27 October, 2008

యుగ ధర్మం


కళ్ళు తెరిచిన శ్యామల తనకెదురుగా నిల్చున్న డాక్టర్ని పోలీస్ ఇన్స్పెక్టర్ని చూడగానే ఆశ్చర్యంగా కళ్ళు తటతటలాడించిండి.చుట్టూ పరిసరాలు పరికిస్తే హాస్పిటల్ గాగుర్తించడంతో"టైమెంతయింది" అంది యెవర్నీ వుద్దేశించకుండా.
"రాత్రి పదయింది,సాయంత్రం మిమ్మల్ని హస్పిటల్లొ చేర్చారు."డాక్టర్ పల్స్ చూస్తూ అన్నాడు. సాయంత్రం జరిగిన దుర్ఘటన మనసులో మెదిలి భయంతో బిగుసుకుపోయింది.శ్యామల కళ్ళలో ప్రతిఫలిస్తున్న భయం చూసి ఇన్స్పెక్టర్ చిన్నగా నవ్వాడు పలకరింపుగా. అయినాయింకా చుట్టూ చూస్తుంటే "మీ భర్త పేరు ప్రభాకరేనా?"అవునన్నట్లు తలాడించింది.అతను బయట కూర్చున్నారు నేను వేసే నాలుగు ప్రశ్నలకు జవాబివ్వండి చాలుఅతన్ని లోపలకు పిలుస్తాను. అలాగేననట్లు తలాడించింది.అలా తలూపడంతో తలకితగిలినగాయం కలుక్కుమంది. "అబ్బా!" అంది.
"మీకీ గాయాలెలాతగిలాయి?" కార్లోంచి దూకటంవల్ల కూర తరుగుతూంటే చెయ్యి కోసుకుంది అని చెప్పి సాధారణంగా. "పరుగెడుతున్న కార్లోంచి దూకవలసిన అవసరం యేమొచ్చింది"ఆసమయంలొ యెక్కడినుండి వస్తూన్నారు?ఎక్కడికి వెళ్తున్నారు?" చూడండి ఇన్స్పెకరుగారూ మీరు నాలుగు ప్రశ్నలు వేస్తామన్నారెండవ ప్రశ్నలో మూడు ప్రశ్నలు యిరికించారు. జరిగినది క్లుప్తంగా చెపుతాను. నేను ప్లాస్టిక్ ప్రొడుక్ట్ కంపెనీ లో స్టెనొగా పని చేస్తున్నాను,ఇన్స్పెక్టర్ నోట్ చేసుకుంటున్నాడుప్రతి పదవ తారీకున మా స్టాఫ్ మీటింగు వుంటుంది. ఆరోజు తప్పని సరిగా లేటవుతుంది.ఈరోజు కూడా ఆరు దగ్గరవుతూండగాబస్టాపు చేరాను. మా మిగతా స్టాఫ్ కొందరు స్కూటర్ల మీద కొందరు సైకిల్స్ మీదా వెళ్ళిపోయారు.నేనుకాక ముగ్గురు మగవాళ్ళున్నారు.అయిదు నిముషాల్లో బస్సు వచ్చి స్టాపుకి పదడుగుల దూరంలో ఆగింది నేను గమనించి పరిగెత్తే లోగా స్టాపులో వున్న నాళ్ళు పరుగెడుతున్న బస్సునెక్కడం బస్సు కదిలిపోవడం జరిగింది. అసలే చలికాలం చీకటి పడుతోంది యిక బస్సు కోసం వెయిట్ చెయ్యడం మంచిదికాదని ఆటో వస్తోందేమోనని దూరానికి చూస్తున్న నేను చేయిగుంజినట్లయి యిటు తిరిగేలోగానే నన్ను కార్లోకి లాగి డోరువేసి అరవకుండా నోరు నొక్కారు ఏంజరుగుతోందో తెలుసుకొనే లోగానే కారు వేగం హెచ్చింది. కార్లో యెంతమందున్నారు?
వాళ్ళనెప్పుడయినా చూసారేమో చెప్పగలరా? డ్రైవరు కాక యిద్దరు ఫ్రంట్ సీట్లొ ఒకరు బేక్ సీట్లోఒకరుకూర్చున్నారు వాళ్ళని నేనెప్పుడు చూడలేదు.ఆ తరువాత యేమి జరిగిందొ చెప్పగలరా?
చెప్పడానికేముంది వాళ్ళు నావంటి మీదున్నది బంగారంగా భ్రమపడి యీ అఘాయిత్యానికి పూనుకున్నారేమొనని ఫ్రీగా వున్న చేతులతో
మెడలోని గొలుసు గాజులు తీసి అతనికిచ్చి దండం పెట్టాను అప్పుడు వాళ్ళు నవ్విన నవ్వు తల్చుకుంటే వెన్నులోంచి వణుకు వచ్చింది.నా మీద అత్యాచారం చెయ్యడమే వాళ్ల వుద్దేశం అనుకుని భగవంతుడిని మౌనంగా ప్రార్ధించసాగాను. నా అదృష్టం బాగుండి నా నోరు మూసి పట్టుకున్న వ్యక్తి సిగరెట్ జేబులోంచి తీసి వెలిగించుకొడానికి నన్ను కాసేపు వదిలాడు.ఆ సమయాన్ని వృధా చెయ్యకుండా ప్రాణం నిలుస్తే మానం నిలుస్తుందిలేకుంటె ప్రాణలామెగు నిలవదుకదా అని తెగించి పరుగెడుతున్న కారు డోర్ తెరుచుకుని దూకేసాను.ప్రక్కగా బైక్ ఆగడం తెలిసింది.అంతే హస్పిటల్ లోనే కళ్లు తెరిచాను.
మీ ధైర్యం మెచ్చుకో తగ్గది.ఎప్పుడైనా ఆ వ్యక్తులు తటస్త పడితే గుర్తు పట్ట గలరా?
లేదండి వాళ్ళనుంచి తప్పించుకోవడమెలా అనే తాపత్రయమ్ పడ్డానుగాని వాళ్ళు యెలావున్నారని నేను చూడ లేదు. థేంక్స్! పెద్దగా దెబ్బలు తగల లేదు త్వరగా డిశ్చార్జి చెయ్యొచ్చు అవసరం పడితే మళ్ళీ కలుద్డాం".
వెంటనే ప్రభాకర్ లోపలికొచ్చాడు. ముఖం విచారంగా దీనంగా వుంది.ప్రభాకర్ని చూడగానే యింటి వద్దనున్న పిల్లలిద్దరూ గుర్తుకి వచ్చి కళ్ళనీళ్ళు తిరిగాయి శ్యామలకి.
భర్త దగ్గరనుండి ఓదార్పునాశించిన శ్యామలకి ఆశాభంగమయింది. ఎవరో స్నేహితుడిని విసిట్ చెయ్యడానికి వచ్చినట్లు మంచానికి మూరెడు దూరాన నిల్చుని"నీకు ప్రమాదం జరిగినప్పుడు నీ పర్సులోని పర్టిక్యులర్సుని బట్టి నాకు తెలియ పరిచి నిన్ను హాస్పిటల్ లో
చేర్చారుట. ఏమిటో రోజులా కాకుండా యిందరి నోళ్ళలో నానటమయింది. చివరికి పోలీసులు అల్లరి". గాయాయాలకన్న బధించాయా మాటలు దుండగుల చేతుల్లోంచి రక్షింపబడ్డా అది పబ్లిసిటీ అవుతోందన్న బాధ ప్రభాకర్లో యెక్కువగా కనిపిస్తోంది. "పిల్లలేరీ?" మాతృప్రేమ వుగ్గబట్టుకోలేక అడిగింది."పక్కింట్లో అప్పజెప్పి వచ్చాను. పనిపిల్ల వెళ్ళిపోయింది,"అన్నాడు వుదాసీనంగా. "కూర్చోండి పరాయివాళ్ళలా యెంతసేపు నిలబడతారు?"స్టూలు లాక్కుని కూర్చున్నాడు ప్రభాకర్. సిస్టర్ వచ్చి హార్లిక్స్ త్రాగించింది,వొంట్లోకి కాస్త
శక్తి వచ్చినట్లయింది. "ఆఫీసు నుంచి వచ్చి కాఫీ అయినా త్రాగారా?ముఖం వాడి పోయింది.ఫ్రాక్చర్లేవీ లేవుట తొందరగానే యింటికి పంపించేస్తారుకంగారు పడకండి. స్త్రీ మమతానురాగాలు ప్రకటించింది.
"ఈ సంఘటన తెలిసినప్పటినుండి నా తల బాడ్డలయిపోతోందిశ్యామా!
ఈ అల్లరి యీ ఎంక్వయిరీలు విమర్శలు యింతటితో సరిపోవు. ప్రతివాళ్ళకి యిదో చర్చనీయాంశం అవుతుంది.నీ ఆఫీసులో నా అఫీసులో యిరుగు పొరుగు అందరినీ ఫేస్ చెయ్యాలంటే యెంత కష్టం".
"తిరిగి వచ్చినందుకు బాధగా వుందా?ప్రాణాలకు తెగించి మీ కోసం పిల్లల కోసం సాహసించాను.మీరు మెచ్చుకోలేదు సరికదా అదేదో నాదే తప్పయినట్లు మాట్లాడుతున్నారు".వుక్రోషంగా అంది.
మనం యెంత అభ్యుదయం సాధించినా మన దేశంలో స్త్రీలకు పవిత్రత ముఖ్యం కడా! సీతలాంటి సాధ్వికే రాముడు అగ్ని పరీక్ష పెట్టాడు.
రాముడు అడగ్గానేఅగ్నిలో దూకేసి మా అందరి దురదృష్టాలకు సింహద్వారం నిలబెట్టింది.సీత తనకు తానుగా రావణాసురుడికి లెటర్ రాసి పిలవలేదే?తీసుకుపోయేటప్పుడు కూడా యెంతో ప్రతిఘటించింది కదా యింకా ఎందుకు అగ్నిపరీక్ష?
బాగుంది అమె పవిత్రత లోకానికి చాటడానికి.
చాటించాడు బాగానే వుంది.ఆపైన ఎవడో ఏదో అన్నాడని వదిలేయడం ఎందుకు? ఆ సీతారాముల మాట దేముడెరుగును గాని నా పవిత్రత కోసం పరుగెడుతున్న కార్లోంచి దూకాను.నేనింకే అగ్నిలోను దూకలేను, ఆపైన మీ యిష్టం.
ఛ!ఛ! అందుక్కాదు, మనవాళ్ళు పవిత్రతకి అంత ప్రాముఖ్యం యిస్తారని చెప్తున్నాను.
నిజమే వెర్రి సీత కాకుంటే ఆరు నెలలు విడిగా వున్నదని అగ్నిపరీక్ష పెడితే తానివతలకి వచ్చిన తరువాత ,తమరుకూడా నాకు దూరంగా వున్నారు కదా ఏదీ మీరూ అగ్ని ప్రవేశం చేసి మీ పవిత్రత కూడా నిరూపించుకోండి ఆర్యపుత్రా! అని యెందుకనలేదు?ఆమె
పిరికితనమే మమ్మల్ని కాల్చుకు తింటోంది. హాస్పిటల్ అన్న మాట కూడా మర్చిపోయి తన నాటకానుభవం బయటపెట్టింది.
సరే నువ్వు రెస్టు తీసుకో, నేనేం మాట్లాడినా అపార్ధంగాభావిస్తున్నావు బాగుంది ప్రమాదం జరిగి గాయాలు నాకు తగిలాయి ఓదార్పు మీకు కావాలా? మీ సొత్తు నెవరో దోచుకోబోయారని అంత బాధ అనిపించినపుడు మీ సొత్తుని యింట్లోనే దాచుకో లేకపోయారా? భార్య తెచ్చే సంపాదన తీపి యిటువంటి సంఘటనలు చేదూనా? నాకు ధైర్యం చెప్పి వూరట కలిగించడం పోయి సీత పవిత్రత చింతకాయ పచ్చడీనా? ఆ నాటి సీత అరిచి గోల చేసిందేమో గాని నాలా ప్రాణాలకు తెగించి పరుగెడుతున్న కార్లోంచి దూకలేదు.చాలా ఆవేదనగా అంది.
శ్యామా నువ్విలా మాట్లాడటం బాగా లేదు.రేపు యీవార్త పేపర్లలోకెక్కుతుందేమో అని భయపడుతున్నాను.నీమీద నాకెటువంటి అనుమానాలు లేవు.
పేపర్లలో పబ్లిష్ అవకపోతే మీ భార్య తిరుగుయినా బాధలేదా? బోతచాలించు !ఏం మాట్లాడుతున్నావొ తెలిసే మాట్లాడుతున్నావా? మన రఘు రూపలని గుర్తు పెట్టుకునైనా మసలుకోవాలి.పిల్లల్ని కాదని ఏం చెయ్యగలం?
అవును పిల్లల్ని అడ్డం పెట్టుకుని ఎక్కడికి పోగలదులేఅన్న ధీమాతో ప్రతి మగవాడు భార్యని హింసించగలడు. మీకు కొన్ని సులువులు చెప్పనా?పిల్లల్ని పెంచగలనన్న ధైర్యం వుంటే మీరు మరో వూరు బదిలీ చేయించుకుని వాళ్ళమ్మ కారు అక్సిడెంట్ లొ పోయిందని చెప్పండి. అందరూ మీ మీద బోలెడు సానుభూతి కురిపించి పిల్లనిచ్చి పెళ్ళి చేస్తారు. పిల్లల్ని పెంచలేకుంటే నా వద్ద వదిలేయండి నేను పోషించుకోగలను. పాతికేళ్ళ కుర్రాడిలా పిల్లతోపాటు కట్నకానుకలు కూడా ముడతాయి.మీకీ పబ్లిసిటీ బాధ తప్పుతుంది.
మీ జీవితంలో శ్యామల కాటుక చుక్కలాగ సమసిపోతుంది గాని జీడి చుక్కలాగా వుండిపోదు. ఈ సంఘటన తరువాత కూడా మీరు పూర్వంలా నాతో బ్రతకదల్చుకుంటే రేపు వుదయాన్నే పిల్లలిద్దరినీ తీసుకు రండి.లేకుంటే మీకూ నాకూ సారీ! యిలా చెప్పేస్తే మీ సీతారాముల ప్రిన్సిపల్స్ కి సరిపడవు కదా.అయినా ఏం చెయ్యను యివాళ లోకులకు జడిసి నన్నింట్లో పెట్టుకున్నా, రేపు ఎదురింట్లోని మీసం రాని కుర్రాడు నన్ను చూసి నవ్వినా నా వల్లే తప్పన్నట్లు నిముష నిముషానికి నరక ద్వారాలు తెరుస్తారు. అంతకన్నా వివాహ బంధానికే ద్వారం మూసేయడం తప్పుకాదని భావిస్తున్నాను.
ఆ నాటి సీత అలా ప్రవర్తిస్తే అది త్రేతాయుగ ధర్మం.
ఈ నాటి శ్యామల యిలా ప్రవర్తిస్తే యిది యీ కలియుగ ధర్మం.

No comments: