూ
నినాదాలు చేయడంసమాజానికి సిగ్గు చేటు
ఏనాడు బాలికలను ఆదరంగా పెంచి ప్రగతికి బాట వేస్ధామో
ఆనాడే దేశానికి ప్రగతి రేపటి నారిని నేటి నారిగా తీర్చి దిద్దండి
శుభం

21 October, 2008

భిన్నత్త్వంలో ఏకత్త్వం

హిమగిరి శ్రేణులు మకుటముగా
సుందర ప్రకృతి ప్రతీకగా
కుంకుమ పూత పరిమళ భరితమ్
నాకాశ్మీరం నాకాశ్మీరం
భరత మాత మకుటం
నాకాశ్మీరం నాకాశ్మీరం

భరతమాత గజ్జెల పదములు
మూడు సాగరముల లయ తాళములో
పచ్చని ప్రకృతి పరదాపై
నాట్యము సలిపే రాష్ట్రం
నా కేరళ రాష్ట్రం

త్రివేణి సంగమ తీర్థముగా
చరిత్రకెంతో ప్రసిధ్దిగా
రాముడు కృష్ణుడు పుట్టిన రాష్ట్రం
రాజసాల నిలయం నా ఉత్తర దేశం
నా ఉత్తర ప్రదేశం

ప్రాచీన సౌంస్కృతి సంగమము
కళలకు నిలయం నా రాష్ట్రం
ఆది శంకరుని ఒడిలో నిడిన
దేవళముల రాష్ట్రం నా తమిళ నాడు

విశ్వ కవీంద్రుడు సుభాష్ బోసు
ప్రసిధ్ద పురుషుల కన్నది బెంగాల్
సుందర వనములతో అలరారు
బెంగాల్ నా బెంగాల్

భరతమాత పచ్చని పయ్యద
నారాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
త్యగయ గీతి రాయల కీర్తి
ఖ్యాతిగన్న రాష్ట్రం
తెల్లవాని తుపాకి గుళ్ళకు
రొమ్మిచ్చిన అల్లూరిని కన్నది
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం
భారతావనికి అన్నపూర్ణ
నా రాష్ట్రం ఆంధ్రరాష్ట్రం

దేశ భక్తికి మాతృరక్షణకు
ప్రాశస్త్యం నా పంజాబ్
అమర వీరుడు భగత్ సింగుని
అర్పించిన నాపంజాబ్
పంచ నదులతో పునీతమైనది
పంజాబ్ నా పంజాబ్

తల్లి దాస్య విముక్తికి అసువులు బాసిన
మహాత్ము కన్నది నా గుజరాత్
శబరమతి తీరంలొ ఈశ్వర్ అల్లా నాదంలా
ఘూర్ణిల్లిన నా గుజరాత్
ఘూర్ణిల్లిన నా గుజరాత్

మరుభూమిని మల్లెలు పూచిన రీతి
ఎడారిలో కళలను పెంచి
ప్రసిధ్ది చెందిన రాష్ట్రం
రాజస్థాన్ నా రాజస్థాన్
రాణీ పద్మిని రాణా ప్రతాప్
శౌర్యానికి ఎనలేని రాష్ట్రం
రాజస్థాన్ నా రాజస్థాన్

మరాఠ కొదమ సింగముగా
వీరశివాజి వాసి కెక్కగా
వస్త్రోత్పత్తికి వరదానం
పూర్వ పశ్చిమల సంగమం
నా రాష్ట్రం మహరాష్ట్రం


చేయి చేయి కలిపి పాడుదాం
భరత మాతకు జయం జయం
భారత మాతకు జయం జయం

వేషం భాషా వేరే అయినా
జాతి మతము వేరైనా
అడుగు అడుగు కలిపి నడుద్దాం
ఏక కంఠమున పాడుదాం
ఏక కంఠమున పాడుదాం.....చేయి

ఆనందానికి ఆవేదనకు భాషతొ పనిలేదూ
భాషకు మూలం భావం కాదా
హావానికి యీ బేధమెందుకు .....చేయి


సత్యాహింసలె ధర్మముగా
నమ్మిన బాపూ మార్గములొ
భారత నవ నిర్మాత నెహ్రూ
కలలను సాకారము సేయుచును.....చేయి

భారత జాతి మా జాతి
ఐకమత్యమే మా మతమూ
మానవత్త్వమే మా ధనమూ
వేద్దాం ప్రగతికి సోపానం
వేద్దాం ప్రగతికి సోపానం.....చేయి

19 October, 2008

వసంతాగానం

Audio: Vasanthaganam

కమ్మగా కూసింది కోయిలమ్మ సిగ్గుగానవ్వింది ముద్దుగుమ్మ

మల్లె మందారాలు సన్నజాజుల తొను
సంపెంగ విరజాజి పూల విందుల తోను
పుడమి పులకించె పండు వెన్నెలలోన
వచ్చింది వయ్యారి వాసంత లక్ష్మి ..కమ్మగా

వీణమీటినలా వేణునాద రవళిలా
మందహాసము చేసె అందాల ఆమని
కన్నె మనసున పలికె ప్రేమ రాగాలేవో
సిగ్గు దొంతర లోన మదుర భావాలేవో ..కమ్మగా

యమునా తీరాన రాస లీలల తేలు
చిలిపి కృష్ణుని తీరు తలచెనేమొ
గున్న మామిడి పైన గువ్వ జంటల వలపు
గుట్టుగా గుర్తుకి వచ్చెనేమొ ..కమ్మగా

మృదు మదుర భావాలు పిల్ల గాలుల తేలి
మూగ బాసలలొన మురిపించెనెంధుకో
ఊహలలో వరుని రూపు ఊరించెనేమొ ..కమ్మగా

14 October, 2008

ప్రవాసాంద్రవాసులం

Audio: Pravasandhravasulam

ఆంధ్రులం ఆంధ్రులం ప్రవాసాంధ్రవాసులం
తెలుగునాడు వదలినా తెలుగు మాట మరతుమా
తేనెలొలుకుతెలుగులొన తనివి తీర గలుగునా .. ఆంధ్రులం

మరువమెపుడు మాతృ భూమి మరువము మరియాదా
మరువమెపుడు సంస్కృతిని సాంప్రదాయాలను
మరువము పండుగ పర్వము మరువము సౌభ్రాతృత్త్వము
మరువము చెలిమి విలువ తెలుగు తల్లి చలువ .. ఆంధ్రులం

విశ్వములొ ఎచటనున్న విఙ్నటను మరువము
తెలుగు మాట మరువము తెలుగుతనము వీడము
తెలుగు తల్లి కీర్తి ఝనత పెంపొందగ మెలుగుతాం .. ఆంధ్రులం