31 March, 2018


    సౌఖ్యము చాలు
 హనుమంతరావు యింట్లో ప్రవేశిస్తూనే వుస్సురంటూ పై మీది కండువా దులిపి వాలు కుర్చీలోకూలబడ్డాడు.భర్త అలికిడి విని చల్లటి మంచినీళ్ళ గ్లాసు అందించి "చాలా దూరం నడిచారా? అలిసిపోయినట్లున్నారు"
అబ్బే! ప్రక్కనున్న పార్కులో కూర్చున్నాను.అక్కడ పిల్లలు కలకిలలాడుతూ వుయ్యాలలూగుతూ జారుడు బల్ల జారుతూ కేరింతాలు కొడుతూ ఆడుతూంటే మనింట్లో లోటేమిటో తెలిసి మనసంతా దిగులుతో నిండి పోయింది. వారం రోజులై పిల్లలందరికీ వేసవి శలవల్లో రమ్మని ఫోను చేస్థున్నాను.పెద్దాడు బెజవాడలో యిల్లు కట్టుకునే ప్రయత్నంలో వున్నాను,  ఏడాది వీలవదు అన్నాడు.వున్నవాళ్ళకి ఏవో కారణాలు పుట్టుకొచ్చాయి. చిన్నదాని నువ్వన్నా కుటుంబమంతా రండి అంటే వాళ్ళాయనకి ఏవో పరీక్షలున్నాయి చదువుకోవాలంది.ఏటికేడాది పిల్లలకోసం ఎదురు చూపులు చూస్తే యిదీ వరస.
"ఏం చెయ్యగలం? ఎల్లకాలం ఒకేలా వుండాలంటే ఎలా? నిజంగానే వాళ్ళకి అవకాశం లేదేమో.
"అలా అనుకోవడం నీ వెర్రితనం.

పెద్దాడు యిల్లు కట్టుకుందికి లోనుకి అప్లై చేశాడుట అది శాంక్షను అవటానికి టైము పడుతుంది,యీ లోగా పని మొదలు పెడతాను ఒక లక్ష పంపు నాన్నా అన్నాడు ఫొనులో కిందటి వారం.నా దగ్గర అంత డబ్బెక్కడిదిరా పెద్ద చెల్లి పెళ్ళికి అంటు మామిడి తోట అమ్మి పెళ్ళి చేశాను. చిన్నదాని పెళ్ళికి మూడెకరాల పొలం అమ్మేశాను.తాతలనాటి యీ యిల్లు నా పెన్షను తప్ప వేరేఆదాయం ఏముంది?సర్వీసులో వున్నన్నాళ్ళు నిజాయితీగా బ్రతికాను, ఒక్క కాణీ వెనకేసుకోలేదు నేనేమీ సాయం చెయ్యలేను నీ స్వశక్తిమీద ఏర్పర్య్చుకోమని ఖచ్చితంగా చెప్పాను.  దాని పరిణామమే యిది. అందరూ కలిసి నామీద కక్ష సాధిద్దామనుకుంటున్నారు." అంటూ నిట్టూర్చారు.భర్త మాటల్లో నిజం లేక పోలేదు అనుకుని మౌనం వహించింది అనసూయ.

మర్నాడు అదే ధోరణి భర్తకి వూరడింపు మాటలు చెప్పడానికే కరవయ్యాయి.అతనికి మనుషులు కావాలి.వేసవి వచ్చిందంటే ముగ్గురు కొడుకులు కోడళ్ళు అయిదుగురుమనుమలు యిద్దరు కూతుళ్ళు అల్లుళ్ళు నలుగురు మనుమలు వస్తే యిల్లు నిండుగా వుంటుదని ఆయన ఆశ.

              పిల్లల కోసం పెరట్లో వుయ్యాల వేయించి  తాటి మంజలు చెరుకు గడలు మామిడి పళ్ళు తెచ్చి సంబర పడేవారు.అనసూయకూడా అరిసెలు జంతికలు చిట్టి చేగోణీలు పిల్లలకోసమనే ఏమిటి అందరికోసం మనిషిని పెట్టి చేయించేది.వీటన్నిటికీ డబ్బెక్కడి నుంచి వస్తున్నాదని ఒక్కరోజు భర్తని అడగ లేదు,ఫలానా యిబ్బందని భర్త చెప్పలేదు.
ఈ రోజు భర్త డ్బ్బు గురించి మాట్లాడుతుంటే విచిత్రమనిపించింది. అదే మాట అతనితో అంటే "పదే పదే అనుకుంటే యిబ్బంది తగ్గదు,అంతగా అవసరం పడితే పదివేల దాకా మన సుబ్బరాజు సర్దేవాడు.వీలు చూసుకుని తీర్చేసేవాడిని.అతనే రెండేళ్ళ క్రితం సలహా యిచ్చాడు,అమ్మినవి పోగా ఒక చిన్నజాగా చెరువుకింది భాగంలో వుంది కదా ఎప్పుడు పచ్చి గడ్డి పెరిగి పశువులు మేసేవి లేక పశువులకోసం కోసుకెళ్ళేవారు.దానికి కంచె వేయించమని తనకి తెలిసిన వ్యక్తి వున్నాడు అతనికి కూరగాయల పెంప్కంపై మంచి అవగాహన వుంది. చెరువు దిగువలో వున్న పొలం కావున ఎక్కువ నీరు అవుసరం వుండదు అతనిచేత కూరగాయలు పండించితే ఏడాది పొడుగునా మనకి సరిపడా కూరలు దొరుకుతాయి,ఎక్కువైన వాటిని బజార్లో అమ్మి మనకి సగం యిచ్చి తను సగం వుంచుకుంటాడని చెప్పాడు.అప్పటినుండి చిన్నా చితకా వాటికి యిబ్బంది పడటం లేదు.కొంతసొమ్ము వెనకేసి పిల్లలు వచ్చినప్పుడు ఖర్చు పెడుతున్నాను.అంతేగాని నాచేతిలో లక్షలు మూలగటం లేదు." 
:పోనీండి బాధ పడకండి. పిల్లలందరికీ చదువులు చెప్పించి  ప్రయోజకుల్ని చేశాం.పెళ్ళిళ్ళు చేసి ఎవరి సంసారం వాళ్ళకి ఏర్పాటు చేశాం. వయసులో యింకేం చెయ్యగలం" అంటూ వూరడించింది అనసూయ.
మర్నాడు రాత్రి భోజనాలయాక భర్త కుర్చీ పక్కన కూర్చుని " మీరు శాంతంగా వింటానంటే ఒక్క మాట చెప్తాను." అంటూ పర్మిషను కోసం అగింది.ఏమిటన్నట్లు చూశ్శారు.హనుమంతరావు.
"ప్రతి  సంవత్సరం మనంపిలిచినా  వాళ్ళకి అవకాశం వుండొచ్చు వుండకపోవచ్చు,వాళ్ళ యిబ్బందులు వాళ్ళవి మనకిప్పుడు శలవు పెట్టుకోవాలన్న చింత లేదు పెద్ద యిల్లు వుందనే తప్ప మరే కారణం లేదు .మనమే ఒక పదిహేను యిరవై రోజులకోసం పిల్లల దగ్గరకెళ్ళితే వాళ్ళూ సంతోషిస్తారు మనకి కొంత మార్పు వుంటుంది.
అన్నట్లు  మన హాస్పిటల్ కంపౌండరు యీ రోజు సాయంత్రం కనిపించి అడిగాడు, మనకి యింత యిల్లు వుందికదా వుండేది మనమిద్దరమే  యీ వూరికి ట్రాన్స్ఫర్ అయి కొత్తగా డాక్టరు కుటంబంతో సహా వచ్చారుట.స్నేహితుడింట్లో భార్య యిద్దరు పిల్లలతో వున్నారుట మన యింటిలో పక్క వాటా అద్దెకిస్తామా అంటూ అడిగాడు.పిల్లలతో వాళ్ళు అద్దెకి వుంటే మనకి కాస్త ఒంటరితనం తగ్గుతుంది.ఏడాదిలో ఒక వారం రోజుల కోసం వచ్చే మనుమల కోస పిల్లల కోసం ఎదురు చూపులు చూసేకన్నాయింట్లో రోజూ వుండే పిల్లలతో సాన్నిహిత్యం పెంచుకుంటే బాగుంటుందేమో ఆలోచించండి."

" మన పిల్లలు వచ్చినప్పుడు యిల్లు యిరుకవుతుండేమో", సందేహంవెలి బుచ్చాడు హనుమంతరావు." మీది మరీ చాదస్తం యింతకన్నా చిన్న యిళ్ళలో మనుషులు వుండటం లేదా?సర్దుకుంటారు.మీరు సరేనంటే రేపు కంపౌండరుకి చెప్తాను. రోజూ మనింటి మీంచే హాస్పిటలికి వెళ్తాడు. హనుమంతరావుకి కూడా యీ ఆలోచన నచ్చింది.కాని డబ్బు కక్కుర్తి కోసం యిల్లు అద్దె కిస్తున్నామనుకుంటారేమొ మెల్లిగా గొణిగాడు..
మర్నాడు కంపౌండరుచేత కబురు చేసంది అనసూయ.ఆడవాళ్ళు యిటువంటి విషయాల్లో వెనుకడుగు వేయకుండా నిర్ణయాలు తీసుకుంటారని నవ్వు పారేశాడు హనుమంతరావు.
సాయంత్రం డాక్టరు భార్యా బిడ్డలతో కంపౌండరుని తీసుకుని వచ్చారు. కంపౌండరు పరిచయం చేశాడు.
"నమస్కారం బాబయ్యగారూ నమస్కారం పిన్నిగారూ"అంది డాక్టరుగారి భార్య వాణి.డాక్టరు చిరునవ్వుతో నమస్కరించాడు.వాళ్ళ పెద్దబ్బాయి ఆరేళ్ళవాడు చిన్నవాడు ఎనిమిది నెలలవాడు.
" నా పేరు సారధి నా భార్య వాణి."
"రండి బాబూ కూర్చోండి" అంటు కుర్చీలు చూపింది అనసూయ."మంచి నీళ్ళు యిమ్మన్నారా?"
"వద్దమ్మా ఎకువ దూరం నడవ లేదు కావాలంటే అడుగుతాను. డాక్టరు మాటలో వండవలసిన మార్దవం చాలా వుంది  కంపౌండరుకంపండరు "బాబూ మీరు మాట్లాడుకోండి నేను వస్తాను, మీరిద్దరూ  పెద్ద వాళ్ళై పోయారు,యింత యింటిలో ఒక్కరూ రాత్రి పూట అవసరం వచ్చినా ఒకరిని వంటరిగా వదిలి రెండో వాళ్ళు వెళ్ళలేరు యింటిలోనే డాక్టరూగారుంటే అవసరం పడితే సహాయ చెయ్యగలరు." అనగానే హనుమంతరావు "ఏనాడూ యీ కోణంలో ఆలోచించలేదయ్యా,నీ సజెషను చాలా బాగుంది"
డాక్టరుగారూ!మా యిల్లు రెండు వాటాలుగా వున్నా యిండిపెండెంటుగా లేదు.వాకిలంతా కలిసే వుంది దీనిని విభజించలేం"

"అయ్యో మీరు నన్ను డాక్టరుగారూ అంటూ మన్నించవద్దు తండ్రిలాంటివారు,మాకు యిలాంటి యిల్లైతేనే సంతోషం. రోజూ మీ యిద్దరూ కనిపిస్తూ వుంటారు.మా వాణికి మనుషుల్లేకపోతే నన్ను సతాయిస్తూంటుంది".వాణి నవ్వేసింది.

"కాఫీ చేస్తాను."అంది అనసూయ."యిది మాత్రం కాదనకండి"అన్నారు హనుమంతరావు.
"నేనూ సాయం చేస్తాను పిన్నిగారూ"అంటూ వెనుకే వెళ్ళింది వాణి."ఎల్లుండి దశమి వచ్చేయండి రేపు మనిషని పెట్టి యిల్లు శుభ్రంగా కడిగించేస్తాను." 
"అద్దె గురించి మీరేమీ చెప్పలేదు,"అన్నాడు సారధి."మీకెంత యివ్వాలనుకుంటే అంతే యివ్వండి ,డబ్బులకోసం కన్నా మనుషులు సందడి కోసం అద్దెకిస్తున్నాను."
అక్కడ డబ్బు ముఖ్యం కాదన్నది అర్ధమైంది సారధికి."మాకు గవర్నమెంటు హౌస్ అలవెన్సు ఎనిమిది వేలు యిస్తుంది అది చాలదంటే మీరెంత చెబితే అంత యిస్తాను."
" ఎనిమిది వేలే చాలు మీరు వచ్చేయండి"
వంటిటిలోంచి కాఫీ బిస్కట్లు వచ్చాయి .ప్లాను చెప్పగానే" సరే ఎల్లుండి పాలు పొంగించి సామాన్లు పెట్టేసుకుంటాం. ట్రాన్స్ఫర్ల వాళ్ళం కదా సామాను ఎక్కువ లేదు.ఎంత అవసరమో అంతే వుంది"అంది వాణి.
వాళ్ళు యిల్లు మారిన మర్నాడు అలవాటుగా పెరటి వరండాలో వాలు కుర్చీలో కూర్చున్నారు హనుమంతరావు.గదిలొ పడుక్కో పెట్టిన చంటివాడు బంగురుతూ వచ్చి తాత తాత అంటూ హనుమంతరావు కాలిమీద చిట్టి చేయి వేసాడు.వెంటనే చూసి "నువ్వురా బుజ్జీ దా!"అంటూ ఎత్తుకుని గుండెలమీద కూర్చో పెట్టుకున్నారు.
అనసూయ చూసి "చాలా సంతోషంగా వుంది,యిల్లు కళకళ లాడిపోతోంది.పిల్లలు భగవత్స్వరూపులు వాళ్ళకి తనపర బేధం వుండదు"
వాణి బయటికి వచ్చి 'బాబయ్యగారూ వీడు మీ దగ్గరకొచ్చాడా?"
"రానీయమ్మా యీ ఆనందం కోసమే వారం రోజులై కొట్టాడి పోయాను మాకింత కన్నా ఏం కావాలి? ఈ సౌఖ్యం చాలు."