24 May, 2014

కోడలు దిద్దిన కాపురం

          వీరభద్ర చౌదరి అంటే వూర్లో అందరికీ మంచి గౌరవాభిమానాలున్నాయి.అతనికి పదవి పవరు లేవుగాని మంచి మనిషి.సంపన్న కుటుంబీకుడు.నాలుగు బస్సులు రెండెకరాల మామిడి తోట వందెకరాల ఫలసాయమిచ్చే భూమి వున్నాయి.లంకంత యిల్లు రోజూ వచ్చే పోయే మనుషులతో ఎప్పుడూ సందడిగా వుంటుంది.

సుకుమార్ మొదటి భార్య సంతానం.తాత అమ్మమ్మ వద్దనుండి చదువు పూర్తి చేశాడు.మొదటి భార్య గతించిన అయిదేళ్ళకు పద్మావతిని రెండో పెళ్ళి చేసుకున్నాడు చౌదరి.పెళ్ళయిన ఏడాదికి శ్రీకర్ పుట్టాడు.కానుపు కష్టమై పట్నం తీసుకెళితే సిజేరియన్ చేశారు.అప్పటినుండి తనకేవో బాధలున్నాయని మంచం దిగడం మానేసింది.కదలకుండా పనివాళ్ళమీద పూర్తిగా ఆధారపడింది.యింట్లో పాలేరు వంటమనిషి పిల్లడిని చూసుకుందికి పై పనులకి వేరే వేరే మనుషులుండటంతో రెండేళ్ళలో బి పి షుగరు ఒంట్లోకి చేరి మనిషి రెండింతలయింది.

         చౌదరిగారికి వచ్చే పొయే వారితో వ్యవహారాలు బంధు బలగం,యింట్లో ఎంత సామాను వస్తున్నాది ఎంత ఖర్చవుతోంది ఎంత తింటున్నారు ఎంత పారబోస్తున్నారు లెక్క వుండేదికాదు.ఈ పరిస్థితిని ఆసరాగా తీసుకుని పద్మావతిని పలకరించిపోడానిక్ రోజూ లెక్కలేకుండా అభిమానులు వచ్చి నాలుగు మాటలాడి తిన్నవి తిని కొంత పొట్లాం కట్టుకు పోయేవారు.

    మామగారివద్దనుండి (సుకుమార్ తాతగారు) ఒకసారి వచ్చి చూసిపొమ్మని కబురు వచ్చింది.పెద్దవాళ్ళు తన కొడుకుని పెంచి పెద్ద చేసిన తాతగారు  అని వెంటనే బయలుదేరి కాకినాడ వెళ్ళారు.
"రావయ్యా రా! అంతా క్షేమమేనా? యిదిగో అల్లుడొచ్చాడు మంచినీళ్ళు తీసుకురా"భార్యని కేక వేశారు.
"బాగున్నారా?చిన్నబ్బాయి పద్మావతి కులాసానా?'
"అంతా బాగున్నాం సడెన్ గా కబురు చేస్తే ఏమైందా అని కంగారు పడ్డాను."
"మరేం లేదయ్యా సుకుమార్ అగ్రికల్చరల్ ఎమ్మెస్సి అయిపోయింది.వేలెడంత పిల్లడిని యింత వాడిని చేశాం మేం బ్రతికుండగా వాడికి పెళ్ళి చేస్తే చూద్దామని ఆశ ఏమంటావ్?"
తప్పకుండా సరైన సంబంధం చూడాలికదా!"
"మా పక్కింట్లో మన వాళ్ళే వున్నారు. అమ్మాయి ఎమ్మె ఎకనమిక్సు చేస్తోంది. ఆఖరి పరీక్షలు మూడునెలల్లో పూర్తి అవుతాయి. అమ్మాయి చక్కగా వుంటుంది.మన సుకుమార్ కి ఈడు జోడు సరిపోతుంది."

    "మీరు పెద్దవారు అంతలా చెప్పాలా?సుకుమార్ నచ్చుకుంటే అందరికీ అనుకూలమైన ముహూర్తాలు పెట్టుకుందాం."
"వివాహ ప్రసక్తి తేలేదు గాని సుకుమార్ అమ్మాయిని తరుచు చూడటం మాట్లాడటం జరిగాయి.ఒక్కసారి నువ్వు చూసి సరేనంటే బాబుని ఏమాట అడుగుదాం.""సరే' అనగానే పనివాడిని పిలిచి "సూరీ! నీరజమ్మని ఒక్కసారి రమ్మన్నానని చెప్పు."
"అంత హడవిడెందుకు మామయ్యా తాపీగా మనమే వెళ్ళి చూద్దాం."
అదేం కాదులే జస్ట్ ప్రీవ్యూ అన్న మాట.వున్న పాటుగా వచ్చినా అమ్మాయి ఎలా వుంటుందో చూద్దువుగాని."
మాట పూర్తి కాకుండానే నీరజ ప్రవేశించి,"ఎందుకు తాతయ్యా పిలిచారూ?"
ఏం లేదమ్మా మీ నానమ్మ సున్నుండలు చేసింది నీకు పెడదామని,అన్నట్లు యితను మా అల్లుడు అదే సుకుమార్ నాన్న."
"నమస్కారమండి."
చౌదరి రెప్ప వెయ్యడం మరిచి పోయాడు.బంగారు తీగలా సన్నగా పొడవుగా వుంది.బారెడు జడ ఆకర్షణీయమైన సోగ కళ్లు నవ్వితే సొట్టలు పడే బుగ్గలు,అలంకరణ లేకున్నా విలక్షణమైన సౌందర్యం ఆమెలో వుట్టి పడుతోంది.సుకుమార్ కి సరైన జోడీ అనిపించింది.కళ్ళతోనే తన అంగీకారం తెలియ జేశాడు మామగారికి.

సాయంత్రం సుకుమార్ తో పెళ్ళి ప్రస్తావన తెచ్చారు.ముందు యిపుడేనా అని నసిగాడు.తాతగారు హాస్యం ఆడేరు"అల్లుడొచేదాకా అమావాస్య ఆగదు నాన్నా, చక్కని అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలంటే తొందర పడవలసిందే."

మీ యిష్టం తాతయ్యా పెద్దవాళ్ళు మీకేది మంచిదనిపిస్తే అదే నిర్ణయించుకోండి నాకేమీ అభ్యంతరం లేదు."

మర్నాడే నీరజ తల్లి తండ్రులతో అన్ని విషయాలు మాట్లాడుకున్నారు. అమ్మాయి పరీక్షలయేలోపున తమ వూరు వచ్చి నిశ్చితార్ధం చేసుకుందికి,పరీక్షలయాక పెళ్ళి చేసేటట్లు నిర్ణయించుకుని వూరికెళ్ళారు.

యింటికి వచ్చి వివరాలనీ చెప్పి నీరజ ఫొటో పద్మావతికి చూపారు. కనులు చెదిరే అందం చూసి మతిపోయినా "అర్భకంగా వున్నట్ట్లుంది" అంటు నసిగింది.

"ఫరవాలేదు మనింటి తిండి వంట పడితే బొద్దుగా తయారవుతుంది"సమర్ధించారు చౌదరి.

పదిహేను రోజులనాడు నిశ్చితార్ధం జరిపించారు. చౌదరి గారింట శుభకార్యం పెద్ద ఎత్తున చేశారు.

నీరజ పరీక్షలయిన మూడు నెలలకి వివాహం జరిగింది.కొత్త కోడలు గృహప్రవేశం వ్రతం అయాక కులూ మనాలి తిరిగి రమ్మని కొత్త దంపతులని పంపారు.  

హనీమూన్ నుంచివచ్చేసరికి కొడుకు కోడలి గది మోడిఫై చేయించారు.వచ్చిన పదిహేను రోజులయినా యింట్లో కొత్త కోడలిని కలుసుకోవటానికి వచ్చే మనుషుల సందడి తగ్గలేదు.కుటుంబ సభ్యులు తనతో కలిపి అయిదుగురు,యింట్లోనే వుంటూ పనిచేసే మనుషులు అయిదుగురని  నీరజకి వచ్చిన రోజే తెలిసింది.

రోజూ రకరకాల వరుసలు కలుపుకుంటూ వస్తున్న యీ బంధుకోటి ఆదరాభిమానాలు జీర్ణం కావటం లేదు.టిఫిన్ టైములో కొందరు, భోజనాల సమయంలో కొందరు సాయంత్రం అల్పాహారంవేళకి కొందరు.ఎటొచ్చీ రాత్రి భోజనాల టేబిలు వద్ద చౌదరిగారు నీరజ తప్ప ఎవరూ వుండరు.పద్మావతి గదిలోనే భోజనం ముగించుకుని నిద్రపోతుంది.సుకుమార్  తరుచు స్నేహితులతో బయట తింటాడు.శ్రీకర్ సినిమాకో స్నేహితులవద్ద పనుందనో సగం రోజులు భోజన సమయంలో బయటే వుంటాడు.రాత్రి పది దాటాక వచ్చి భోంచేసి నిద్రపోతాడు.

యిలా 'ఎందుకు?' 'ఏమిటి?' అడిగే దాతలు లేరు.నీరజ అంత మంది మధ్యలో కూడా ఒంటరిగా భావించేది.కొత్త వాతావరణం కొత్త బాంధవ్యాలు వాళ్ళ మనస్తత్వాలు అర్ధమయేదాకా వేచి చూడటం తప్ప చేయ గలిగింది లేదు.
భర్తని అడిగింది "రోజూ స్నేహితులంటూ బయట తిరిగే బదులు మన తోటలూ పొలాలూ ఏ స్థితిలో వున్నాయో చూసి రావచ్చుకదా?"

"దేవిగారి ఆజ్ఞ బాగానే వుంది,యివన్నీ యిన్ని సంవత్సరాలై నాన్నగారే చూసుకుంటున్నారు.మధ్యలో నేను చూసేదేముంది?"
"యిన్నేళ్ళయి మామగారు చూసుకుంటున్నారు,మరి మీరు బాధ్యత పంచుకునేదెప్పుడు?అగ్రికల్చరల్ ఎమ్మెస్సి చేశారుగా ఆ పనులు మీరు షేర్ చేసుకోవడం అలవాటు చేసుకోండి.నెమ్మదిగా పని చేయడం అలవాటవుతుంది.""రాణీవారి ఆజ్ఞ శిరసావహిస్తాను.రేపే డ్యూటీలో జాయిన్ అవుతాను." అన్నాడు సవినయంగా. యిద్దరూ మనసారా నవ్వుకున్నారు.

నెల రోజులు గడిచినా పరిస్థితిలో మార్పు లేదు.ఒక రోజు రాత్రి గదిలో మంచినీళ్ళు పెట్టుకోవడం మరిచిపోయింది నీరజ.వంటింటిలోంచి మంచినీళ్ళు తెచ్చుకుందామని హాలులోంచి వెళ్తుంటే చౌదరిగారు వుయ్యాలబల్ల మీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తూ కనిపించారు.తలెత్తి టైము చూసింది ఒంటిగంట దాటింది, దగ్గరగా వచ్చి"నిద్ర పట్టలేదా మామయ్యగారూ యింత రాత్రి వేళ లేచి వున్నారు?"
కోడలి మాట వినగానే వులిక్కి పడి"ఏమీ లేదమ్మా నిద్ర రాక అలా కూర్చున్నాను"అన్నారు కంగారుగా.

ఏదో ఆలోచిస్తున్నారు అతని మనసులోని వ్యధ ఏమిటో తెలుసుకోవాలని చనువుగా ప్రక్కన కూర్చుని"నేను యీ యింటికి కోడలిగా కుటుంబ సభ్యురాలిగా కలిసిపోవడానికి వచ్చాను .ఏదయినా సమస్య వుంటే నేను చేయగలిగిన సహాయం తప్పక చేస్తాను.సంకోచించకుండా చెప్పండి మామయ్యగారూ!"అనగానే చౌదరిగారికి ఆమె అభిమానానికి ,అందరినీ తనవాళ్ళనే భావానికి ముచ్చటపడి,"సమస్య పెద్దది కాదు కాని ఎలా పరిష్కరించాలో అర్ధం కావటం లేదు." వివరంగా చెప్పడం మొదలుపెట్టారు.

"నాకున్న ఆస్థి తక్కువేం కాదు,మామిడి తోటలమీద ఆదాయం పంట మీద అదాయం సంవత్సరంలో ఒక్కసారే వస్తుంది.బస్సులమీద అదాయం రోజూ వచ్చేది.సంవత్సరంలో ఒక్కసారి వచ్చిన అదాయంలోంచి టేక్సులు కట్టడం అప్పులు తీర్చడం ఎవరికేం కావాలో కొనుక్కోవడం మరమ్మత్తులు చేయించడం జరుగుతుంది.ఈ మధ్య బస్సుల మీద అదాయం కన్న ఖర్చులే  చూపిస్తున్నారు.డీజిలు ఖర్చులు స్టాఫ్ కిచ్చే జీతాలు కాక తరుచు బస్సులు రిపైర్ చేయించాల్సి వస్తోంది.వీటికి తోడు యింట్లో రోజు వారీ ఖర్చుకి అంతూ పొంతూ లేకుండా పోతోంది.ఆర్నెలల్లో మర్వాడీ వద్ద రెండు లక్షలు అప్పు చేయాల్సివచ్చింది.యిదంతా సరైన మార్గాన ఎప్పుడు పడుతుందో? నువ్వింకా చిన్నదానివి యీ గొడవలన్నీ నీకెందుకమ్మా నిశ్చింతగా నిద్రపో."

"మామయ్యగారూ మీరు మర్చిపోతున్నారు నేను ఎకనమిక్సులో మాస్టర్ డిగ్రీ తీసుకున్నాను.మనకిప్పుడున్న ఆర్ధిక సంక్షోభం సరి చెయ్యడానికి ఒక ప్రణాళిక తయారు చెయ్యాలి.ఒక్క విషయం చెప్పండి రోజూ మనింటికి తీర్థ ప్రజలా వచ్చే బంధువులు అందరూ మనకు అంత కావలసినవాళ్ళా?"

అబ్బే లేదమ్మా! అందరూ యీ వూరివాళ్ళు దగ్గరున్న పొరుగూరివాళ్ళు. మీ అత్తగారి తరఫువాళ్ళు ఎప్పుడో వస్తారు, వచ్చినా రెండు రోజులకి మించి వుండరు.నా తరఫున ఎవ్వరూ లేరు.సుకుమార్ అమ్మమ్మ తాతగారూ సుకుమార్ వాళ్ళమ్మ పోయిన తరువాత మళ్ళీ యీ యింటికి రాలేదు.యింటికి వచ్చే బంధువులని రావద్దని ఎలా చెప్పగలమమ్మా?ఓపిక లేదని మీ అత్తగారు అన్ని పనులకి పనివాళ్ళ మీద ఆధారపడుతూంటే పెత్తనం బంధువుల చేతులలోకి పోతున్నట్లుంది."

"దీనికి ఉపాయం వుంది మామయ్యగారూ,మీరు కొన్నాళ్ళపాటు వీధరుగు మీద కొలువు తీరడం మానేయండి.ఉదయం టిఫిను తిన్నాక కోవెలకో లైబ్రరీకో వెళ్ళి రెండు మూడు గంటలు గడిపి రండి.యింట్లో చూడవలసిన పనులు నేను చూసుకుంటాను.అత్తయ్యగారు బాధపడకుంటే చాలు ఒక నెలరోజుల్లో ఈ పరిస్థితిని చక్కదిద్ద గలనన్న నమ్మకం నాకుంది."

"మీ అత్తగారి ప్రాణాలన్నీ శ్రీకర్ మీద,వాడు అలగకుండా చూసుకున్నావంటే మీ అత్తగారితో సమస్యే ఉండదు."

"సరే! డన్! మామయ్యగారూ రేపటినుండి మిషన్ స్టార్ట్!"

"జాగ్రత్తమ్మా! యివిగో ఐరన్ సేఫ్ తాళాలు."

"వద్దు మామయ్యగారూ తాళాల బాధ్యత తీసుకునేంత  పెద్దదాన్ని కాదు.నెలలో మీరెంత ఖర్చు చేస్తారో అందులో సగం డబ్బు నాకివ్వండి.అయిపోతే మిమ్మల్ని అడుగుతాను.అన్నట్లు యింకో విషయం బస్సులు రూటు మీద నడుస్తున్నప్పుడు మధ్యలో చెకింగు చేసేందుకు ఒక నమ్మకమైన మనిషిని పెట్టండి.మన కుటుంబ సభ్యులు కాకుండా, మన స్టాఫ్ కి పరిచయం లేని వ్యక్తి యీ ప్రాంతం వాడు కాకుండా చూడండి.నా వుద్దేశంలో రెండు మూడు నెలల్లో యీ సమస్య కూడా తీరిపోవచ్చు."

"చాలా రాత్రయింది నిద్రపోమ్మా రేపటినుంచి నీ పథకాలన్నీ అమలు చేద్దాం.ఆల్ ద బెస్ట్!"
ఆ రాత్రి నిద్ర లేకుండానే గడిపింది నీరజ. ఉదయం లేవగానే స్నానం చేసి దేముడికి దండం పెట్టుకుని ప్రప్రధమంగా స్టోరులో అడుగు పెట్టింది. అడవి కూడా అంతకన్నా బాగుంటుందనిపించింది. పని మనిషిని పిలిచి డబ్బాలన్నీ ఒక వరుసలో పెట్టించి పొట్లాలలో వున్నవేమిటో నోట్ చేసుకుని వాటిని కూడా వీలయినంత వరకు డబ్బాలలో సీసాలలో నింపించింది.

వంటామె స్టోరులో ప్రవేశించి నీరజని పనిమనిషిని చూసి కంగారు పడింది."మీకెందుకు చిన్నమ్మగారూ నేను చూసుకుంటాను కదా!"

"సత్తెమ్మా రోజూ టిఫినేం చేస్తావు?"

"అబ్బో ఒక టిఫిను చేస్తే ఎవరికి నచ్చదమ్మా,కనీసం రెండో మూడో చెయ్యాలి."

"ఈ రోజు పదిమందికి సరిపడా ఉప్మా చెయ్యి,రెండోది రవ్వ దోశకి కలుపుతాను వేద్దువుగాని."

పదిమందికి సరిపడా నూక నెయ్యి జీడిపప్పు తీసి సత్తెమ్మకిచ్చింది.రవ్వదోశ పిండి తయారు చేసింది.

స్టోరులో జీడిపప్పు పొట్లాలు ఎనిమిదో పదో దొరికాయి. అన్నీ ఒక సీసాలో పోసి తన గదిలో పెట్టుకుంది.
సత్తెమ్మ వచ్చి "అమ్మా ఉప్మాకి నూక సరిపోదమ్మా టిఫిను తినేవాళ్ళు పదకొండు గంటల వరకు వస్తూంటారు మరికొంత నూక యివ్వండి."

"సత్తెమ్మా! ఈ రోజు నుంచి తొమ్మిది తరువాత టిఫిను సెక్షను క్లోజ్.మా అయిదుగురు మీరంతా అయాక ఎవరైనా వస్తే టీ గాని కాఫీ గాని చేసి యివ్వు."

ఆరోజు టీఫిను తినడానికి శ్రీకర్ యిష్టపడలేదు."

"నాకీ వుప్మా రవ్వ దోశ వద్దు.'

"నీకేం కావాలో చెప్పు శ్రీకర్" అంది నీరజ.

"నాకు పెసరట్టు కావాలి."

"అంతే కదా! నువ్వు రెడీ అయి వచ్చేసరికి పెసరట్టు సిద్ధం."అంది నవ్వుతూ.పనివాడిని పంపి రెండు పెసరట్ట్లు తెప్పించి,పెనం మీద వేడి చేసి కాస్త నెయ్యి వేసి దగ్గర కూర్చుని స్కూలు కబుర్లు అడుగుతూ తినేలా చేసింది.రాత్రి మామగారి మాటలు దృష్టిలో పెట్టుకుని ఈ తురఫు ముక్కని జాగ్రత్తగా వుపయోగించుకుంటే అత్తగారితో బెడద వుండదని.
 మామగారికి సుకుమార్ కి ఎటువంటి అభ్యంతరాలూ లేవు ఉదయం టిఫిను పెడితే చాలు.అత్తగారి గదిలోకెళ్ళి"అత్తయ్యా మీరు వుప్మా తింటారా? రవ్వ దోశ తింటారా?"
"ఏదైనా ఫరవా లేదు,అన్నట్లు సత్తెమ్మ ఏమయింది?"
"వుంది నాకే కాస్త  తోచటానికి ఏదో పని కల్పించుకుంటున్నాను."

మామగారు భర్త టిఫిన్లు తిన్నాక బుద్ధిగా బయటికెళ్ళి పోయారు.అత్తగారి గదిలోకే రెండు రవ్వ దోశలు కాస్త  చట్నీ,వుప్మా పట్టుకెళ్ళి దగ్గరకూర్చుని కబుర్లు చెపుతూ ఆమె తిన్నాక ప్లేటు తీసుకెళ్ళి సింకులో వేసింది. మొదటి రోజు టిఫిన్లు యింటివాళ్ళవి అవగానే మిగతా వుప్మా వంటగదిలో పెట్టి, " సత్తెమ్మా! మీ అందరూ టిఫిన్లు తినేయండి, యెవరికి కాఫీ టీ లేదా ఏం తాగుతారో అడిగిచెయ్యి." డైనింగ్ టేబిల్ నీట్ గా తుడిపించి మధ్యలో ఫ్లవర్ వాజ్ పువ్వులు పెట్టింది.

సత్తెమ్మ కూడా పని సులువయిందని సంతోషించింది.ఆ! యిదెన్నాళ్ళ ముచ్చట? కొత్తలో అందరికీ ఉరుకులెక్కువ అనుకుంది."మధ్యాహ్నం భోజనానికి  యింకెవరైనా వస్తారా? మనమేనా?" అడిగింది నీరజ.
"ఈ యింట్లో ఎప్పుడెవరొస్తారో తెలీదమ్మా". సరే మరో యిద్దరిమనుషులకి సరిపడా వండండి,రెండు కూరలు సాంబారు ఒక పచ్చడి చాలు.పెరుగు వుంటుంది.ఏమైనా కావాలంటే వూరగాయ యింకేదయినా వేసుకుంటారు."

తరువాత పాల గురించి తెలుసుకుంది,రెండు గేదెలు నాలుగు ఆవులు వున్నాయి.ఎంతవద్దన్నా రోజుకి పదిహేనులీటర్లపాలు వుదయం పది లీటర్లు రాత్రివుంటాయని తెలుసుకుంది."సత్తెమ్మా మనందరికీ రోజుకి ఎన్ని లీటర్ల పాలు సరిపోతాయి?"

పచ్చి వెలక్కాయ గొంతులో యిరుక్కున్నట్లు యిబ్బందిగా కదిలింది సత్తెమ్మ.పనివాళ్ళంతా కుమ్మక్కై దొడ్డి దోవన సగం పాలు బయట అమ్ముకుంటూ, నలుగురు మనుషులు రాగానే పద్మావతి వద్దకెళ్ళి "అమ్మగారూ బంధువులొచ్చారు పాలుచాలవు" అనడం ఆ నెలలో పదిసార్లయినా వింది నీరజ.వెంటనే అత్తగారు వందో రెండొందలో యిచ్చేవారు.తిరిగి చిల్లర అడిగే అలవాటు అమెకు లేదు.


ఒక్కొక్కటీ అరా తీస్తూ నియంత్రించుకుంటూ పోయింది నీరజ. రోజూ మామగారికోసం వచ్చే వందిమాగధులు గుమ్మంలోకి రాగానే పనివాడు"అయ్యగారు బయటికెళ్ళేరు బాబూ"అనేవాడు.
 "ఎప్పుడొస్తారు?"
"తెలీదు బాబూ"అంతే వెనుతిరిగి వెళ్ళిపోయేవారు. వారం తిరిగేసరికి వాళ్ళు రావడం తగ్గింది.
భోజనాల సమయంలో ఎవరైనా వస్తే వూర్లో వున్నవాళ్ళయితే మంచినీళ్ళిచ్చి కాసేపయాక" మజ్జిగ తీసుకుంటారా?"అంగానే పూర్వంలా భోజనానికిలెండి భోంచేసి వెళ్ళండి అన్న మాటలు వినపడక పోవడంతో కాస్సేపటికి వేళ్ళోస్తాం అంటూ బయలుదేరేవాళ్ళు. పద్మావతి గది దాటి బయటికి రాకపోవడంకూడా నీరజ పని సులువయింది.
సుకుమార్ యిదంతా గమనించి"ఏదో పెద్ద  పథకం అమలు  చేస్తున్నట్లున్నవు? ఏదేమైనా అమ్మకి చెడుగా అనిపించకూడదు".కొంత విషయం సుకుమార్ చెవిన వేసి తను తలపెట్టిన  యజ్ఞంలో చేయూతగా వుండమని రిక్వెస్ట్ చేసింది.నవ్వుతూ సరేనన్నాడు.

నెల తిరిగేసరికి బంధువుల ,స్నేహితుల ఎద్దడి తగ్గింది.పనివాళ్ళకి పనిభారం తగ్గింది దాంతోపాటు పైరాబడి కూడా తగ్గింది.సత్తెమ్మ ఒక రోజు చిర చిరలాడుతూ పద్మావతి గదిలోకి వెళ్ళడం చూసి నీరజ ఆమె వెంటే వెళ్ళింది."ఏమిటి సత్తెమ్మా? అత్తయ్యగారిని ఈసమయంలో యిబ్బంది పెడుతున్నావు?అసలే బి పి మనిషి రెస్టు తీసుకోనీ,నీకేం కావాలో చెప్పు నేనిస్తాను." అంటూ మంచిగా బయటకు పిల్చింది.
వంతైంటి వరకు తీసుకెళ్ళి అడిగింది "నీకేంకావాలి?"
"మునపటిలా పనిలేదు."
"నిజమే మనుషులు రావటం తగ్గిపోయింది నీకు పని తక్కువయిందని జీతం తగ్గించలేదు కదా సత్తెమ్మా!దీపావళి రాబోతోంది కాస్త పిండివంటలవీ చేద్దాం మళ్ళీ పని తగులుతుంది."
నవ్వొచ్చింది నీరజకి సత్తెమ కినుకకి కారణం అదికాదు,బజారు పనిలో కమిషను బయట పాలమ్ముకునే సొమ్ము వండినవి ఎక్కువై పారపోయకుందా డబ్బాల్లో పట్టుకెళ్ళేవి యిలా ఎన్ని నష్టాలో ఆసంతృప్తిని పద్మావతి వద్ద వేరే విధంగా వెళ్ళబోసుకుందామన్న కోరిక నెరవేరనివ్వలేదు.ఏమీ మాట్లాడలేక విసవిసా వెళ్ళిపోయింది సత్తెమ్మ.
నెల గడవగానే ఖర్చుల లిస్టు పుస్తకంలో రాసి మామగారికి చూపింది.అతనిచ్చిన దబ్బులో మోడోవంతు మిగిలి పోయాయి. యిదెలా సాధ్యం అని ఆశ్చర్యపోయారు చౌదరిగారు.
"మామయ్యగారూ! మీరు కనీసం నాలుగైదు కుటుంబాల్ని పోషించేవారు.యింకొక్క రిక్వెస్టు ఈ గేదల్ని ఆవుల్ని అమ్మేసి మనం పాలెన్ని కావాలో కొనుక్కుందాం.ఎందుకంటే ఒకరోజు ఎక్కువ ఒకరోజు తక్కువ వుండదు.పైగా వాటి గ్రాసం వాటి సేవ కోసం ఒక మనిషి అతని పోషణ.పాలు ఎక్కువైననాడు మనలాంటివాళ్ళం బయట అమ్ముకోలేం.ఆ జాగా అంతా శుభ్రం చేయిస్తే దోమల బెడద వుండదు. ఆపని వాడిని వేరే పనికి వినియోగించుకోవచ్చు. వీటి కింద పెట్టే ఖర్చులో సగం కూడా అవదు మనం పాలు కొనుక్కుంటే."
నిజమే అనిపించింది చౌదరిగారికి. "ఈ పని చెయ్యాలంటే మీ అత్తగారి చెవిన వెయ్యాలి ఎందుకంటే అందులో ఒక ఆవు ఆమె పుట్టింటినుంచి వచ్చింది."
నెమ్మదిగా భార్యకి నచ్చజెప్పేరు,మిగతా పశువుల్ని అమ్మేసినా ఆమె పుట్టింటివాళ్ళిచ్చిన ఆవుని అమ్మకుండా వాళ్ళకి పంపేద్దాం అన్నారు.
"మా వాళ్ళు బాధపడితే?"
"నచ్చచెపుదాం,మనకి ఓపికలుండటం లేదు.పిల్లలేం చెయ్యగలరు?పనివాళ్ళు శలవు పెడితే యింకో మనిషి దొరకడం కష్టంగా వుంటోంది." సులువుగానే ఒప్పుకుంది.
మరుచటి నెల పూర్తయేసరికి పశువుల కొట్టం వాటి గ్రాసం ఖాళి చేసి శుభ్రంగా వెల్ల వేయించారు. వచ్చిన దబ్బుని ఖర్చుచేయకుండా మార్వాడీకి జమకట్టించింది.
బస్సుల మీద చెకింగు ఏర్పాటు చేసినవద్దనుండి రాబడి పుంజుకుంది.రిపేరు వచ్చినా చౌదరిగారే స్వయంగా దగ్గరుండి మెకానిక్ చేత రిపేర్ చేయించి పేమెంటు యిచ్చేవారు.
ఒక రోజు పచారీ కొట్టు వాడు ఎదురుపడి "బాబుగారూ మీ యింట్లో సరుకులు కొనడం తగ్గించేశారు బయట కొంటున్నారా? నెలకి పదిహేను యిరవై వేల బిల్లయితే అయిదువేలు దాటడం లేదు."
"నేనెప్పుడూ ఈ విషయాల్లో కలుగచేసుకోలేదు,యింట్లోవాళ్ళే చూసుకుంటారు."అనగానే మారుమాట్లాడకుండా వెళ్ళిపోయాడు.
ఒకరొజు  చౌదరిగారు నీరజని అడిగారు"యింత కష్టపడుతున్నావు నీకింత బలం ఎక్కడిదమ్మా?"
మీ అందరే నా బలం మామయ్యగరూ! ఎలాగైనా అత్తయ్యగారిని ఆ గది దాటించియిల్లంతా తిరిగేలా చెయాలి.అప్పుడే ఆవిడ ఆరోగ్యం కుదుట పడుతుంది.మన అందరికీ వ్యాపకాలున్నాయి పూర్వం అందరూ వచ్చి వెళుతూ ఆమెతో మాటలుచెప్పేవారు.యివన్నీ బందయినాక ఆమె కాలక్షేపం పూర్తిగా పోయింది.అయినా మంచం పట్టేసినంత అనారోగ్యంలేదు వయసు కాదు.సాయంత్రంపూట కార్లో కోవెలదాకా తీసుకెళ్ళండి కోవెలలో నాలుగడుగులు వేస్తారు,ఎవరైనాకనిపిస్తే కాస్త మాట్లాడతారు.ఫ్రెష్ గాలి వెలుతురుమనిషిని రిఫ్రెష్ చేస్తాయి.మన ఆర్ధిక ప్రణాళికలో ఆమె నలిగిపోయారు.శ్రీకర్ వద్దనుండి కంప్లైంటు ఏమీ రాలేదు కాబట్టి ఆమె ఏమీ విర్శించలేదు. అన్నట్లు మామయ్యగారూ!మన శ్రీకర్క్వార్టర్లీ పరీక్షల్లో మంచి మార్కులు వచ్చాయి. వాళ్ళ టీచరు ప్రశంసించారు."
"అమ్మా! ప్రతి యింటా నీలాంటి కోదలుంటే ఆ యిల్లు స్వర్గసీమ అవుతుందనటంలో అతిశయోక్తిలేదు.""అంత మాటెందుకు మామయ్యగారూ సంపాదించకున్నా దూబరాని అరికడితే అదికూడా అదాయం కిందే లెక్క.సంపన్నులు కూడా అవసరానికి సరిపడానే ఖర్చులు చెయ్యాలి.మీరింత పొగుడుతున్నారు నన్ను తిట్టుకునేవాళ్ళు మన ఐదుగురు పనివాళ్ళు. వాళ్ళకి దీపావళికి బోనస్ లాగా ఎంతోకొంత యిచ్చారంటే వాళ్ళ అసంతృప్తి తగ్గుతుంది."
"అలాగేనమ్మా మన సుకుమార్ రోజూ పొలాలూ తోటలూ చూసుకుంటున్నాడు,ఈ సారి ఫలసాయం కూడా బాగుండేలా వుంది.ఎరువులు విత్తనాలూ కొనడం పనివాళ్ళ మీద పెట్టకుండా తనే చూస్తున్నాడు.వచ్చే నెలలో మార్వాడీ అప్పు తీరిపోతుంది.రోజూ లైబ్రరీలో కూర్చుంటే మంచి పుస్తకాలు చదవడం అలవాటయింది.మౌనంగా వుండటం కూడా పట్టు పడింది.థేంక్సమ్మా."
బస్సులమీద చెకింగు పెట్టిన పదిహేను రోజుల రిపోర్టులో స్టాఫ్ మొత్తం కుమ్మక్కై డీజిలు ఎక్కువ పోయించినట్టు రసీదులు తేవటం రిపేర్లు లేకున్నా సరిచేయించినట్లు రసీదులు,ప్రయాణీకులందరికీ టిక్కెట్లుయివ్వకుండా రికార్డు లేకుండా చేస్తున్నారు.
యిదంతా గమనించాక ఒక రోజు స్టాఫ్ అంతటినీ పిలిచారు,"ఈ నెలాఖరుకి బస్సులన్నీ అమ్మేయదల్చుకున్నాను.నాకు వీటి మీద లాభం కన్నా ఖర్చుల భారం ఎక్కువగా వుంది.మీకు జీతాలివ్వాలన్నా యిబ్బందిగా వుంటోంది మీరు మరోచోట పని చూసుకోండి."
అందరూ నిర్ఘాంత పోయారు.పాలిచ్చే పొదుగుని కోసుకున్నట్లయింది.అందులో వివేకమున్నమనిషి,"బాబుగారూ! తొందర పడకండి. అందరం కష్టపడియిందులో లాభాలు వచ్చేలాచూస్తాం.యిప్పటికిప్పుడు  కొత్తచోట పని వెతుక్కోవాలంటే దొరకాలి కదా?పిలపాపలతోవీధిన పడాలి.ఒక నెల అవకాశం యివ్వండి.మా కష్టంతో ఏమీ లాభం కనిపించకపోతే అప్పుడే అమ్మేయండి."
సరే! మీరు చెప్పినట్లే ఒక నెల గడువిస్తాను.నేను అన్ని బస్సులలో డీజిలు నింపించుతాను. సరైన మెకానిక్కుని మన గేరేజిలో అపాయెంట్ చేస్తాను.బస్సులు రూటులోబయలుదేరే ముందు మెకానిక్కు అంతా సరిగా వుందన్నాక బస్సులు బయలుదేరుతాయి. ప్రయాణీకుల టిక్కెట్లు రూటు మధ్యలో ఎక్కడైనా నేను నియమించిన చెక్కరు చూస్త్తాడు.యిందులో ఏమాత్రం తేడా వచ్చినా ఆ బస్సు స్టాఫ్ మొత్తం తీసేస్తాను. అంగీకారం అయితే బస్సులని రేపటినుండి నడపండి లేకుంటే మీ యిష్టం."
పగ్గాలన్నీ తన చేతిలోకి తీసుకున్నారు.ఏమయితే అయింది,కనీసం నెల తిరిగేసరికి జీతాలందుతాయని అందరూ తలలూపి శలవు తీసుకున్నారు.
యివన్నీ సర్దుకున్నాక మరుచటి నెలలో పద్మావతి వాళ్ళ అమ్మా నాన్నగారు తీర్థ యాత్రలకెళుతూకూతురి కుటుంబాన్ని చూద్దామని వచ్చారు.వాళ్ళు యింట్లో ప్రవేశించగానే వీధిలో అల్లుడి చుట్టూకొలువు లేదు లోపల  పద్మావతి వద్ద జనాలు కనిపించకపోయేసరికి ఆశ్చర్యమనిపించింది.వాళ్ళని చూడగానే అంతకు ముందు వాళ్ళ ఫొటోలు చూసింది కనుక నీరజ పోల్చుకుని, కాళ్ళకి నమస్కరించి ఆదరంగా అత్తగారి గదిలోకి తీసుకెళ్ళి,"అత్తయ్యా ఎవరొచ్చారో చూడండి."
"అమ్మా! నాన్నా! కబురు లేకుండా వచ్చేరు బాగున్నారా?"
"అంతా బాగున్నామమ్మా,తీర్థ యాత్రలకని బయలుదేరాం ముందుగా మీ అందరినీ చూసి వెళ్దామని వచ్చాం."
 నీరజ మంచినీళ్ళు తీసుకొచ్చింది.సత్తెమ్మకి కాఫీ కలపమనిచెప్పింది.పద్మావతి నీరజని పరిచయం చేసింది,"ఈ అమ్మాయి మా కోడలు సుకుమర్ భార్య.నీరజా మా అమ్మా నాన్నా ."
ఈ మాట విన్న నీరజ ఏనుగెక్కినంత సంబర పడింది.పెళ్ళయిన నాటినుంచి పొరపాటున కూడా మాకోడలని చెప్పలేదు.ఈ రోజున ఆ మాట వినగానే సంతోషమనిపించింది.
"నేను చూడగానే పోల్చుకున్నా అత్తయ్యా,ఫొటోల్లో చూశాను కదా తాతయ్య గారిని నానమ్మగారిని."అంటూ సత్తెమ్మ తెచ్చిన కాఫీ అందించింది.

పద్మావతి తలిదండ్రులు క్రిందటిసారి వచ్చినప్పుడు శ్రీకర్ ఎనిమిదో క్లాసు వార్షిక పరీక్షలు నడుస్తున్నాయి,యింటినిండా జనం ప్రశాంతంగా చదువుకునే వీలు లేక స్నేహితుడింటికి వెళ్ళి చదువుకున్నాడు. అది చూసి వాళ్ళెంతగానో బాధ పడ్డారు.లంకంత యిల్లు పిల్లాడికి చదువుకుందికి జానెడు చోటులేకుండా ఈ బంధువులేమిటి? ఈ వరబడిని ఈ సంసారం ఎలా సాగుతుంది? కూతురు మంచం దిగదు అల్లుడేమో రచ్చమీదే వుంటాడు అని బాధ పడుతూనే వెళ్ళారు.

ఈ సారి వచ్చేసరికి అందుకు పూర్తి భిన్నంగా వుంది వాతావరణం. యిల్లంతా కలియ తిరిగి సత్తెమ్మని కదిలించింది పద్మావతి వాళ్ళమ్మ,"కొత్త కోడలు సంసార భారం చేతిలోకి తీసుకున్నాక యిల్లంతా సాఫీగా వుందమ్మా.నాకు రోజూ మూడేసి టిఫిన్లు నాలుగేసి కూరలు చేస్తూ రోజంతా వంటింట్లో వుండే పని తప్పిందమ్మా! ఏమయినా మంచి తెలివైనపిల్ల నోటితో చెడ్డగా అనకుండా చేతలతో అందరినీ దూరంగా వుంచింది.శ్రీకర్ బాబు చదువుకూడా నీరజమ్మే చూసుకుంటుంది.చినబాబుకి వదినంటే చాలా యిష్టం."

పద్మావతి పెళ్ళై పదిహేను సంవత్సరాలైనా ఆమె సంసారం గురించి బాధ పడేవాళ్ళు.ఆరోగ్యం సరిలేక వచ్చేపోయే బంధువులు పిల్లాడి మంచిచెడ్డలు చూసే ఓపిక తీరిక ఎవరికీ లేకపోయిందే అని చింతపడేవారు.ఈరోజున అవన్నీ సర్దుకోవడంతో చాలా సంతోషించారు.

సాయంత్రం వాళ్ళతో మాట్లాడుతూ "అత్తయ్యగారికి సీరియస్ గా తీసుకోవలసిన అనారోగ్యం లేదు. ప్రస్తుతం బి పి, షుగరు లేనివాళ్ళు లేరనే చెప్పాలి. ఆమె కాస్త నడిచి బయట తిరిగితే అరోగ్యం చక్కబడుతుంది.మామయ్యగారికి చెప్పాను బయట తిరిగి రండి కనీసం కోవెలకైనా అని. నాలుగైదుసార్లు వెళ్ళారు. గది దాటి రానంత వయసు పైబడలేదు,మీ యిద్దరూ చెప్పండి.ఆమె వుత్సాహంగా తిరుగుతూంటే మా అందరికీ ఆనందంగా వుంటుంది.ముఖ్యంగా శ్రీకర్ పెద్దవాడవుతున్నాడు,తల్లి నిర్లిప్తంగా వుండటం భరించలేక పోతున్నాడు."

"మొదట్లో రెండో పెళ్ళివాడని భర్తమీద, మామీద కినుకగా వుండేది.ఏమీ ఆలోచించుకునే సమయం యివ్వకుండా భగవంతుడు ఏడాదితిరిగేసరికి బిడ్డనిచ్చాడు.ఆపరేషను చేసి బిడ్డని తీశారని తను పునపటిలా తిరగలేనని ముందునుంచీ భావించుకుని ఒంటికి తెచ్చుకుంది.నలభై రెండేళ్ళ వయసులో దెబ్భై ఏళ్ళలా ప్రవర్తిస్తోంది.అయినా మేం వెళ్ళేముందు మాట్లాడతాం యికనయినా లేచి తిరగమని."

మూడు రోజులుండి వాళ్ళు వెళ్ళారు.నాలుగోనాడు సాయంత్రం చక్కగా ముస్తాబై మంచి చీర కట్టుకుని గది బయిటికి వచ్చిన పద్మావతిని చూసి సంభ్రమగా,"అత్తయ్యా! ఎంత చక్కగా వున్నారు.వుండండి ఫ్రిజ్ లో పూలమాల వుంది తెస్తాను,"అంటూ వెళ్ళి పూలమాల తెచ్చి చనువుగా తలలో పెట్టింది.మామగారివద్దకెళ్ళి "ఈ రోజు స్పెషల్ రోజు,అత్తయ్యగారిని ప్రోద్బలం చెయ్యకుండా రెడీ అయారు. మీరు తెమిలి ఎటైనా తిరిగి రండి."

డ్రైవర్ కి కారు రెడీ చెయ్యమని చౌదరిగారు  తయారై భార్యతో ముందుగా కోవెలకి వెళ్ళి అట్నుంచి సినిమా చూసి రాత్రి పది గంటలకి యిల్లు చేరారు. అందరూ డైనింగు టేబిలు వద్ద వైట్ చేస్తున్నారు.యిద్దరూ యింట్లో ప్రవేశించగానే శ్రీకర్ పరుగున వెళ్ళి తల్లిని చుట్టుకుని"ఎన్నాళ్ళనుంచో మిమ్మల్నిలా చూడాలనుకున్నాను. యిన్నాళ్ళకు నా కోరిక తీరింది. రోజూ మీ యిద్దరూ యిలా బయట తిరిగి రండి నాన్నా."చనువుగా అంటూంటే పద్మావతి కళ్ళలో నీళ్ళు తిరిగాయి.శ్రీకర్ తల నిమురుతూ "అలాగే కన్నా నా అవివేకంతో ఎన్ని సంవత్సరాలు వృధా చేసుకున్నానో యిప్పటికి తెలిసింది." బట్టలు మార్చుకున్నాక అందరూ డైనింగు టేబిలు వద్ద కూర్చున్నారు భోజనానికి.

"అత్తయ్యా యిన్ని రోజులు ఆ కుర్చీ మీ కోసం నిరిక్షించినందుకు మీరు నిరాశ పరచలేదు.ఆ కుర్చీ తరఫున నేను థేంక్సు చెపుతున్నాను.ఈ రోజునుంచీ గదిలో టిఫిన్లు భోజనాలు బంద్! అందరితో కలిసి నవ్వుతూ కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేస్తే చప్పిడి వంటలు కూడా రుచికరంగా వుంటాయి."
"నిజమేనమ్మా యిన్నాళ్ళై నాయింట్లో నేనే గెస్టులా మసలుకున్నాను."
"అత్తయ్యా రేపు ఒక దైటీషియన్ ని పిలిచాను,ఆమె ఎటువంటి భోజనం ఎంత పరిమాణంలో తింటే మీ ఆరోగ్యం బాగుంటుంది అన్నీ వివరంగా మీకు చెపుతుంది.వాటిని రుచిగా వుండేలా నేను చూస్తాను.ఒక నెల గడిచేసరికి మీ ఆరోగ్యంలో తేడా మీకే తెలుస్తుంది.ఎటొచ్చీ యింత యిల్లుంది కాబట్టి మీరు ప్రత్యేకించి వాకింగు చెయ్యకున్నా యిల్లంతా ఒక సారి కలియ తిరిగితే  వాకింగయిపోతుంది.మా అందరి విన్నపం ఏమిటంటే ఈ రోజులా మీరు చక్కగా లక్ష్మీదేవిలా ముస్తాబై వుంటే మా అంద్రికీ కన్నుల పండుగగా వుంటుంది."

అందరూ మనసారా నవ్వుకున్నారు.పద్మావతి అంగీకారంగా తలూపింది.
నెల గడిచాక ఒక రోజు రాత్రి చుదరిగారు నిద్ర  రాక వుయ్యాల బల్లపై కూర్చున్నారు.జరిగిన సంఘటనలన్నీ సిమ్హావలోకనం చేసుకుంటిఉన్నారు.పద్మావతి వచ్చి పక్కన కూర్చుని "నిద్ర రావటం లేదా? యింత రాత్రివేళ యిక్కడ కూర్చున్నారు?"
"యిదే ప్ర్శ్న ఆర్నెల్ల క్రితం నీరజ అడిగింది.ఆరోజున మన యింటి పరిస్తితి అయోమయంగా వుండెను.ఈ రోజున అంతా సరుబాటై మనసు ప్రశాంతంగా వుంది. యింత తొందరగా మార్పు రావడం ఎలా సంభవం అని ఆలోచిస్తున్నాను."
"మన తెలివికి భగవత్సహాయం వుంటే అన్నీ యిలాగే అనుకూలిస్తాయి.మీకింకో రహస్యం చెప్పనా? నీరజ చేపట్టిన కార్యక్రమం  గురించి కొద్ది రోజుల్లోనే నా చెవిన పడింది.సత్తెమా కొంత మంది బంధువులు నాతో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు.నేనూ ఈ జన సందడితో విసిగి పోయాను, గాని వాళ్ళని ఎలా అరికట్టాలో తెలియక తికమక పడేదాన్ని.నీరజ వీటన్నిటినీ సర్దుబాటు చెయ్యడానికి పూనుకుందని తెలిసి ఏమీ విమర్శించకుండా నిర్లిప్తంగా వుండిపోయాను.ఫలితం కొద్ది రోజుల్లోనే కనబడింది. డబ్బుల విషయం నాకంతగా తెలియక పోయినా వచ్చే పోయే బంధువులు మన సంసారం మీద పెత్తనం చెయ్యడం నాకేమీ బాగా అనిపించలేదు,కాని వాళ్ళని ఎలా కాదనాలో తెలియని స్తితి,ఈ రోజున నాకూ ఆనందగా వుంది. పై యింటి పిల్లైనా మనలో కలిసిపోయి అందరినీ తనవాళ్ళుగా చూసుకుంటోంది."

"పద్మా! చాలా థేంక్స్! ఈ ప్రణాళిక అమలు చెయ్యడంలో నువ్వు బాధ పడతావేమోనని నీరజ రోజూ బాధ పడేది .ఏమయితేనేం అందరికీ నచ్చినట్ట్లు.  మన యిల్లు కళకళలాడుతోంది. వచ్చే నెల సుకుమార్ నీరజల పెళ్ళి రోజు,మొదటి మేరేజ్ డే,ఎలా సెలిబ్రేట్ చెయ్యాలన్నది రేపు మాట్లాడుకుందాం.చాలా రాత్రయింది పద పడుక్కుందాం."

మర్నాడు టిఫిను టైములో మేరేజ్ డే గురించి ప్రస్తావించారు చౌదరిగారు."వూర్లో స్నేహితుల్ని, బంధువులని పిలిచి విందు ఏర్పాటు చేద్దాం.బాగుంటుందా?"

"వద్దు మామయ్యగారూ! యింత కష్టపడి అందరినీ ఒక దూరంలో వుంచ గలిగాం. మళ్ళీ ఈ అకేషన్ తో రాకపోకలు మొదలు పెడతారు.అలా కాకుండా మా అమ్మా నాన్నగారిని తాతయ్యా నానమ్మ వాళ్ళని,నూజివీడుతాతయ్య నానమ్మలనిరమ్మందాం.అందరం కలిసి ఏదో ఒక పుణ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ గడిపి చుట్టుప్రక్కల చూడవలసినవి వుంటే చూసి వద్దాం. కేవలం మన కుటుంబ ఫంక్షనుగానే వుంచుదాం."
అందరూ "హియర్! హియర్!"అన్నారు.నిర్ణయం పిల్లలకి వదిలి "ఒకే! మీరందరూ ఎలా అంటే అలాగే."


1 comment:

Unknown said...

Interesting treatment of the topic
చాలా బాగా ఉంది