31 October, 2008

కిరాయి మనుషులు

ఆఫీసుకి అరగంటాలస్యమైపోయిందని వాచీ చూసుకుంటూ ఆదరా బాదరాగా ఆఫీసులో అడుగు పెడితే నాగవిల్లి తరువాత పెళ్ళివారిల్లులా చడీ చప్పుడులేదు.ఎవరుండాల్సిన స్తానాల్లో వాళ్ళు లేరు సరికదా ప్యూను జోగులు జోగుతూ కన్పించాడు."ఏమిటోయ్ మన ఆఫీసులో అందరికీ అర్జంటుగా సలవు కావల్సొచ్చిందా యేమిటి ఎవరూ కనిపించటంలేదు".
లేదు బాబూ! మన సుబ్బారావుబాబు తెల్లారీ సరికల్లాసచ్చిపోయారుట. యాదగిరిగారు ఫోన్లో చెప్తే మనోళ్ళంతా అక్కడికెళ్ళారు నేను ఆఫీసుకి కాపలా వుండి తరువాత వచ్చినవాళ్ళకి కబురు చెప్పడానికి వుండిపోయాను. ఎలక్రిక్ షాకు తగిలినట్లయింది,నిన్న సాయంత్రం బస్టాపులో విడిపోయేవరకు నవ్వుతూ కబుర్లు చెప్పిన సుబ్బారావుకి యింతట్లో యేంముంచుకొచ్చింది చెప్మా అనుకుంటూ,సరే నేనూ అక్కడికేవెళ్తాను.అంటూ ఆటోలో బయలుదేరాను బస్సులో అయితే లేటవుతుందని. సుబ్బారవు యిల్లు చేరేవరకు అతన్ని గురించే ఆలోచనలు చుట్టుముట్టాయి.సుబ్బారావు వంటరివాడు మహా అయితే ముఫైఅయిదేళ్ళుండవచ్చు.ఏదో మాటల సందర్భంలో చెప్పాడు చిన్నప్పుడే తల్లి తండ్రి పోయేరని,నా అనేవాళ్ళెవరూ లేరని. ఈ కార్యక్రమమంతా ఆఫీసువాళ్ళే చెయ్యాలనుకుంటాను,ఆలోచిస్తుండగానే అటో సుబ్బారావు వుండే వీధి చేరుకుంది. నాలుగడుగుల ముందుగా ఆటోనాపించి దిగిపోయాను.ఆతృతలో అడుగులు పడుతున్నా తొందరగా నడిచినట్లే అనిపించటం లేదు.గుండెల్నెవరో పిండుతున్నట్లు అనుభూతి కలుగుతోంది. అక్కడ యించుమించు మా ఆఫీసు స్టాఫంతా వుంది.ఇంటి ముందు అందరూ గుమిగూడి వున్నారు. సుబ్బారావు శరీరాన్ని చాప మీద పడుక్కోపెట్టారు, నిద్రపోతున్నట్లు ప్రశాంతంగా వుంది అతని ముఖం. ఇంటి వోనరు శ్రీనివాసయ్యంగారు అరవ యాసతో వివరిస్తున్నారు పక్కవాళ్ళతో రాత్రి కడుపుల నొప్పిగుంది మాత్తర యామన్నవుంటే యీమన్నాడు. పాపం యామి నొప్పొరొంబ కష్టమయింది హాస్పిటలుకి పోదామప్పా అంటే యినుకోలా ఇంతలో యింత అవుతాదనుకోలా శానా మంచివాడు. మురుగాకి దయ లేదు. మా బాస్ దగ్గరకి వెళ్ళి అడిగాను .సార్! యేర్పాట్లెవరు చేస్తున్నారు నేను చెయ్య వలసిన పని యేమైనా వుంటే చెప్పండి. యాదరిరి అన్ని యేర్పాట్లు చేసాడు, యింకొక్క అరగంట పడుతుందేమో. ఏమైనా దురదృష్టవంతుడు.యీమాటలు పూర్తి కానేలేదు యిద్దరు స్ట్రీలు పెద్దగా రోదిస్తూ వచ్చేసరికి అందరి ముఖాల్లో ఆశ్చర్యం కొట్టవచ్చినట్లు కనబడుతోంది. వారు తిన్నగా సుబ్బారావు శరీరం మీదపడి యేమేమిటో వర్ణిస్తూ పెద్దగా యేడుస్తున్నారు. వారి భాష యాస చూడగా హైదరాబాద్ ప్రాంతం వాళ్ళ తీరుగా వుంది. ఎంతయినా తను మాత్రం మనిషి కాదా యేదొ పెళ్ళి జంఝాటం లో యిరుక్కోకుండా యీ స్ట్రీతో సబంధం పెట్టుకొని వుంటాడు. ఇద్దరూ తల్లీ కూతుర్లయి వుంటారు. చిన్నామెకు పాటికేళ్లుంటాయి. వాళ్ళు యేమంటు యేడుస్తున్నారో యేమీ అర్ధం కావడం
లేదు ఓదార్చాలన్నా యెటువంటి పరిచయం లేదు. ఒక పావుగంట గడిచింది. యాదగిరి మిగతా యేర్పాట్లు చూసాడు శ్మశానానికి అందరం బయలుదేరాం.నిన్న నవ్వుతూ మాట్లాడిన వ్యక్తి నేడు కట్టెల్లో బూడిదవుతూంటే కళ్లు చెమర్చాయి.నా ప్రక్కనే వచ్చి నిలుచున్నాడు యాదగిరి. జేబులోంచి కర్చీఫ్ తీసి కన్నులొత్తుకుంటూసుబ్బారావు చాలా మంcఇవాడు కదా యెంత హఠాత్తుగా జరిగింది కలా నిజమా అన్నట్లుంది అన్నాను.ఏంటోనండి మొదట్నుంచి మనిషి నిరాశావాది,పెండ్లెందుకు చేసుకోలేదంటే పోనిద్దూ నాకింకో బంధకమందుకు యిలాగే హాయిగాఆరు.అందరితో వొకేలా మాట్లాడేవారు., ఒకరి విషయంలో అనవసరంగా జొక్యం చేసుకునేవారు.
అన్నట్లుయాదగిరీ నాకో చిన్న సందేహం సుబ్బారావు పెళ్ళీ పెడాకులూ చేసుకోలేదు కదా యిందాక ఏడ్చిన స్ట్రీలిద్దరూ యెవరంటావునీకేమైనా తెలుసా? ప్చ్! యేంచెప్పమంటారు సార్! చనిపోయిన వ్యక్తికోసం యేడ్చే మనిషి కరువయితే ఆత్మకి శాంతి కలుగదంటారు. ఇంతమందిమి వచ్చాంగాని వాళ్ళలా ఒక్కరిమయినా యేడవగలిగామా? ఇంతకూ వాళ్ళెవరో చెప్పనేలేదు. వాళ్ళు కిరాయికి దొరుకుతారు సార్! యిలాంటి కేసులు తటస్థ పడితే వాళ్ళకొక యాభయి రూపాయిలిస్తే అరగంట యేడిచి యింటికెళిపోతారు.

అవాక్కయిపోయాను చనిపోయిన సుబ్బారావుకి వాళ్ళకి యెటువంటి సంబధం లేదు. అతని ముఖమైనా యెరుగరు.అయినా గుండెలవిసేలా ఏడ్చారంటే వాళ్ళచే ఏడ్పించినవి రక్త సంబంధాలు మమతానురాగాలు కావు, "అదే ఆకలి"! యిప్పుడు నా జాలి సుబ్బారావు మీంచి ఆ కిరాయి మనుషుల మీదకి మరలింది.

No comments: