"అబ్బబ్బా! కాస్త రేడియో కట్టవే చిన్నీ!మాట తోచదు సముద్ర ఘోషే దిక్కుమాలిన కామెంట్రీ" వంటింట్లోంచి జానకి విసుగ్గా. చిన్నికింకా విసుగ్గా వుంది స్కోరు చెప్పే సమయానికే అమ్మ యేదో వొకటంటుంది. విసురుగా ట్రాన్సిస్టరు తీసుకుని పెరట్లో జామిచెట్టు క్రింద కూర్చుంది. భర్త కోసం కాఫీ పట్టుకెళ్ళి టేబిలు మీద పెట్టి "ఏమండి!" అంది జానకి వుపోద్ఘాతంగా."ఏమిటి?" చికాగ్గా ముఖంపెట్టాడు శ్రీనివాసరవు.ఇంతలోనే క్రికెట్ కామెంటరీలో కొంపలంటుకు పోతున్నట్లు కోలాహలం."చిన్నీ1 ట్రాన్సిస్టరెందుకు పట్టుకుపోయావ్?యిలాతే",జానకి వైపు తిరిగి కోపంగా "యెప్పుడూ న్యూసు వినేవేళ కామెంటరీ వినేవేళ కట్టుకున్న మొగుడు ఎక్కడికి పొతాడోనన్నట్లు ఏమండీ! ! ఏమండీ! యెన్ని సార్లు చెప్పినా బుర్రకెక్కదు మరెప్పుడూ టైముదొరకనట్లు మంచి స్కోరు డిక్లేరు చేసే వేళకితయారు.
ప్రవాహంలా శ్రీనివాసరవు దండకం సాగుతూనే వుంది. ,నోట్లో మాటలు నోట్లోనే కుక్కుకుని వంటింట్లోకి వెళ్ళింది జానకి వుదాసీనంగా.
ఛ! ఛ! ఎన్నిసార్లు యిటువంటి అవమానాలు పొందినా నాకే బుధ్దిలేదు.మనసులోనే తిట్టుకుంది.పెళ్ళై రెండు దశాబ్దాలయినా అతనితో యేవిషయంచర్చించి అవగాహన చేసుకునే అవకాశమే యివ్వటంలేదు.అయితే నిర్లక్ష్యంగా వూరుకునే విషయం కాదే! ముందురోజు జగన్నాధం మావయ్య కమల కోసం సంబధం గురించి చెప్పిన దగ్గరనుండి మనసాగటం లేదు,పిల్లాడు ఇంజనీరుట.అతని తలి తండ్రులు తెలిసిన వాళ్ళింటికి ఈవూరే వచ్చారుట .ఈ రోజు శలవే కదా యిద్దరం వెళ్ళి చెప్తే యెంత బాగుంటుంది! ఏమో! పిల్ల అదృష్టం బాగుంటే ఈ సంబధం ఖయం కావచ్చు. అయినా అరటి బోదల్లే పిల్ల కళ్ళముందు తిరుగుతూంటే సంబంధం చూసి పెళ్ళిచెయ్యాలనే ధ్యాస లేకుంటే యెలా? పొనీ పిల్లల అవసరాలు పట్టించుకోరా అంటే అదీలేదు.కమల ఫాబ్రిక్ పైంటింగు సెట్టు కావాలంటే మర్నాటికల్లా రెడీ! బాబు ఒక్కసారి చెప్పాడు తనకి క్రికెట్ సెట్టు కావాలని పూర్తి సెట్టు వాడిముందు పెట్టారు ఇక చిన్ని కోరితే కొండ మీది కొతి దిగి వచ్చేస్తుంది వాళ్ళ నాన్న వెనుకనే నడుచుకుని మరీను. ఎటుకీ పొందని దాన్ని నే నే!
నాది అన్న అభిప్రాయం వెలి బుచ్చనివ్వరు.కానీ నాకేనా నష్టం? అతనికి మాత్రం పిల్ల పెళ్ళి బాధ్యత లేదూ? ఆలోచనా తరంగాలలోజానకి మనసు వూగుతోంది.మౌనంగా అందరి అవసరాలు చూడసాగింది. రున్నింగ్ కామెంటరీ వింటూనే భోజనాలు పూర్తయ్యాయి.
సాయంత్రం అయిదవగానే బాబు ఆటకి వెళ్ళాడు చిన్ని కధలపుస్తకం పట్టుకుంది.కమలకి కాలేజీ పుస్తకాలే ప్రపంచం.శ్రీనివాసరావు గబగబ తయారయి "జానకీ! నా ఫ్రెండు ఒకతను హాస్పిటల్లో వున్నాడు చూసి రావాలి" జవాబు కోసం చూడకుండానే గుమ్మం దాటాడు. జానకికి కోపం బాగానే వచ్చింది.కానీ జగన్నాధం మావయ్య మాటలే చెవుల్లో రింగుమంటున్నాయి.
"పిల్లడి గుణం బంగారం అనుకో వెనుక బాధ్యతలెమీలేవు చక్కని వుద్యోగం.ఇటువంటి సంబధం వదులుకోకు జానకీ! వూరుకుంటే లాభంలేదు" నుదురు కొట్టుకుంది వూరుకోక వురిపెట్టుకోనా? ఈయనకేమో బొత్తిగా ఇల్లు పట్టదు. భార్యా భర్తలు మాట్లాడుకొడానికి అపాయింటుమెంటు తీసుకోవాలో ఏమో ఖర్మ! ఇంతకూ దాని నొసట భగవంతుడెలా రాసి పెడితే అలా జరుగుతుంది. నేను కంగారు పడి ప్రయోజనం లేదు"వేదాంత ధోరణిలో స్వగతం పలికింది కర్మభూమిలో పుట్టిన జానకి.
రాత్రి తొమ్మిదింటికి వచ్చిన భర్తను పలుకరించ లేదు.భోజనాల సమయంలో పిల్లాల కబుర్లతో హడావిడే. "నాన్నా ఈసారి ఇండియాకి హోప్ లేదు కదా? డ్రా అయితే అదే గొప్ప" బాబు వ్యాఖ్య. మన వాళ్ళకి ఒకసారి గెలిస్తే మరి పట్టపగ్గాలుండవు. టీమంతటిలో యెవరో ఒకరు లాగకపోరులే యింకా రేపంతా వుంది శ్రీవారి ఆశావాదం. భోజనాల టైమంతా క్రికెట్ భాషే ,అన్నం మీద యెవరికీ ధ్యాసే లేదు.సాంబారన్నంలో నెయ్యే వేసుకుంటున్నారో నూనే వేసుకుంటున్నారో తెలియటంలేదు. ఆప్రకరణం ముగిసింది,పని ముగించుకుని పక్కమీదకు చేరేసరికి శ్రీవారు గదిలో పచార్లు చేస్తున్నారు. ఆశ్చర్య పోయింది జానకి సావకాశంగా ఆలోచిస్తూ పచార్లు చేస్తూండటంతో మాట్లాడకుండా వెళ్ళి మంచం మీద పడుక్కుంది. సాయంత్రం నుంచి భార్య తనతో మాట్లాడలేదన్నవిషయం అప్పుడే గుర్తించినట్లు మంచం మీద సావకాసంగా కూర్చుంటూ "అన్నట్లు జానకీ వుదయం యేదో చెప్పబోయేవు యేమిటి సంగతి?" పీకదాకా కోపం వచ్చింది అడిగేరు కదా అని యేకరువు పెడితే అలుసయిపోతావ్! మనసు హెచ్చరించింది. ముఖంలోకి నవ్వు తెచ్చుకుని" అబ్బే ముఖ్యమైనదేం కాదు స్కోరెంత?"అని అడుగుదామని. "నిజం"! ఆశ్చర్యంలో తలమునకలయ్యాడు.'అసలు అందరికీ యింతో అంతో క్రీడారంగంలో యింట్రస్టు వుండాలి. ఎన్నాళ్ళకి శ్రీనివాసరావు భార్యననిపించావు. గుడ్! అలా వుండాలి! సంతోషం పట్టలేక వెన్ను తట్టి మరీ ప్రోత్సహించాడు. అవును అలాగే వుండి పై వాడి లీల యెలా వుందో చూడాలి.జానకి మనసు మూల్గింది.
04 November, 2008
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment