16 January, 2022

అమ్మ

 ఈ కధ బహుశ 70's లో ఏ మేగజైన్లో చదివానో, రచన ఎవరిదోగుర్తు లేదు.కాని కధా వస్తువు మాత్రం మనసులో చెరగని ముద్రె పడింది.

యిప్పటికి బాగా గుర్తు, చదివిన ప్రతీ సారి మనసు ఆర్ద్రమై కనులు చెమర్చటం జరిగినది. అది నా బలహీనతకావచ్చు. అదే కధని నేటి పరిస్థితులకనుగుణంగా కొద్దిగా మార్పులు చేర్పులు చేసి నాదైన శైలిలో మీ ముందుంచుతున్నాను.ఆదరిస్తారని భావిస్తున్నాను.

                                                అమ్మ

శేషగిరి స్కూలు టీచరు. లెఖలు ఇంగ్లీషు బోధించేవారు.భార్య మాణిక్యమ్మ, వీరికి మాధవి, శశాంక్ యిద్దరు పిల్లలు.
అందరు టీచర్ల వలెనే సాధారణ జీవితం సాగిస్తూ పిల్లల్ని క్రమ శిక్షణలో పెంచారు .మాధవి గ్రాడ్యుఏషను అవగానే ఇ న్ కం టేక్సుశాఖలో అధికారిగా వున్న శ్రీరాం కి యిచ్చి వివాహం చేశారు. అబ్బాయి సి ఎ అవగానే కాకినాడలో వుద్యోగం వచ్చింది.తన సెర్వీసులో వుండగా యిల్లు కూర్చుకోలేక పోయానన్నచింత వుండేను.
అబ్బాయికి 25 సంత్సరాలు నిండగానే స్నేహితుడు విద్యాధర్ కుమార్తె సుశీలనిచ్చి వివాహం జరిపించేశాడు.
"ఇంత హడావిడేమిటిరా? అబ్బాయిని కాస్త వుద్యోగంలో నిలదొక్కుకోనీకుండా"అని కాబోయే వియ్యంకుడితో చెప్తున్నా,"లాభం లేదు ఆలశ్యం చేస్తే ఈ చేప యింకే కొక్కేనికి తగులుకుంటుందో ,శుభశ్య శీఘ్రం."
పెళ్ళైన ఏడాదికి మనుమడు పుట్టగానే స్నేహితుడు హాస్యమాడేడు."తాతగారి హడావిడి మనుమడికి కూడా వచ్చేసినట్లుంది."
కిట్టూ పుట్టగానే శేషగిరి వాలెంటరీ రిటైర్మెంటు బెనిఫ్ట్త్సు దొరొకుతున్నాయని రిట్తైర్మెంటు తీసుకున్నారు.వచ్చిన డబ్బు, కొడుకు లోను పెట్టిన డబ్బుతో మూడు గదుల యిల్లు కొన్నారు. అంతా కలిసి కాకినాడలో కాపురం పెట్టారు.సుశీల వచ్చిన నాటినుంచి శేషగిరి గారి కుటుంబంతో పాలు నీళ్ళలా కలిసిపోయింది.అత్తా కోడళ్ళిద్దరూ కలిసి మెలిసి పనులు చేసుకునేవారు.
శేషగిరిగారు వుద్యోగంలో వుండగా ట్యూషన్లు చెప్పే వారు కాదు.రిటైర్మెంటు తరువత ఉదయం రెండు బేచిలలో పదేసి మంది పిల్లలు లెక్ఖలు ఇంగ్లిషుచెప్పించుకునేవారు.సాయంత్రం రెండు బేచిలువచ్చేవారు.వాళ్ళంతా వీధి అరుగు మీదకూర్చుని చదువుకునే వారు.మిగతా సమయంలో బజారు పని వుంటే యింట్లో భార్యని కోడల్ని అడిగి ఏం కావాలో తెచ్చేవారు.
కిట్టూ రెండేళ్ళవాడయాడు,వాడితో ఆట పాటలు ముద్దుమాటలు జీవితం సాఫీగా సాగుతోంది అనుకుంటున్న తరుణంలో అందరికీ లెక్ఖల్లో తప్పులు దిద్దే మాస్టారి జీవితంలో పెద్ద తప్పు లెక్ఖ చేయించేశాడు భగవంతుడు. తుఫాను వచ్చి అల్లకల్లోలం అయిపోయినట్లయింది.
ఒక రోజొ ఉదయం టిఫిను చేద్దామని ఉప్మా కలియబ్ర్డుతోందిమాణిక్యమ్మ,ఒక్కసారి కళ్ళు తిరుగుతున్నట్ట్లైతే కోడల్ని కేకేసి"అమ్మా!సుశీలా నాకేమిటొ కళ్ళు తిరుగుతున్నాయి యీ ఉప్మా సంగతిచూడు కాసేపు కూర్చుంటాను".
అనగానే కంగారుగా పొయ్యి ఆర్పేసి అత్తగారి చెయ్యిపట్టుకెళ్ళి మంచం మీద కూర్చోబెట్టిందీ.
"నాకేం కాదు టిఫిను సంగతి చూడు శశాంక్ కి లేటవుతుంది".
పొయ్యి వెలిగించి ఉప్మా సంగతి చూస్తోంది,బాథ్రూంలోంచి "ఓక్!"శబ్దం రాగానే పొయ్యి ఆర్పేసి పరుగెత్తింది శశాంక్ హాల్లోంచి పరుగెత్తుకొచ్చాడు.
తల్లికి ఎప్పుడూ లేనిదివాంతి చేసుకుంటోందని యిద్దరూ పట్టుకుని ముఖం కడిగి నీళ్ళు పట్టి పడుకో బెట్టారు.
"సుశీలా అమ్మని డాక్టరుకి చూపించు అశ్రద్ధ చెయ్యకు నాకు ఆఫీసులో అర్జంటు పని ఉంది.వెళ్ళాలి."
"అలాగే అప్పాయింట్మెంట్ తీసుకుంటాను గంటలో తీసుకెల్తాను, మీరేం వర్రీ అవకండి"
"ఈ పూట ఒక బేచి పిల్లలకి శలవు యిచ్చేయండి మామయ్యగారూ , అత్తయ్యకి ఒంట్లో బాగు లేదు వాంతి చేసుకున్నారు."
"రాత్రి తిన్నది అరిగి వుండదు కాస్త జీలకర్ర కషాయం కాచి యిస్తే సర్దుకుంటుంది".
"అలాగే లెండి డాక్టరుకి చూపించి వచ్చాక కషాయం చేస్తాను.మీరూ వస్తే కిట్టూని చూసుకోవచ్చు."
"సరే రిక్షా తెస్తాను బయలుదేరుదాం నేను సైకిలు మీద వస్తాను".
డాక్టరు బి పి చూసి బి పి నార్మల్ గా వుంది బల్ల మీద పడుక్కోమని కడుపు నొక్కి చూసి అజీర్ణం సంబంఢించి ఏమీ కనిపించటం లేదు,ఆమె సుశీలని చూసిన గైనకాలజిస్టు కూడా ,మాణిక్యమ్మ కడుపు నొక్కి నొక్కి చూసి మీకు బహిష్టులు ఆగి [పోయాయా?"
ఆ!ఆగిపోయాయి."
"ఎన్నాళ్ళయింది?"
"ఒక సంవత్సరం ఔతోందనుకుంటాను." యూరిన్ శాంపిల్ తీ సి టెస్టు చేసింది.
రిసల్టు పోజిటివ్ సుశీలని లోపలికి పిలిచి "మీ అత్త గారికి సోనోగ్రాఫీ చెయ్యాలి."
"ఎందుకు డాక్టర్?"
"జస్ట్ ఫర్ కంఫర్మేషన్"
"మీ అత్తగారికి నాలుగు నెలల ప్రెగ్నెన్సీ ఆమె వయసు ఎంత?"
సంభాషణ వినగానే మణిక్యమ్మ "యిదేం విడ్డూరం డాక్ట? సరిగ్గా పరీక్షించారా?"
"సోనోగ్రాఫీలో డౌటేం వుండదమ్మా మీకేమాత్రం తెలియలేదా?" "అబార్షన్ చేసేయండి, యీ వయసులో మమ్మల్ని చూసి నలుగురూ నవ్వుతారు డాక్టర్!".
"పెద్ద ప్రాణానికే ప్రమాదం ,ఆ రిస్కు ఏ డాక్టరూ తీసుకోదు. ఒక్క సారి మీ మామగారిని పిలువు అతనితో కూడా మాట్లాడాలి."
శేషగిరి లోపలికి వచ్చిడాక్టరు నోటివెంట వచినవార్త విని అతనికి నోట మాటలేదు."
"డాక్టర్ దీనికేం సొల్యూషను లేదా?"
"నాకు తెలిసినంతవరకు డెలివరీ వరకు కేర్ తీసుకోవడమే!"
తల ఎక్కడ పెట్టుకోవాలో తోచలేదు శేషగిరికి. డాక్టరు మందుల చీటీ రాసిచ్చి జాగ్రత్తలు చెప్పారు "అమ్మా మీరు ఎటువంటి ఆలోచనలు పెట్టుకోవద్దు,మీకు యీ బిడ్డని సాకే ఋణం వుంది, అంతకు మించి చెప్పడానికేం లేదు. సుశీలా! మీ యింటిల్లి పాది దృష్టి ఆమె ఆరొగ్యం కోసం చూడటమే . నీకు చంటి బిడ్డ వున్నాడు కావాలంటే ఎవరినైనా పని మనిషిని చూసుకో నీకు కొంత శ్రమ తగ్గుతుంది.ఆమెకి రెస్టు వుండేలా చూడు.శేషగిరిగారూ మనుమల్ని ఎత్తుకునే వయసులో మీకు బిడ్డ కలగడం చిన్నతనంగా భావించవద్దు.ప్రశాంతంగా వుండడానికి ప్రయత్నించండి."
యిల్లు చేరుకున్నాక పనులన్నీ యాంత్రికంగా చేసింది సుశీల.
శశాంక్ యిల్లు చేరేసరికి ఏడు గంటలు దాటింది.
"స్నానం చెయ్యండి భోజనం చేద్దురుగాని."
"సరే" అంటూ బాత్రూములో దూరాడు.స్నానం చేస్తూ గురుకొచ్చింది,ఉదయం అమ్మవొంట్లో బాగులేదని డాక్టరుకి చూపించిందా? అనుకుంటూ భోజనానికి కూర్చుని సుశీలని అడిగాదు."అమ్మని డాక్టరుకి చూపించావా ఏమన్నారు?"
"నాకు బుల్లి మరిదినో మరదలినోయివ్వబోతున్నారని చెప్పారు."
"ఏయ్! నీకు బుద్ధుందా?అమ్మతో యీ వయసులో పరాచికాలాడటం బాగుందా?"
"యిది మరీ బాగుంది డాక్టరు ఏది చెప్పారో అదే నేను రిపీట్ చేశాను." ఆంటె కంచంలో చెయ్యి కడిగేసికుని చివ్వునలేచి బెడ్రూములోకెళ్ళి పడుకుండిపోయాడు ఎంత సర్ది చెప్పుకున్నా ఈ విషయం జీర్ణం కావటంలేదు. ఆఫీసులో తెలిస్తే ఏమనుకుంటారు? యిరుగు పొరుగు వారేమనుకుంటారు బంధు వర్గంలో మన పరువేం కావాలి యివే శశాంక్శ మనసుని దొలిచేస్తున్నాయి.
పరిస్థితులను అర్ధం చేసుకుని సుశీలా శేషగిరిగారే అన్నీ సర్దుబాటు చేసుకున్నారు, సాధ్యమైనంత వరకు శశాంక్ కళ్ళముందు పడకుండా జాగర్త పడేవారు తల్లి తండ్రి.
ముందు జాగ్రత్తగా ఆడబిడ్డ మాధవికి విషయం తెలియజేసి ప్రసవం సమయానికి సహాయంగా రమ్మంది సుశీల.
మాధవి అత్తగారు "అవ్వ!"అని బుగ్గలు నొక్కు కున్నారు. "మరీ అంతగా నొక్కుకోకండి అత్తయ్యా! బూరె బుగ్గల కాస్తా సొట్ట బుగ్గలు అయే ప్రమాదం వుంది". అని హాస్యమాడింది.
ఒకానొక శుభదినాన మాణిక్యమ్మ హాస్పిటల్లో మగ బిడ్డని ప్రసవించింది.దాక్టరు ముందునుంచే అన్ని జాగర్తలు తీసుకున్నారు, మళ్ళీ గర్భం రాకుండా ట్యూబెక్టమీ చేశారు. వారం తరు వాత యింటికి తీసుకెళ్ళారు.శశాంక్ ఒక్క సారి కూడా చూడటానికి హాస్పిటల్కి రాలేదు.
మరునాడు పదకొండు రోజుల స్నానం,మాధవి తండ్రిని అడిగింది, "నాన్నా బాలసార సంగతి ఏం చేశారు?"
"యిప్పుడవన్నీ ఆలోచించ లేదు,అందరి మనసులు కుదుట పడ్డాక ఏదో వొక పేరుతో పిలుచుకుందాం."
పదకొండో రోజున తెల్లవారు ఝామున తల్లీ బిడ్డలికి స్నానం చేయించి సాంబ్రాణి ధూపం వేశారు. చంటి వాడికి పాలిస్తూ రామా లాలీ మేఘ శ్యామా లాలీ" అంటూ చిన్నగా పాడుకుంటోంది మాణిక్యమ్మ. శశాంక్ పెరట్లోకి వెళ్తూ వెనుక గది నుంచి తల్లి చిన్నగా పాడుతున్న పాట చెవిలో పడింది.
తనకి బాగా జ్ఞానం వచ్చే వరకు తల్లి వొళ్ళో తల పెట్టుకుంటే తన జుత్తు నెమ్మదిగా నిమురుతూ యీ లాలి పాట పాడుతుంటే కళ్ళు బరువెక్కి నిద్రపోయేవాడు.
హఠాత్తుగా అనిపించింది,ఆ పసివాడు చేసిన తప్పిదం ఏమిటి? తను అమ్మ నాన్నతో యీ చంటివాడితో దూరంగా మసలడానికి కారణం సమాజమా? తను ఎంత తప్పు చేశాడు,తల్లిని జాగ్రత్తగా చూసుకోవలసిన సమయంలో పరాయ వ్యక్తిలా మసలుకున్నాడు. అంతే! అనుకోకుండా అడుగులు తల్లి వున్న గదివైపు పడ్డాయి.
వొళ్ళంతా పసుపు రాసుకుని రూపాయి కాసంతబొట్టు పెట్టుకున్న అమ్మని చూడగానే ఒక్క సారిగా దుఖం పెల్లుబికి వచ్చింది. కొన్ని సంత్సరాల క్రితం అమ్మ వొళ్ళో తను అమ్మ ప్రేమ అనే అమృతాన్ని గ్రోలుతూ, యీ భావన మనసులోకి రాగానే "అమ్మా!"అన్నాడు."దా కన్నా అంటూ చేయి చాచింది మాణిక్యమ్మ.
యిన్ని నెలల దూరం వొక్క సారి మటు మాయం అయింది.అమ్మ పక్కనే కూర్చుని చంటి వాడిని రెండు చేతుల్లోకి తీసుకున్నాడు, "నన్ను క్షమించమ్మా ఎంత మూర్ఖంగా ఆలోచించాను ఎంత అవివేకంగా ప్రవర్తించాను" అంటూ తల్లి భుజం మీద తల పెట్టి వెక్కి వెక్కి ఏడ్చాడు.
"వూరుకో కన్నా నీ తప్పేం లేదు నీ స్థానంలో ఎవరున్నా అలాగే ప్రవర్తిస్తారు."
మాటలు విని సుశీల మాధవి శేషగిరి అందరూ పురుటి గది చేరుకున్నారు. "అమ్మా నువ్వూ నాన్న వీడిని గురించి ఏమీ చింత పడకండి వీడు నాకే తమ్ముడు కాదు మన కిట్టూగాడికి కూడా తమ్ముడే!ఏ ప్రయోజనం కోసం మనింట్లో పూట్టాడో వీడి మంచి చెడ్డలు నేను సుశీలా చూసుకుంటాం". పై మాటలు విన్నాక అక్కడున్న అందరి కళ్ళు చెమ్మగిల్లాయి.
వెంటనే మాధవి సుశీల మాణిక్యమ్మని చుట్టుకున్నారు.కోడలి తల నిమురుతూ
" అమ్మా సుశీలా యిన్ని రోజులు నువ్వు నాకు కోడలివి కాదు కన్న తల్లిలాగ చూసుకున్నావు, అమ్మ ఏ యుగంలోనైనా అమ్మ అమ్మే!"

No comments: