21 May, 2013

జీవన సంఘర్షన


కధ ప్రారంభించటానికి కాకులు దూరని కారడవి చీమలూ దూరని  చిట్టడవి అంటూ మొదలు పెట్ట నక్కర లేదు. అనగా అనగా ఒక చిన్న వూరు . ఆవూర్లో వంద గడపల సామాన్యులతో పాటు నాలుగైదు సంపన్నుల లోగిళ్ళు ఉన్నాయి.ఆ వూర్లొ ఒక అక్కా ఒక చెల్లి, అక్క బాల వితంతువు చెల్లి నడి వయసు వితంతువు.పిల్ల పీచూ బాదరాబందీ లేదు.ఉన్న చిన్న పొలం మీద ఫలసాయం సంవత్సరానికి  కొంత ధాన్యం వస్తాయి. చిన్నామె భర్త   వదిలి వెళ్ళిన  చిన్న ఇల్లు. వూరి వాళ్ళంతా చింత పడేవారు ఈ ఇద్దరక్కచెల్లెళ్ళు ఎలా బ్రతుకు బండి  లాగించుతారని . భర్త పోయిన నాటినుంచి చెల్లెలు బయటికి వెళ్లేది కాదు.
బ్రతికినంత కాలం బ్రతుకు ని లాగుకునో  నెట్టు  కునో  నడపాల్సిందే!   చిన్నామెకు  దిష్టి మంత్రం ,తేలు మంత్రం  యిరుకు మంత్రం చప్పి మంత్రం  వచ్చు.పల్లెటూరు కావున ఎవరో ఒకరు వస్తారు.. యుక్తిగా తేలు మంత్రం వేయించు కునే టప్పుడు చిన్న పళ్ళెంలో బియ్యం పెసరపప్పు వేసి రూపాయ బిళ్ళ దానిపై ఉంచి తెమ్మనేవారు.మంత్రించిన తరువాత రూపాయి కొంత పప్పు బియ్యం ఉంచుకుని కొద్దిగా పప్పు బియ్యం మిగిల్చి ఒక కొసలొ కొద్దిగా పసుపు కుంకుమ వేసి, తెలు కుట్టిన చోట పసుపు కుంకుమ అద్ద మానేవారు. మిగతా వాటకి కూడా ఏవో తెమ్మనేవారు .
దిష్టి మంత్రానికి పిల్లల్నితేచ్చేటప్పుడు చిన్న గిన్నెలో అయిదు చెంచాల పంచదార తెమ్మనేవారు. అందులోంచి కొంత పంచదార అట్టే పెట్టుకుని మంత్రం వేసేక ఒక చెంచాడు పంచదరగిన్నెలో ఉంచి చిటికెడు పంచదార పిల్లల నోట్లో వేసే వారు.వీటితో వారి దినం తిరుతూందా అంటే తీరదు  కానీ వారి కాఫీ లోకి కొంత పంచదార సరిపోతుంది.ఎవరి పిల్లల్నయినా అతి ముద్దుగా ఆప్యాయంగా పలకరించేవారు.ఆవిధంగా పిల్లలు వారితో పాటు తల్లులు వచ్చేవారు.
ఇక పెద్దామె ఉదయాన్నే ఏడు గంటలవగానే ఒక చిన్నసత్తు గిన్నె కొంగు చాటున పట్టుకుని సంపన్నుల ఇంటికి  వెళ్లి " ఏం చేస్తున్నారు అమ్మడూ ?"అంటు పలకరించేది .ఫ్రిజ్ లు లేని కాలం . కూరల బుట్ట వద్ద కెళ్లి చిందరవందరగా పడి ఉన్న కూరలన్నీ చక్కగా ఏరి ఎండిపోయిన వాటిని వేరు చేసి మంచి వాటిని సర్ది చుట్టూ శుభ్రం చేసి ,"అమ్మడూ !యీ నాలుగూ ఎండి పోయాయి తీసుకు వెళ్ళనా ? నువ్వైనా అవతల వేసేదే కదా ! ఏదో పెద్ద వాళ్ళం కురో పచ్చడో చేసుకుంటాం ,సరేనా అమ్మా!" అన్నాక కాదనడానికి ఇల్లాలికి నోరు రాదు .
అలాగే యింకో యింటికి వెళ్లి కాస్త పని సహాయం చేసి "అమ్మాయ్ కొద్దిగా పుల్ల మజ్జిగ వుంటే పోయ్యమ్మా. చెల్లికి వేడి  చేసింది ."ఉన్నంత లో గిన్నెలో పోసే వారు .తమ అవసరానికి మించి ఏ కాస్త కయినా ఆశ పడేవారు కాదు .
వారి స్వభావాల్ని చూసి వూరి వాళ్ళు ఏదో విధంగా వారికి సహాయం చేద్దామని ,మహాలయ పక్ష మని స్వయం పాకము వాళ్ళు కట్టుకునే తెల్ల చీరలు బెల్లం ముక్క యిచ్చేవారు .కాయ కూర పండు ఎవరు అభిమానం తో ఏమిచ్చినా కాదనకుండా స్వీకరించే వారు .చదువు లేకున్నా వుద్యోగాలు లేకున్నా కేవలం మాట మంచి తనం ,యుక్తి తో జీవిత రధాన్ని నడప వచ్చని రుజువు చేశారు ,ఆ వితంతు సోదరీ మణులు .

No comments: