11 June, 2009

చిగురించిన పందిరి

లావణ్యకి యిటువంటి పరిస్థితిలో ఏంచెయ్యాలో దిక్కు తోచలేదు. తండ్రి వ్యాపారరీత్యా బెంగుళూరు వెళ్లి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి హాస్పిటల్లో జాయిన్ అయినట్లు ఫోను వచ్చింది.చందూని సాయం తీసుకుని బెంగుళూరు చేరుకుంది.డాక్టర్లు పరిస్థితి అదుపులో వున్నా ఆపరేషను చేయందే ఆరోగ్యం చక్కపడదని నిర్ధారించారు.నాలుగు రోజుల తరువాత అతన్ని తీసుకుని తమ వూరికి చేరుకున్నారు. ఎంతో వుత్సాహంగా వెళ్లినతండ్రి ఢీలాపడిపోవడంతో లావణ్య దిగులు పడింది.అయితే ధైర్యంగా నిలబడవలసిన సమయంలో తన అధైర్యం తండ్రిని క్రుంగదీస్తుందని లేని నిబ్బరం ప్రదర్శించింది. అన్ని టెస్టులు చేయించాక ఆపరేషను తేదీ నిర్నయించారు డాక్టర్లు.

ఆరోజు సాయంత్రం తండ్రి తనని చందూని కరుణని పిలిచి మంచం పక్కన కూర్చోపెట్టుకున్నాడు. ఏం మాట్లాడతాడోనని ఆతృతగా ఎదురు చూసింది. తన చేయి పట్టుకుని "అమ్మా! లావణ్యా! పురిటిలో మీ అమ్మ చనిపోతే పసికందుని గుండెలమీద పెట్టుకుని పెంచాను. నెలల బిడ్డగా వున్నపుడు జ్వరం వస్తే డాక్టర్లు పోలియో అన్నారు.ఎన్ని మందులిచ్చినా నీచేయి కాలు నయం చెయ్యలేకపోయారు. ఆరోజునుంచి నా జీవితంలోసంతోషం ఎలా వుంటుందో మర్చిపోయాను, కాని విచిత్రం ఏమిటోగాని నేను ధనవంతుడినే అయినా ఏటికేడాది వ్యాపారం పెరిగి నేనూహించలేనంత ఎత్తుకెదగ గలిగాను కాని నీ జీవితం చక్రాల కుర్చీ నుంచి తప్పించలేకపోయాను. ఇప్పుడిదంతా ఎందుకంటే ఆపరేషను తర్వాత నా పరిస్థితి ఎలా వుంటుందో తెలియదు,నాబ్రతుకు చుక్కాని లేని నావలావుంటే నీకొక దారి పెట్టకుండా ఎలాగమ్మా?" అలసట తీర్చుకునేందుకు ఆగారు. ముగ్గురూ కళ్లనీళ్లతో వుగ్గబట్టి వింటున్నారు."యిప్పుడిదంతా ఎందుకు నాన్నా మీరు బాగుంటారు" వెక్కిళ్ల మధ్య లావణ్య అంది. "బాగుండాలనే నేనూ కోరుకుంటున్నానమ్మా అయితే భగవన్నిర్ణయంమనకి తెలియనపుడు పరిస్థితి కొంతయినా చక్కబెట్టడం నాధర్మం. చందూ! నాయనా నిన్ను పరాయి వాడిలా ఎప్పుడూ చూడలేదు. నీ తండ్రి నిన్ను నా చేతుల్లో పెట్టిననాటినుంచి యీ నాటి వరకు కన్నకొడుకులా చూసుకున్నాను.ఋణం తీర్చుకోమని అడిగే హక్కు లేదు 
గాని నాబిడ్డని నావ్యాపారాన్ని నీ చేతుల్లో పెడుతున్నాను అభిమానంవుంచి లావణ్యని పెళ్లిచేసుకోమని అర్ధిస్తున్నాను. అమ్మా కరుణా! తుఫాను రాత్రి ఒంటరిగా పార్కు పక్కన తడిసి ఏడుస్తున్న నిన్ను యింటికి తెచ్చి నా లావణ్యకి తోడుగా వుంటావని పెంచాను.మీముగ్గురిని ఒక చోట చేర్చి పెంచిన నాడు నా బిడ్డకి తోడుగా వుంటావనే ఆలోచించానుగాని యీ రోజున స్వార్థపరుడిలా కొరిక కోరినందుకు సిగ్గు పడుతున్నాను. అయినా అసహాయుడిని నాకు మాటివ్వగలవా చందూ?" అంటూ రెండు చేతులూ జాపిన రఘునాధరావుగారిని ముగ్గురూ ముప్పేటల్లా అల్లుకు పోయారు. చందూ పెదవి విప్పి మీరెలాచెపితే అలా చేస్తాను అంకుల్ లావణ్య మనసు కూడా తెలుసుకోండి" "ఏమంటావు తల్లీ?"అనగానే "మీ యిష్టం నాన్నా" అంది కారు మబ్బులు విడిపోయినట్లయింది.రఘునాధరావుతేలికగా వూపిరి తీసుకున్నారు. మర్నాటినుంచి ఆపరేషను తేదీ లోపున సింపుల్ గా పెళ్లి చెయ్యటానికి అన్ని ఏర్పాట్లు చేయించారు.వేంకటేశ్వరుని సన్నిధిలో వివాహం జరిగిపోయింది.వధూవరులు పసుపు బట్టలు మార్చక ముందే రఘునాధరావుగారు హాస్పిటల్లో జాయిన్ అయి హార్ట్ సర్జరీ చేయించుకున్నారు.

పది రోజుల తరువాత యింటికి వచ్చారు.లావణ్య చక్రాల కుర్చీలో కదులుతూనే తండ్రి సేవలు స్వయంగా చూసుకుంటోంది.యింట్లోని నౌకర్లు కరుణ లావణ్య రఘునాధరావుగారి సేవలు చేస్తుంటే చందూ అనబడే చంద్రశేఖర్ వ్యాపార వ్యవహారాలు చక్కబెడుతున్నాడు. నెలరోజులు గడిచి కోలుకుంటున్నారు అనుకునే సమయంలో జరిగింది ప్రళయంలాంటి సంఘటన. లావణ్య అన్నం స్పూనుతో తండ్రికి తినిపిస్తోంది "ఏమిటమ్మా నన్ను మరీ పసిపిల్లాడిని చేస్తున్నావు" ఏమీ ఫరవాలేదు నాన్నా . లావణ్య అన్నం స్పూనుతో తండ్రికి తినిపిస్తోంది "ఏమిటమ్మా నన్ను మరీ పసిపిల్లాడిని చేస్తున్నావు" ఏమీ ఫరవాలేదు నాన్నా మీరు తొందరగా కోలుకోండి మనమంతా ఎటయినా ప్రశాంతమైన ప్రదేశానికి పది పదిహేను రోజులు వెళ్లి గడిపి వద్దాం" అంటూ అన్నం తినిపించింది.సడెన్ గాపలమారింది ఎంత చేసినా తట్టుకోలేక మెలికలు తిరిగిపోతుంటే గట్టిగా కేకలు పెట్టి అందరినీ పోగు చేసింది డాక్టరు వచ్చి పరీక్షించి పెదవి విరిచాడు.చుట్టు వున్నవాళ్లంతా ఘొల్లుమన్నారు లావణ్య జరిగినది గ్రహించి డాక్టరుని పట్టుకుని కుదిపేసింది,"చెప్పండి డాక్టర్!నావల్లే యిలా జరిగిందికదా? అన్నం పెడుతూంటే పలమారి నాన్న పోయారా?" అంటూ విలపిస్తున్నా ఒదార్పుగా తలనిమురుతూ "లేదమ్మా లావణ్యా! యిటువంటి సంఘటనలు మావైద్య చరిత్రకేసవాల్ గా నిలుస్తుంటాయి.అన్నం తినక పోయినా వుమ్మి అడ్డం పడి పలమారి ప్రాణం పోతుంది వైద్య సహాయం అందే సమయం వుండదు." 
లావణ్యకి చుట్టూ అంతా చీకటయినట్లయింది. తల్లీతండ్రీ తనే అయి అహర్నిశలూబిడ్డ సంతోషం కోసం జీవించిన తండ్రి, యిరవైఆరు సంత్సరాలు గుండెల్లో పెట్టుకుని కాపాడుకున్న తండ్రి గాజు గ్లాసు చేయిజారినట్లు అవటంతో తట్టుకోలేకపోయింది. కరుణ చందూ చెరో ప్రక్క నిలుచుని ఒదార్చారు. రావలిసినవారు రావటం చేయవలసిన కార్యక్రమాలు లావణ్య ప్రమేయం లేకుండానే జరిగి పోయాయి.

లావణ్యలో ఎంత నిర్లిప్తత చోటు చేసుకుందంటే రోజూ గంటల తరబడి దండవేసిన తండ్రి ఫోటో ముందు తన కుర్చీలో కూర్చుని తన చిన్నప్పటినుండి తండ్రితో గడిపిన అనుబంధపు పుటలు తిరగవేస్తుండేది. ఆసమయంలో కరుణగాని చందూగాని మాట్లాడించడానికి సాహసించలేకపోయేవారు.లావణ్య తన అసహాయత అర్ధమయి తనపై తను దయకలిగే పరిస్థితి ఏర్పడకుండా యిల్లంతా ఎక్కడికయినా కుర్చీలో సులువుగా తిరుగగలిగేలా యింటిని మార్చారు. చదువుకుందికి స్కూలికి వెళితే తోటివారు హేళన చేయకుండా అన్ని సబ్జక్టులకీ టీచర్లని యింట్లో ఏర్పాటు చేసి పదవ తరగతి పరీక్ష యిప్పించారు.తన నాలుగవ ఏట తడిసిముద్దయిన కరుణని యింటికి తీసుకు వచ్చి నౌకరు చేత స్నానం చేయించి తన బట్టలు కట్టించి పాలు పట్టించి అన్నారు "అమ్మా! లావణ్యా నీకో చెల్లిని తెచ్చాను. నీతో ఆడుకుందికి ." తరువాత కరుణ ఎలా దొరికింది మర్నాడు పోలీసులచే ఎంక్వైరీ చేయించి ఆమెని పెంచే దాతలెవరూ లేరని తెలుసుకుని చట్టరీత్యా దత్తాత చేసుకుని తనకి సవతి తల్లిని తేకుండా ఒక చెల్లిని తెచ్చారు.ఇక చందూ సంగతి సరేసరి తన చిన్న నాటి స్నేహితుడు ఆర్ధికంగా చితికిపోయి ఆరోగ్యం కోల్పోయి మిగిలిన తన పద్కొండేళ్ల కొడుకుని తీసుకుని వైద్యం కోసం ఆర్ధిక సహాయం అర్ధించడానికి వచ్చాడు.అతని అసహాయత గమనించి హాస్పిటల్లో చేర్చారు.అతని చింత కొడుకు చంద్రశేఖర్ అయిదో క్లాసు మధ్యలో మానిపించి తనకు సహాయం చేయగల వ్యక్తి రఘునాధరావు వొక్కడే అని నిర్నయించుకుని వచ్చాడు. రోజూ తనతో పాటు చందూని హాస్పిటల్ కి తీసుకు వెళ్లి తండ్రి వద్ద కాసేపు వుండనిచ్చి స్నేహితునికి ధైర్యం చెప్పి వచ్చేవాడు. అతని సేవ కోసం ఒక నౌకర్ని పెట్టాడు. ఎన్ని మందులు వాడినాఅతని ప్రాణాలు పధ్నాలుగు రోజులు కాపాడగలిగేరు.పోతూ పోతూ "రఘూ! నా చందూని నీ చేతుల్లో పెడుతున్నాను. వాడినేదో గొప్పవాడిని చెయ్యమనను గానిఒక మనిషిగా తీర్చు అంతే చాలు." చివరి దశలో వున్న స్నేహితుని చేతిలో చెయ్యి వేసి,"నువ్వేమీ దిగులు పడకు చందూని నాయింట్లో నా పిల్లలలో ఒక పిల్లాడిగా పెంచుతాను. తను ఎంత చదువుకుంటానంటే అంత చదివించి నువ్వు ఏలోకంలో వున్నా నీ బిడ్డని చూసి గర్వించేలా చేస్తాను". అంటూంటే చివరి చూపులోకూడా స్నేహితుని కళ్లల్లో మెరుపు చూడగలిగాడు.ఆనాటి నుంచి ఆయింట్లో ముగ్గురు పిల్లలు. చందూని స్కూల్లో జాయిన్ చేసారు.కరుణ మాత్రం లావణ్య కోసం వచ్చిన టీచర్ల వద్ద అక్క ప్రక్కన కూర్చుని చదువుకునేది. 
లావణ్యకి సంగీతం నేర్చుకునే అభిలాష వ్యక్తం చేస్తే రోజూ ఒక గంట సంగీతం మాష్టరు వచ్చి నేర్పేవారు.
పదవ తరగతి తరువాత బి ఎ ,ఎ మ్మె ప్రైవేటుగా పరీక్షలకి కూర్చుని పాసయింది. కరుణ బి ఎ తరువాత యిక చదవనని అక్కకి తోడుగా వుంటాను యిల్లు చూసుకోవడంలో సహాయ పడతానంది. చందూ ఎమ్ కామ్ చేసి సి ఎ చేసాడు.తండ్రి ఆర్ధిక వ్యవహారాల్లో సహాయంగా వుండేవాడు.తన అభిరుచులకు ప్రాధాన్యతనిస్తూపెంచాడు తండ్రి.గ్రాడ్యుయేషను చేస్తున్న సమయంలో పైంటింగు మీద వుత్సాహం చూపిస్తే దానికి తగిన పరికరాలన్నీ తెచ్చారు. అవన్నీ తనకి అందుబాటులో వుండేటట్లు ఏర్పాటు చేశారు.కరుణ ప్రక్కన వుండి సహాయం చేస్తే చందూ తగిన సలహాలిస్తూండేవాడు.బయటి ప్రపంచంలో తిరగని తనకు గార్డెన్ లో తిరుగుతూ రంగు రంగుల పూవులు పచ్చని చెట్లు తీర్చి దిద్దినట్లున్న తోటలో రోజూ తిరగటం కళ్ళముందు కనిపించిన అందాల్ని మనసులో నిలుపుకుని కాగితంపై రంగుల కలల్ని కుంచెతో మలిచేది.లావణ్య దినచర్య చూసి అందరికీ ఆశ్చర్యమే యింత నాజూకుగా వుండి తన వికలాంగతనికూడా లెక్కచెయ్యక యిన్ని రంగాలలో ప్రావీణ్యం సంపాదించడంలో ఆమె పట్టుదల తెలియజెప్పేది.

రఘునాధరావు ఒకసారి బెంగుళూరు వెళ్లినప్పుడు ప్రత్యేక రకమైనతీగమల్లె తెచ్చారు.అప్పుడు తండ్రితో అంది"నాన్నా!మన గార్డెన్ లో దీనిని సరైన స్థలంలో పాతి చక్కని పందిరి వేయించుదాం.మల్లెపూలు పూచినప్పుడు ప్రక్కన బెంచీపై కూర్చుంటే ఆపరిమళం ఆస్వాదిస్తూ యెంత సేపైనా గడపవచ్చు కదా!" "తప్పకుండానమ్మా మాలికి స్థలం నిర్నయించి నువ్వే చెప్పు పందిరి వేయించు రాతిబెంచీలు తెప్పిస్తాను".మర్నాడే స్థలం నిర్నయించి మొక్కని పాతించి జాగ్రత్తగా రోజూ నీళ్లుపోయమని మాలీకి చెప్పింది. రెండు నెలలు గడిచే సరికి తీగలు పొడవుగా రావటం మొదలయింది.పందిరి వేయించుదామనుకునే లోపున మాలి నెలరోజులు శలవలో వెళ్తూ వేరే మనిషిని అప్పజెప్పాడు.పందిరి వేయించుదామనుకునే లోపున మాలి నెల రోజులు శలవలో వెళ్తూ వేరే మనిషిని అప్పచెప్పాడు.తండ్రి గుండె నొప్పి వచ్చే ముందు రోజే కొత్త మాలీని పిలిచి పందిరి ఏర్పాటు చెయ్యాలని దానికి కావలిసిన సామగ్రి తేవాలని చెప్పింది. అలాగేనని తలూపాడు.మర్నాడు తండ్రికి సీరియస్ గా వుందని కబురు రావటం మిగతా హడావిడిలో పందిరి వేశాడా లేదా చూసే మనస్థమితం లావణ్యకి లేకపోయింది.

తండ్రి పోయి మూడు నెలలు గడిచాయి.ఆరోజు యిల్లంతా తిరుగుతూ అన్నీ సరిగా వున్నాయా లేదా అని పరిశీలిస్తున్న లావణ్యతన జీవితం మునుపటిలా నడవటం లేదు ఏదో వెలితిగా వుందని భావించింది.ఏమిటా అని ఆలోచిస్తుంటే పూర్వంలా కరుణ తన ప్రక్కనే వుండి కబుర్లు చెబుతూ సహాయ పడటం లేదని గ్రహించింది.అయితే చిన్నప్పటినుంచి పెంచిన తండ్రి పోవటం తనుకూడా బెంగపడిందేమో అనుకుంది. ముఖ్యమైనది చందూతో తన వివాహబంధం ఏర్పడిందేగాని పూర్వపు స్నేహం సన్నిహిత్త్వం లోపించినట్లనిపించింది .ఈ మూడు నెలల్లో తనతో మాట్లాడిన సందర్భాలు వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. ఇంటి బాధ్యతలు బిజినెస్ బాధ్యతలలో తలమునకలవుతున్నాడేమో.అసలు తనేబాహ్య ప్రపంచం మరిచి తండ్రి జ్ఙాపకాలలో మునిగి తేలుతుండటం కూడా కారణం కావచ్చు అనుకుంది.సాయంత్రం తన కుర్చీ నడుపుకుంటూ తోటలోకెళ్లిన లావణ్య మల్లెతీగ పెట్టిన స్థలానికి వెళ్లి నిశ్చేష్టురాలయింది.మల్లె తీగ ఎండిపోయింది పందిరి కోసం వేసిన కర్రలలోంచి పచ్చని చిగుళ్లు కనిపిస్తున్నాయి.మాలీని కేకవేసి అడిగింది,"నేను లేను కదమ్మాయిగారూ!కొత్త మాలీకి అంతగా తెలియదు.మీరు చెప్పారు ఎలాగో ఒలా చెయ్యాలని మన పెరటి వైపున్న పెద్ద చెట్టుకొమ్మలు సాపుగా వున్నవికోసి పందిరి కట్టాడుటమ్మా.అయ్యగారి ఆపరేషను ఆబాబు పోవటం యింట్లో యెవరూ పట్టించుకోలేదు లేత మల్లెమొక్క యెండిపోయింది.పందిరికున్న పచ్చి కొమ్మలు చిగురుపెట్టాయి.యివి తీసి మళ్లీ సరిగా కడతానమ్మా"."వద్దులే తాతా యింక నాకూ వుత్సాహం పోయింది". అంటూ లోపలికెళ్లింది.ఇదేదో అపశృతికి సంకేతంలా అనిపించింది.

రాత్రి నిద్రపట్టక పక్కపై దొర్లుతున్న లావణ్యకి గుసగుసగా మాటలు ఎవరో సన్నగా రోదిస్తున్న స్వరం విపించగానే ఎవరై వుంటారని ఆలోచించింది. కుర్చీలో కూర్చుని నెమ్మదిగా నడుపుకుంటూ మాటలు వినిపిస్తున్న వైపు వెళ్లింది.బెడ్ లాంపు కాంతిలో కనుపించిన దృశ్యం తన కళ్లని తనే నమ్మలేకుండా చేసింది.చందూ కరుణ భుజాలు పట్టుకుని వూరడిస్తున్నాడు,కరుణ అతని గుండెల్లో ఒదిగి రోదిస్తోంది.తమ ముగ్గురి మధ్య చిన్ననాటినుంచి స్నేహం ముక్కోణంగా వుండేది.ఈపాటి సన్నిహిత్వానికి సందేహించనవసరంలేదు కాని అంతరాత్రి వేళ యిద్దరూ యేవిషయంలో అంత ఆందోళన చెందుతున్నారా అనిపించింది.సంగతేమిటో తెలుసుకుందామని దగ్గరకెళ్లింది.లావణ్యని చూడగానే యిద్దరీ వులిక్కి పడ్డారు,"ఏమయింది కరుణా ఈసమయంలో వచ్చావు"?"అదే నేనూ అడుగుదామని వచ్చాను.యింత రాత్రి వేళ మీ యిద్దరికీ ఏ సమస్య వచ్చిందో తెలుసుకుందామని".
కరుణ లావణ్యని చుట్టుకుని ఎడుస్తోంది.చందూ దోషిలా తల వంచుకుని "నన్ను క్షమించు లావణ్యా! నావల్ల పొరపాటు జరిగింది కరుణని దూషించకు. నేను అంకుల్ ఆశల్ని వమ్ము చేశాను. తీరని నేరం జరిగింది,దీనిని ఎలా దిద్దుకోవాలో తెలియక సతమతమౌతున్నాం".వివేకంగల లావణ్యకి కొంతవరకు అర్ధమయింది కాని దీని వెనుక అర్ధం పరమార్ధం అవగతం కాలేదు."శాంతంగా కూర్చోండి యిద్దరూ ఏం జరిగిందో చెప్పండి.మన ముగ్గురితో పరిష్కారమయ్యే సమస్య అయితే మనమే దీనికి మార్గం చూద్దాం.ఎంత నిగ్రహించుకుందామనుకున్నా కంఠం వణికింది.

చందూనే ముందుగా తేరుకుని చెప్పడం మొదలు పెట్టాడు"లావణ్యా యీ యింటికి వచ్చిననాడు నేనింత వడినవుతానని గాని చదువుకుని ప్రయోజకుడిని కాగలననుకోలేదు.అంకుల్ నా ఫ్యూచరుని బంగారు బాటగా మలిచేరు.ఏమిచ్చినా ఆయన ఋణం తీర్చుకోలేను. ఈ భావనతోనే మన పెళ్లి ప్రపోజల్ ని క్షణం కూడా ఆలోచించకుండా నా అంగీకారం తెలిపాను. కాని లావణ్యా! అంకుల్ పోయాక నేను ఎన్ని సార్లు నీగదికి వచ్చి నీతో సన్నిహితంగా వుందామనుకున్నా నాలో ఏదో న్యూనతా భావం వెనక్కు లాగేది. నేను నీకు తగిన వాడినికాను,అల్పుడిని అన్న భావం నన్ను వణికించేది.నువ్వు నాకన్నా ఎంతో ఎత్తులో వున్నట్లనిపించేది.నీవు అంకుల్ జ్ఙాపకాలలోంచి బయటపడలేక సతమతమౌతూంటే నాకు కొత్తగా చుట్టుకున్న బాధ్యతలతోపాటు నీతోముడిపడ్డ బంధం ఎంతవరకు నిభాయించ గలనని ఆరాట పడేవాడిని. అన్ని పరిస్థితులలోను నిండుకుండలా వుండే కరుణని చూస్తే ఆశ్చర్యమనిపించేది.మనిద్దరికన్న చిన్నదయిన కరుణలో పరిస్థితినెదుర్కోగల నిబ్బరం కనిపించేది. అందుకనే నేను యింట్లో వుండే సమయం తగ్గించి బిజినెస్సు మీద మనసు లగ్నం చేశాను.ఒకరోజు రాత్రి పదకొండు దాటాక యిల్లు చేరాను,నేను రావటం గమనించి కరుణ అన్నం పెట్టింది. నా ముభావం చూసి "ఏమయింది? అంకుల్ పోయినప్పటినుండి గమనిస్తున్నాను.నీలో ఏదో మార్పు యింత నిర్లిప్తంగా వుంటున్నావు నీ బాధ ఏమిటి చందూ"? ఆపాటి సానుభూతి మాటలకు నాలోపేరుకుపోయిన భావాలు అలలుగా పెల్లుబికాయి, మాటలద్వారాకాదు కన్నీళ్లరూపంలో. తనకన్న పెద్దవాడిని బేలగా కన్నీరు పెట్టడంచూడలేక దగ్గరగావచ్చి నా తలని గుండెలకి హత్తుకుంది.ఈ హాలులో మాట్లాడవద్దు లాన్ లో కూర్చుని మాట్లాడుకుందాం పద"అంది. మనసులోని బాధ బయటపడితే సర్దుకోగలనన్న వుద్దేశంతో అని వుండవచ్చు. అక్కడ కూర్చున్న తరువాత చెప్పాను నాకు నీపై గౌరవం అభిమానం కొండంతవున్నా భర్తని అన్న వూహ రాగానే నీరుగారిపోతున్నాను.నాలో ఆ ప్రేమ భావం కలగటంలేదు.ఆమాటే కరుణతో చెప్పాను. కరుణ చాలా పెద్ద తరహాగా సలహా యిచ్చింది.రోజూ కొంత సమయం నీ వద్ద గడపడం లేదా బయటి ప్రదేశానికి ఎక్కడికైనా వారం పది రోజులు గడిపి రమ్మంది.సాన్నిహిత్యం పెరిగితే అనుబంధం అదే బలపడుతుందని, చావు బ్రతుకులమధ్య నున్న అంకుల్ కి యిచ్చిన మాట తప్పకు చందూ అంటూ వూరడించింది. ఎందుకనో ఆ సాంత్వనవచనాలతో లోపలి దుఖం లావాలా ఎగిసిపడింది.చిన్నప్పుడే తల్లిని పోగొట్టుకున్నాను జ్ఙానం తెలిసీ తెలియని వయసులో తండ్రిఅష్ట కష్టాలు పడుతూ ముక్కు ముఖం తెలియని వీళ్లకి అప్పగించి చనిపోయాడు.ఆసమయంలో అనిపించినదొక్కటే వీళ్ల ఆసరా వదులుకుంటే నాకు బ్రతకటం కష్టమని.అయితే లోటు తెలియనివ్వకుండా అంకుల్ మీ యిద్దరితో పాటు నా భవిష్యత్తు తీర్చిదిద్దారు.అతనికిచ్చిన మాట తప్పలేను.పూవులా నాజుకుగా వుండే లవణ్యకి ద్రోహం చెయ్యలేను. కాని నామనసుని మోసపుచ్చుకో లేకపోతున్నాను. నేనేం చెయ్యాలి? ఎవరితోను పంచుకోలేని బాధ యిది". అంటూ కదిలికదిలి ఏడ్చాను.కరుణ నా దుఖం చూడలేక ఓదార్చుతూ దగ్గరకు తీసుకుంది.వయసు సమయం పరిస్థితి మమ్మల్ని అవివేకుల్ని చేశాయి.శరీరాలు వశం తప్పాయి,అంతే జరగకూడనిది జరిగిపోయింది.యిరువురం దొంగల్లా మర్నాటినుంచి నీనుంచే కాకుండా మానుంచి ఒకరికొకరం దూరంగా మసలడం మొదలు పెట్టాం నేనయితే బయట టూర్లుమీద ఎక్కువ సమయం గడపడం మొదలు పెట్టాను".

ఇంతటి కథని ధైర్యం కూడదీసుకుని చెప్పాడు చందు. కరుణ వెక్కిళ్ల మధ్య "అక్కా నీకు అండగా వుందామననుకున్నానుగాని నీ అనందాన్ని మింగేయాలనుకోలేదు మన ముగ్గురిమధ్య యిటువంటి పరిస్థితి వస్తుందని వూహించలేదు.దేవునిలాటి అంకుల్ మనసు క్షోభించేలా అయింది. నాకు ఏ శిక్ష అయినా వేయి".అంటూ లావణ్య కాళ్లు చుట్టేసింది."చందూ! కరుణా!యిద్దరూ యీ క్షమాపణలూ పశ్చత్తాపాలూ ఆపండి! నేను జీవితాన్ని యీవిధంగా జీవించాలి ఆవిధంగా జీవించాలి అని ఎప్పుడూ కలలు కనలేదు.అయితే నాతండ్రి ఆర్ధిక స్థోమత బాగుండి నేను కోరినవన్నీ అందుకోగలిగాను.యింత పెద్ద యింటిలో నేనొక్కర్తినీ వొంటరితనం ఫీలవకుండా మీ యిద్దరినీ చేరదీశారు.భగవంతుని దయవలన మన ముగ్గురి స్నేహంలో ఎప్పుడూ విఘ్నం రాలేదు.నేను పెళ్లిమీద ధ్యాస లేకుండానే యిన్నాళ్లు గడిపాను.నాకున్న దుర్బలత నా అవిటితనం గుర్తు పెట్టుకునే బ్రతికాను. అయితే నాన్న ఆరోగ్యం ప్రమాదస్థితిలో వుండి నన్ను యీ విషయం అడిగేసరికి ఆలోచించుకునే వ్యవధి లేదు. ప్రతీది నేను కోరటమేగాని అతను అడిగిన మొదటి కోరిక యిదే చందూ! నీ నిర్నయం ఏమైవుంటుందా అని చూశాను ఎందుకంటే మొదటినుండి మాయింటి వ్యవహారాలు, నాగురించి తెలిసిన నీ స్పందన ఎలా వుంటుందా అని చూశాను.నీ సమాధానం విన్నానే గాని ఒక్క సారి నీ ముఖంలోకి చూసి వుంటే అరోజు తప్పక నీ మనసు గ్రహించి వుండేదాన్ని. 
కాని నాన్న పోయాక అయినా ఒక్కసారి నీ మనసు విప్పి నాతో మాట్లాడి వుంటే నేనే యీ వివాహబంధం నుంచి విముక్తుడిని చేసి వుండేదాన్ని. యీ తప్పిదం మీవల్ల జరిగే అవకాశం వుండేదికాదు.కాని పొరపాటు జరిగిన యిన్నాళ్ల తరువాత యింత రాత్రివేళ బాధ పడటం,ఓదార్పులు ఏమవసరమైంది"?చందూ నసుగుతూ "అదే కరుణ కడుపులో మా తప్పుని యెత్తి చూపే అంకురం యేర్పడింది.ఈ రోజు తను చెప్తే నేను ఓదార్చే ప్రయత్నంలో నువ్వు రావటం జరిగాయి". కరుణ సడెన్ గా లావణ్య కాళ్లకు చుట్టుకుని"యింత జరిగాకకూడా మాతో ఎలా మాట్లాడుతున్నావక్కా?నాకయితే చచ్చిపోవాలనివుంది"."పిచ్చిదానా యిటువంటి సంఘటనలే మన ప్రమేయం లేకుండా జరిగేవి.సరే యీ రాత్రివేళ ఒక్కసారిగా పరిష్కారం దొరకదు.రేపు సాయంత్రం వరకు ఆలోచించి మనం ఏం చెయ్యాలన్నది నిర్నయించుకుందాం".కుర్చీని వెనక్కి తిప్పి నడుపుకుంటూ వెళ్లిపోయింది.ఇద్దరూ బొమ్మల్లా చేష్టలుడిగి నిలుచున్నారు.

మర్నాటి సాయంత్రంముగ్గురూ రఘునాధరావుగారి గదిలో సమావేశమయ్యారు,అక్కడయితే నౌకర్లువచ్చే ప్రసక్తి వుండదు.లావణ్య చెప్పడం ప్రారంభించింది,"చందూ! కృతజ్ఙతా భావంతో తొందరపడి నాన్నకి మాట యిచ్చావు.హడావుడిగా జరిగిన యీ పెళ్లి మనిద్దరిలోను ఎటువంటి మధురోహలూ కలుగలేదు.ఎంతసేపూ నాన్న కోరిక మన్నించితే ఆయన ఆరోగ్యం కుదుటపడుతుంది యివే అందరి మనసులలో మెదిలిన వూహలు. అనుకున్నదొకటయితే జరిగినది మరొకటి.పెను తుఫాను వచ్చి అన్నీ కుదిపేసినట్లు నాన్న మరణం అందర్నీ తలో దిక్కు చేసింది.మళ్లీ తొందరపాటుతో మరొక తప్పు చేయకు.నానుంచి విడాకులు తీసుకుని కరుణని పెళ్లి చేసుకో పుట్టబోయే బిడ్డకు తండ్రిగా నిలువు.వీటికి కావలిసిన కాగితాలు మన లాయర్ని పిలిచి వారంలో తయారు చేయించుతాను.ఈ యింట్లో మీ యిద్దరూ ఎప్పటిలా వుండండి.మా తాతగారికి వూటీలో ఎస్టేటు ఒక బంగళా వున్నాయి యిన్నాళ్లు అలనా పాలనా లేకపోయింది.కొన్నాళ్లు మనుషులని పెట్టి యిక్కడిలాగానే నాకు సదుపాయంగా ఆ యింటిని మార్చి అక్కడే వుంటాను.ప్రశాంతత ప్రకృతి రమణీయతలను నారంగుల కుంచెతో పదిల పరుస్తాను. నేను మీ కళ్లెదుటే వుంటే రోజూ మీకు నరకప్రాయంగా వుంటుంది.ఎలాగు బిజినెస్ వ్యవహారాలు చూస్తున్నావు కాబట్టి ఎస్టేట్ వ్యవహారాలు కూడాచూడు.నాన్న బెంగుళూరు వెళ్లినప్పుడు వూటీ వెళ్లి ఆ పనులు కూడా చూసేవారు.యిప్పుడు యీ పనులన్నీ నువ్వే చూడు.నీ వ్యవహార దక్షత మీద నాకెప్పుడూ నమ్మకమే.కరుణా రేపు డాక్టరుని పిలిపిస్తాను ఆమె సలహాలు పాటించి ఆరోగ్యం కాపాడుకొని పండంటి బిడ్డని కనాలి". లావణ్య మాటలు విన్న కరుణకి ఆమెలో అక్క అమ్మ స్నేహితురాలు అందరూ కనుపించారు."అక్కా! నీ విశాల హృదయం ముందు మేము చాలా చిన్న మనుషులుగా అనిపిస్తోంది తుఫాను బారినుండి కాపాడినన్ను తీసుకు వస్తే నీ బ్రతుకులోనే తుఫాను కలుగజేశాను"."కరుణా!యీ మాటలకింక చోటు లేదు.ముందుగా నిన్ను తేబట్టి నీ భర్త నిన్ను వెతుక్కుంటూవచ్చాడు.పదండి యిక భోజనాలు చేద్దాం".చందు"లావణ్యా!నువ్వు వూటీలో ఒక్కర్తివీ ఎలా వుండగలవ్"? అడిగాడు."నాకు ఒంటరితనం లేదు,నా అభిరుచులే నా సహచరులు నాన్న జ్ఙాపకాలే నాకు మార్గదర్శకాలు మీ యిద్దరి స్నేహం నాకు బలం.ఇక మీ పిల్లలు నేను జీవించడానికి ప్రేరణలు.ప్రతి సంత్సరం వేసవి కాలంలో నాతో గడపడానికి మీ యిద్దరూ పిల్లలతో వస్తేనేను ఒంటరినెలా అవుతాను?ఆకలిగా వుంది పదండి".ఆమె గుండె నిబ్బరానికి ప్రదర్శించిన హుందాతనంకి మనసులోనే జోహార్లర్పించారు.

కాల చక్రం గిర్రున తిరుగుతోంది,చందూ కరుణలకు ముందు అమ్మాయి రెండు సంత్సరాల తరువాత అబ్బాయి పుట్టారు.అనుకున్న ప్రకారం ప్రతి సంత్సరం కుటుంబంతో సహా వూటీ వెళ్లేవారు. వాళ్లున్న పది పదిహేను రోజులూ సందడిగా వుండేది.పిల్లలు లావణ్యను పెద్దమ్మా అని పిలిచేవారు.అమ్మాయి జ్యోతి వచ్చినప్పుడల్లా లావణ్య వేసిన కొత్త పైంటిగులు చూడటం వాటిని జాగ్రత్త పెట్టడం వాటి మీద చర్చకూడా చేస్తుండేది.అబ్బాయి రఘు మితభాషి అడిగినదానికి మాత్రమే జవాబిచ్చేవాడు.లావణ్య యాభైయవ సంత్సరం పుట్టిన రోజు జరపడానికి ప్రత్యేక ఏర్పాట్లతో వచ్చారు చందూ కుటుంబం. 
ఆ సారి జ్యోతి హడావిడి ఎక్కువగా వుండెను.వూటీలో ఆర్ట్ గేలరీ హాలు బూక్ చేసింది. అందులో లావణ్య పైంటింగ్సు ప్రదర్శన ఏర్పాటు చేసింది.లావణ్య ఆశ్చర్య పోయింది "ఎందుకమ్మా ఈ పబ్లిసిటీ యివన్నీ నా సంతోషం కోసం వేసుకున్నాను".అంటే "పెద్దమ్మా నీ సంతోషంలో పాలుపంచుకునేందికు ఎంతమంది వస్తారో చూడు.చిత్రాలని చూసి వారు వెలిబుచ్చిన అభిప్రాయాలు విన్నాక ఈ మాట అడుగు".చిత్ర ప్రదర్శనకి చాలా మంది వచ్చారు.ప్రతి చిత్రంలోను తన మనోభావంలో అనుకోని భావాలు కూడా వాళ్లు వెలిబుచ్చటం ఆశ్చర్యమనిపించింది.ఇన్ని చిత్రాలని వేసిన లావణ్యని చూసి వారు అబ్బుర పడ్డారు.

లావణ్య చక్రాలకుర్చీ నడుపుకుంటూ వొక ముసలాయన వద్ద ఆగింది.అతనికి యెనభై సంత్సరాలు వుండొచ్చు,అరగంట నుండి వొక్క చిత్రాన్నే చూస్తున్నాడు. ప్రక్కనున్న వాటిమీద ధ్యాసే లేదు.అతను చూస్తున్న చిత్రంలో రంగు రంగుల పూలతోటలో ఒక చెట్టుకి వేసిన వూయల వూగుతున్న పదహారేళ్ల అమ్మాయి చిత్రం.గాలికి ఎగురుతున్న ముంగురులు పావడా కుచ్చెళ్లు కదులుతున్నట్లు ఆమె ముఖంలో కాంతి చక్కగా కుదిరాయి.తను అనుభవించలేని ఆనందాలు తన చిత్రాలలోని పాత్రలద్వారా ఆస్వాదించేది.అయితే అదే చిత్రాన్ని అంత తదేకంగా చూస్తున్న ముసలాయనని పలకరిస్తూ,"క్షమించండి మీరు చాలా సేపటి నుంచి ఒక్క చిత్రాన్నే చూస్తున్నారు ఏమిటి అందులో ప్రత్యేకత"?అడిగింది లావణ్య.అతను మాట్లాడకుండా జేబులోంచి పర్సు తీసి అందులోచి ఒక ఫొటో తీసి చూపించాడు.ఆశ్చర్యపోయింది,ఆ ఫొటోలో అమ్మాయినే చిత్రీకరించినట్లుంది.తరువాత పరిచయాలయ్యాయి.లావణ్యే ఆచిత్రకారిణి అని తెలుసుకుని ఆమె కుడిచేతిని తన చేతుల్లో తీసుకుని నిమురుతూ ఎంత జీవకళ వుట్టి పడుతోంది చిత్రంలో నా కూతురు.ఆశ్చర్యపోవడం లావణ్య వంతయింది."నేనెప్పుడూ ఎవరినీ చూసి చిత్రాలు గీయలేదు.ప్రకృతి అందాలు చిత్రీకరిస్తూ నా వూహనిబట్టి గీసే చిత్రాలే తప్ప వ్యక్తుల చిత్రాలు స్కెచ్ లు ఎప్పుడూ గీయలేదు"."అలా చూసే అవకాశంకూడా లేదు. మా అమ్మాయి చిన్నప్పుడే మా కుటుంబం ఆస్ట్రేలియా వెళ్లిపోయాం. అక్కడే చదువు పూర్తి చేసి విదేశీయుడిని పెండ్లాడి అక్కడే సెటిల్ అయిపోయింది.మా ఆవిడ అ షాకు తట్టుకోలేక మంచం పట్టింది.ఒక్క కూతురికోసం ఆ దేశంలోనే వుందామన్నా యిష్టపడలేదు.యిక్కడికి వచ్చిన మూడు సంత్సరాలకి చనిపోయింది.అప్పటినుండి వొంటరి బ్రతుకే,అయినా యిటువంటి ఎగ్జిబిషన్లు గానకచేరీలు ఎక్కడున్నా హాజరవుతుంటాను". "సారీ!అంకుల్ మీ మనసుకి కష్టం కలిగించాను". "లేదమ్మా ఎవరయినా మాట్లాడితేనే కదా గతం గుర్తుకి వచ్చేది. నిన్ను కలుసుకున్నాక నా మనసుకి ఏదో ప్రశాంతత దొరికినట్లుగా వుంది.మన పరిచయం యింతటితో ఆగకుండా ప్రతి వారం మీ యింటికి వచ్చి నీతో కాసేపు మాట్లాడి నాలో కాస్త కాస్తగా వుత్సాహం నింపుకుంటాను"."తప్పకుండా అంకుల్ నా విజిటింగ్ కార్డు తీసుకోండి". ఈలోపున జ్యోతి వచ్చి"పెద్దమ్మా" అంటూ ఏదో చెప్పబోయి ప్రక్కనున్న ముసలాయనని చూసి "తాతయ్యా" ఇద్దరూ పలకరించుకుంటూంటే లావణ్య"మీకు యింతకు ముందే పరిచయం వుందా?నాకు తెలియదే!""గత సంత్సరం బొటానికల్ గార్డెన్ లో కలుసుకున్నాం,నీగురించేకాబోలు చాలా చెప్పింది.ప్రతి సంత్సరం వస్తామని ,నా అడ్రెస్స్ తీసుకుని యీ సారి నన్ను కలుసుకుందికి వస్తానంది.ఏం జ్యోతీ"?"ఈ వారం అంతా పెద్దమ్మ బర్త్ డే సందర్భంగా బిజీ తాతయ్యా. ఒకలా చేద్దాం రేపు మీరు మా యింటికి అదే పెద్దమ్మ యింటికి వుదయం పది గంటలకి వచ్చేయండి.అందరం సరదాగా గడిపి భోజనాలు చేద్దాం.సరేనా తాతయ్యా"?అంది జ్యోతి.ఎగ్జిబిషను అయాక అందరూ యిల్లు చేరుకున్నారు."పెద్దమ్మా నేకెలా అనిపించింది? చిత్రాలు నీ కోసమే గీసుకున్నా అందరితో ఆనందం పంచుకోవడంలో థ్రిల్ల్ వుందికదా"! "అవును జ్యోతీ నిజంగా ఈ రోజు చాలా సంతోషంగా వుంది,ముఖ్యంగా ఆ ముసలాయన కళ్లల్లో ప్రతిఫలించిన సంతోషం చెప్పలేను".సరే అలిసిపోయావు రెస్టు తీసుకో రేపు యింకొక ప్రొగ్రాం వుంది"."నా చేత గాన కచేరీ చేయించవు కదా"?"తినబోతూ రుచులేందుకు పెద్దమ్మా నిన్ను యిబ్బంది పెట్టనుగాని సర్ప్రైజ్"!నవ్వుకుంటూ తన గదికి చేరుకుంది లావణ్య.

మర్నాడు తొమ్మిదినుంచే అందరినీ సమావేశ పరిచింది.లావణ్యకి మంచి చీరకట్టి కుర్చీ నడిపించుకుంటూ వచ్చింది."పెద్దమ్మా యీ వయసులో కూడా యింత అందంగా వున్నావు యంగ్ గా వున్నప్పుడు యింకా ఎంత అందంగా వుండేదానివో""చాల్లే పిచ్చి మాటలు"అంది లావణ్య మురిపెంగా. హాలులో చందూ కరుణ రఘు కూర్చుని వున్నారు. 
హాలంతా పూల బొకేలతో అలంకరించి వుంది."ఈ హడావిడంతా ఏమిటి?నేనేదో నా వూహాలోకాల్లో బ్రతుకుతుంటే అప్పుడే నాకు యాభై సంత్సరాల వయసని గుర్తు చేస్తున్నారా మీరంతా". "యాభై సంత్సరాల వయసులోకూడా యింత వుత్సాహంగా గడపగల శక్తి నీకే వుంది మెనీ మెనీ హేపీ రిటర్న్స్ ఆఫ్ ది డే!" అంటున్న కరుణ చేతులు పట్టుకుని "థేంక్స్"అంది లావణ్య. నౌకరు వచ్చి"అమ్మగారూ ఎవరో పెద్దాయన మీ కోసం వచ్చారు" వెంటనే "మన ఫ్రెండు తాతయ్య అయి వుంటారు లోపలికి తీసుకురా"అంది జ్యోతి.ఒక చక్కని పుష్ప గుచ్ఛం తీసుకుని లావణ్య వద్దకు వచ్చి "జన్మదిన శుభాకాంక్షలమ్మా'తలవంచి నమస్కరించి "అంకుల్ యిన్నాళ్ల తరువాత నా తండ్రి వచ్చి నన్నాశీర్వదింనట్లుగా వుంది"అనగానే లావణ్య తల నిమురుతూ"భగవంతుడు నిన్ను చల్లగా చూడాలి!"అందరి కళ్లు చమర్చాయి.జ్యోతి అంది భగవంతుడు చల్లగా చూస్తున్నాడు కాబట్టే వూటీ యింత చల్లగా వుంది"."అల్లరి పిల్లా"అన్నారు.అందరి వద్దకు తాతయ్యను తీసుకెళ్లి నా ఫ్రెండు తాతయ్య పేరు ఆనందరావు,మా అమ్మా నాన్నా మా తమ్ముడు మా పెద్దమ్మతో నిన్ననే పరిచయమైంది కదా కూర్చోండి తాతయ్యా "అంటూ మర్యాద చేసింది.అందరికీ డ్రింక్సు యిచ్చింది.

వెండి పళ్లెంలో గోల్డెన్ పేపరుతో గిఫ్ట్ పేక్ చేసిన పేకెట్ చిన్న కత్తెర పెట్టి తెచ్చింది.లావణ్య చూసి "ఏమిటమ్మా యిది"?"నీ స్వహస్తాలతో తెరువు పెద్దమ్మా యిది నీ కోసమే ప్లీజ్!"అంది "సరే" అంటూ నవ్వుతూ ఓపెన్ చేసింది.పుస్తకం అందమైన కవరు పేరు చదవగానే ఆశ్చర్య పోయింది లావణ్య చిగురించిన పందిరి ఈ వాక్యం తనదే రచయిత్రి పేరు కోసం తిరగేసింది. ప్రియమైన పెద్దమ్మకి సమర్పించుకుంటున్న చిరు కానుక రచయిత్రి కుమారి జ్యోతి."ఏమిటీ యిది నువ్వు రాశావా"?కాళ్లకు నమస్కరించి "పెద్దమ్మా నీ సహవాసంలో ఈ పాటి ప్రావీణ్యం అబ్బక పోతే బాగుండదు"."నీకు ఈ సబ్జెక్టు ఎక్కడదొరికింది?" అంది కుతూహలం ఆపుకోలేక.తాతగారి గదిలో బుక్ షెల్ఫ్ లోని తీరం చేరని నావ నవలులో దొరికింది.కరెంటు షాకు తగిలినట్లయింది లావణ్యకి.అప్పుడు గుర్తుకొచ్చింది,వివాహ బంధం తెగిపోయి అక్కడి పనులన్నీ పూర్తిచేసుకుని వూటీ వచ్చేసే ముందు రోజు రాత్రి నిద్ర పట్టక చదుతున్న నవల సగంలో ఆపి కాగితం కలం తీసుకుని రాయటం మొదలు పెట్టింది.తనభావాలు అనుకోకుండానే అక్షర రూపం ధరించాయి.

చిగురించిన పందిరి
మల్లె తీగను తెచ్చి మక్కువగ పెంచి
ఆలంబన ఏర్పరచ నెంచి
అందమైన పందిరి వేసి
అల్లుకునే తరుణంలో మల్లె తీగ మాడి పోయె
పందిరి మాత్రం పచ్చని చిగురులు వేసె
మనిషి బ్రతుకు ప్రతి క్షణం సమరం
విధి లీల ముందు తప్పక తల వంచుతాం

ఈ చిన్ని భావల కాగితాన్ని నవలలో పెట్టిన లావణ్య మళ్లీ వులిక్కి పడింది. తన పెళ్లి ఫొటోలన్నీ కాల్చేయగా ఒక్క ఫొటోని కాల్చే సాహసం లేకపోయింది.పెళ్లి ముస్తాబులో దండలతోనున్న చందూని తనని తండ్రి యిద్దరి భుజాల మీద చేతులు వేసి దగ్గరగా పట్టుకున్నారు. తన ప్రక్కన కరుణ నిలుచుంది.ఆ ఫొటో చూస్తే తండ్రి తనకి అండగా వున్న భావన కలిగి అతని ఆఖరి ఫొటో కాల్చ లేక కవిత రాసిన కాగితంతోపాటు జతచేసి నవలలో వుంచింది. నవల ఎలాగూ పూర్తిగా చదవలేదు తనతో తీసుకు వెళ్దామన్న వుద్దేశంతో బుక్ షెల్ఫ్ మీద వుంచింది వుదయం బయలుదేరే హడావిడిలో దాని విషయమే మర్చిపోయింది.ఆయింటిలో పుస్తక పఠనం మీద ఆసక్తి తన ఒక్కర్తిదే అందు నుంచి వాటిని సర్ది పెట్టి వుంటారు.అయినా జ్యోతి చేతిలో ఎలా పడింది?సందేహాన్ని బయట పెట్టింది లావణ్య.జ్యోతి అంది"గత సంత్సరం పుస్తకాలన్నీ దులిపి సర్దిస్తున్నాను. నవల చేతిలోంచి జారి కింద పడటంతో ఈ చిన్ని కవిత ఒక ఫొటో బయటపడ్డాయి. చూసి ముందు ఆశ్చర్యపోయాను పెద్దమ్మ అనబడే వ్యక్తి పెళ్లికూతురు నాన్న పెళ్లికొడుకు మీ యిద్దరి మధ్య తాతగారు నిలుచున్నారు అమ్మేమో సింపుల్ గా ప్రక్కన నిలుచుంది.ఆ రెండూ భద్రం చేసి అమ్మ నాన్నలని కూర్చోపెట్టి విషయం అడిగాను.అమ్మ నాన్న దాచకుండా అంతా చెప్పారు అలా యీ విషయం బయట పడింది.నీ త్యాగ నిరతి విన్నాక నాలోకూడా రచయిత్రి ఒళ్లు విరుచుకుంది. ఈ కధ రాసి నీ కవిత శీర్షికనే పేరు పెట్టాను. నేను అపరాధం చేసి వుంటే క్షమించు పెద్దమ్మా!" అంది జ్యోతి తల దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది."యిక మన కుటుంబంలో అపరాధాలు లేవమ్మా, నేను రాసుకోలేనిది నీవు రాశావు". "ఒక్క సందేహం పెద్దమ్మా తీర్చకపోతే నా మనసు సర్ది చెప్పుకోలేకపోతోంది. స్త్రీకి జీవితంలో వివాహం అనేది ముఖ్య ఘట్టం అది జరిగిన కొద్ది రోజులకే పెళ్లి ఎంత సూక్ష్మంగా చేసుకున్నావో అంత సూక్ష్మంగా త్యజించావు.ఎలా చెయ్యగలిగావు పెద్దమ్మా"?"కారణం నాకు తెలుసు"అన్నాడు రఘు.అందరూ ఆశ్చర్యపోయారు ఎప్పుడూ నోరు మెదపని వాడు యింత పెద్ద సబ్జెక్టు తనకి తెలుసునని ఎలా చెప్తున్నాడని.లావణ్య కూడా చాలా కుతూహలంగా "చెప్పు నాన్నా నీకేం తెలుసు"?అంది. "పెద్దమ్మా నువ్వు వేసిన చిత్రాలన్నీ చూశాను,తాతగారు పోక ముందు వేసినచిత్రాలు కూడా గమనించాను.అన్నిటిలో ప్రకృతి తోటలూ పూవులు జలపాతాలు కొండలు జింకలు పక్షులు అమ్మాయిలు తప్ప ఒక్క మేల్ కేరక్టరు కూడా నీ చిత్రాల్లో లేదు.జీవితంలోకి వచ్చినా అంత తొందరగానూ ఫేడౌటు అయిపోయాడు అదీ సంగతి".అంతటి సిరియస్ మేటర్ని అంత సింపుల్ గా చెప్పడంతో అందరూ నవ్వు కున్నారు.

"నిజమే రఘూ నా వూహల్లో ఎప్పుడూ ప్రకృతి దృశ్యాలే తిరుగుతుండేవి.నడవలేని కాళ్లిచ్చిన భగవంతుడు పరుగులుపెట్టే మనసిచ్చాడు.ఆమనసుతో నేను చేయలేని పనులన్నీ నా చిత్రీకరణలో చోటు చేసుకునేవి.నా చిత్రాల్లో నేను తోటల్లో పరుగెత్తాను కాలువలో ఈతలు కొట్టాను నాట్యాలు చేశాను.నా చిత్రాలన్నీ నా మనసు చర్యలు.నా కాళ్లు నన్ను కదలనివ్వకపోయినా నా కుంచెతో అన్నీ సాధించాను.నా మనోఫలకంమీద పురుషుని నీడ కూడా కదల లేదు.చిన్నతనంనుంచి ఒంటరివాళ్లమంతా ఒక చోట చేరాం. జంటల మనోభావాలు గమనించే అవకాశం లేకపోయింది.మానాన్న నాకు తల్లి తండ్రి గురువు దైవం లాగా బ్రతికాను.అతని మరణం నన్ను అంధకారం, శూన్యంలోకి నెట్టినట్లయింది.ఆ వెలితి ముందు మిగతా విషయాలు చాలా అల్పమైనవిగా అనిపించాయి. చందూ కరుణలుకూడా మాయింటిలో నాతో పెరిగారు వారి క్షేమ కోరడంకూడా నా ధర్మంగా భావించాను.ఇందులో త్యాగం అన్న పెద్ద పేరు అనవసరం.అందరం కలిశాం సంతోషంగా గడుపుదాం.మనమంతా ఒక కుటుంబ సభ్యులం.పిల్లలూ మీ మనసుల్లో అనవసరమైన ఆలోచనలు పెట్టుకోక ఎప్పటిలా వుండండి.చందూ! నువ్వు వచ్చినప్పటినుండి మూడీగా వుంటే బిజినెస్ ఒత్తిడి అనుకున్నాను.నీసంగతి పిల్లలకి తెలిసిపోయిందని చింత పడుతున్నావ?వాళ్లకి జ్ఙానం తెలిశాక తెలియడం మంచిదే.మంచి చెడు గ్రహించే శక్తి వాళ్లకి వుంటుంది.అంకుల్ బోరయ్యారా?మా గొడవలతో"?"అల్లాగనకమ్మా మీ అనుభవాలనుండి నేర్చుకోవలసినది చాలా వుంది.మీ ఒంటరి సంఘంలో మరొక సభ్యుడిని చేరాను.అన్నట్లు ఈ బంగళా ఎస్టేటుదార్ చెన్న కేశవరావుగారిది అని గుర్తు"."ఔను అంకుల్ మా తాతగారే"."అంటే నువ్వు రాజ్యలక్ష్మి కూతురివా?"కుతూహలంగా అడిగారు."అవును అమ్మమ్మకి తాతగారికి అమ్మ ఒక్కతే సంతానం".ఆనందరావు లేచి వచ్చి లావణ్య తలనిమురుతూ"మీ ఆమ్మా నేనూ కలిసి చదువుకున్నాం.ఒకటి రెండుసార్లు ఈ బంగళాకి వచ్చాను.ఏమిటో అందరి జీవితాలలోను విషాదం చోటు చేసుకుంది.ఇలాటి కలయిక చాలా అరుదనుకుంటాను.నీతో అనుబంధం పెంచుకుందుకు సందేహించనవసరం లేదు ఎనభై ఏళ్ల తరువాత అనుబంధాలేమిటని ఆశ్చర్యపోతున్నారా అందరూ"?"లేదు అంకుల్ ఒక్క రోజైనా అనుబంధం అనుబంధమే.పోనీండి అంకుల్ అందరూ పిల్లల్ని దత్తత చేసుకుంటారు నేను మిమ్మల్ని తండ్రిగా దత్తత చేసుకుంటాను".అంది లావణ్య ఆనందరావు చేతిని తన చేతిలోకి తీసుకుంటూ."పెద్దమ్మా పందిరికి మరో రాట చేర్చుకుంటున్నావా"?అడిగాడు రఘు"ఈ రాట చిగురించదు బాబూ కంగారుపడకు"అన్న ఆనందరావు మాటలతో వాతావరణం తేలికయింది.అందరూ విందు భోజనానికి భోజనాల హాలుకి కదిలారు.

2 comments:

అరుణ్ కుమార్ ఆలూరి said...

కథ మొత్తం ఒకే పేరాలో వుందటం వలన చదవడనికి ఇబ్బందిగ వుంది.. పేరాగ్రాఫ్‌లు మారుస్తూ వుంటే ఆ ఇబ్బంది వుండదు..

వీలైతె కథకు 5 నుంచి 6 పెయింటింగులు కథకు తగ్గవి గూగుల్‌లో వెతికి కథతో పాటు పెడితే మరింత బాగ కనిపిస్తుంది అని నా అభిప్రాయము..

Hymavati said...

Thanks for your comments & suggestion. Which site do you use for typing telugu characters?