24 November, 2008

అమెరికా అల్లుడొస్తున్నాడు హాస్య నాటిక

పాత్రలు:- రఘునాధరావు---తండ్రి
పార్వతి----తల్లి
లక్ష్మి----పెద్దకూతురు
వెంకట్---అల్లుడు
వసంత---చిన్నకూతురు
తెర లేచేసరికి పధ్దెనిమిది సంత్సరాల వసంత ఫోన్లో మాట్లాడుటూంటుంది
వసంత: హలో!ఆ ఆ వున్నారు పిలవనా మట్లాడతావా సరే అలాగా ఆహా తప్పకుండా అమ్మకి న్నాన్నకి చెప్తున్నా అలాగే ఫోను పెడుతున్నా మరి (సైడు కర్టెను వైపు చూస్తూ) అమ్మా నాన్నా త్వరగా రండి . ముందుగా తల్లి ఆ వెనుకగా తండ్రి ప్రవేసిస్తారు.
తల్లి: ఏమయిందే? కొంపలంటుకున్నట్లు కేకలు పెడుతున్నావు? నాకసలే బ్లడ్ ప్రెషరు కంగారు పెట్టక త్వరగా చెప్పు
వ్సంత: అక్క బావగారు యీ రోజు ఇండియా వచ్చేరుట మనకి ముందుగా మెసేజి యివ్వటం కుదరలేదుట రేపు యిక్కడికి వస్తున్నారుట. బావగారి స్నేహితుడు కూడా వాళ్లతో వచ్చేడుట అతన్ని హొటల్లో దింపి అక్కయ్య బావగారు యింటికి వస్తామన్నారు.
తండ్రి: ఏ బండిలో వస్తున్నదీ చెప్పలేదమ్మా?
వసంత: ఏమో మనని కంగారు పడవద్దని అక్కయ్య వుందిగా యిల్లు కనుక్కుందికి అన్నారు బావగారు.
తల్లి: అమ్మో ఒక్కరోజులో అరేంజిమెంట్లు ఎలా చెయ్యగలం? మనింటిని మోడరన్ గా మార్చవద్దూ.
వసంత: అమ్మా మరీ మోడరన్ గా మార్చేస్తే అక్కయ్య మనిల్లు పోల్చుకోలేదేమో.
తల్లి: ఏయ్ వసంతా బావగారి ముందు యిలా అమ్మా అసిరమ్మా అంటూ పిలవకు అతను అమెరికాలో పుట్టి పెరిగాడు. అక్కావాళ్లున్నాన్నాళ్లు మమ్మీ లేదా మామ్ అని పిలువు.
వసంత: అమ్మో అమ్మకి అమెరికా జ్వరం మొదలైనట్లుంది.(తల్లి నుదుటి మీద చెయ్యి వేసి చూస్తుంది)
తల్లి:చాల్లే గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించినట్లుంది. యిదిగో మిమ్మల్నే అల్లుడున్న వారం రీజులూ యీ దిక్కుమాలినపంచలు లుంగీలూ మాని యించక్కా సూటు బూటు వేసుకోండి. లేకుంటే అత్తమామలు మరీ యింత పాతకాలం వాళ్లా అనుకుంటాడు. అన్నట్లు యింకో మాట నన్ను పార్వతీ పార్వతీ అని పిలవకండి (దగ్గరగా వచ్చి గారంగా) యించక్కా పారూ అంటూ పిలవండి.
తండ్రి: బాబోయ్ యిదెక్కడి గోలే పారు పారూ అంటూంటే భగ్నప్రేమికుడు దేవదాసులా చేతిలో బాటిలు ఖళ్లు ఖళ్లుమంటూ దగ్గుతూ జగమే మాయా బ్రతుకే మాయా యివే కళ్లముందు మెదులుతాయి.
తల్లి: చాల్లెంది మరీ బడాయి ఏది ఏమయినా యీవారం రోజులూ నేను చెప్పినట్లు వినాల్సిందే లేకుంటేఅల్లుడు మనగురించి ఏమనుకుంటాడు మనల్ని అనాగరికులమనుకుంటాడు .
తండ్రి: నీ ధోరణి నీదె గాని ఎవరిమాట వినవు కదా తొలిసారిగా అమ్మాయి అల్లుడు యింటికి వస్తున్నారంటే బొబ్బట్లు చేసిపెడతాను పెరుగు గారెలు చేసిపెడ్తాను అనే అత్తగార్లని చూసానుగాని పారూ అని పిలవండి సూట్లేసుకోండి నా మతి పోతోంది భగవంతుడా!(లోపలికి వెళ్తాడు)
తల్లి: (ఫోను డయల్ చేసి) హలో నవీన్ యింటీరియర్ డెకొరేటర్స్? నేను ప్రొఫెసర్ రఘునాధరావుగారి భార్యని మాట్లాడుతున్నాను. మాయింటిని మోస్ట్ మోడ్రన్ గా మార్చాలి ఎన్నాళ్లా అబ్బే రేపటిలోపున ఏమిటి అంత షార్ట్ టైమ్ లో వీలుకాదా సరే (నిస్పృహగా ఫోను పెట్టేస్తుంది)
వసంత: అమ్మా(అని నాలిక కొరుక్కుని) ఆమ్ (కాదన్నట్లు చెయ్యి దులిపి)అమ్మీ
తల్లి: ఏమిటే మమ్మీ లేకుంటే మామ్ అనమంటే ఆమ్ అమ్మీ యిదేం పిలుపే?
వసంత: ఏంచెయ్యమంటావు చిన్నప్పటినుండి అమ్మా అమ్మా అనేదాన్ని పట్టుకుని మమ్మీ మామ్ అనమంటె యిలాగే వుంటుంది. అమ్మా నిన్ను చూస్తుంటే భయం వేస్తోంది. అక్కయ్య పరాయిదా మనింట్లో పుట్టి పెరిగింది. బావగారు అక్కయ్యని నచ్చి మెచ్చి పెళ్లి చేసుకున్నారు. నీ హడావిడితో మా మతులు పోగొడుతున్నావు. అక్కయ్య అమెరికా వెళ్లాక యీరెండేళ్లలో తనకిష్టమైనవి తినగలిగిందో లెదో చేగోడీలు కోవాబిళ్లలూ చేద్దామా పద పద (అంటూ చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళుతుంది తల్లి నుదురు కొట్టుకుంటు వెళ్తుంది)
తెర పడుతుంది తెర లెచేసరికి వసంత పరికిణీవాణీవేసుకుని పదహారణాల తెలుగు అమ్మాయిలా ముస్తాబయి సోఫాలమీది కవర్లు సర్దుతూ వుంటుంది యీలోగా తల్లి కాస్త మోడర్న్ హెయిర్ స్టైల్తో నాజూకైన చీరతో చేతి గాజులు సవరించుకుంటూ ప్రవేశిస్తుంది.
తల్లి: వసూ యింకా అలాగే వున్నావేమిటె అక్కావాళ్లూ వచ్చే టైము అయింది వెళ్లి మామయ్య బొంబాయినుంచి తెచ్చిన స్కర్టుమిడి టాపు వేసుకో
వసంత: అమ్మా అక్కయ్యవాళ్లు వున్న వారం రొజులూ అదే డ్రెస్సు వేసుకోవాలా యింకొకటి మార్చవద్దా?
(తండ్రి సూటు బూటు తో ప్రవెశిస్తాడు)
తండ్రి: పార్వతీ లక్ష్మీ అల్లుడు హొటల్నుంచి బయలు దేరారుట ఏక్షణంలోనైన వచ్చేస్తారు నాచిట్టి తల్లిని ఎప్పుడెప్పుడు చూస్తానా అని వుంది.(జేబు లోంచి రుమాలు తీసి కళ్లు తుడుచుకుంటాడు)
తల్లి: నిన్నటినుంచి చెప్పి చెప్పి నా నోరు నొప్పేగాని మీ యిద్ద్రికీ ఏమాటా చెవుల్లో దూరటం లేదు ఆ చిట్టీ పొట్టీ ఏమిటి? అల్లుడిముందు కూడా యిలాగే మాట్లాడతారా? అల్లుడితో మనకున్న పరిచయం చాలా కొంచం అతని అభిరుచులేమిటో అలవాట్లేమిటో తెలియదు మన పాత పధ్దతులు నచ్చుతాయోలెదో తెలుసుకోవాలికదా
తండ్రి: నిజమే పర్వతీ నేనంతగా ఆలొచించలేదు
వసంత: అమ్మా పెళ్లిలో బావగారు లక్షణంగా పంచ కట్టుకున్నారుకదే!
తల్లి: ఆ...ఆ..పెళ్లిలో నలుగురూ ఏమనుకుంటారోననికట్టుకుని వుంటాడు. అమెరికాలో పుట్టి పెరిగి వుద్యోగంచేస్తున్న కుర్రాడికి కోనసీమ కొరివికారం నచ్చుతుందా?
వసంత: కోనసీమ పిల్ల నచ్చినప్పుడు కొరివికారం కూడా నచ్చవలిసిందే.(యింతలో లక్ష్మి భర్త ప్రవేశిస్తారు.అల్లుడు సాదా పైజామా కుర్తాలోను లక్ష్మి పట్టు చీర తలనిండా పువ్వులతోను వుంటారు)వాళ్లని చూడగానే పరుగున వెళ్లి అక్కయ్యాబాగున్నావా అంటూ వసంత లక్ష్మిని భుజం మీద చేయి వేసి తెస్తుంది
లక్ష్మి: ఆ !వసూ నువ్వెలావున్నావ్? అమ్మానాన్నా లేరా?
వసంత:యీ యిద్దరూ అమ్మా నాన్నే! మరీ పోల్చుకోలేనంతగా మారిపోయారా? బాగున్నారా బావగారూ?
తలవంచి విష్ చేసినట్లు నవ్వుతాడు తండ్రి దగ్గరగా వచ్చి
తండ్రి: లక్ష్మి తలమీద చేయి వేసు నిమురుతూ రా నాయనా కులాసానా? అమ్మా లక్ష్మీ బాగున్నావమ్మా?
లక్ష్మి: తండ్రిని ఎగాదిగా చూసి ఎక్కడికైనా వెళ్తున్నారా నాన్నా?సూటు బూటులొ వున్నారు?
తండ్రి: ఏం చెప్పమంటావమ్మా? నిన్న మీరు వస్తారని తెలిసినప్పటినుండి నన్ను వూదరగొట్టి మీ అమ్మ ఈ పగటి వేషం వేయించింది
లక్ష్మి: అమ్మా నేను వచ్చిన దగ్గరనుండి ఒక్క మాటకూడ మాట్లాడలేదు ఏమయిందమ్మా?(దగ్గరగా వచ్చి తల్లి భుజంమిద తలపెట్టుకుండి
వసంత: అక్కయ్యా అమ్మని అమ్మా అసిరమ్మా అంటూ పిలవ్వద్దంది.
లక్ష్మి: అరే ఎందుకని?
తల్లి: అమెరికాలో మామ్ మమ్మి అంటారుకదా
.వెంకట్: నమస్కారమ్ అత్తయ్యగారూ మీరూ మామయ్యగారూ మా పెళ్లిలో ఆది దంపతుల్లా కనిపించారు మాకు మిమ్మల్నలా చూస్తేనే బాగుంటుంది.అది సరె రాత్రి భోజనంలో ఏం చెస్తున్నారు?
తల్లి: సేండ్ విచ్ వెగిటబుల్ సలాద్ (మాట పూర్తి కాకముందే )
వెంకట్: స్వర్గానికి వెళ్లినా సవతి పొరు తప్పనట్లు శాన్ ప్రాన్సిస్కోవదిలినా శాండివిచ్ వదలదా? అత్తయ్యగారూ చక్కటి గోంగూర పచ్చడి మెంతి వంకాయ కూర ఆవకాయ గడ్డపెరుగు తిన్నాలని మేం వస్తే రోగిష్టి భోజనం పెడతానంటారెమిటి?
తండ్రి: మరే నాయనా మీకేం కావాలంటె అదె చేసి పెడుతుంది. పద పార్వతీ ఆ ఏర్పాట్లు చూడు
అవును నాయనా మీ స్నేహితుడు మీతొ వచ్చాడన్నావు మనిల్లుండగా అతన్ని హొటల్లొ వుంచడమెందుకు? అతన్ని యిక్కడికే తీసుకు వస్తే అందరం కలిసి సరదాగా వుందాం.
వెంకట్: మామయ్యగారూ మేమొక వుద్దేశంతొ యిక్కడికి వచ్చాం.అమెరికాలొ వున్నవాళ్ల మనసులు ఆలోచనలు అలవాట్లు యిండియాలో వున్నట్లే వుంటాయి. మేము ప్రతిక్షణం పగలు రాత్రి మన దేశ సౌంస్కృతి ఆచార వ్యవహాల పట్ల అభిరుచి పెంచుకుని పక్కా భారతీయులుగా ఏప్రాంతం వారు ఆ ప్రాంతపు ఆచారవ్యవహారాలను పాటిస్తుంటాం. అందుకే తెలుగమ్మాయి కావాలని మీ అమ్మాయిని చేసుకున్నాను.
వసంత: బావగారూ మా అమ్మ నిన్నటి నుండి మాకు యిన్ స్ట్రక్షన్స్ యిచ్చి యిచ్చీ అలిసి పోయింది మీ మాటలు అమ్మని చాలా నిరుత్సాహ పరిచినట్లున్నాయి. చూడండి ఎలా ముఖం వ్రేలాడేసుకుందో.
లక్ష్మి: అమ్మా అమెరికాలో వున్నవాళ్లు మనుషులుకారూ? యిక్కడ దొరికే అన్ని వస్తువులు అక్కడకూడా దొరుకుతాయి. తేడా యేమిటంటే యిక్కడ ఫ్రెష్ గా దొరుకుతాయి అక్కడ మామూలుగా కొన్ని దొరికితే కొన్ని ఫ్రోజెన్ దొరుకుతాయి. ఒక సారి పనసకాయ కూర చేసాను తెలుసమ్మా?
తల్లి: అదేమిటే లక్ష్మీ మరీ అంత పల్లెటూరి భోజనాలు చేస్తారా?
(అందరూ గొల్లున నవ్వుతారు)
వెంకట్: అత్తయ్యగారూ! కొడుకు దేశాధ్యక్షుడయినా తల్లి ఏరా నాయనా అని పిలవకుండా వుంటుందా? ఏయ్! మరదలు పిల్లా కాస్త మంచి నీళ్లు తెచ్చి అతిథి మర్యాదలు చెయ్యి
(వసంత లోపలికి వెళుతుంది)
వెంకట్: మామయ్యగారూ నా స్నేహితుడు డాక్టరు మంచివాడు లక్ష్మిలాంటి అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుంటానని తరుచు నాతో అనేవాడు మన వసంత ఫొటో చూపిస్తే నచ్చుకున్నాడు. యిక్కడికి రావటానికి అవకాశం కలిగింది. అందరికీ అంగీకారం అయితే ఆ శుభకార్యం జరిపించేద్దాం ఏమంటారు? నయం అతన్ని హొటల్లో దింపడం మంచి పని చేశాను యిక్కడి వాతావరణం చూసి నెక్స్ట్ ఫ్లైటులో వెళ్లిపోయేవాడు. వుద్యోగరీత్యా ఎన్నో దేశలు తిరగవచ్చుగాని కన్న తల్లిని స్వదేశాన్ని మరిచిపోకూడదు. అత్తయ్యగారూ యిప్పటికయినా అమెరికా జ్వరం నుంచి బయట పడితే మా స్నేహితుడు మోహన్ని తీసుకు వస్తాను ఏమంటారు మామయ్యగారూ?
తండ్రి: ఏమంటాను నాయనా నామీద నాకే సిగ్గు వేస్తున్నాది. మీ అత్తగారు చెప్పగానే ముందూ వెనుకా ఆలోచించకుండా యీ గంగిరెద్దు వేషం వేసెసుకున్నాను. నీలాంటి అల్లుడు దొరకడం మా అదృష్టం నాయనా అల్లుడివయినా కొడుకువయిన నువ్వే.
(వసంత ట్రేలో మంచి నీళ్లు తెస్తుంది)
వెంకట్: ఏం మరదలుపిల్లా అమెరికాలో వసంత కోకిలలా మోహనరాగం ఆలాపిస్తావా?
వసంత: (జడతిప్పుతూ) పొండి బావగారూ!
లక్ష్మి: పొండి అంటే ఎలా పోతామే నిన్నుకూడ తీసుకునే వెళ్తాము. అమ్మా నువ్వేమీ అనటంలేదేమిటీ?
తల్లి: ఏమీ అనడానికి మిగల్లేదు. మీ నాన్నగారు చెప్పినట్లు బొబ్బట్లు పులిహొర ఆవడలు చెయ్యటానికి వంటింట్లోకి వెళ్తున్నాను.(అందరూ మనసారా నవ్వుకుంటారు)
శుభం

No comments: