23 July, 2013

పేరులో ఏముంది?

పద్మనాభంగారింటి పక్కవాటాకి 'టు లెట్'బొర్దు పెట్టిన నాలుగు రోజులకి యిల్లు చూడటానికి కుటుంబరావు వచ్చాడు.పద్మనాభం యిల్లు చూపిస్తూ,"మా అబ్బాయిలిద్దరూ పెద్ద చదువులకి వచ్చాక వాళ్ళకోసం ఈ రెండు గదులు కట్టించాను.వుద్యోగాలకై ఒకడు అమెరికా మరొకడు అస్సాం వెళ్ళారు.ఆర్నెల్ల క్రితం ఒక గదిని వంటిల్లుగా మార్చి చిన్న వాటా చేశాను.చిన్న కుటుంబానికి పనికివస్తుందని."క్లుప్తంగా చెప్పారు.
"యిల్లు బాగుంది,అన్నట్లు నా పేరు కుటుంబరావే గాని నాకు కుటుంబం లేదు.ఒంటరివాడిని.ఎ జి ఆఫీసులో అకౌంటెంటుగా పని చేస్తున్నాను.నాలుగు నెలల క్రిందట ట్రాన్స్ఫరు మీద యీ వూరు వచ్చాను.యిన్నాళ్ళు ఒక స్నేహితునితో కలిసి వున్నాను.నేను స్వయంగా వంట చేసుకుంటాను.నా కంటూ ఒక వాటా వుంటే బాగుంటుందని వచ్చినప్పటినుంచి వెతుకుతున్నాను."
"పెళ్ళి కాలేదా? బ్రహ్మచారులకి అద్దెకిస్తే యిబ్బందికరంగా వుంటుందని ఆలోచిస్తున్నాను.యింతవరకు ఎవరికీ యిల్లు అద్దెకి యివ్వలేదు." నసిగారు పద్మనాభంగారు.
"నాకింకా పెళ్ళికాలేదు.బ్రహ్మచారినని మీరు శంకించే పనిలేదు.నాకెటువంటి దురలవాట్లు లేవు.స్నేహితులు, తిరుగుళ్ళు నాకలవాటులేదు.వుదయం వంట చేసికుని అన్నం తిని పదింటికి ఆఫీసుకెళితే అయిదున్నరకి యిల్లు చేరుకుంటాను.రాత్రి కొసం వండుకోవడం తొందరగా భోజనం చేసి ఏదైనా పుస్తకం చదువుకుని నిద్రపోవడం. నావల్ల మీకెటువంటి యిబ్బంది కలుగదు.మీకంగీకారమై అద్దె ఎంతో చెపితే వచ్చే వారం సామాన్లతో వస్తాను."
"ఒక సారి నా భార్యతో కూడా సంప్రతించి చెపుతాను.మా యింట్లో కాసేపు కూర్చోండి,"అంటూ ఆహ్వానించారు.
'సరే'నంటూ వాళ్ళ వాటాలోకి వెళ్ళాడు కుటుంబరావు.పద్మనాభం గారిని అన్నపూర్ణమ్మని చూస్తే ఎంతో గౌరవభావం కలిగింది.అద్దె నాలుగు వేలు రెండు నెలల అద్దె అద్వాన్సు చెప్పేరు.రెండో మాట లేకుండా పన్నెండు వేలు చేతిలో పెట్టాడు.చూడటానికి మర్యాదస్తుడిలా వున్నాడు,యిల్లు ఖాళీగా వుండేకన్నా ఎవరో ఒకరుంటారని సంతృప్తి పడ్డారు.
మరుచటివారం సామాన్లతో వచ్చాడు కుటుంబరావు.చిన్న సంసారానికి తగిన అన్ని హంగులు వున్నాయి.శనివారం వచ్చి ఆదివారం సాయంత్రానికి అన్నీ అమరికగా సర్దుకుని,సోమవారం పదయేసరికి ఠంచనుగా ఆఫీసుకు స్కూటరు మీద బయలు దేరాడు.అన్నపూర్ణమ్మగారి పని మనిషిని వుదయాన్నే యిల్లు శుభ్రం చేసి గిన్నెలు తోమటానికి కుదుర్చుకున్నాడు.నెల రోజులు అతని దినచర్య చూసిన పద్మనాభందంపతులకి ముచ్చటవేసింది.రోజూ రాత్రి ఎనిమిదిన్నర అయేసరికి భోజనం చేసి వీధి వరనండాలో కుర్చీ వేసుకుని ఒక అరగంట కూర్చునేవాడు.అదే సమయానికి పద్మనాభంగారు కూడా బయట కూర్చునేవారు.వరండా కామన్ అవటంతో ఆ అరగంటా కుశల ప్రశ్నలు పిచ్చాపాటీ నడుస్తుండేది.
పద్మనాభంగారు కూడా ఎ జి ఆఫీసులో సూపరెంటెండెంటుగాచేసి రిటైరు అయ్యారు. ఆ కారణాన కుటుంబరావుని అభిమానంగా చూసేవారు.
ఏ సమయంలో కుటుంబరావు వుంటున్న వాటాలోకెళ్ళినా యిల్లు అద్దంలా వుండేది.యిల్లాలు వున్న యింట్లో కూడా అంత తీరుగా వుండదేమో అనిపించేది.వంటింట్లో గిన్నెలూ డబ్బాలు సర్దుకున్న తీరు చూసి అన్నపూర్ణమ్మగారు "బాబూ నీ యిల్లు చూడముచ్చటగా వుంది. బ్రహ్మచారులకు కూడా యిల్లు యివ్వ వచ్చని నిస్సందేహంగా చెప్పొచ్చు.నిన్ను కన్న తల్లి తండ్రులు ధన్యులు."
"అలా అనకండి పిన్నిగారూ!నా తలిదండ్రులు ధన్యులేమో గాని నేను ధన్యుడినిగాను.నా చిన్నప్పుడే అమ్మా నాన్నాపోతే తాతగారూ నాయనమ్మా నన్ను పెంచారు.మా నాయనమ్మకి ప్రతి పనిలో సహాయపడేవాడిని.వాళ్ళిద్దరూ కాలం చేసి అయిదేళ్ళవుతోంది.
"అయ్యో అలాగా మరి మీ స్వగ్రామం?"
"వేములవాడలో మా తాతగారి యిల్లు కొంత ఆస్తి వున్నాయి ఎప్పుడైనా చూసి వస్తుంటాను."
ఆర్నెలలు గడిచాయి,కుటుంబరావుని కొడుకులా చూసుకునేవారు.అతను కూడా యింటి యజమానులలా కాకుండా పెద్దలనే గౌరవాభిమానాలతో మసలుకునేవాడు.
ఒక రోజు రాత్రి అన్నపూర్ణమ్మ బెడ్రూములో వాళ్ళింటిని కలిపే తలుపుని గట్టిగా తడుతూ "బాబూ కుటుంబరావ్ ఒక్కసారి లేస్తావా?"కాస్త గట్టిగానే పిలుస్తున్నాది.వెంటనే లేచి వెళ్ళాడు.
"మీ బాబయ్యగారు బాత్రూముకని లేచి మంచినీళ్ళు అడిగితే యిచ్చాను.గ్లాసు పట్టుకోలేదు.అడ్డంగా మంచం మీద పడిపోయారు.మన స్పృహలేదు పిలిస్తే పలకటం లేదు."
ముఖం మీద నీళ్ళు జల్లి తువ్వాలుతో తుడిచాడు."మీరేం కంగారు పడకండి,ఆటో తెస్తాను హాస్పిటల్ కి తీసుకెళ్దాం."క్షణం ఆలస్యం చేయకుండా స్కూటరు తీసి ఆటో తెచ్చాడు.
ఆటో డ్రైవరు సాయంతో పద్మనాభంగారిని ఆటోలో కూర్చో పెట్టి అన్నపూర్ణమ్మగారిని పట్టుకు కూర్చోమని, స్కూటరుతో ఫాలో అయాడు.అన్ని పరీక్షలు చేసి బి పి లో అయిందని మందువేసి డ్రిప్సు పెట్టారు. నాలుగు రోజులు హాస్పిటల్లో వుంచి పరీక్షిస్తామన్నారు దాక్టర్లు.
"కంగారు పడకండి పిన్నిగారూ అంతా సర్దుకుంటుంది.బాబయ్యగారికేమీ కాలేదు.మీ అబ్బాయికి ఫోను చెయ్యమన్నారా?"
"ఫోను చేసి హాడావిడి పెట్టొద్దు బాబూ,కోడలు వుద్యోగం పిల్లల చదువులు.అవకాశం చూసుకుని వచ్చి చూడమని చెపుతాను.యిక్కడికి పది కిలో మీటర్ల దూరంలో వున్న పల్లెటూర్లో మా ఆడబిడ్డ,వాళ్ళమ్మాయి వున్నారు.వాళ్ళకి ఫోను లేదు.మనిషి వెళ్ళి తీసుకొస్తే వెంటనే వస్తారు."
"అడ్రసు యివ్వండి నేను వుదయాన్నే వెళ్ళి తీసుకువస్తాను."
"మా ఆడబిడ్డకి వుత్తరం వ్రాస్తాను,నువ్వెవరో ఆమెకి తెలియదుకదా. వెంటనే బయలుదేరి రమ్మని చెప్పు."
వుదయం టాక్సీ తీసుకెళ్ళి వుత్తరం చూపించి పద్మనాభంగారి చెల్లెలిని మేనకోడలిని హాస్పిటల్ కి తీసుకొచ్చాడు కుటుంబరావు.వాళ్ళిద్దరినీ చూడగానే అన్నపూర్ణమ్మకి కొండంత ధైర్యం వచ్చింది. పద్మనాభంగారి ఒంట్లో కూడా కాస్త నెమ్మదించింది.కుటుంబరావు సహాయానికి పదే పదే ధన్యవాదాలు చెప్పారు భార్యా భర్తలిరువురూ.
"మీరేమీ వర్రీ అవకండి బ్బాబయ్యగారూ, ఏ సహాయం కావాలన్నా మీ అబ్బాయికి చెప్పినంత చనువుగా చెప్పండి. ఈ రోజు ఆఫీసుకి శలవు పెడతాను."ఈ మాటలు విన్న అన్నపూర్ణమ్మకి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.
పద్మనాంభంగారి చెల్లెలు సుభద్రమ్మ ఆశ్చర్యపోయింది. యింట్లో అద్దెకున్న అబ్బాయి యింటి మనిషిలా సాయం చేస్తూంటే,"ఏ అమ్మ కన్న బిడ్డో గాని ఈ కాలంలో యిటువంటి వాళ్ళుండటం అరుదు" అంది వదినతో.
"వదినా నువ్వు అన్నయ్య దగ్గరుండు నేను,రాజీ యింటికెళ్ళి వంటచేసి మీ యిద్దరికీ భోజనం తెస్తాము."
"పిన్నిగారూ మీరూ యింటికెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అవండి. మీరు భోజనం చేసి వచ్చేవరకు నేను బాబాయిగారి వద్ద వుంటాను.'
"నీకింకా శ్రమ నాయనా.రాత్రినుండి ఒక్క క్షణం విశ్రాంతి లేదు."
"మీరు పెద్దవారు మీరు రెస్టు తీసుకోండి నాకేమీ శ్రమలేదు."
యింటికెళ్ళిన వదినా ఆడబిడ్డలిద్దరూ పద్మనాభంగారి అనారోగ్యం కన్నా కుటుంబరావు మంచితనాన్నే గుర్తు చేసుకున్నారు.
నాలుగోనాడు డిశ్చార్జి అయి యింటికొచ్చారు పద్మనాభంగారు.మందులు వాడుతూ రెస్టు తీసుకోమన్నారు డాక్టరు. ఆ రోజే పెద్దకొడుకు ఫ్లైటులో వచ్చి ఒకరోజుండి వెళ్ళాడు శలవు లేదంటూ.
సుభద్రమ్మ తనూ వెళ్తానంది."అయ్యో అప్పుడేనా నాలుగు రోజులుండు తొందరేముంది?" నిలదీసింది ఆడబిడ్డని.
"యింటి దగ్గరున్న ఖాళీ స్థలంలో మనిషిని పెట్టి కూరలు పండించుతున్నాను.మాకు కావలిసినవి అట్టే పెట్టుకుని మిగిలినవి మార్కెత్లో అమ్మించి వచ్చిన డబ్బులు నేనుసగం పనివాడు సగం తీసుకుంటాం.నేను లేకుంటే పనులు సజావుగా సాగవు కావాలంటే మళ్ళీ వస్తాను"
"సరే నువ్వంత చెప్పాక కాదనడమెలా? పోనీ రాజేశ్వరిని ఒక నెలరోజులు నాకు సహాయంగా వుంచు."సరేనని సుభద్రమ్మ ఒక్కతే వూరికి వెళ్ళింది.
పద్మనాభంగారు హాస్పిటలు నించి యింటికొచ్చిన దగ్గరనుండి రోజూ ఆఫీసుకెళ్ళేముందు ఎలా వున్నారో పరామర్శించి,ఏమైనా కావాలా అడిగి వెళ్ళేవాడు కుటుంబరావు.సాయంత్రం వస్తూ పండో కాయో స్వీటొ తెచ్చి చేతిలో పెట్టేవాడు.
'ఏ నాటి ఋణమో యిలా తీర్చుకుంటున్నావు నాయనా! నీ వద్ద అద్దె వసూలు చెయ్యటానికి జంకుగా వుందయ్యా కుటుంబరావ్."
"అంత మాటనకండి బాబయ్యగారూ మీతో వుంటే నేను ఒంటరి వాడినన్న విషయం జ్ఞప్తికి రాదు."
ఆ రోజు అన్నపూర్ణమ్మ భర్తనడిగింది,"మీ చెల్లిని సంప్రతించి కుటుంబరావుకి రాజేశ్వరినిస్తామని అడిగితే బాగుంటుందనుకుంటున్నాను,మీరేమంటారు?మీ బావ పోయాక రాజీకి సంబంధం చూసే బాధ్యత మీమీదే వుందికదా!మూడేళ్ళు తండ్రి జబ్బుతో వున్నాడని పెళ్ళికి సుముఖత చూపలేదు. తండ్రి పోయాక తల్లి ఒంటరిదైపోతుందని ఆగమంది. చూస్తూ చూస్తూ ముఫై రెండేళ్ళు దాటుతున్నాయి. కుటుంబరావు  ముఫై అయిదేళ్ళన్నాడు. యింత మంచి సంబంధం ఎక్కడ దొరుకుతుంది?"
ఇటువంటి విషయాల్లో ఆడవాళ్ళ బుర్ర పాదరసంలా పని చేస్తుందనుకున్నాడు.ఆలోచనలో అంకురార్పణ జరగగానే క్రియా రూపానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు పద్మనాభం దంపతులు.
సుభద్రమ్మని అడగగానే తన అంగీకారం తెలిపింది.అద్దెకున్న అబ్బాయితో పెళ్ళి ప్రస్తావన తేవడం యిష్టమేనా అని రాజేశ్వరిని అడిగింది అన్నపూర్ణమ్మ.
"అన్నీ బాగున్నాయిగాని పేరే బాగులేదు.కుటుంబరావు అనగానే గంపెడు పిల్లలు పేదరికంతో క్రుంగిపోతున్న బడుగు వ్యక్తి కళ్ళముందు కనిపిస్తాడు."వినగానే ఘొల్లున నవ్వింది,"నయం నాతో అన్నావు సరిపోయింది యింకెవరితో అన్నా నవ్విపోతారు." "యిప్పుడు నువ్వు కూడా నవ్వావు కదా అత్తా!"
ఒక్క సారి ఆ అబ్బాయి యిల్లు చూస్తే ఆ మాటనవు.అతని వుద్దేశమేమిటో కూడా తెలుసుకోవాలి.నీ పెళ్ళయిపోతే మీ అమ్మకి నిశ్చింత.సరిగ్గా చెప్పు అడగమన్నావా? లేదా?"
మీ యిష్టం అత్తా మీ అందరికీ ఏది మంచిదనిపిస్తే అదే చేయండి."
ఆదివారం నాడు తమ యింటికి భోజనానికి ఆహ్వానించారు కుటుంబరావుని.
"పిన్నిగారిని శ్రమ పెడతారెందుకు? నాకలవాటే కదా వండుకోవడం."
"మాతోపాటే పట్టెడన్నం పెట్టడానికి శ్రమేమిటయ్యా,మరేమీ అడ్డు చెప్పకు."పరంధామయ్యగారు నిక్కచ్చిగా చెప్పారు,కాదనలేకపోయాడు.
భోజనానికి వస్తూ పళ్ళు స్వీట్లు తీసుకొచ్చాడు కుటుంబరావు."యివన్నీ దేనికయ్యా?యిచ్చేది ఈత పండు తీసుకునేది తాటి పండు అన్నట్లుంది."
"భలే సామెత చెప్పేరుగాని మీ అభిమానాన్ని ఈత పండుతో పోల్చడం భావ్యం కాదు."
భోజనాల సమయంలో రాజేశ్వరి వడ్డనలో సహాయం చేస్తుంటే గమనించాడు,చామన ఛాయ అయినా చారెడేసి కళ్ళు నల్లగా ఒత్తయిన పొడవాటి జడ నవ్వు ముఖం కళైన పిల్లే అనుకున్నాడు.యిన్ని సార్లు చూసినా ఒక్క మాటైనా మాట్లాడటం వినలేదు అనుకున్నాడు.వెంటనే ఆ కోరికా తీరింది.
"పెరుగు వడ్డించమ్మా."
"అలాగే మామయ్యా."వీణమీటినట్లుంది స్వరం మనసులోనే అనుకున్నాడు.ఈ రోజు మనసెటు పోతోంది అనుకుంటూండగానే కంచంలో సగానికి పెరుగు వేసింది రాజేశ్వరి.
"అరెరే! యింత వేసేశారేమిటి నేను చూసుకోలేదు." ఫక్కున నవ్వి లోపలికెళ్ళిపోయింది.
భోజనాలయాక హాల్లో కూర్చుని లోకాభిరామాయణం మొదలుపెట్టారు.మాటల మధ్య చెల్లెలి కుటుంబ స్థితిగతులు బావ పోవటం తరువాత చెల్లి మేనకోడలు కలిసి ఆస్థిపాస్థులు చక్కబెట్టుకుంటూ పల్లెటూర్లో నెట్టుకు రావటం చెప్పుకొచ్చారు.
"మీ మేనకోడలి చదువు ఆ పల్లెటూర్లో ఎలా సాగింది?"
"పదో క్లాసు వరకు అక్కడి స్కూల్లో పూర్తి చేసింది.ఇంటరు రెండేళ్ళు మా యింట్లో వుండి చదువుకుంది. పైవేటుగా బి ఎ, ఎం ఎ చేసింది చాలా తెలివైన పిల్ల.కుటుంబం కోసం పెళ్ళి వాయిదా వేసుకుంది.తను పెళ్ళి చేసుకుని వెళ్ళిపోతే తల్లి ఒంటరిదైపోతుందని చింత.యిలా ఎన్నాళ్ళు చెప్పు? ఈ సంవత్సరం రాజీ పెళ్ళి చేసేద్దామనుకుంటున్నాం.అమ్మాయిని చూశావు, నీకు ఆమెని చేసుకునే వుద్దేశం వుంటే చెప్పు.తొందరేం లేదు అలోచించుకుని చెప్పు.యిలా డైరెక్టుగా అడిగానని మరోలా అనుకోకు నీకు తండ్రిలాంటి వాడిని.కావాలంటే రాజేశ్వరితో మాట్లాడు."
యింతలో ఆడవాళ్ళ భోజనాలయి హాల్లోకి వచ్చారు.
"రాజీ వక్క పొడిగాని, ఏలకులుగాని తెచ్చిపెట్టమ్మా." లోపలికెళ్ళి ఏలకులు తెచ్చింది.ఏలక పండు తీసుకుంటూ రాజీ కళ్ళలోకి చూశాడూ కుటుంబరావు.ఈ ప్రస్తావన ఆమెకి ముందుగానే తెలిసినట్ట్లు అర్ధమయింది.
సాయంత్రం పెరట్లో పువ్వులు కోస్తుండటం గమనించి,రాజీని నిలదీసి అడిగాడు.
"మీ మామయ్యగారు నీ గురించి ప్రపొజ్ చేశారు.నీ వుద్దేశమేమిటో స్వయంగా తెలుసుకుందామని,"అగాడు.
సిగ్గు పడి పారిపోయే చిలిపి వయసు కాదు నిర్మొహమాటంగా చెప్పింది."మీ గురించి విన్నాక అభ్యంతరం చెప్పడానికేమీ లేదు.మీ పేరొక్కటే నచ్చలేదు.పాత కాలం వాళ్ళలాగ 'యిదిగో' 'మిమ్మల్నే' అనలేను.మీ పేరుని ఏ విధంగాను పొట్టి చేసి పిలవలేను అదొక్కటే సమస్య."
పొట్ట చెక్కలయ్యేలా నవ్వొచ్చినా అతి కష్టం మీద ఆపుకున్నాడు."ఈ సమస్యకి పరిష్కారం వుంది.వున్న పేరుని ప్రస్తుతం మార్చుకోలేను. మా తాతగారు నన్ను 'చంటీ' అని పిలిచేవారు,మా నాయనమ్మ 'బబ్లూ' అని పిలిచేది. ఈ రెండింటిలో ఏ పేరుతోనైనా పిలవచ్చు,లేదా కొత్తగా ముద్దు పేరేదైనా పెట్టుకోవచ్చు.ఈ సమస్య సెటిల్ అయనట్లనిపిస్తే పెద్దవాళ్ళకి మన అంగీకారం చెప్పేద్దాం.ఓ కే నా?"అనుకున్నంత బుద్ధావతారం కాడు సరసుడే! అనుకుంది."సరే ముందు మన అంగీకారం తెలియజేద్దాం,తాపీగా ఏ పేరుతో పిలవాలో ఆలోచిస్తాను."
సంగతంతా విన్న అన్నపూర్ణమ్మ పద్మనాభంగార్లు ' ఓర్నీ! వీళ్ళిద్దరూ అసాధ్యుల్లా వున్నారే'అని నవ్వుకున్నారు.

No comments: