నీతి నియమాలకై సరిహద్దులేర్పరిచి
న్యాయ ధర్మాలకై కొలబద్ద్లుంచి
జాతి మతములటంచు విభజనలు గావించి
వీటన్నిటికి వేరు దైవాల నియమించి
మానవత్త్వపు మాట మరచావు నీవు
ఓ మనిషీ యిదా నీపంథా?
సత్యాహింసలు నీ మతమనుచు
ధర్మ మార్గమే నీ బాట యనుచు
ప్రజా క్షేమమే నీ లక్ష్యమనుచు
శాంతి పరిరక్షణే నీ గమ్యమనుచు
మారణాయుధములు చేతబూనావు
ఓ మనిషీ యిదా నీ పంథా?
రాజకీయములు నీ సర్వస్వమనుచు
పదవీ వ్యామోహమే పరమార్ధముగ నెంచి
రక్త సంబంధముల రచ్చకీడ్పించావు
రుధిరధారల యెల్లెడల చిందింపజేశావు
పరంధాముడిని కూడా పార్టీలో చేర్చావు
ఓ మనిషీ యిదా నీ పంథా?
స్త్రీలు తల్లి తోబుట్టువులా భావించమనుచు
తరుణుల ప్రగతియే దేశ సౌభాగ్యమ్మనుచు
మగువను గౌరవించనిదే మనుగడ లేదనుచు
ఉపన్యాసములలో నమ్మ బలికేవు
వెండితెరపై స్త్రీల వలువలిప్పించావు
ఓ మనిషీ యిదా నీ పంథా?
26 October, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment