మేము అయిదుగురు స్నేహితురాళ్ళం భిలాయి నుంచి భోపాల్ బయలుదేరాం.అక్కడ చదువుకుంటున్న మా అమ్మయిలని కలిసి రావడానికి. నా ఒక్కర్తికే రానూ పోనూ రిజర్వేషను అయింది మిగతా వాళ్ళు వచ్చేటప్పుడు రైల్లో చేయించుకుంటాం అని వూరుకున్నారు.
రెండు రోజుల తరువాత తిరుగు ప్రయాణం.నా రిజర్వుడు బెర్త్ లో నేను కూర్చున్నాను. అదే కంపార్టుమెంటులో మా స్నేహితులు ఎక్కి టీ టీ యిని అదే పెట్టెలో వాళ్ళకి బెర్తులు అలాట్ చేయమని కోరారు.ఆ పెట్టెలో వీలుకాదని వేరే బోగీలో అలాట్ చేస్తామన్నారు.
"ఒక్క రాత్రి ప్రయాణం మీరంతా ఒకచోట వుంటారు బెర్తులు వేరే చోట తీసుకోండి నాకిక్కడ ఒక్కర్తిని అన్న భయం లేదు"అన్నాను. అందరికీ ఒక్ చోట బెర్తులిమ్మని చాలా బతిమాలేరు. ఇక తప్పదని నాతో సహా మా అందరికీ వేరే బోగీలో బెర్తులు అలాట్ చేశారు.
అందరం అక్కడ కూర్చుని 'హమ్మయ్య!'అనుకున్నాం.వెళ్తూ వెళ్తూ ఆ టీ టీ యి నాతో "మేడం!వేరే టీ టీ యీ వచ్చి అడిగితే పొరపాటూన కూడా మీరు వేరే బోగీ నుంచి యిక్కడికి వచ్చినట్లు చెప్పవద్దు,"అని హెచ్చరించాడు.
ఇందులో ఏదో తిరకాసుంది చూద్దాం ఏమవుతుందోనని దుప్పట్లు వేసుకుని నిద్రకుపక్రమించాం.
ఇటార్సీ స్టేషను దాటిన పావుగంటకి వేరే టీ టీ యీ వచ్చి లైటు వేసి "టికెట్"అన్నారు.నా టికెట్ చూడగానే "మీరిక్కడెలా కూర్చున్నారు? ఎస్-4 లో మీ బెర్తు కదా"అన్నారు గద్దించుతూ.నా పనైపోయిందనుకున్నాను.
మళ్ళీ అడిగారు విసుగ్గా"ఈ కంపార్టుమెంటులో మీ బెర్తు లేదు యిందులో ఎందుకు కూర్చున్నారు?"స్వరంలో అధికార దర్పం వుంది.ఏంచెయ్యాలో పాలుపోలేదు,అయినా స్థిరంగా "నాకు తెలియదు,నాకు చదువురాదు. భోపాల్ లో టి టీ యి కి టికెట్ చూపించి ఎక్కడ కూచోవాలని అడిగితే యీ జాగాలో కూర్చోమన్నారు.కూర్చున్నాను.అంతకుమించి నాకేమీ తెలియదు"అన్నాను.
ఎగాదిగా చూసి గొణుక్కుంటూ వెళ్ళారు.అతను వెళ్ళారని నమ్మకం కుదిరాక మావాళ్ళంతా లేచి"మిసెస్ రావ్! అంత ధైర్యంగా అబద్ధమెలా చెప్పారు?మరోకటీ మరికటీకాదు ఏకంగా చదువురాదని,బాప్ రే!"అనగానే "ఏం చెయ్యాలి మీ అందరికోసం నా బెర్తు వదులుకుని వచ్చాను.ఏ మాత్రం నసిగినా పినాల్టీ వడ్డించేస్తారు.ఎలాగో తప్పించుకోవాలి, అదే చేశాను."
వారిజాక్షులయందు
వైవాహికములందు
ప్రాణ విత్త మాన భంగమందు
బొంకవచ్చునధిప పొందదఘము.అన్న పద్యం గుర్తుకొచ్చింది.ఈ పద్యార్ధం మా వాళ్ళకి బోధపరిచే ఓపిక లేక దుప్పటి ముసుగు పెట్టేసుకున్నాను.
No comments:
Post a Comment