06 November, 2008

మర్మమెరుగని మనిషి

సంధ్యచీకట్లతోపాటు రాజారావుగారింట్లో వెండికంచం పోయిందన్న వార్త కార్చిచులావూరంతా వ్యాపించింది. అసలే పల్లెటూరు అక్కడున్న యిళ్ళు వేళ్ళమీద లెక్కపెట్టవచ్చు.రాజారవుగారు ఆవూరు వచ్చిఆరేళ్ళయింది. వచ్చిన నాటినుండి ప్రజల అభిమానం చూరగొన్నారు. వృత్తి ధర్మం అయాక సాయంత్రం పిల్లలకి వుచితంగా చదువు చెప్పేవారు.దాంతో అందరూ ఆయన్ని రాజారావుమాష్టారనే పిలుస్తారు. ఆయనవద్ద చదువుకుందికి పిల్లలు లేనివారుకూడా ఆయన కనపడితే ఆదరంగా పలకరించడం యోగక్షేమాలు కనుక్కోవడం చేస్తూంటారు. అలాంటి రాజారావుమాష్టారింట్లో వెండికంచం పోవడమా? wలా పోయింది ఎప్పుడు పోయింది అంటూ ఒక్కొక్కరే వచ్చి ప్రశ్నిస్తూన్నారు. కొందరు పోలీసు కంప్లైంటు యివ్వమని సలహా యిచ్చారు. రాజారావుగారి మనసు అతి సున్నితం పోలీసు కంప్లైంటు యివ్వడానికి ఒప్పుకోలేదు.'నాకెవరిమీదా అనుమానంలేదు వస్తువు తీసినది ఒకరు నిందపడేది మరొకరు అవుతారు నా నిజాయితీ మీద నాకు నమ్మకం వుంది నా వస్తువే అయితే నట్టేట్లో పడేసినా నట్టింటికొస్తుంది'. రాజారవుగారి భార్యయితే కళ్ళనీళ్ళు పెట్టుకోవటం మినహా ఎవరినీ పల్లెత్తు మాట అనలేదు. "ఒక్కగంట యింటికి తాళం పెట్టి పేరంటానికి వెళ్ళాను వేసితాళం అలాగే వుంది తక్కిన వస్తువులన్నీ వుండి ఆఒక్క కంచమే పోవడం ఆశ్చర్యంగా వుంది. అంతామాయలా వుంది.అది వారి తాతగారి కంచం ఆయనకెంత బాధగావుందో పైకేమీ అనటం లేదు". కామేశ్వరమ్మ వచ్చినవాళ్లతో చెప్తోంది. ఆపూట భోజనాల మాటే మర్చిపోయారు రాజారావుగారి ఆప్తమిత్రుడు సాంబయ్య వస్తూనే" ఏంటి మాష్టారూ! మీయింట్లో వస్తువు పోవడమేమిటి? మీ నౌకరు సత్తెయ్యే తీసుంటాడు. యింతకు ముందు కూడా వొకరింట్లో మారుతాళంతో తలుపు తీసి వెండిపళ్లెం దొంగిలించాడు. రేపు నేను టౌను పోలీస్టేషన్లో కంప్లైంట్ యిస్తాను."అంటు లేచాడు .ఎందుకులే సాంబయ్యా నాకు ప్రాప్తముంటే అదే దొరుకుతంది.ఈ ఆశావాదం సాంబయ్య ఒప్పుకోలేదు పోయిన వస్తువు తన స్వంతమన్నట్లు మర్నాడు పోలీసు కంప్లైంటు యిచ్చి వచ్చాడు. సాబంఅయ్య యిచ్చిన కంప్లైంటు తో పోలీసుయిన్స్పెక్టర్ రాజారావుగారి యిల్లు సోదాచేసి ప్రశ్నించి కంచం నూరు తులాలదని దాని వెనుక వారి తాతగారి పేరు పొడి అక్షరారున్నాయని రాసుకుని వెళ్లేరు. రాజారావుగారు యింటికి రాగానే వాలుకుర్చీలో కూలబడ్డారు . కామేశ్వరమ్మ భర్తకోసం మంచినీళ్లు తీసుకెళ్లి ఏమయిందండీ అలా వున్నారు అని ప్రశ్నించింది .చూడు కాముడూ ఈ పోలీసు కంప్లైంటులు అవీ అందుకే వద్దన్నాను .అయ్యో ఏమయిందంఢీ? అనగానే ఏం చెప్పమంటావు? నా ఆఫీసు దగ్గరికి మన సత్తెయ్యని తెచ్చి నా కళ్లముందు వాడిని యిష్టంవచ్చినట్లు కొడుతూంటే చూడలేక వాడినలా కొట్టవద్దని అనుమానంవుంటే లాకప్పులో పెట్టండి గాని ఈ అకృత్యం నేను చూడలేను అని ఖచ్చితంగా చెప్పేను.
అయ్యో ఎంతపని జరిగిందండీ! పాపం సత్తెయ్య భార్యకి పురిటిరోజులు కూడానూ భగవంతుడా ఈ పాపం చుట్టుకోకుండా మమ్మల్ని కాపాడు నాయనా! అంటూ కామేస్వరమ్మ కనుపించని వేలుపుని వేడుకుంది. మూడురోజులు ఎలాగడిచాయో ఆ దంపతులిద్దరికే తెలుసు. ఆరోజు మధ్యాహ్నం కామేశ్వరమ్మ వీధి వరండాలో కూర్చుని భగవద్గీత చదువుకుంటోంది. అక్షరాలు కళ్లముందున్నా ధ్యాస దానిమీదలేదు.కంచం పోయిననాటి ఙ్నాపకాలు ముసురుకున్నాయి.జానికమ్మగారింటికి పేరంటానికి వెళ్లి వచ్చి హడావిడిగా వంటచేసి అన్నాలు పెడదామని కంచాలు పెడుతుంటె ఆయన కంచం కనిపించలేదు.పిల్లలనడిగితే మాకేం తెలుసు?ఎదురు ప్రశ్నించారు ఏం చెయ్యాలొ పాలుపోక ఆయనతో చెప్తే సరిగా వెతకండి ఎక్కడో పెట్టి వుంటారు. యింట్లోని వస్తువు ఎక్కడికి పోతుంది అన్నారేగాని యిలా మాయం అయిపొతుందనుకోలేదు.అన్ని సామాన్లు వుండి అ ఒక్క కంచం లేకపోవడమేమిటి? యిలా ఆలోచనలో మునిగి వున్న ఆమె శంకరం రావటం గమనించ లేదు. అతన్ని చూడగానే "ఏమిటి నాయనా చేతిలో సంచీ వుంది వూరెళుతున్నావా?" అవునండి పట్నం వెళుతున్నాను రెండు రోజుల్లో వస్తాను .అంటే మంచిది నాయనా శుభం! శంకరరం వెళ్లాక గీత చదువుతోందీ ఒక శ్లోకం వద్ద ఆగిపోయింది.
అనన్యాశ్చింత యంతోమాం
ఏజనా: పర్యుపాసతే
తేషాం నిత్యాభియుక్తానాం
యోగక్షేమం వహామ్యహమ్
కృష్ణా! నిన్ను మనసారా నమ్మి నీ మీద భారం వేసి అన్నీ నీకు వదిలి పెడితే మా యోగక్షేమాలు నువ్వే చూసుకుంటానన్నావు కదయ్యా? ఏదీ దొంగ మారు తాళాల్తో తలుపు తీసుకుని కంచం పట్టుకుపోతుంటే నువ్వేంచేసావు?నువ్వు గీతలో చెప్పినవన్నీ నిజమని నమ్మాను ఆయనగాని నేనుగాని యితరులకి చేతనైన సహాయమే చేసాం గాని చీమకైనా అపకారం చెయ్యలేదు. గీతలో నువ్వు చెప్పిన విధంగా పరోపకారం చేస్తూ బ్రతుకుతున్నాం.మాకు దొరికిన ప్రతిఫలం యిదా? అన్యాయంగా ఆర్జించి ఆస్తులు కూడబెట్టకుంటెమానె తాతలనాటి వస్తువైనా నిలబెట్టుకోలేపోయాం. ఇదేనా నువ్వు చూసే యోగక్షేమం? కామేశ్వరమ్మ మనసులోనె గీతాచార్యునితో వాదిస్తోంది. పనిమనిషి పిలుపుతో యీ లోకంలోకి వచ్చింది.
ఈ మూడు రోజులై ఎవరో వొకరు రావడం మీ కంచం పోయిందట మీ యింటిలో దొంగతనం జరిగిందట అంటూ పరామర్శ చేస్తూంటే వాళ్లకి అభిమానం వ్యక్తం చేసినట్లుందిగాని మాకు మాత్రం వీళ్ల మాటలతో గాయం కెలికినట్లవుతోంది. రాత్రయినా ప్రశాంతంగా నిద్రపోదామంటే నిద్రాదేవి కరుణించలేదు. మనమేయిలా నీరుగారిపోయినట్లున్నాము,కాని యింకొకరయితే ధైర్యంగావుందురు . అయినా మనం అదృష్టవంతులమనే చెప్పుకోవాలి వచ్చిన దొంగ యింకేమీ పట్టుకెళ్లకుండా కంచమొక్కటె పట్టుకెళ్లాడు.రాజారవుగారు భార్యని వోదారుస్తున్నారు.నిజమేనండీ నయంకాదూ వొక్క వస్తువుతో సరిపెట్టుకున్నాడు. మధ్యాహ్నం కోపం వచ్చి దేముడినే తిట్టాను. ఎంత అవివేకం నాది? అంటూ వాపోయింది. పోన్లే రామదాసంతటివాడు రాముణ్ణి తిట్టాడు నువ్వూ ఆకోవకి చెందుతావేమో!నవ్వుతూనే సమాధానం యిచ్చారు. రాత్రి వొంటిగంట అయింది తలుపు తట్టిన చప్పుడుతో మెలకువ వచ్చింది రాజారావుగారికి తనపేరుపెట్టి పిలుస్తున్నారెవరో,పక్క నున్న కామేశ్వరమ్మకు కూడా తెలివి వచ్చేసింది తలుపు తియ్యబోయిన భర్తని అడ్డుకుంది ఎవరో ఏమిటో కనుక్కోకుండా తలుపు తియ్యకండి అసలె మొన్న దెబ్బ తిని వున్నాం. ఎవరు అవతల? రాజారావుగారి కంఠం ఖంగుమందీ నేనండీ యిన్స్పెక్టర్ కేసవరావుని తలుపు తియ్యండి మీకొచ్చిన భయమేమీలేదు. ఆశ్చర్యంలొ మునకలు వేస్తు తలుపు తీశారు. రండి కూర్చోండి .ఆరోజు పరిచయం తప్ప స్నేహం లేకపోయినా సభ్యత అనిపంచిన మాటలు.కేసవరావు లోపలికి వచ్చి తలుపు గడియపెట్టి వచ్చి కూర్చున్నాడు. ఇది మరీ విడ్డూరమనిపించింది.ఏదో తిరకాసుంది లేకుంటే యితనిలా ప్రవర్తించడు. మనసులోనే అంచనా వేస్తున్నారు రాజారావుగారు. అమ్మా! కాస్త మంచినీళ్లివ్వండి రాత్రి పూట మీకు శ్రమకలిగించినా సంతోషం కలిగించే వార్త తీసుకొచ్చాను.కామేశ్వరమ్మ సంశయం సంభ్రమంగా మారింది.లోనికెళ్లి గ్లాసుతో నీళ్లు తెచ్చింది.మాష్టారూ మీ కంచం దొరికింది.నిజంగా మీరు చాల అదృష్టవంతులు.అంటూ బేగులోంచి కంచంతీసి టేబిలు మీద పెట్టాడు .యింతకూ ఎవరు తీసారు సార్ నాకు చాలా కుతూహలంగా వుందిఈ వూరు వచ్చిన ఆరు సంత్సరాలలోను ఈ వూరందరి అభిమానం పొందగలిగేను నాకే కష్టం కలిగినా తమకే ఆకష్టం వచ్చినట్ట్లు భావిస్తున్నారు ఈ పల్లె ప్రజలు అటువంటిది నా యింటిలో దంగతనం చేసి అదీ ఒక్క కంచం పట్టుకెళ్లిన వ్యక్తి ఎవరుసార్! నాకు చాల ఆతృతగా వుంది రియల్లీ ఆయామ్ ఫీలింగ్ వెరీ యాంక్షస్! కేశవరావు రెండు చేతులూ జోడించి ఈ విషయం చెప్పడానికి నాకు జంకుగా వుంది మాష్టారూ! నా వుద్యోగం ఎలాటిదో మీకు తెలుసు రోజూ కత్తి మీద సామే అది చెప్తే మాత్రం మీ వూరివాళ్లు నాకు భూమిమీద నూకలు చెలగొట్టెస్తామన్నారు క్షమించండి. మీరు చెప్పే విషయం ఈ నాలుగు గోడలు దాటదు మా యిద్దరి మనసుల్లోనే సమాధి అవుతుంది మీ సంకోచం నన్ను అసలు నిలువనియ్యటంలేదు".మీ యింటి వారబ్బాయి శంకరం"
ఆ! యిద్దరూ వొక్కసారే ఆశ్చర్యపోయేరు. ముందుగా కామేశ్వరమ్మ తేరుకుని అదేమిటండీ మన శంకరం మధ్యాహ్నం నా ముందునుంచేగా పట్నం వెళ్తానని బయలుదేరాడు. ఏదొ మందు తెచ్చుకోవాలన్నాడు అయినా మీరు సరిగ్గా విచారించారా? ఆ అబ్బాయి అటువంటివాడుకాడు. ఆమె అమాయకత్వానికి నవ్వొచ్చింది కేశవరావుకి . మీ ముందు నుంచి ఎన్ని గంటలకు బయలుదేరేడమ్మా? రెంఢు అంది నాకు మూడు గంటలకు దొరికాడు.అతని సంచీలో మీ కంచం దొరికింది తన నేరం వొప్పుకున్నాడు, యింకా మీరతన్ని మన శంకరం అంటున్నారమ్మా? మీరతన్ని ఎలా అనుమానించరు సార్? వెరీసింపుల్ మా దృష్టి ఎంతసేపూ చుట్టూ వున్నవారి ముఖ కళవళికలు గమనిస్తూంటాం. నాకు హెడ్ క్వార్టర్స్ నుంచి కబురొచ్చింది అర్జంటుగా రమ్మని. సమయానికి జీపు పాడై బస్సులో బయలు దేరాను. నేను ఫ్రంట్ సీట్లో కూర్చున్నాను. ఈ వూరు దాటిన రెండు మూడు కిలోమీటర్లు దాటాక శంకరం బస్సాపించాడు లెఫ్టు సైడులో నిలుచోవడం నుంచి నా దృష్టిలొ పడ్డాడు. యూనిఫాంలో వున్న నన్ను చూడగానే వులిక్కిపడటం క్షణంలో నా దృష్టినుంచి తప్పించుకోలేదు. బస్సెక్కను వెళ్లిపోమని సౌంఙ్నచేశాడు. నాకు ఆశ్చర్యమేసింది. తిట్టుకుంటూ బస్సు స్టార్టు చేసాడు డ్రైవరు. నేను కిటికీలోంచి మరొక్కసారి అతన్ని చూసాను ఎక్కడో చూసిన ముఖంలాగుంది. నేను అతన్ని చూడటం గమనించి చేతిలో వున్నబేగుని చంకలో యిముడ్చుకుని తలవంచుకుని అడుగులు వేస్తున్నాడు అతని వద్ద సారా బాటిల్సు వున్నాయో యేమో నన్ను చూసి జంకుతున్నాడని బస్సు ఆపమన్నాను. వెనక్కి నడిచి వెళ్లి అతన్ని కలుసుకున్నాను.బస్సువెళ్లటమే గమనించాడు గాని తలొంచుకుని నడుస్తున్న అతను బస్సాగటం గమనించలేదు నేను దిగి వెనక్కి వెళ్లి అతని ఎదురుగా నిల్చున్నాను. ఒక్క క్షణం కంగారుపడ్డాడు తప్పించుకునే అవకాశం యివ్వలేదు. వూరు పేరు ఎవరి తాలూకా అన్నీ వివరాలడిగాక సంచిలో ఏముందన్నాను కాసేపు నసిగాడు .గట్టిగా అడిగి సంచిలోంచి తీస్తే మీ వెండికంచం! వెనక తిప్పి చూస్తే మీరు చెప్పిన ప్రకారం మీ తాతగారి పేరు వుంది. యికనే అక్కడే నాలుగు తగిలించి బస్సులో నా పక్కనే కూర్చోపెట్టుకున్నాను.బస్సులో ఎవరికీ అనుమానం రానివ్వవద్దని ప్రాధేయ పడ్డాడు.ఫ్రెండ్సులా కబుర్లు చెప్పుకుంటూ టౌను చేరాం.ఆ రాత్రి టౌన్లో చింతామణి నాటకం ఈ వూరి ప్రముఖులంతా అక్కడే వున్నారు. ఆ నాటకమేం చూస్తారు ఈ నాటకం చూడమని కబురు చేసాను.సంగతి తెలిసి లబోదిబో మన్నారు. ఈ సంగతి నలుగురికీ తెలిస్తే పరువు పోతుందని గోలపెట్టారు. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే మీ కంచం మీకు భద్రంగా అప్పగించమన్నారు.ఆ వస్తువు మీ యింట్లోనే దొరికినట్ట్లు అందరికి చెప్పమన్నారు. కేసులేకుండా శంకరాన్ని వదిలి పెట్టమని నా కాళ్లు పట్టుకున్నారు.ఇంటరెస్టింగుగా వింటున్న రాజారావుగారు కేశవరావు కళ్లలో చూసి యింకా? అన్నారు రాజారావుగారి కళ్లలోని కాంతికి యిన్స్పెక్టరు చలించినట్ట్లయింది. ఈ విషయం చెప్పకూడదుగాని నాకో అయిదు వేలిచ్చారు.మీ వస్తువు మీకు దొరికింది అది మీ యింట్లోనె దొరికినట్లు చెప్పాలి మాషారూ ప్లీజ్ నాకొసం మాటివ్వండి అంటూ బతిమాలుతున్న యిన్స్పెక్టరుతో అల్లాగే మావస్తువు మాకు దొరికింది మీరు నిశ్చింతగా వుండండి సార్! అంటూ లోపలికి వెళ్లి అయిదువందలు కేశవరావు చేతిలో పెట్టి నేను పేదవాడిని వేలు యివ్వలేను యీ సొమ్ము తీసుకుని మా సత్తెయ్యని రేపు పొద్దుటే విడిపించండి సార్ వాడిభార్య నిన్న ప్రసవించింది . వాడిని చూడటానికి నాకు ముఖం చెల్లదు. కెశవరావు ముఖం ఎర్రగా కందిపోయింది.మష్టారు నన్నింకా సిగ్గు పడేలా చేయకండి.మీ వద్డ డబ్బు తీసుకోవడం నావుద్యోగానికే కళంకం. వస్తానౌ మష్టారూ వస్తానమ్మా అంటూ బయటకు నడిచాడు. అప్పటికి తేరుకున్నకామేశ్వరమ్మ వెంటనే పెరట్లోకి వెల్ళ్లి కాళ్లు కడుక్కుని దేముడికి దండంపెట్టి లెంపలు వేసుకుని క్షమాపణ వేడు కుంది మధ్యాహ్నం నిన్నన్ని మాటలన్నాను పన్నెండు గంటలు కాకుండానే మా సొమ్ము నట్టింట్లో పెట్టించావు.నాది అఙ్నానం తండ్రీ!నన్ను క్షమించు! అంటు దండాలు పెట్టింది .యింతలో రాజారావుగారు వచ్చి చూసావా కాముడూ గట్టిగా దెబ్బలాడేసరికి పౌరుషం వచ్చి నిముషాలమీద దొంగని పట్టించేసాడు. ఇప్పటి కాలంలో తిట్టందే దేముడుకూడా పన్లు చెయ్యటం లేదు. చాల్లెండి కృష్ణుడు గీతలో చెప్పినట్లే చేశాడు.
పరిత్రాణాయ సాధూనాం వినాశాయచ దుష్కృతాం
ధర్మ సంస్థాపనార్ధాయ సంభవామి యుగే యుగే /

దుష్ట శిక్షణ మాటెలా వున్నా శిష్ట రక్షణ మాత్రం చెయ్యలేదు .అమాయకుడు నేరం చేయని వాడు నిందపడి దెబ్బలు తిని జైలుకెళ్లాడు. నేను పడ్డ మానసిక సంక్షోభం వివరించలేను.ఒకరు మానవతా వాది యింకొకరు ఆస్తిక వాది యిరువురినీ మనసారా అశిర్వదించాడు భగవంతుడు. మర్నాడుదయం పదిగంటలయింది కమేశ్వరమ్మ వంట పూర్తయింది. కాముడూ! ఎవరొచ్చెరో చూడు అన్నారు రాజారావుగారు సంతోషంగా వచ్చినవాడు స్వంత తమ్ముడే అన్నట్లు.బయటికి వచ్చిన కమేశ్వరమ్మ సత్తెయ్యని చూడగానే సంతోషం దు:ఖం కలిగాయి .వాడు మాష్టారి కాళ్లు పట్టుకుని నాను దొంగని కాదు బాబూ గంజితాగీ నాకు యెండికంచవెందుకు బాబు,అమ్మగారూ మీరూ నన్నేదొంగననుకున్నారమ్మా? రాజారావుగారు వాడి భుజాలుపట్టుకుని లెవనెత్తి లేదురా నువ్వు దొంగవికావు నీది దొరబతుకు.మావల్లే పొరపాటుజరిగింది . కాముడూ వీడికి అన్నంపెట్టు ఒరేయ్ కాళ్లూ చేతులూ కడుక్కుని అన్నం తిను. అమ్మగారివాళ చింతకాయ పులుసు పెట్టిందితిను. వీది అరుగుమీద ఆకువేసి స్వయంగా అన్నం వడ్డించారు.వాడు అవురావురని అన్నం తింటుంటె యింటి కెల్లి నీ భార్యని కొడుకుని చూశావురా?అన్నారు నేదు బాబూ కొండంత నింద నెత్తినేసుకునిఎల్లానా? ఆల్లేటి సెప్పకుండ మాష్టారిడిపించీమన్నారని వొదిలీసినారుబాబూ మీ నోటితో నాను దొంగనికాను అన్న ముక్కింటెగాని యింటికెల్లబుధ్దికానేదుబాబూ. ఇంతకూ మీ కంచం దొరికిపోనాదా బబూ ఎవరికెన్ని గుండెలు బాబూ మీయింటిల దూరి కంచవట్టుకెల్లటానికి. ఆ మాటలు వింటూంటే కాళ్లకింద భూమి కంపించినట్లయింది దంపతులిద్దరికి. మా తెలివి తక్కువరా సత్తెయ్యా మా బట్టల బీరువాకింద దొరికింది ఏచెయ్యో తగిలి దొర్లిపోయి వుంటుంది .కనిపించలేదనగానే వూరంతా నిన్నే అనుమానించారు .ఇప్పటికీ నా వస్తువు పోయిన బాధకన్నా నిన్ను దొంగ అని నిందించి బాధించిన దానికే ఎక్కువ బాధపడుతున్నాను. చిన్నవాడివయినా నన్ను క్షమించరా సత్తెయ్యా. నా మనస్సాక్షే నన్ను నిలదీస్తోంది. అంత మాటనకండి బాబూ మీ లాటోల్లు భూమ్మీదుండబట్టి యింకా యీ పెపంచం యినాగయినా వున్నాది.

1 comment:

Anonymous said...

రచయిత్రిగారికి నమస్కారములు. మీ రచనలు అద్భుతంగా వున్నాయి. వరలక్ష్మి భాషా....కధలో డాక్టరుకిచ్చిన జవాబులోనే వున్నది సున్నితమైన దెబ్బ.మర్మమెరుగని కధలో ఎంత లీనమయ్యేనంటే కధ చదువుతున్నట్లు కాక నేనుకూడా ఆయింట్లో ఒక మనిషి లాగా కళ్లముందు జరుగుతున్నట్లే వుంది మొత్తం రచనలన్నీ చదివాను. చాలా చాలా రాయాలని వుంది టైపు చెయ్యడం యిబ్బందిగావుంది. ఇంకా ఇంకా రచనలు చెయ్యాలి యిట్లు లక్ష్మి.